సీఎం గహ్లోత్‌, డిప్యూటీ పైలట్‌! | Ashok Gehlot named Rajasthan CM, Sachin Pilot as Deputy CM | Sakshi
Sakshi News home page

సీఎం గహ్లోత్‌, డిప్యూటీ పైలట్‌!

Published Sat, Dec 15 2018 2:57 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Ashok Gehlot named Rajasthan CM, Sachin Pilot as Deputy CM - Sakshi

శుక్రవారం ఢిల్లీలో భేటీ సందర్భంగా రాహుల్‌తో అశోక్‌ గహ్లోత్, సచిన్‌ పైలట్‌

న్యూఢిల్లీ/జైపూర్‌: రాజస్తాన్‌ రాజకీయాల్లో మూడురోజుల ఉత్కంఠకు తెరపడింది. సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోత్‌(67), యువ నేత సచిన్‌ పైలట్‌(41) మధ్య సయోధ్య సాధించేందుకు రాహుల్‌ గాంధీ చేసిన యత్నాలు ఫలించాయి. సీఎంగా అశోక్‌ గహ్లోత్‌ను, డిప్యూటీ సీఎం పదవికి పైలట్‌ను ఎంపిక చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయంపై ఆ ఇద్దరు నేతలు సంతోషం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా పనిచేసి, లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఎడారి రాష్ట్రం తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్‌కు రాష్ట్ర కాంగ్రెస్‌ పరిశీలకుడు కేసీ వేణుగోపాల్‌ తెరదించారు. సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోత్‌ ముఖ్యమంత్రిగా, రాజస్తాన్‌ పీసీసీ అధ్యక్షుడు  సచిన్‌ పైలట్‌ను ఉపముఖ్యమంత్రిగా నియమించేందుకు అధిష్టానం నిర్ణయిచిందని ఆయన శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఇద్దరు నేతలు జైపూర్‌ చేరుకుని గవర్నర్‌ కల్యాణ్‌సింగ్‌తో భేటీ అవుతారని తెలిపారు. ప్రమాణ స్వీకారం తేదీ ఆ తర్వాతే ఖరారవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు.

‘మూడోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యేందుకు అవకాశం కల్పించిన రాహుల్‌ గాంధీకి కృతజ్ఞతలు. పైలట్‌తో కలిసి రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందిస్తా’ అని గహ్లోత్‌ తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో గహ్లోత్‌తో కలిసి అద్భుత ఫలితాలను సాధించాం. ఇదే జోరును 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కొనసాగిస్తుంది. కేంద్రంలోనూ అధికారంలోకి వస్తుంది. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేస్తాం’ అని సచిన్‌ పైలట్‌ తెలిపారు. 2013 ఎన్నికల్లో కేవలం 21 సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్‌..ఇటీవలి ఎన్నికల్లో 99 స్థానాలను గెలుచుకుని బీజేపీ నుంచి అధికారం కైవసం చేసుకుంది. అయితే, ముఖ్యమంత్రి పదవి కోసం సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోత్, సచిన్‌ పైలట్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇప్పటి వరకు మూడుసార్లు చర్చలు జరిపారు.

రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధులపై పార్టీ సీనియర్‌ నేతలతోపాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతోనూ రాహుల్‌ భేటీ అయ్యారు. అంతిమ నిర్ణయాన్ని అధ్యక్షుడు రాహుల్‌కు వదిలేస్తూ ఎమ్మెల్యేలంతా తీర్మానించిన తర్వాత హైకమాండ్‌ నిర్ణయాలను పాటించి తీరాల్సిందేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు తెలిపారు. అయితే, పార్టీని గెలిపించడంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చడంలో రాహుల్‌ సఫలీకృతులయ్యారు. అందుకే ఒకరికి సీఎం, మరొకరికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించారు. అనంతరం ముగ్గురు నేతలు సంతోషాన్ని పంచుకుంటున్న ఫొటోతోపాటు ‘ది యునైటెడ్‌ కలర్స్‌ ఆఫ్‌ రాజస్తాన్‌’ అనే కామెంట్‌ను ట్విట్టర్‌లో ఉంచారు.

