
సాక్షి,బెంగళూరు: నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీఎస్ యడ్యూరప్ప జీవితంలో కూడా ఎన్నో మలుపులు, వివాదాలున్నాయి. సాధారణ ప్రభుత్వ గుమస్తా నుంచి ప్రభుత్వ అధినేతగా ఎదిగిన ఆయన జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. మాండ్యా జిల్లా బూకనకెరె గ్రామంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సిద్దలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు 1943, ఫిబ్రవరి 27న యడ్యూరప్ప జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై హిందుత్వ విధానాలను అనుసరించారు. డిగ్రీ పూర్తయ్యాక కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖలో క్లర్కు ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ఉద్యోగం వదిలి స్వగ్రామంలోని ఒక రైస్ మిల్లులో పని చేశారు. ఆ మిల్లు యజమాని కుమార్తె మైత్రిదేవిని ప్రేమించి పెళ్లాడారు. 1980లో బీజేపీలో చేరి 1983లో తొలిసారిగా శికారిపుర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2007, 2008, 2018లలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
షాకిచ్చిన జేడీఎస్: 2006లో ధరమ్‌సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ సర్కారును కూల్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జేడీఎస్‌తో చేతులు కలిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. యడ్డీ 2007లో తొలిసారి సీఎంగా ప్రమాణం చేసినా జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో వారంలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించడంతో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అవినీతి ఆరోపణలు రావడంతో 2011లో రాజీనామా చేయ డంతోపాటు జైలుకెళ్లాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలైన తరువాత బీజేపీని వీడి కర్ణాటక జనతా పక్ష పార్టీ పేరిట సొంత పార్టీని స్థాపించారు. 2013 ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు సీట్లే గెలుచుకుంది. 2014 ఎన్నికలకు ముందు తన పార్టీని బీజేపీలో విలీనం చేసి షిమోగా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment