సాక్షి, న్యూఢిల్లీ : కుడి ఎడమల అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్‌లతో కలిసి ఉల్లాసంగా నవ్వుతున్న ఫొటోను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దానికి ‘ది యునైటెడ్ కలర్స్ ఆఫ్ రాజస్థాన్’ అని కూడా శీర్షిక తగిలించారు. ఫొటోలో ఉన్న ముగ్గురిలోనూ విజయ దరహాసం కనిపిస్తోంది కానీ, అది అర్ధ సత్యం మాత్రమే. మూడు హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడినప్పుడు ముగ్గురు సీఎంలను ఎంపిక చేయడంలో రాహుల్ గాంధీ తన నిర్ణయాత్మక నాయకత్వాన్ని నిరూపించుకోలేకపోయారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు తేలిన రోజునే మూడు రాష్ట్రాల సీఎంలను రాహుల్ గాంధీ ఖరారు చేయాల్సింది. ముఖ్యమంత్రి పదివికి పోటీపడిన అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్‌లను ఒప్పించడానికి ఆయనకు ఇన్ని రోజులు పట్టడం, పార్టీమీద ఇంకా ఆయన పట్టు సాధించలేదనడానికి నిదర్శనం. ఈ రోజు గహ్లోత్, సచిన్‌లు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయం తెల్సిందే.
రాజస్థాన్‌తో పోలిస్తే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్ నాథ్‌ను ఖరారు చేయడం చాలా సులువు. అయినా ఆయన పేరును ఖరారుచేయడానికి రాహుల్ గాంధీ మూడు రోజుల సమయం తీసుకున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా భూపేశ్ బఘెల్ పేరును రాహుల్ మరింత ఆలస్యంగా ఆదివారం నాడు ప్రకటించారు. రాజస్థాన్ సీఎం పదవికీ గహ్లోత్, సచిన్ పైలట్‌లు పోటీ పడుతున్నారని, వారిద్దరు తమకు అనుకూలంగా కార్యకర్తలతోని ర్యాలీలు నిర్వహించారన్న విషయం రాహుల్ గాంధీకి తెల్సిందే. సీఎం పదవికి సచిన్ పైలట్ వైపు ముందునుంచి మొగ్గుచూపిన రాహుల్ గాంధీ పార్టీ పెద్దల సలహా మేరకు గహ్లోత్‌ను అంగీకరించక తప్పలేదని, సచిన్‌ను డిప్యూటీగా ఒప్పించినప్పటికీ గహ్లోత్‌ను ఒప్పించలేకపోయారన్న విషయం ఇంటా బయట తెల్సిందే. ఒకరకంగా గహ్లోత్, రాహుల్, సచిన్ పైలట్‌లలో ఎవరు విజయం సాధించలేదు. గహ్లోత్‌కు సీఎం పదవి దక్కినప్పటికీ డిప్యూటీగా సచిన్ వద్దన్న మాటను నిలబెట్టుకోలేకపోయారు. సచిన్‌ను సీఎంగా కోరుకున్న రాహుల్ అలా చేయలేకపోయారు. ఇక సీఎం పదవిని ఆశించిన సచిన్ డిప్యూటీగా సర్దుకోవాల్సి వచ్చింది.
రాజస్థాన్ శాసన సభ్యులు ముఖ్యమంత్రి ఎన్నికను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానాన్ని చేసినప్పుడు ఠక్కున సీఎం పేరును ప్రకటించి నిర్ణయాత్మక నాయకత్వాన్ని నిలబెట్టుకునే అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నారు. ఊగిసలాట ధోరణి వల్ల పార్టీ పట్ల అంతగా పట్టులేదనే సందేహం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఇచ్చినట్లు అయింది. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన గహ్లోత్, పైలట్ మధ్య రాజీ కుదుర్చేందుకు మూడు రోజుల సమయం తీసుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు. పార్టీని నడపడంలోనే నిర్ణయాత్మక నాయకత్వాన్ని ప్రదర్శించలేని ఓ నాయకుడు రేపు దేశానికే ఎలా నాయకత్వం వహిస్తారన్న అనుమానం ప్రజలకు కలగక మానదు.
Comments
Please login to add a commentAdd a comment