మద్దతుదారుల ఆనందోత్సాహాలు
సీఎంగా అశోక్‌ గహ్లోత్, డెప్యూటీ సీఎంగా సచిన్‌ పైలట్‌లను అధిష్టానం ఖరారు చేయడంతో ఇద్దరు నేతల మద్దతుదారులు పండుగ చేసుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి గహ్లోత్‌ మద్దతుదారులు జైపూర్‌లోని ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆయనే సీఎం అవుతారని ఆసక్తిగా ఉన్న అభిమానులు పెద్ద సంఖ్యలో హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. సీఎంగా ఎంపికైన ప్రకటన వెలువడగానే స్వీట్లు పంచిపెట్టారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. డోళ్ల చప్పుళ్లతో నృత్యాలు చేశారు. సచిన్‌ పైలట్‌ మద్దతుదారులు కూడా సందడి చేశారు. పీసీసీ కార్యాలయం మద్దతుదారులతో నిండిపోయింది. ఇద్దరు నేతల నివాసాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సింధియా తిరస్కారం.. సచిన్‌ అంగీకారం
మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల్లో సాధించిన విజయాలు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని దాదాపు మూడు రోజులపాటు ముప్పుతిప్పలు పెట్టాయి. ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే విషయంలో జరిగిన సుదీర్ఘ చర్చల్లో సీనియర్లు, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తోపాటు సోనియా గాంధీ, ప్రియాంక కూడా పాలుపంచుకున్నారు. సింధియా, పైలట్‌లలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని రాహుల్, ప్రియాంక గట్టిగా వాదించారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. దీనిద్వారా కాంగ్రెస్‌లో యువరక్తానికి ప్రాధాన్యం ఉంటుందనే విషయం చాటి చెప్పాలని వారు వాదించారని వెల్లడించాయి. అంతిమంగా వారిద్దరికీ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. అయితే, ఈ ఆఫర్‌ను మధ్యప్రదేశ్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరస్కరించగా రాజ స్తాన్‌ పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ అంగీకరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో సీఎం పీఠానికి అర్హత సాధించేందుకే పైలట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. 1988లో రాజీవ్‌ హయాంలో శివ్‌ చరణ్‌ మాథుర్‌ సీఎంగా ఉండగా గహ్లోత్‌ డిప్యూటీ సీఎంగా పని చేశారు.

కాంగ్రెస్‌ కట్టప్ప.. గహ్లోత్‌!
రాజస్తాన్‌ కాబోయే సీఎం గహ్లోత్‌ కాంగ్రెస్‌కు ‘కట్టప్ప’ వంటివారు. మూడు తరాలుగా గాంధీ కుటుంబానికి నమ్మిన బంటుగా వ్యవహరించడమే గహ్లోత్‌కు సీఎం పదవి దక్కేందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గహ్లోత్‌లోని నాయకత్వ లక్షణాలను గుర్తించి ఆయనను రాజకీయాల్లోకి  ఆహ్వానించింది ఇందిరా గాంధీ. రాజకీయాల్లో ఆయన ఎదుగుదలకు దోహదపడింది సంజయ్‌ గాంధీ. ఆయనను రాజస్తాన్‌ ప్రభుత్వంలో హోం మంత్రిని చేసి రాష్ట్ర రాజకీయాలకు పంపింది రాజీవ్‌ గాంధీ. సోనియాగాంధీకి విశ్వాసపాత్రుడిగా ఉన్న గహ్లోత్‌ ఇప్పుడు రాహుల్‌ గాంధీకి అనధికార మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాహుల్‌ చంద్రగుప్తుడయితే గహ్లోత్‌ చాణక్యుడు. గాంధీ కుటుంబం మరుగున పడ్డ సమయంలో ప్రభుత్వ, పార్టీ పగ్గాలు చేపట్టిన పివీ నరసింహారావు, సీతారాం కేసరి వంటి వారితో కూడా గహ్లోత్‌ సత్సంబంధాలు నెరపారు.  ఆయన అనుసరిస్తున్న గాంధేయవాదం, ఆడంబరాలకు పోకుండా ఉండటం, నిజాయితీ, హుందాతనం ఇవన్నీ గహ్లోత్‌ను ఉత్తమ నేతగా తీర్చిదిద్దాయి. ఎన్నికల వ్యూహ రచనలో నిష్ణాతుడిగా పేరొందారు. ఈ ఎన్నికల్లో పార్టీకి భారీ మెజారిటీ రాని నేపథ్యంలో అనుభవజ్ఞుడు, రాజకీయ నిర్వహణ దక్షుడు అయిన గహ్లోత్‌ అవసరం రాష్ట్రానికి, పార్టీకి ఎంతైనా ఉందని అధిష్టానం భావించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ నుంచి మెజారిటీ సంఖ్యలో ఎంపీలను పంపాలంటే గహ్లోత్‌ వంటి రాజనీతిజ్ఞుడు సీఎం పీఠంపై ఉండాలని అధిష్టానం భావించింది. లోక్‌సభ ఎన్నికల వరకు గహ్లోత్‌ను తనతోనే ఉంచుకోవాలని రాహుల్‌ అనుకున్నారు.

‘పైలట్‌’కు కోపైలట్‌ బాధ్యతలు
జైపూర్‌/న్యూఢిల్లీ: డ్రైవింగ్‌ అంటే ఎంతో ఇష్టపడే ఈ యువనేత విమానాల్ని సైతం నడపగలడు. అంతే చాకచక్యంతో 2013లో ఘోర పరాజయం పాలైన పార్టీని 2018లో విజయతీరాలకు నడిపించారు. కానీ, శుక్రవారం నాటి పరిణామాలతో ఆయన కోపైలట్‌ బాధ్యతలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనే సచిన్‌ పైలట్‌(41)!. దివంగత కాంగ్రెస్‌ నేత రాజేష్‌ పైలట్‌ కొడుకైన సచిన్‌ ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి డిగ్రీ, వార్టన్‌ బిజినెస్‌ స్కూల్‌(యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా) నుంచి ఎంబీఏ పట్టా పొందారు. బీబీసీ ఢిల్లీ బ్యూరోతోపాటు, జనరల్‌ మోటార్స్‌లోనూ పనిచేసిన అనుభవం ఉంది. 2000వ సంవత్సరంలో ఆయన తండ్రి రాజేష్‌ పైలట్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తండ్రి నియోజకవర్గం దౌసా నుంచి 2004లో ఎన్నికై అతి పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు.

2009లో అజ్మీర్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఐటీ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు నిర్వహించారు.  పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల సభ్యుడిగా కూడా ఉన్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా కూతురు సారాను వివాహం చేసుకున్నారు. 1995లో అమెరికాలో పైలట్‌ లైసెన్స్‌ పొందారు. జాతీయ స్థాయి షూటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొన్నారు. టెరిటోరియల్‌ ఆర్మీలో కమిషన్డ్‌ ఆఫీసర్‌గానూ పనిచేశారు.   2013లో రాజస్తాన్‌లో పార్టీ ఘోర పరాజయం అనంతరం..మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేదాకా తలపాగా ధరించబోనని శపథం చేశారు. పీసీసీ చీఫ్‌ హోదాలో పార్టీని బలోపేతం చేసేందుకు, జనంతో మమేకమయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు. ఇంగ్లిష్‌ వార్తా చానెళ్ల చర్చా కార్యక్రమాల్లో ధాటిగా మాట్లాడగలిగే సచిన్‌.. గ్రామీణ ప్రజలతోనూ అంతే సులువుగా మమేకమై పోతారనే పేరుంది. కాంగ్రెస్‌ విజయంతో పైలట్‌ మళ్లీ అందమైన ‘సాఫ’ ధరించనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement