Chief menister
-
ఛత్తీస్‌గడ్‌లో హోరాహోరీ పోరు
దేశంలో కొద్ది రోజుల్లో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా పరిగణిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా, భూపేష్ బఘెల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి అధికారం దక్కించుకునేందుకు బీజేపీ తన ఎంపీలను, కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి భూపేష్ బఘెల్ పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ దుర్గ్‌లో ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ దుర్గ్ కోటను ఛేదించడం అంత సులువు కాదని, ఇది ఎప్పటికీ కాంగ్రెస్‌కు కంచుకోట అని అన్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ రాయ్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఛత్తీస్‌గఢ్ ప్రజలు బీజేపీ మద్దతు పలకాలని కోరారు. కాగా ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 7, 17 తేదీల్లో ఓటింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇది కూడా చదవండి: దేశ రాజకీయాల్లో మహరాణులెవరు? ఎక్కడ చక్రం తిప్పుతున్నారు? -
సీఎం గహ్లోత్, డిప్యూటీ పైలట్!
న్యూఢిల్లీ/జైపూర్: రాజస్తాన్ రాజకీయాల్లో మూడురోజుల ఉత్కంఠకు తెరపడింది. సీనియర్ నేత అశోక్ గహ్లోత్(67), యువ నేత సచిన్ పైలట్(41) మధ్య సయోధ్య సాధించేందుకు రాహుల్ గాంధీ చేసిన యత్నాలు ఫలించాయి. సీఎంగా అశోక్ గహ్లోత్‌ను, డిప్యూటీ సీఎం పదవికి పైలట్‌ను ఎంపిక చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయంపై ఆ ఇద్దరు నేతలు సంతోషం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా పనిచేసి, లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎడారి రాష్ట్రం తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్‌కు రాష్ట్ర కాంగ్రెస్ పరిశీలకుడు కేసీ వేణుగోపాల్ తెరదించారు. సీనియర్ నేత అశోక్ గహ్లోత్ ముఖ్యమంత్రిగా, రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌ను ఉపముఖ్యమంత్రిగా నియమించేందుకు అధిష్టానం నిర్ణయిచిందని ఆయన శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఇద్దరు నేతలు జైపూర్ చేరుకుని గవర్నర్ కల్యాణ్‌సింగ్‌తో భేటీ అవుతారని తెలిపారు. ప్రమాణ స్వీకారం తేదీ ఆ తర్వాతే ఖరారవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. ‘మూడోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యేందుకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. పైలట్‌తో కలిసి రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందిస్తా’ అని గహ్లోత్ తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో గహ్లోత్‌తో కలిసి అద్భుత ఫలితాలను సాధించాం. ఇదే జోరును 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కొనసాగిస్తుంది. కేంద్రంలోనూ అధికారంలోకి వస్తుంది. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేస్తాం’ అని సచిన్ పైలట్ తెలిపారు. 2013 ఎన్నికల్లో కేవలం 21 సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్..ఇటీవలి ఎన్నికల్లో 99 స్థానాలను గెలుచుకుని బీజేపీ నుంచి అధికారం కైవసం చేసుకుంది. అయితే, ముఖ్యమంత్రి పదవి కోసం సీనియర్ నేత అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటి వరకు మూడుసార్లు చర్చలు జరిపారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్ధులపై పార్టీ సీనియర్ నేతలతోపాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతోనూ రాహుల్ భేటీ అయ్యారు. అంతిమ నిర్ణయాన్ని అధ్యక్షుడు రాహుల్‌కు వదిలేస్తూ ఎమ్మెల్యేలంతా తీర్మానించిన తర్వాత హైకమాండ్ నిర్ణయాలను పాటించి తీరాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేతలు తెలిపారు. అయితే, పార్టీని గెలిపించడంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చడంలో రాహుల్ సఫలీకృతులయ్యారు. అందుకే ఒకరికి సీఎం, మరొకరికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించారు. అనంతరం ముగ్గురు నేతలు సంతోషాన్ని పంచుకుంటున్న ఫొటోతోపాటు ‘ది యునైటెడ్ కలర్స్ ఆఫ్ రాజస్తాన్’ అనే కామెంట్‌ను ట్విట్టర్లో ఉంచారు. మద్దతుదారుల ఆనందోత్సాహాలు సీఎంగా అశోక్ గహ్లోత్, డెప్యూటీ సీఎంగా సచిన్ పైలట్లను అధిష్టానం ఖరారు చేయడంతో ఇద్దరు నేతల మద్దతుదారులు పండుగ చేసుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి గహ్లోత్ మద్దతుదారులు జైపూర్‌లోని ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆయనే సీఎం అవుతారని ఆసక్తిగా ఉన్న అభిమానులు పెద్ద సంఖ్యలో హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. సీఎంగా ఎంపికైన ప్రకటన వెలువడగానే స్వీట్లు పంచిపెట్టారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. డోళ్ల చప్పుళ్లతో నృత్యాలు చేశారు. సచిన్ పైలట్ మద్దతుదారులు కూడా సందడి చేశారు. పీసీసీ కార్యాలయం మద్దతుదారులతో నిండిపోయింది. ఇద్దరు నేతల నివాసాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సింధియా తిరస్కారం.. సచిన్ అంగీకారం మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల్లో సాధించిన విజయాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని దాదాపు మూడు రోజులపాటు ముప్పుతిప్పలు పెట్టాయి. ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే విషయంలో జరిగిన సుదీర్ఘ చర్చల్లో సీనియర్లు, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తోపాటు సోనియా గాంధీ, ప్రియాంక కూడా పాలుపంచుకున్నారు. సింధియా, పైలట్లలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని రాహుల్, ప్రియాంక గట్టిగా వాదించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీనిద్వారా కాంగ్రెస్‌లో యువరక్తానికి ప్రాధాన్యం ఉంటుందనే విషయం చాటి చెప్పాలని వారు వాదించారని వెల్లడించాయి. అంతిమంగా వారిద్దరికీ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. అయితే, ఈ ఆఫర్‌ను మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరస్కరించగా రాజ స్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ అంగీకరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో సీఎం పీఠానికి అర్హత సాధించేందుకే పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. 1988లో రాజీవ్ హయాంలో శివ్ చరణ్ మాథుర్ సీఎంగా ఉండగా గహ్లోత్ డిప్యూటీ సీఎంగా పని చేశారు. కాంగ్రెస్ కట్టప్ప.. గహ్లోత్! రాజస్తాన్ కాబోయే సీఎం గహ్లోత్ కాంగ్రెస్‌కు ‘కట్టప్ప’ వంటివారు. మూడు తరాలుగా గాంధీ కుటుంబానికి నమ్మిన బంటుగా వ్యవహరించడమే గహ్లోత్‌కు సీఎం పదవి దక్కేందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గహ్లోత్‌లోని నాయకత్వ లక్షణాలను గుర్తించి ఆయనను రాజకీయాల్లోకి ఆహ్వానించింది ఇందిరా గాంధీ. రాజకీయాల్లో ఆయన ఎదుగుదలకు దోహదపడింది సంజయ్ గాంధీ. ఆయనను రాజస్తాన్ ప్రభుత్వంలో హోం మంత్రిని చేసి రాష్ట్ర రాజకీయాలకు పంపింది రాజీవ్ గాంధీ. సోనియాగాంధీకి విశ్వాసపాత్రుడిగా ఉన్న గహ్లోత్ ఇప్పుడు రాహుల్ గాంధీకి అనధికార మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ చంద్రగుప్తుడయితే గహ్లోత్ చాణక్యుడు. గాంధీ కుటుంబం మరుగున పడ్డ సమయంలో ప్రభుత్వ, పార్టీ పగ్గాలు చేపట్టిన పివీ నరసింహారావు, సీతారాం కేసరి వంటి వారితో కూడా గహ్లోత్ సత్సంబంధాలు నెరపారు. ఆయన అనుసరిస్తున్న గాంధేయవాదం, ఆడంబరాలకు పోకుండా ఉండటం, నిజాయితీ, హుందాతనం ఇవన్నీ గహ్లోత్‌ను ఉత్తమ నేతగా తీర్చిదిద్దాయి. ఎన్నికల వ్యూహ రచనలో నిష్ణాతుడిగా పేరొందారు. ఈ ఎన్నికల్లో పార్టీకి భారీ మెజారిటీ రాని నేపథ్యంలో అనుభవజ్ఞుడు, రాజకీయ నిర్వహణ దక్షుడు అయిన గహ్లోత్ అవసరం రాష్ట్రానికి, పార్టీకి ఎంతైనా ఉందని అధిష్టానం భావించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ నుంచి మెజారిటీ సంఖ్యలో ఎంపీలను పంపాలంటే గహ్లోత్ వంటి రాజనీతిజ్ఞుడు సీఎం పీఠంపై ఉండాలని అధిష్టానం భావించింది. లోక్‌సభ ఎన్నికల వరకు గహ్లోత్‌ను తనతోనే ఉంచుకోవాలని రాహుల్ అనుకున్నారు. ‘పైలట్’కు కోపైలట్ బాధ్యతలు జైపూర్/న్యూఢిల్లీ: డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టపడే ఈ యువనేత విమానాల్ని సైతం నడపగలడు. అంతే చాకచక్యంతో 2013లో ఘోర పరాజయం పాలైన పార్టీని 2018లో విజయతీరాలకు నడిపించారు. కానీ, శుక్రవారం నాటి పరిణామాలతో ఆయన కోపైలట్ బాధ్యతలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనే సచిన్ పైలట్(41)!. దివంగత కాంగ్రెస్ నేత రాజేష్ పైలట్ కొడుకైన సచిన్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ, వార్టన్ బిజినెస్ స్కూల్(యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా) నుంచి ఎంబీఏ పట్టా పొందారు. బీబీసీ ఢిల్లీ బ్యూరోతోపాటు, జనరల్ మోటార్స్‌లోనూ పనిచేసిన అనుభవం ఉంది. 2000వ సంవత్సరంలో ఆయన తండ్రి రాజేష్ పైలట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తండ్రి నియోజకవర్గం దౌసా నుంచి 2004లో ఎన్నికై అతి పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు. 2009లో అజ్మీర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఐటీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సభ్యుడిగా కూడా ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కూతురు సారాను వివాహం చేసుకున్నారు. 1995లో అమెరికాలో పైలట్ లైసెన్స్ పొందారు. జాతీయ స్థాయి షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్నారు. టెరిటోరియల్ ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసర్‌గానూ పనిచేశారు. 2013లో రాజస్తాన్‌లో పార్టీ ఘోర పరాజయం అనంతరం..మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాకా తలపాగా ధరించబోనని శపథం చేశారు. పీసీసీ చీఫ్ హోదాలో పార్టీని బలోపేతం చేసేందుకు, జనంతో మమేకమయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు. ఇంగ్లిష్ వార్తా చానెళ్ల చర్చా కార్యక్రమాల్లో ధాటిగా మాట్లాడగలిగే సచిన్.. గ్రామీణ ప్రజలతోనూ అంతే సులువుగా మమేకమై పోతారనే పేరుంది. కాంగ్రెస్ విజయంతో పైలట్ మళ్లీ అందమైన ‘సాఫ’ ధరించనున్నారు. -
గుమస్తా నుంచి సీఎంగా
సాక్షి,బెంగళూరు: నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీఎస్ యడ్యూరప్ప జీవితంలో కూడా ఎన్నో మలుపులు, వివాదాలున్నాయి. సాధారణ ప్రభుత్వ గుమస్తా నుంచి ప్రభుత్వ అధినేతగా ఎదిగిన ఆయన జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. మాండ్యా జిల్లా బూకనకెరె గ్రామంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సిద్దలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు 1943, ఫిబ్రవరి 27న యడ్యూరప్ప జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై హిందుత్వ విధానాలను అనుసరించారు. డిగ్రీ పూర్తయ్యాక కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖలో క్లర్కు ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ఉద్యోగం వదిలి స్వగ్రామంలోని ఒక రైస్ మిల్లులో పని చేశారు. ఆ మిల్లు యజమాని కుమార్తె మైత్రిదేవిని ప్రేమించి పెళ్లాడారు. 1980లో బీజేపీలో చేరి 1983లో తొలిసారిగా శికారిపుర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2007, 2008, 2018లలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. షాకిచ్చిన జేడీఎస్: 2006లో ధరమ్‌సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ సర్కారును కూల్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జేడీఎస్‌తో చేతులు కలిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. యడ్డీ 2007లో తొలిసారి సీఎంగా ప్రమాణం చేసినా జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో వారంలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించడంతో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అవినీతి ఆరోపణలు రావడంతో 2011లో రాజీనామా చేయ డంతోపాటు జైలుకెళ్లాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలైన తరువాత బీజేపీని వీడి కర్ణాటక జనతా పక్ష పార్టీ పేరిట సొంత పార్టీని స్థాపించారు. 2013 ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు సీట్లే గెలుచుకుంది. 2014 ఎన్నికలకు ముందు తన పార్టీని బీజేపీలో విలీనం చేసి షిమోగా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. -
గృహహింస, లైంగిక వేధింపుల నియంత్రణపై ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ: నాలుగు గోడల మధ్య జరిగే దారుణాలను ఆపడం కష్టమేనని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అభిప్రాయపడ్డారు. బయట జరిగే దారుణాలను అరికట్టే అవకాశమున్నా ఇళ్లల్లో జరిగేవాటిని నియంత్రించడం పోలీసులకు అగ్నిపరీక్షేనన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ ఇన్ ఆసియా అండ్ ఓషినియా(సీఎంఏఏఓ) 28వ సదస్సు సందర్భంగా గురువారం నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. మహిళలు, చిన్నపిల్లల పట్ల జరుగుతున్న దారుణాల విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. నిర్భయ ఘటన తర్వాత పోలీసులు అప్రమత్తంగానే ఉంటున్నారని, వారి పనితీరు సంతృప్తికరంగానే ఉందన్నారు. కేసుల పరిష్కారం కోసం పోలీసులు ఎలక్ట్రానిక్ పరికరాల సాయాన్ని తీసుకోవాలని, నేరం జరిగినట్లు సమాచారం అందినవెంటనే స్పందించాలని సూచించారు. అయితే ఇళ్లల్లో జరుగుతున్న నేరాల సమాచారం పోలీసుల వద్దకు చేరడంలో ఆలస్యమవుతోందని, చాలా సందర్భాల్లో పోలీసుల వరకు కూడా రావడంలేదన్నారు. ఇటువంటి నేరాల ను, లైంగిక వేధింపులను నియంత్రించడం కష్టంగా మారిందని షీలాదీక్షిత్ అభిప్రాయపడ్డారు. రహదారులు, మాల్స్, బస్సులు, సినిమా థియేటర్ల వంటి జనసంచారమున్న బహిరంగ ప్రదేశాల్లో జరుగుతున్న నేరాలను నియంత్రించడం సాధ్యమేనని, అయితే నాలుగు గోడల మధ్య జరుగుతున్న దారుణాలను ఎలా నియంత్రించగలమని ప్రశ్నించారు. విద్యాబుద్ధులతోనే మార్పు... విద్యాస్థాయిని పెంచడం ద్వారానే సమాజంలో ఈ పరిస్థితి నుంచి మార్పును ఆశించవచ్చని షీలా అభిప్రాయపడ్డారు. స్త్రీలు, పిల్లల పట్ల వ్యవహరిస్తున్న తీరులో మార్పు వచ్చినప్పుడే ఈ దురాగతాలకు స్వస్తిపలికినట్లవుతుందని, విద్యా, సంస్కృతులు మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరముందన్నారు. దేశ విదేశాల్లో మహిళలు, పిల్లల పట్ల జరుగుతున్న నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతోనే వాటి నియంత్రణ కోసం ఏం చేయాలనే విషయమై ఇక్కడ సమావేశమైనట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరేందర్ సైని చెప్పారు. మహిళలకు అన్ని రకాల దాడుల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరముందన్నారు. డిసెంబర్ 16 తర్వాత పరిస్థితి మారింది.. డిసెంబర్ 16న చోటుచేసుకున్న సామూహిక అత్యాచారం ఘటన తర్వాత మహిళల భద్రత విషయంలో నగరంలో కొంత పురోగతి కనిపిస్తోందని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేర్కొన్నారు. అయితే ఆశించినమేర భద్రత కల్పించాలంటే మరింతగా శ్రమించాల్సి ఉందన్నారు. ఇది రాత్రికి రాత్రే సాధ్యమయ్యే పనికాదని, ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. -
దేశానికే మేం ఆదర్శం
దశాబ్దం క్రితం దాకా అధ్వానస్థితిలో ఉన్న ఢిల్లీ నగరాన్ని తమ ప్రభుత్వం సర్వతోముఖంగా అభివృద్ధి చేసిందని ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రకటించారు. కరెంటు చార్జీలను 30 శాతం తగ్గిస్తామంటూ విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఆహార భద్రత పథకం ద్వారా 73 లక్షల మంది పేదలకు అతి తక్కువ ధరలకే ఆహారధాన్యాలు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాహిత కార్యక్రమాలు, పథకాల అమలుకు దేశంలో మొట్టమొదట శ్రీకారం చుట్టే రాష్ట్రంగా ఢిల్లీని చూస్తున్నారని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అన్నారు. మొత్తం 73 లక్షల మంది పేదలను మరో రెండు నెలల్లో ఆహార భద్రత పథకం కిందకు తేవాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఆగస్టు 20న భారీ ఎత్తున నిర్వహించే సభ ద్వారా ఆహార భద్రత పథకాన్ని దేశంలో మొట్టమొదట ప్రారంభిస్తామని షీలాదీక్షిత్ చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా తొలుత 32 లక్షల మందికి భారీ సబ్సీడీతో ఆహార ధాన్యాలను సరఫరా చేస్తారు. ఢిల్లీని ఆకలిరహిత నగరంగా మార్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. 73 ల క్షల మందిని వీలైనంత త్వరగా ఈ పథకం పరిధిలోకి తేవడానికి కృషి చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించామన్నారు. మహిళలను శక్తిమంతులుగా చేయడానికి కూడా ఈ పథకం ఉపకరిస్తుందన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీయే చైర్పర్సన్ సోనియాగాంధీ ఆకాంక్ష మేరకు రూపొందించిన ఆహార భద్రత పథకం వల్ల ఢిల్లీలోని 1.32 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని షీలాదీక్షిత్ విశదీకరించారు. ఛత్రసాల్ స్టేడియంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రసంగిస్తూ షీలాదీక్షిత్ పైవిషయాలు చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో వరుసగా 15 సార్లు స్వాతంత్య్ర దినోత్సవాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఖ్యాతిని కూడా ఆమె దక్కించుకున్నా. ఏసీపీ పవన్‌కుమార్ నేతృత్వంలో ఢిల్లీ పోలీసులు, హోంగార్డులు, సివిల్ డిఫెన్స్ సిబ్బంది, ఎన్సీసీ, రాష్ట్ర అగ్నిమాపకశాఖ, విద్యార్థులు నిర్వహించిన పరేడ్‌ను ఆమె తిలకించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఢిల్లీకి రావాల్సిన నిధుల వాటా పెరగకపోయినా, ఢిల్లీ ఆర్థికంగా పురోగమిస్తోందని షీలాదీక్షిత్ వెల్లడించారు. రూ.రెండు లక్షల చొప్పున ఢిల్లీవాసి తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికమని ఆమె చెప్పారు. గడిచిన 15 సంవత్సరాలలో ఢిల్లీ అనూహ్యంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. 1998లో తాము అధికారంలోకి వచ్చినప్పటి పరిస్థితులను ఆమె గుర్తుచేశారు. ‘అప్పట్లో రోజుకు 11 గంటలకు పైగా విద్యుత్ కోతలు ఉండేవి. కరెంటు కోసం వీధుల్లో ఘర్షణలు జరిగేవి . విద్యుత్ సంస్కరణలను విజయవంతంగా అమలు చేయడం వల్ల సరఫరా స్థితి మెరుగుపడింది’ అని చెబుతూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘1998లో అధికారంలో ఉన్న ప్రభుత్వం (బీజేపీ) కేవలం 1,900 మెగావాట్ల డిమాండ్‌ను తీర్చలేకపోయింది. అదే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆరు వేల మెగావాట్ల డిమాండ్‌ను తీర్చగల సామర్థ్యం ఉంది’ అని ఆమె చెప్పారు. కరెంటు సరఫరా, పంపిణీ నష్టాలను 55 శాతం నుంచి 15 శాతానికి తగ్గించగలిగామని తెలిపారు. గ్రిడ్ వైఫల్యం నుంచి రక్షించడానికి ఢిల్లీలో పవర్ ఐలాండింగ్ను అమలు చేశామన్నారు. ఢిల్లీలో విద్యుత్ చార్జీలు ఎన్సీఆర్ పట్టణాలు, మెట్రో పట్టణాల కన్నా తక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. షీలా ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఇచ్చే సబ్సీడీని పెంచడమే కాక 201 నుంచి 400 యూనిట్ల వినియోగదారులకు కూడా కొత్తగా సబ్సిడీని ప్రకటించింది. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గిస్తామంటూ విపక్షాలు ఇస్తున్న బూటకపు హామీలను ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారని షీలాదీక్షిత్ తెలిపారు. అంతభారీ స్థాయిలో విద్యుత్ చార్జీలను తగ్గించే మంత్రదండమేదీ లేదని ఆమె చెప్పారు. నీటిని రక్షించుకుందాం.. అన్ని ప్రాంతాలకూ నీటి సరఫరా అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదనపు నీటి సరరా కోసం ఢిల్లీ ఇతర రాష్ట్రాలపై ఆధారపడి ఉన్నందున, కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని ఆమె చెప్పారు. మునాక్ కెనాల్‌పై పెట్టిన ఖర్చు వృథా అయిందని విచారం వ్యక్తం చేశారు. ‘ప్రతి నీటి చుక్కా అమూల్యమైనది. దానిని వృథా చేయవద్దు. నీటి బిల్లుల బకాయిలు, సర్‌చార్జీలను కూడా మా ప్రభుత్వం తగ్గించింది’ అని చెప్పారు. రవాణారంగానికి పెద్దపీట మౌలిక సదుపాయాలు, రవాణారంగంలో తమ ప్రభుత్వం తెస్తున్న పెనుమార్పుల వల్ల ఢిల్లీ అత్యుత్తమ నగరం కాగలగుతుందని ఆశాభావం ప్రకటించారు. ఏసీ, నాన్ఏసీ లోఫ్లోర్ బస్సులతో ప్రపంచస్థాయి రవాణా సదుపాయం కల్పించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంతర్జాతీయ విమానాశ్రయాలకు దీటైన సదుపాయాలతో కశ్మీరీగేట్ ఐఎస్బీటీని అభివృద్ధి చేశామన్నారు. నాలుగోదశ మెట్రోపనులు పూర్తయితే, వాటి సేవల పరిధి మరో 400 కిలోమీటర్ల మేర పెరుగుతుందన్నారు. అనేక ప్రభుత్వ విభాగాల్లో ఈ-గవర్నెన్స్ ప్రాంభించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని షీలాదీక్షిత్ చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, కోర్టుల్లో ఈ-పాలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఐదు అక్రెడిడేటెడ్ ఆసుపత్రులున్న నగరం ఢిల్లీ ఒక్కటేనని షీలాదీక్షిత్ చెప్పారు. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే 35 శాతం రోగులకు ఢిల్లీ ఆసుపత్రులు వైద్య సేవలను అందిస్తున్నాయన్నారు. విద్యతోనే వ్యక్తిత్వ వికాసం ఇక్కడి విద్యావ్యవస్థ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేలా ఉంటుందని చెప్పారు. బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణులయ్యేవారి శాతం గణనీయంగా పెరిగిందన్నారు. 10వ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణతశాతం 99.4 శాతానికి పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా మరిన్ని పాఠశాలలు తెరుస్తున్నట్లు వెల్లడించారు. బాలల కోసం అకాడమీ ప్రాంభించిన తొలిరాష్ట్రం ఢిల్లీయేనన్నారు. ‘ప్రపంచంలోని హరిత రాజధానుల్లో ఢిల్లీ ఒకటి. నగర విస్తీర్ణంలో 20.2 శాతం హరితప్రదేశం. కామన్వెల్త్ క్రీడల కోసం అభివృద్ధి చేసిన సదుపాయాలు నగరంలో భాగంగా మారాయి’ అని ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వివరించారు.