yadurappa
-
ఈ స్పీచ్‌లు! మనకన్నా అధికార పార్టీకి ఎక్కువ ప్లస్ అవుతాయోననిపిస్తుంది!
ఈ స్పీచ్‌లు! మనకన్నా అధికార పార్టీకి ఎక్కువ ప్లస్ అవుతాయోననిపిస్తుంది! -
యడ్డీని ఎవరూ టార్గెట్ చేయలేరు
సాక్షి, గంగావతి (కర్ణాటక): మాజీ సీఎం యడియూరప్పను టార్గెట్ చేసే శక్తి ఎవరికీ లేదని ఆయన కుమారుడు బీ.వై. విజయేంద్ర అన్నారు. ఆయన సింధగి ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ మార్గం మధ్యలో కొప్పళ గవిమఠాన్ని సందర్శించి గవిసిద్దేశ్వర స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్న అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. సింధగి, హానగల్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. చంద్రశేఖర్ పాటిల్, కనకగిరి ఎమ్మెల్యే ధడేసూగూరు బసవరాజ్, అమరేష్ కరడి పాల్గొన్నారు. -
కర్ణాటక సీఎం యడ్యూరప్పకు ఎదురుదెబ్బ
సాక్షి, కర్ణాటక: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. భూముల డీనోటిఫికేషన్ కేసులో పోలీసుల నివేదికను బెంగళూరు స్పెషల్ కోర్టు తిరస్కరించింది. పోలీసుల నివేదికను తప్పుబట్టిన కోర్టు.. భూముల డీనోటిఫికేషన్‌పై పునర్విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ భూమి అప్పగింతపై యడ్యూరప్పపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
కర్ణాటకలో లాక్డౌన్ సడలింపు.. ఎప్పటివరకంటే!
సాక్షి, బెంగళూరు: రోజు రోజుకూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను సడలిస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కరోనా రెండో వేవ్ తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో లాక్డౌన్ నియమాలు సడలించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప శనివారం ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం.. రాష్ట్రంలో 5% శాతం కన్నా తక్కువ పాజిటివిటీ రేటున్న 16 జిల్లాల్లో మాల్స్, రెస్టారెంట్లు, కళ్యాణ మండపాలు, స్పా, సెలూన్లు, రెస్టారెంట్లు, షాపింగ్ కాంప్లెక్సులను 50% సామర్థ్యంతో సాయంత్రం 5 గంటల వరకు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. బస్సులు, మెట్రో రైళ్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి.ఈ సడలింపులు ఈనెల 21 నుంచి అమలులోనికి రానున్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,783 మందికి వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. అదే సమయంలో 168 మంది మృత్యువాత పడ్డారు. 15,290 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,96,121కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 26,25,447మంది కోలుకున్నారు. 33,602 మంది మరణించారు. ప్రస్తుతం 1,37,050 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. -
లాక్డౌన్ పొడిగించిన కర్ణాటక.. రూ. 500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
బెంగళూరు: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. మొదటి దశలో కంటె సెకండ్‌వేవ్‌లో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అనేక రాష్ట్రాలు కోవిడ్ కట్టడికి లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. అయితే, కేసులు అదుపులోకి వస్తున్న క్రమంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులపాటు పొడిగిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించాయి. తాజాగా, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప జూన్ 14 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతున్నాయని.. మరికొన్ని రోజులు లాక్డౌన్ పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలే మరికొన్ని రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. కాగా, రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ తీవ్రత 5 శాతానికి తగ్గిందని అన్నారు. అయితే, ఈ సారి ప్రత్యేకంగా మత్స్యకారులు, పూజారులు, పవర్లూమ్ కార్మికులు..ఇతరులకు రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందని తెలిపారు. ప్రతిరోజు నమోదవుతున్న కేసులు కూడా గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. లాక్డౌన్ వలన ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అయితే, ఇప్పటికే తమ ప్రభుత్వం ప్రజల జీవనోపాధి కోసం 1,250 కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని తెలిపారు. అలాగే, తమ ప్రభుత్వం ఈ నెలలో 60 లక్షలకు పైగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. జూన్ 30 నాటికి దాదాపు 2 కోట్ల మందికి టీకాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యాక్సిన్లను సరఫరాకు చేయుత అందించిన ప్రధాని మోదీకి, యడ్యూరప్ప ట్వీటర్లో ధన్యవాదాలు తెలిపారు. -
కర్ణాటక సీఎంపై గవర్నర్‌కు మంత్రి ఫిర్యాదు
బెంగళూరు: కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప తీరుపై బుధవారం గవర్నర్ వజూభాయ్ వాలాకు ఫిర్యాదు చేశారు. తన శాఖ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఐదు పేజీల ఫిర్యాదు పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. తన శాఖకు సంబంధించిన పలు పరిపాలనా సంబంధమైన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని ఈశ్వరప్ప చెప్పారు. తనకు తెలియకుండానే తన శాఖ నుంచి ముఖ్యమంత్రి నిధులు విడుదల చేస్తున్నారని విమర్శించారు. యడియూరప్పకు సన్నిహితుడిగా ఈశ్వరప్ప పేరు పొందారు. ఇటీవల ఇరువురి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. -
కర్ణాటకలో టెస్లా ప్లాంట్
బెంగళూరు: ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. గతంలో బిల్ గేట్స్ కంప్యూటర్ రంగంలో సృష్టించిన సంచలనాలను ఇప్పుడు ఎలన్ మస్క్ ఇతర రంగాల్లో సాధిస్తున్నారు. ఆయనకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇతర దిగ్గజ ఆటోమొబైల్ తయారీ కంపెనీలకు దీటుగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ అమ్ముడుపోతున్న కార్లు టెస్లా కంపెనీకి చెందినవే. అలాంటి కారు తయారీ కంపెనీ మన భారత్ లో కూడా ప్లాంట్ పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తమ హెడ్ క్వార్టర్‌గా బెంగళూరును ఎంచుకున్న టెస్లా. ఇప్పుడు ప్లాంట్ ను కూడా బెంగళూరు దగ్గరలోని తుంకూర్ జిల్లాలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు కర్ణాటక సీఎం యడ్యూరప్ప అధికారిక ప్రకటన చేశారు. టెస్లా ప్లాంట్ నిర్మాణం, కార్ల అభివృద్ధి కోసం 7,725 కోట్లను కూడా కేటాయించినట్లు పేర్కొన్నారు. టెస్లా మోటార్స్ ఇండియా జనవరి 8న టెస్లా ఆర్&డి విభాగాన్ని బెంగళూరులో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థకు డైరెక్టర్ లలో ఒకరిగా డేవిడ్ ఫెనిస్టియన్ పేరును కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఆయన టెస్లాలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా విధులను నిర్వహిస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటిగా టెస్లా మోడల్ 3 సెడాన్ అమ్మకానికి తీసుకొనిరావడానికి చూస్టున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ఈ మోడల్ 3 ధర 38వేల డాలర్లుగా ఉంది. చదవండి: ప్రపంచంలో చవకైన ఎలక్ట్రిక్ వాహనం సెంచరీ కొట్టిన పెట్రోల్ ధరలు! -
ప్రముఖులపై కరోనా పంజా
న్యూఢిల్లీ/బెంగళూరు/లక్నో: కరోనా మహ మ్మారి అత్యంత ప్రముఖులను సైతం వదిలిపెట్టడం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తమిళనాడు గవర్నర్, కర్ణాటక సీఎం యెడియూరప్ప తాజాగా కరోనా బారినపడ్డారు. ఉత్తరప్రదేశ్ మంత్రి కరోనా వల్ల కన్నుమూశారు. అమిత్ షాకు కరోనా పాజిటివ్ తనలో కరోనా వైరస్ ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(55) ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వెల్లడించారు. అమిత్ షా ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ సుశీల్ కటారియా పర్యవేక్షిస్తున్నారు. మేదాంత ఆసుపత్రిలోకి ఇతరులు రాకుండా నిషేధం విధించారు. అమిత్ షాను ఇటీవలే తాను కలిశానని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో చెప్పారు. అతి త్వరలో కరోనా టెస్టు చేయించుకుంటానని, అప్పటిదాకా కుటుంబ సభ్యులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉంటానని తెలిపారు. అమిత్ షాను కలిసిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయన ఇటీవలే కేబినెట్ భేటీలో పాల్గొన్నారు. అమిత్ షా త్వరగా కోలుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, హరియాణా సీఎం ఖట్టర్ ఆకాంక్షించారు. యెడియూరప్ప కూడా.. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు కరోనా వైరస్ సోకింది. ఆదివారం ఆయనకు పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా తేలింది. యెడియూరప్ప చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఇటీవల తనను కలిసినవారు కరో నా టెస్టు చేయించుకోవాలని, హోం ఐసో లేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ కూడా కరోనా బారినపడ్డారు. కరోనాతో యూపీ మంత్రి మృతి యూపీ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమల్‌రాణి (62)ని కరోనా పొట్టన పెట్టుకుంది. ఆమె ఆదివారం లక్నో లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశా రు. రాష్ట్రంలో కరోనా వల్ల ఒక మం త్రి మరణించడం ఇదే తొలిసారి. యూపీ కేబినెట్లో ఆమె ఏకైక మహిళ. కమల్‌రాణికి జూలై 18న పరీక్షలు చేయ గా, కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమె డయాబెటిస్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. కరోనా బారిన తమిళనాడు గవర్నర్ సాక్షి, చెన్నై: తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు(80) కరోనా వైరస్ సోకింది. ఆయనలో కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉండడంతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని కావేరీ ఆసుపత్రి వైద్యులు సూచించారు. తమిళనాడు రాజ్‌భవన్‌లో ముగ్గురికి కరోనా సోకడంతో గవర్నర్ పురోహిత్ జూలై 29 నుంచి సెల్ఫ్ ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. ఒక వైద్య బృందం ఎప్పటికప్పుడు గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గవర్నర్‌లో కరోనా లక్షణాలు బయటపడలేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశాయి. -
ఇకపై వర్క్ ఫ్రం హోం చేయనున్న కర్ణాటక సీఎం
ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. శుక్రవారం కోవిడ్ -19 పరిస్థితిని సమీక్షించడానికి బ్రూహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) మొత్తం 198 మంది కార్పొరేటర్లతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే ఆయన వద్ద పనిచేసే సిబ్బందిలో కొంత మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తాను ఇంటి నుంచి పని చేయనున్నట్లు యడ్యూరప్ప చెప్పారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ముందు జాగ్రత్త కోసం ఇంటి నుంచి పనిచేస్తున్నానని తెలిపారు. ప్రజలెవరు భయమపడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన ఆన్లైన్ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తానని చెప్పారు. (‘దయచేసి బెంగళూరును వీడొద్దు’) ఈ విషయాని కంటే ముందు యడ్యూరప్ప రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కరోనా సెంటర్ కోసం బెంగుళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో 10,100 బెడ్లు ఏర్పాటు చేసినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. ప్రజలందరూ కరోనా గైడ్‌లైన్లకు ఫాలో అవుతూ కరోనా వ్యాప్తిని ఆరికట్టాలని యడ్యూరప్ప కోరారు. ఇదిలా వుండగా ఇప్పటి వరకు కర్ణాటకలో 30,000లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. (కరోనా భయంతో భార్యను వెళ్లగొట్టాడు!) The largest Covid care centre in the country with 10,100 beds has been setup at the Bangalore International Exhibition Centre. Its key feature being that everything that an Asymptomatic Covid patient needs will all be available under one roof.#KarnatakaCoronaUpdate pic.twitter.com/zdmGBLNvVe — CM of Karnataka (@CMofKarnataka) July 10, 2020 -
6న కర్ణాటక కేబినెట్ విస్తరణ
బెంగళూరు: కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయింది. కేబినెట్‌ను ఈనెల 6వ తేదీన విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. ‘ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు రాజ్‌భవన్‌లో 13 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తారు’అని ఆదివారం సీఎం వెల్లడించారు. వీరిలో కాంగ్రెస్, జేడీఎస్ తదితర పార్టీల నుంచి బీజేపీలో చేరిన 10 మంది ఉన్నారని తెలిపారు. అన్ని ప్రాంతాలకు, కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం లింగాయత్‌లు 8 మంది, వొక్కలిగలు ముగ్గురు, ఎస్సీలు ముగ్గురు, ఇద్దరు ఓబీసీలు, బ్రాహ్మణ, ఎస్టీల నుంచి ఒక్కరు చొప్పున కేబినెట్లో ప్రాతినిధ్యం ఉంది. మంత్రివర్గం పరిమితి 34 మంది కాగా, ముఖ్యమంత్రి సహా ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో 18 మంది మంత్రులున్నారు. ఆరు నెలల క్రితం అధికారపగ్గాలు చేపట్టిన యడియూరప్ప కేబినెట్ విస్తరణపై రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. ఎట్టకేలకు జనవరి 31వ తేదీన బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. -
విశ్వాసపరీక్షలో ‘యెడ్డీ’ విజయం
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో గత నెల రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. విధానసౌధలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విజయం సాధించారు. అసెంబ్లీ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే సీఎం యడియూరప్ప ‘నా నేతృత్వంలోని మంత్రివర్గంపై ఈ సభ విశ్వాసం ఉంచుతోంది’ అనే ఏకవాక్య తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ..‘నేను ప్రతీకార రాజకీయాల జోలికిపోను. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో పాలనా యంత్రాంగం నిర్వీర్యమైంది. దీన్ని చక్కదిద్దడమే మా తొలి ప్రాధాన్యత’ అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్–జేడీఎస్ సభ్యులు డివిజన్ కోరకపోవడంతో విశ్వాసతీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. స్పీకర్ రమేశ్ కుమార్ ఆదివారం కాంగ్రెస్–జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేసిన విషయం తెలిసిందే. ఇది అనైతిక ప్రభుత్వం.. విశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా సీఎల్పీ నేత సిద్దరామయ్య ముఖ్యమంత్రి యడియూరప్పపై నిప్పులు చెరిగారు. ‘యడియూరప్ప నేతృత్వంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అనైతిక పద్ధతుల్లో ప్రభుత్వం ఏర్పడింది. ఆయనకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లేదు. కేవలం 105 మంది ఎమ్మెల్యేలతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవీకాలాన్ని పూర్తిచేసుకోవాలని నేను కోరుకుంటున్నా. కానీ మీరెంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటారో చూద్దాం!’ అని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి మాట్లాడుతూ..‘మీరు(బీజేపీ) కుట్రలు పన్ని అధికారంలోకి వచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన పనులు, ఈ రాజకీయాలు చరిత్రలో నిలిచిపోతాయి’ అని వ్యంగ్యంగా అన్నారు. విశ్వాసఘట్టం ముగిసిన నేపథ్యంలో మంత్రివర్గ ఏర్పాటుపై దృష్టిసారిస్తామని బీజేపీ నేత సురేశ్ కుమార్ తెలిపారు. స్పీకర్ రాజీనామా.. అసెంబ్లీలో విశ్వాసతీర్మానం ఆమోదం పొందినవెంటనే తాను స్పీకర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రమేశ్ కుమార్ ప్రకటించారు.‘రాజ్యాంగాన్ని అనుసరించి మనస్సాక్షి ప్రకారం విధుల్ని నిర్వర్తించాను. స్పీకర్ కుర్చీ గౌరవాన్ని కాపాడేందుకు శాయశక్తులా కృషిచేశాను. ప్రజలు మీకు(యడియూరప్ప) రెండో అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో సుపరిపానలతో మీదైన ముద్ర వేయండి’ అని తెలిపారు. అనంతరం తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డికి అందించి సభనుంచి నిష్క్రమించారు. అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఖర్చులకు ఉద్దేశించిన ఆర్థికబిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. -
కన్నడ పీఠంపై మళ్లీ ‘కమలం’
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో మరోసారి కమలనాథుల ప్రభుత్వం కొలువుదీరింది. కర్ణాటక 32వ ముఖ్యమంత్రిగా బూకనకెరె సిద్ధలింగప్ప యడియూరప్ప(76) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ వజూభాయ్‌వాలా శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సదానంద గౌడతో పాటు మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ, కర్ణాటక బీజేపీ ఇన్చార్జ్ మురళీధరరావు, బీజేపీ నేత శోభాకరంద్లాజే, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రోషన్‌బేగ్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజన్న ఈ వేడుకకు వచ్చి అందర్ని ఆశ్చర్యపరిచారు. కర్ణాటకలో హెచ్.డి.కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన మూడ్రోజులకే యడియూరప్ప ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం. కాంగ్రెస్ నేతలెవరూ ఈ కార్యక్రమానికి రాలేదు. యెడ్డీకి అమిత్ షా ఫోన్.. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ముగ్గురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయడంతో బీజేపీ అధిష్టానం చకచకా పావులు కదిపింది. పలువురు న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. శుక్రవారం ఉదయాన్నే యడియూరప్పకు ఫోన్‌చేసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వజూభాయ్‌వాలా అపాయింట్మెంట్ తీసుకున్న యడియూరప్ప నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలనీ, సభలో మెజారిటీని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇందుకు అంగీకరించిన గవర్నర్ వజూభాయ్‌వాలా సాయంత్రం 6–6.15 గంటల మధ్యలో ప్రమాణస్వీకారం చేయాలని ఆదేశించారు. యడియూరప్ప ఇప్పటికే ప్రతిపక్ష నేత కాబట్టి ఆయన్ను బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా మరోసారి ఎన్నుకోలేదు. 29న అసెంబ్లీలో బలపరీక్ష.. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక యడియూరప్ప స్పందిస్తూ.. ఈ నెల 29న ఉదయం 10 గంటలకు బలపరీక్షను చేపడతామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన ఆర్థిక బిల్లును కూడా ఆమోదిస్తామని చెప్పారు. బీజేపీ చీఫ్ అమిత్ షాను సంప్రదించి త్వరలోనే మంత్రివర్గ విస్తరణను చేపడతామని పేర్కొన్నారు. మరోవైపు యడియూరప్ప విజ్ఞప్తి మేరకు సోమవారం సభను నిర్వహిస్తానని స్పీకర్ చెప్పారు. యడ్యూరప్ప కాదు.. యడియూరప్ప! కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తన పేరును మరోసారి మార్చుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్‌కు రాసిన లేఖలో తన పేరును ఆయన ‘బీఎస్ యడియూరప్ప’గా రాశారు. న్యుమరాలజీ ప్రభావంతో యడియూరప్ప ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. 2007లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిరావడంతో న్యుమరాలజీ ప్రకారం యడియూరప్ప తన పేరును యడ్యూరప్పగా మార్చుకున్నారు. అయితే ఇది కలిసిరాకపోవడంతో ఈ బీజేపీ నేత తన పాత పేరునే వాడాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమా? ప్రస్తుత పరిస్థితుల్లో యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్‌ను మినహాయించి)కి చేరుకుం టుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 112 అయింది. బీజేపీకి ప్రస్తుతం 106 మంది సభ్యుల (బీజేపీ 105, ఓ స్వతంత్ర ఎమ్మె ల్యే) బలముంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఆరుగు రిని బీజేపీ ఎలా సంపాదిస్తుందన్నది ఇప్పు డు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ స్పీకర్ రమేశ్ మిగిలిన 14 మంది రెబెల్స్ రాజీనామాలను ఆమోదిస్తే/ అనర్హత వేటేస్తే అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 208కి చేరుకుంటుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు 105 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతుంది. ఇదే జరిగితే ఓ స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ గట్టెక్కుతుంది. అయితే 14 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ప్రస్తుతం అస్పష్టత నెలకొంది. ప్రజానుకూల పాలన అందిస్తాం: అమిత్ షా కర్ణాటకలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సుస్థిరమైన, రైతు, ప్రజానుకూల పాలన అందిస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు. కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్పకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. కర్ణాటక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. కలహాలవల్లే కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయిందనీ, తమ ప్రమేయం లేదన్నారు. మండిపడ్డ కాంగ్రెస్, జేడీఎస్.. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకా రం చేయడంపై కాంగ్రెస్, జేడీఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ‘బీజేపీకి అండగా నిలిచిన వజూభాయ్‌వాలా సాయంతో రాజ్యాంగ విరుద్ధంగా కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. అవినీతి రారాజు, జైలు పక్షి యడియూరప్ప రాజకీయ ప్రలోభాల విషయంలో తన అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి అధికారంలోకి వచ్చారు’ అని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శించింది. కర్ణాటక బీజేపీకి ప్రయోగశాలగా మారిపోయిందని సీఎల్పీ నేత సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. యడియూరప్ప వరాల జల్లు కర్ణాటకలో రైతులు, చేనేత కార్మికులకు సీఎం యడియూరప్ప వరాలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఎంపికైన రైతులకు అదనంగా రూ.4000ను రెండు విడతల్లో అందజేస్తామని తెలిపారు. ఈ పథకం కింద కేంద్రం ఏటా రూ.6 వేలు అందిస్తుందన్నారు. అలాగే చేనేత కార్మికులకు రూ.100 కోట్ల మేర ఉన్న అప్పులను మాఫీ చేస్తామని వెల్లడించారు. రైతుల రుణమాఫీ విషయంలో అన్నిపక్షాలను సంప్రదించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. 15 ఏళ్లకే ఆరెస్సెస్ కార్యకర్త కర్ణాటకలోని మాండ్యా జిల్లా బూకనకెరె గ్రామంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సిద్దలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు 1943, ఫిబ్రవరి 27న జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే ఆరెస్సెస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారు. తన స్వగ్రామం శికారిపురలో ఒక రైలు మిల్లులో పని చేశారు. ఆ మిల్లు యజమాని కుమార్తె మైత్రిదేవిని ప్రేమించి పెళ్లాడారు. ఆరెస్సెస్ శికారిపుర సంఘ్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో బీజేపీలో చేరిన యడ్యూరప్ప 1983 నుంచి శికారిపుర ఎమ్మెల్యేగా ఏడు సార్లు ఎన్నికయ్యారు. తొలిసారి 2007లో.. 2007 నవంబర్‌లో తొలిసారి యడియూరప్ప సీఎం అయ్యారు. జేడీ(ఎస్) మద్దతు ఉపసంహరించడంతో ఆయన ఏడు రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008 మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అక్రమ మైనింగ్ కేసులో లోకాయుక్త యడియూరప్పను దోషిగా తేల్చడంతో మూడేళ్లకే 2011 జులైలో సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చింది. వారం రోజులు జైల్లో ఉన్నారు. కొత్త పార్టీ.. మళ్లీ విలీనం ఆ తరువాత కర్ణాటక జనతా పక్ష (కేజేపీ) పేరుతో పార్టీ పెట్టారు. 2014లో కేజేపీని బీజేపీలో విలీనం చేశారు. 2018 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకోవడంతో యడియూరప్ప మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బలనిరూపణకు 15 రోజుల సమయం ఇచ్చారు. కానీ, దీనిపై కాంగ్రెస్, జేడీ(ఎస్) కోర్టుకెక్కడంతో సుప్రీంకోర్టు వెంటనే బలాన్ని నిరూపించుకోవాలంటూ ఆదేశించింది. కేవలం 3 రోజులు మాత్రమే సీఎంగా ఉన్న యెడ్డీ మే 19న బలపరీక్షకు కాస్త ముందు రాజీనామా చేశారు. -
హై‘కమాండ్’ కోసం ఎదురుచూపులు
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కర్ణాటక బీజేపీ చీఫ్, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. అయితే ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరులోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) ప్రధాన కార్యాలయం ‘కేశవ కృప’లో బుధవారం సంఘ్ పెద్దలను కలుసుకున్న అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ‘నేను ఢిల్లీ నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నా. ఎప్పుడు అవసరమైనా నేను బీజేపీ శాసనసభా పక్షాన్ని సమావేశపర్చి ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌ను కలుసుకోగలను. కానీ ఇందుకోసం పార్టీ హైకమాండ్ నుంచి తొలుత స్పష్టత రావాలి’ అని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాసపరీక్షకు అనుకూలంగా 99 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపగా, 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. దీంతో విశ్వాసతీర్మానం వీగిపోయి సీఎం కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఆరెస్సెస్ ఆశీర్వాదం వల్లే.. ఆరెస్సెస్ పెద్దల ఆశీర్వాదం, సహకారం కారణంగానే తాను తాలూకా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి నేతగా, ముఖ్యమంత్రిగా ఎదిగానని యడ్యూరప్ప తెలిపారు. ‘తదుపరి కార్యాచరణను చేపట్టేముందు ఆరెస్సెస్ పెద్దల ఆశీస్సులు తీసుకునేందుకే ఇక్కడకు వచ్చాను. విశ్వాసపరీక్ష సందర్భంగా మా ఎమ్మెల్యేలు బలంగా, ఐకమత్యంతో నిలిచారు. మాకు రాబోయే కాలంలో కీలకమైన పరీక్షలు ఎదురుకానున్నాయి. ఇలాంటి పరిస్థితులన్నింటిని దీటుగా ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’ అని వెల్లడించారు. మరోవైపు విశ్వాసపరీక్షకు డుమ్మా కొట్టిన 17 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో స్పీకర్ రమేశ్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని బీజేపీ అధిష్టానం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనిపై స్పష్టత వచ్చాకే కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ముందుకెళ్లాలని భావిస్తోంది. కాగా, ముంబైలో ఆందోళన చెందుతున్న రెబెల్ ఎమ్మెల్యేలకు సర్దిచెప్పేందుకు బీజేపీ నేతలు అశ్వంత్ నారాయణ్, ఆర్.అశోక ముంబైకి బయలుదేరివెళ్లారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక దూత.. కర్ణాటకలో నాటకీయ పరిణామాల మధ్య సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో బీజేపీ అధిష్టానం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను సాఫీగా జరిగేలా చూసేందుకు త్వరలోనే ప్రత్యేక పరిశీలకుడిని పంపనుంది. కర్ణాటకలో విశ్వాసపరీక్షకు మొత్తం 17 మంది అధికార కూటమి సభ్యులు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వీరిపై స్పీకర్ చర్యలు తీసుకునేవరకూ వేచిఉండాలన్న ధోరణితోనే బీజేపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ స్పీకర్ సుప్రీంకోర్టుకెళ్లిన 15 మంది రెబెల్స్ రాజీనామాలను ఆమోదించి లేదా అనర్హత వేటేస్తే అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 210కి, కాంగ్రెస్–జేడీఎస్ కూటమి బలం(బీఎస్పీ ఎమ్మెల్యేతో కలుపుకుని) 103కు చేరుకుంటుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 106కు తగ్గుతుంది. దీంతో 107 ఎమ్మెల్యేల మద్దతున్న బీజేపీ కూటమి(బీజేపీ 105, ఇద్దరు స్వతంత్రులు) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమౌతుంది. అయితే స్వతంత్రుల దయాదాక్షిణ్యాలపై బీజేపీ ప్రభుత్వం మనుగడ సాగించాల్సి ఉంటుంది. -
18న బలపరీక్ష
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ నెల 18న(గురువారం) ఉదయం 11 గంటలకు విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పీకర్ రమేశ్ ప్రకటించారు. బీఏసీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలను సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నాననీ, ఇందుకు ఇరుపక్షాలు అంగీకరించాయన్నారు. ఈ మేరకు సోమవారం విధానసౌధలో ప్రకటించిన స్పీకర్..విశ్వాసపరీక్షకు వీలుగా సభను గురువారానికి వాయిదా వేశారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ‘పూర్తి నమ్మకంతో ఉన్నా. మీరెందుకు ఆందోళన చెందుతున్నారు?’ అని మీడియాను ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: యడ్యూరప్ప బీఏసీ సమావేశం సోమవారం సహృద్భావ వాతావరణంలో సాగిందని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప తెలిపారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తాము ప్రకటించడంతో, ప్రభుత్వం బలపరీక్షకు తేదీని ఖరారు చేసిందని వ్యాఖ్యానించారు. ‘విశ్వాసపరీక్ష జరిగేవరకూ ఎలాంటి సభా కార్యకలాపాలు కొనసాగరాదని మేం స్పీకర్‌ను కోరాం. మా విజ్ఞప్తి మేరకు ఆయన సభను గురువారానికి వాయిదా వేశారు. దీన్ని మేం స్వాగతిస్తున్నాం. రాబోయే 3–4 రోజుల్లోనే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీజేపీ ప్రభుత్వం కర్ణాటకకు అత్యుత్తమ పాలన అందిస్తుంది’ అని తెలిపారు. అసెంబ్లీలో మంచి ప్రసంగం ఒకటి ఇచ్చాక సీఎం కుర్చీ నుంచి కుమారస్వామి తప్పుకుంటారని వ్యాఖ్యానించారు. విచారణకు ఇద్దరు రెబెల్స్ డుమ్మా.. స్పీకర్ ముందు విచారణకు ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రాజీనామాల విషయంలో తమ వాదనల్ని వినిపించేందుకు సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, జేడీఎస్ ఎమ్మెల్యే గోపాలయ్యలను స్పీకర్ ఆదేశించారు. అయితే అసెంబ్లీ కార్యదర్శి ఆఫీసుకు ఫోన్‌చేసిన ఇద్దరు నేతలు, విచారణకు తాము రాలేకపోతున్నట్లు సమాచారం అందించారు. ఈ సందర్భంగా విచారణకు మరో తేదీని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే వీరి విజ్ఞప్తిపై స్పీకర్ స్పందించలేదు. పోలీస్ కమిషనర్‌కు రెబెల్స్ లేఖ.. తమను బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖర్గే, ఆజాద్‌లు రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. ఈ 15 మంది కాంగ్రెస్–జేడీఎస్ ఎమ్మెల్యేలు సోమవారం ముంబై పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ‘ ఖర్గే లేదా ఆజాద్ లేదా మరో కాంగ్రెస్ నేతను కలుసుకునే ఉద్దేశం మాకు లేదు. కాంగ్రెస్ నేతల రాక నేపథ్యంలో మా భద్రతపై ఆందోళనతో ఉన్నాం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ నేతలు మమ్మల్ని కలుసుకోకుండా నిలువరించండి’ అని లేఖలో కోరారు. కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ముంబైలోని రినైసెన్స్ హోటల్లో బస చేస్తున్నారు. కాగా, ఈ రెబెల్ ఎమ్మెల్యేలు గురువారం జరిగే విశ్వాసపరీక్షకు హాజరుకాబోరని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సిట్ విచారణకు ఎమ్మెల్యే బేగ్ గైర్హాజరు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోషన్ బేగ్ సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు గైర్హాజరయ్యారు. ఐఎంఏ జువెల్స్ అధినేత మన్సూర్ ఖాన్ నుంచి రూ.400 కోట్లు పుచ్చుకున్న కేసులో ఆయనకు సిట్ నోటీసులు జారీచేసింది. ముఖ్యమైన పనిపడటంతో తాను విచారణకు రాలేకపోతున్నానని రోషన్ బేగ్ తెలిపారు. ఈ నెల 25న విచారణకు వస్తానని చెప్పారు. అయితే ఇందుకు అంగీకరించని సిట్.. జూలై 19న విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేస్తూ రెండోసారి నోటీసులు జారీచేసింది. బేగ్ తన దగ్గర రూ.400 కోట్లు పుచ్చుకుని తిరిగివ్వడం లేదని మన్సూర్ ఖాన్ ఓ వీడియో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సుప్రీం ఓకే స్పీకర్ తమ రాజీనామాలను ఉద్దేశపూర్వకం గానే ఆమోదించడంలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఐదుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. తమ పిటిషన్‌ను మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌తో కలిపి విచారించాలన్న రెబెల్ ఎమ్మెల్యేల విజ్ఞప్తికి కోర్టు అంగీకరించింది. ఈ 15 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారిస్తామని సీజేఐ జస్టిస్ గొగోయ్, జస్టిస్ గుప్తాల బెంచ్ తెలిపింది. కర్ణాటకకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కోర్టు ఇంతకుముందు స్పీకర్ రమేశ్‌ను ఆదేశించడం తెల్సిందే. ఎమ్మెల్యేల రాజీనామాల కంటే ముందు అనర్హత పిటిషన్‌పైనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా? అనే విషయాన్ని తాము పరిశీలించాల్సి ఉందని బెంచ్ వ్యాఖ్యానించింది. -
రేపే ‘విశ్వాసం’ పెట్టండి
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో బుధవారం బలపరీక్ష నిర్వహించాలని సీఎం కుమారస్వామి ప్రతిపాదించడంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్–జేడీఎస్ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెబెల్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ ఇంటికి శనివారం వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత శివకుమార్, రాజీనామాను వెనక్కు తీసుకునేలా ఆయన్ను ఒప్పించారు. దీంతో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం బలం పుంజుకోకుండా బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. కర్ణాటక సీఎం తన బలాన్ని అసెంబ్లీలో సోమవారం నిరూపించుకోవాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప డిమాండ్ చేశారు. బెంగళూరులో శనివారం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ‘సీఎం స్వయంగా సోమవారం విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలి. సోమవారం జరగబోయే బీఏసీ సమావేశంలో ఈ మేరకు మేం సీఎంకు సూచిస్తాం. సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త ప్రభుత్వానికి పరిపాలన బాధ్యతలు అప్పగించడం ఆయనకే మంచిది’ అని తెలిపారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి నుంచి ఎమ్మెల్యేల వలసలను ఆపేందుకే కుమారస్వామి ‘విశ్వాసపరీక్ష’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపారని ఆరోపించారు. దమ్ముంటే సీఎం విశ్వాసపరీక్ష కోరాలనీ, ప్రస్తుతం పరిస్థితి తమకే అనుకూలంగా ఉందని చెప్పారు. స్పీకర్‌కు స్వతంత్ర ఎమ్మెల్యేల లేఖ.. కాంగ్రెస్–జేడీఎస్ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్ శనివారం స్పీకర్ రమేశ్ కుమార్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. శాసనసభలో ప్రతిపక్షం(బీజేపీ)వైపు తమ స్థానాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ వర్షకాల సమావేశాలు జూలై 26 వరకూ కొనసాగనున్నాయి. కుమారస్వామి కేబినెట్లో నగేశ్ చిన్నతరహా పరిశ్రమల మంత్రిగా, శంకర్ల మున్సిపల్ శాఖ మంత్రిగా ఇటీవల నియమితులయ్యారు. కానీ అనూహ్యంగా ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు ముందుకొస్తే మద్దతిస్తామని ప్రకటించారు. మా పిటిషన్లను కలిపి విచారించండి సాక్షి, బెంగళూరు: కర్ణాటకకు చెందిన మరో ఐదుగురు రెబెల్ ఎమ్మెల్యేలు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ స్పీకర్ తమ రాజీనామాలను కావాలనే ఆమోదించడంలేదని ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, కె.సుధాకర్, ఎన్.నాగరాజ్, మునిరత్న, రోషన్‌బేగ్‌లు ఆరోపించారు. గతంలో 10 మంది రెబెల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషనత్తో తమ పిటిషన్‌ను కలిపి విచారించాలని కోర్టును కోరారు. 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత విషయంలో జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని స్పీకర్‌ను కోర్టు ఇప్పటికే ఆదేశించింది. అనర్హతపై నిర్ణయం రిజర్వు: స్పీకర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన రెబెల్ ఎమ్మెల్యేలు రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటళ్లిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది ఫిబ్రవరి 11న కోరిందని స్పీకర్ తెలిపారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపామనీ, చివరికి నిర్ణయాన్ని రిజర్వులో ఉంచినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో రమేశ్ కుమార్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ ‘నాగరాజ్’ సఫలం ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు సొంత పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యే నాగరాజ్‌ను తమవైపునకు తిప్పుకున్నారు. బెంగళూరులోని నాగరాజ్ నివాసానికి చేరుకున్న కాంగ్రెస్ మంత్రి శివకుమార్ ఆయనతో చర్చలు జరిపారు. రాజీనామాను వెనక్కు తీసుకుని పార్టీలోకి రావాలని కోరారు. ఈ సందర్భంగా నాగరాజ్ ఇంటికొచ్చిన డిప్యూటీ సీఎం పరమేశ్వర, రాజీనామాను వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మెత్తబడ్డ నాగరాజ్ రాజీనామాను వెనక్కు తీసుకునేందుకు చూచాయగా అంగీకరించారు. తర్వాత నాగరాజ్ మీడియాతో మాట్లాడారు. ‘నా రాజీనామాను వెనక్కు తీసుకోవాలని సిద్దరామయ్య, దినేశ్గూండూరావులు ఫోన్లో విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కొంత టైం అడిగా. చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే సుధాకర్‌తో మాట్లాడి ఆయన్ను కూడా రాజీనామా ఉపసంహరించుకునేలా ప్రయత్నిస్తానని చెప్పా’ అని తెలిపారు. మరోవైపు రమడా రిసార్టులో బసచేసిన బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి యడ్యూరప్ప భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రెబెల్ ఎమ్మెల్యే నాగరాజ్ వెనక్కి వెళ్లబోరని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే రామలింగారెడ్డితో బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్, బెంగళూరు కార్పొరేటర్ పద్మనాభ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. దీనిపై స్పందించేందుకు రామలింగారెడ్డి నిరాకరించారు. ఫిరాయింపులపై చర్యలేవి? నిర్వీర్యమవుతున్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం దేశంలో ఇప్పటివరకూ ఒక్క నేతకూ శిక్షపడని వైనం కర్ణాటక, గోవాల్లో తలెత్తిన రాజకీయ సంక్షోభాలను నివారించేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఆయుధంగా వాడుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ చట్టాన్ని 1985లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ తీసుకొచ్చారు. ఈ చట్టం కింద ఒక్క ప్రజాప్రతినిధికి శిక్ష పడకపోవడం గమనార్హం. స్పీకర్ పాత్రే కీలకం.. 1985లో వచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రచారం ఏ ప్రజాప్రతినిధి అయినా తమ పార్టీ విప్‌ను పాటించకపోయినా, స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేసినా అతను/ఆమె అనర్హులవుతారు. అయితే ఈ చట్టం ప్రజాస్వామ్య మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తోందన్న వాదన కూడా ఉంది. ఎందుకంటే చాలా రాజకీయ పార్టీలు అంతర్గత విభేదాలను అణచివేయడానికి ఈ చట్టాన్ని ఓ ఆయుధంగా వాడుతున్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో స్పీకర్ పాత్రే కీలకం. స్పీకర్ ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ఈ చట్టం ఉద్దేశమే నీరుగారిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అధికార పార్టీ కొనుగోలు చేసింది. వీరిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. ఈ సందర్భంగా ఫిరాయింపుదారులపై వేటేయాలని వైఎస్సార్‌కాంగ్రెస్ విజ్ఞప్తి చేసినప్పటికీ అప్పటి స్పీకర్ పట్టించుకోకపోవడాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నిష్ప్రయోజనమవుతుందని చెబుతున్నారు. బెంగళూరులో సిద్ధరామయ్యను కలిసి వెళ్తున్న కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే నాగరాజ్ -
విధానసౌధలో బీజేపీ ఆందోళన
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు బుధవారం రంగంలోకి దిగారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు విధానసౌధ(అసెంబ్లీ) ముందు ఆందోళనకు దిగారు. గాంధీజీ విగ్రహం ముందు బైఠాయించిన నేతలు, కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేయాలని నినాదాలు ఇచ్చారు. అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బుధవారం నాటికి 16 మంది కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించిన నేపథ్యంలో వాటిపై త్వరితగతిన నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. దీంతో అన్ని అంశాలను పరిశీలించాక దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ జవాబిచ్చారు. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఏ నిర్ణయం తీసుకున్నా, బలపరీక్షకు ఆదేశించినా బీజేపీ శిరసావహిస్తుందని కేంద్ర మంత్రి సదానంద గౌడ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ 9 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరించిన నేపథ్యంలో వీరంతా గురువారం మరోసారి రాజీనామాలను సమర్పించారు. మెజారిటీ కోల్పోయారు: యడ్యూరప్ప ‘ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ రమేశ్ కుమార్ ఆలస్యం చేయకుండా ఆమోదిస్తే జూలై 12 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు కూడా జరగవు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి నుంచి ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశముంది. కాబట్టి సీఎం కుమారస్వామి ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని తన పదవికి రాజీనామా చేస్తే మంచిది’ అని యడ్యూరప్ప హితవు పలికారు. మరోవైపు స్పీకర్ రమేశ్ కుమార్‌తో బుధవారం సమావేశమైన బీజేపీ ప్రతినిధి బృందం.. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా.. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి తాజాగా ఇద్దరు కాంగ్రెస్ నేతలు షాకిచ్చారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి నాగరాజ్, ఎమ్మెల్యే సుధాకర్‌లు బుధవారం స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను సమర్పించారు. దీంతో అధికార కూటమి నుంచి రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేల సంఖ్య 16(13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు)కు చేరుకుంది. రాజీనామా చేసేందుకు స్పీకర్ ఆఫీస్‌కు వచ్చిన ఎమ్మెల్యే సుధాకర్‌ను కాంగ్రెస్, జేడీఎస్ నేతలు నిర్బంధించారు. విధానసౌధ మూడో అంతస్తులో మంత్రి కేజే జార్జ్ కార్యాలయంలోకి సుధాకర్‌ను లాకెళ్లి కూర్చోబెట్టారు. కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న సిద్దరామయ్య మంత్రి పదవి ఇస్తామనీ, రాజీనామా చేయవద్దని కోరారు. అయితే తనకు నమ్మకం పోయిందనీ, రాజీనామా చేస్తున్నానని సుధాకర్ స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. మరోవైపు సుధాకర్ భార్య వజూభాయ్‌వాలాకు ఫోన్ చేయడంతో వెంటనే ఎమ్మెల్యేలను తన దగ్గరకు తీసుకురావాలని నగర కమిషనర్‌ను గవర్నర్ ఆదేశించారు. దీంతో కమిషనర్ స్వయంగా ఎమ్మెల్యేను రాజ్‌భవన్‌కు తీసుకురావడంతో వ్యవహారం సద్దుమణిగింది. అన్ని హద్దులు దాటేశారు: కుమారస్వామి బీజేపీ అన్ని చట్టాల ఉల్లంఘన విషయంలో అన్ని హద్దులు దాటేసిందని కుమారస్వామి విమర్శించారు. బీజేపీ రాజకీయం చేస్తోందా? లేక వక్రబుద్ధి ప్రదర్శిస్తోందా? అని నిలదీశారు. మంత్రి శివకుమార్‌కు రక్షణ కల్పించాల్సిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిందన్నారు. -
రాజీనామా చేస్తే పది కోట్లు, మంత్రిపదవి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఆడియో టేపుల వ్యవహారం సెగలు పుట్టిస్తోంది. జేడీఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టాలని ప్రయత్నించినట్లుగా ఉన్న మరో ఆడియోటేపు తాజాగా బయటకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఒక టేపును ఈ నెల 8న స్వయంగా సీఎం కుమారస్వామి విడుదల చేయడం తెలిసిందే. ఈ నెల 7న బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు యడ్యూరప్ప జేడీఎస్ ఎమ్మెల్యేలు శివనగౌడ నాయక్, ఆయన కుమారుడు శరణ గౌడలతో మాట్లాడినట్లుగా చెబుతున్న మరో ఆడియో టేపు తాజాగా జేడీఎస్ వర్గాల ద్వారా బయటకొచ్చింది. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే ఒక్కొక్కరికి రూ. 10 కోట్లు ఇస్తామని, ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తామే గెలిపించుకోవడంతోపాటు మంత్రి పదవి కూడా ఇస్తామని యడ్యూరప్ప హామీ ఇచ్చినట్లుగా ఆ టేపులో ఉంది. నువ్వే మంత్రివి కావచ్చు.. టేపులో ఉన్న దాని ప్రకారం శరణగౌడతో యడ్యూరప్ప మాట్లాడుతూ ‘మొదటి మీ నాన్నతో రాజీనామాకు ఒప్పించు. ముంబై లోని హోటల్లో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నీవు అక్కడికి వెళ్లు. సాయంత్రానికి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారు. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు అయ్యాక అందరు కలసి ఒకేసారి రాజీనామా చేయండి. ఆ వెంటనే మొదట మీ ఇంటికి రూ. 20 కోట్లు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలన్నీ నా కొడుకు బీవై విజయేంద్ర చూసుకుంటాడు. ఉప ఎన్నికల్లో నిన్ను గెలిపించి, మంత్రిని కూడా చేస్తాము. లోక్‌సభ ఎన్నికల తర్వాత జేడీఎస్ పార్టీ ఎక్కడికిపోతుందో ఎవరికీ తెలియదు’ అని సూచించారు. శివనగౌడ మాట్లాడుతూ రాజీనామా చేస్తే స్పీకర్ వెంటనే దాన్ని అంగీకరించరేమో.. అని చెప్పబోతుండగా మళ్లీ యడ్యూరప్ప.. ‘దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవ సరం లేదు. సమావేశాలు ముగిసేలోగా రాజీనామాలను స్పీకర్ అంగీకరించి తీరాల్సిందే. అదం తా పెద్దలు చూసుకుంటారు. ప్రధాని, అమిత్ షా, గవర్నర్ చూసుకుంటారు. నిన్ను మంత్రిని చేయడమే కాకుండా యాదగిరి జిల్లాకు ఇంచార్జిని కూడా చేస్తాం. రాజీనామాకు అంగీకరిస్తే సాయంత్రంలోగా రాయ చూరులోని మార్వాడిల నుంచి రూ. 20 కోట్లు అందిస్తాం’ అని చెబుతున్నట్లుగా ఉంది. -
ఆ ఎమ్మెల్యేల చూపు మా వైపు
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లోని చాలా మంది అసంతృప్త నేతలు తమ పార్టీలోకి చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు బీఎస్ యడ్యూరప్ప చెప్పారు. శనివారం బెంగళూరు మల్లేశ్వరంలో రాష్ట్ర బీజేపీ యువ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని, అయితే ఆ ఎమ్మెల్యేల పనితీరు, ప్రాధాన్యాన్ని బట్టి ఎవరెవరినీ పార్టీలో చేర్చుకోవాలనే అంశంపై తమ పార్టీ జిల్లాల నాయకత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న అసంతృప్తిని, అసహనాన్ని ఆధారంగా చేసుకుని లాభపడాలని మేము భావించడం లేదు. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం ఎంత కాలం వరకు తన మనుగడను నిలపుకోగలదో నాకు తెలుసు. అప్పటివరకు ప్రజల ఆకాంక్షల మేరకు ప్రతిపక్ష పాత్ర చక్కగా పోషిస్తాం. ఎన్నికల్లో కేవలం కొద్ది సీట్లతో అధికారం కోల్పోయాం. ఈసారి చక్కగా పనిచేసి అధికారంలోకి వస్తాం. మేం అనుకుంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రాగలం. కానీ ప్రస్తుతం మా దృష్టి అంతా 2019 లోక్‌సభ ఎన్నికలపై ఉంది. మరోసారి మా నాయకుడు నరేంద్రమోదీని ప్రధానిని చేసేందుకు కృషి చేస్తాం’ అని యడ్డి తెలిపారు. కుమారకు పట్టం.. దారుణం స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి 37 స్థానాలు గెలిచిన ఒక పార్టీ నేత ముఖ్యమంత్రి కావడం విడ్డూరమని యడ్యూరప్ప విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దారుణం జరగడం ఒక్క కర్ణాటకకే చెల్లిందన్నారు. గతంలో 20–20 నెలల చొప్పున సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు బీజేపీకి జేడీఎస్ చేసిన అన్యాయం కాంగ్రెస్ మరచిపోరాదని సూచించారు. మున్ముందు ఈ విషయంలో కాంగ్రెస్ పశ్చాత్తాపపడక తప్పదన్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తానని హామీనిచ్చిన సీఎం కుమారస్వామి ఇప్పటివరకు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. గత 15 రోజులుగా మంత్రి విస్తరణతో బిజీగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ నేతలు పాలనను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఈ సారి ఎన్నికల్లో కొద్ది సీట్లతో వెనుకంజలో పడ్డామని, వచ్చే ఎన్నికల్లో 150 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ ప్రతాప్ సింహా, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయేంద్ర, ఎమ్మెల్యే అరవింద్ లింబావళి తదితరులు పాల్గొన్నారు. -
కర్ణాటకం ముగిసింది!
బెంగళూరు: కర్ణాటకలో దాదాపు పది రోజులుగా సాగిన రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అనూహ్య పరిణామాల మధ్య సీఎం పీఠం అధిరోహించిన సీఎం కుమారస్వామి అసెంబ్లీ బలపరీక్షలో సునాయాసంగా విజయం సాధించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి సాగుతున్న ఉత్కంఠకు ముగింపు పలుకుతూ శుక్రవారం ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ సర్కారు మూజువాణి ఓటుతో నెగ్గింది. బీజేపీ ఎమ్మెల్యేలు ముందే వాకౌట్ చేయడంతో అవాంతరాలు లేకుండా బలపరీక్ష ఘట్టం ముగిసింది. కాంగ్రెస్‌కు చెందిన 78, జేడీఎస్‌కు చెందిన 37, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కలసి మొత్తం 117 మంది ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడంతో కుమారస్వామి ప్రభుత్వం గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ కుమార్ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చివరి నిమిషంలో తమ స్పీకర్ అభ్యర్థిని బీజేపీ ఉపసంహరించుకోవడంతో పోటీ లేకుండానే ఎన్నిక పూర్తయింది. పార్లమెంటరీ సంప్రదాయాల్ని అనుసరించి తమ అభ్యర్థిని పోటీ నుంచి తప్పించినట్లు ఆ పార్టీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు తన పట్ల నమ్మకం చూపనందుకు బాధగా ఉన్నా ఐదేళ్ల పాటు రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తామని కుమారస్వామి అన్నారు. బలపరీక్షలో కుమారస్వామిని ఓడించాలంటే 104 మంది సభ్యులున్న బీజేపీకి మరో 7గురు ఎమ్మెల్యేలు అవసరం. అయితే ఆ పార్టీ ముందే వాకౌట్ చేయడంతో అసెంబ్లీలో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోలేదు. వారం రోజుల వ్యవధిలో కర్ణాటక అసెంబ్లీలో ఇది రెండో బలపరీక్ష. మే 17న కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప సరిపడా ఎమ్మెల్యేలు లేకపోవడంతో 19న రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్– జేడీఎస్ కూటమి తరఫున కుమారస్వామి మే 23న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నమ్మకం చూపనందుకు బాధగా ఉంది అసెంబ్లీలో కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘సంపూర్ణ మెజారిటీ ఇవ్వకుండా నా పట్ల ప్రజలు నమ్మకం ఉంచనందుకు బాధగా ఉంది. ఐదేళ్లు సుస్థిర పాలనను అందిస్తాం. మా సొంత ప్రయోజనాలను తీర్చుకునేందుకు అధికారంలోకి రాలేదు’ అని చెప్పారు. తాను గానీ తన కుటుంబ సభ్యులు గానీ ఎప్పుడూ అధికారం కోసం అర్రులు చాచలేదని, ఎక్కువ సమయం ప్రతిపక్షంలోనే ఉన్నామని పేర్కొన్నారు. ‘2006లో బీజేపీతో నేను సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడపై అపనింద పడింది. ఇప్పుడు కాంగ్రెస్‌తో లౌకిక ప్రభుత్వం ఏర్పాటు ద్వారా దానిని తొలగించాను’ అని చెప్పారు. ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినట్లుగానే రైతు రుణాలు మాఫీ చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్లను దుర్వినియోగం చేస్తోందని కుమారస్వామి ఆరోపించారు. మంత్రిత్వ శాఖల పంపకంపై చర్చలు బలపరీక్ష పూర్తవ్వడంతో మంత్రిత్వ శాఖల పంపకంపై జేడీఎస్–కాంగ్రెస్‌లు దృష్టిపెట్టాయి. శాఖల పంపిణీపై చర్చించేందుకు బలపరీక్ష పూర్తయిన కొద్దిసేపటికే ఇరు పార్టీల నేతలూ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత సీఎల్పీ నేత సిద్దరామయ్య నివాసంలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, జేడీఎస్ నేత హెచ్డీ రేవణ్న తదితరులు హాజరయ్యారు. మంత్రి పదవులపై అధిష్టానంతో చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. రైతురుణాల్ని మాఫీ చేయాలి సభ నుంచి వాకౌట్కు ముందు ప్రతిపక్ష నేత యడ్యూరప్ప సీఎం కుమారస్వామిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్‌కు సీఎం పదవి ఎలా ఇస్తారని మండిపడ్డారు. తన పోరాటం కాంగ్రెస్‌పై కాదని, కుమారస్వామిపైనే అన్నారు. కుమారస్వామి నమ్మక ద్రోహం గురించి అందరికీ తెలుసని, కుమారస్వామి, దేవెగౌడలు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తారని ఆ పార్టీ సభ్యుల్ని హెచ్చరించారు. కుమార స్వామి సీఎంగా ఉండడం నచ్చకనే సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం రూ. 53 వేల కోట్ల రుణాల్ని మాఫీ చేస్తానని కుమారస్వామి ప్రకటించారని, ప్రస్తుత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లోనే దానిపై ప్రకటన చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
‘పరీక్ష’లో విఫలమైన ప్రధాన మంత్రులు..!
కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడు రోజులు కూడా కొనసాగకుండానే శాసనసభలో బలపరీక్షకు ముందే రాజీనామా చేసిన బీఎస్ యడ్యూరప్ప మాదిరిగానే దేశంలో పదవి నుంచి వైదొలిగిన ప్రధానులు ఉన్నారు. లోక్‌సభలో అతి పెద్ద పార్టీ నేతగా ప్రధాని పదవి చేపట్టిన అటల్ బిహారీ వాజ్‌పేయి 1996 మే చివరి వారంలో విశ్వాసం తీర్మానంపై ఓటింగ్ జరగడానికి ముందే రాజీనామా చేశారు. మెజారిటీ నిరూపణకు అప్పటి రాష్ట్రపతి రెండు వారాలు గడువిచ్చినా అవసరమైన 272 మంది సభ్యుల మద్దతు కూడగట్టలేకపోయారు. విశ్వాసతీర్మానంపై చర్చ పూర్తయ్యాక వాజ్‌పేయి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. బీజేపీకి తగినన్ని సీట్లు రాలేదంటే మాతృభూమికి తక్కువ సేవ చేసినట్లు కాదని అన్నారు. ప్రసంగం చివరిలో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మొరార్జీ దేశాయి అలాగే.. 1977 మార్చి 24న జనతాపార్టీ తరఫున తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ప్రమాణం చేసిన మొరార్జీ దేశాయి రెండేళ్లు గడిచాక పార్టీలో చీలిక కారణంగా పదవి కోల్పోయారు. ఆ పార్టీ నుంచి ఎంపీలు భారీ సంఖ్యలో రాజీనామా చేసి చరణ్‌సింగ్ నాయకత్వాన ఏర్పడిన జనతాపార్టీ–ఎస్‌లో చేరిపోయారు. ఫలితంగా మెజారిటీ నిరూపించుకోవడం అసాధ్యమని భావించిన మొరార్జీ దేశాయ్ అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తికాకుండానే 1979 జులై 12న రాజీనామా చేశారు. -
ఎప్పుడు.. ఏంటీ...
న్యూఢిల్లీ: మే 12 నుంచి శనివారం వరకు థ్రిల్లర్‌ను తలపించిన కర్ణాటక రాజకీయ పరిణామాల క్రమం.. ► మే 12: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ► మే 15: వెలువడిన ఎన్నికల ఫలితాలు. 104 మంది సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 37 సీట్లు. ► ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీతోపాటు కాంగ్రెస్–జేడీఎస్ కూటమి సంసిద్ధత. ► మే 16: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీని కోరిన గవర్నర్ వజూభాయ్ వాలా. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని యడ్యూరప్పకు ఆహ్వానం. ► దీనికి వ్యతిరేకంగా అదే రోజు సాయంత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ ► మే 16, 17: అర్ధరాత్రి తర్వాత కాంగ్రెస్ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు ► యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ ► సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం ► మే 18: మే 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు బలం నిరూపించుకోవాలని యడ్యూరప్పకు సుప్రీంకోర్టు ఆదేశం ► ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య నియామకంపై మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్–జేడీఎస్. ► మే 19: విశ్వాస పరీక్ష కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు. బోపయ్య నియామకానికి సమర్థన. ► సాయంత్రం 4 గంటలకు: ‘విశ్వాస పరీక్ష ఎదుర్కోలేను. రాజీనామా చేస్తా..’ అని ప్రకటించిన యడ్యూరప్ప. -
కర్ణాటకంలో కాంగ్రెస్ దూకుడు
కర్ణాటక రాజకీయ క్రీడలో ప్రస్తుతానికి కాంగ్రెస్ విజయం సాధించింది. గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచినా.. అధికారం చేపట్టలేకపోయిన వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకున్న కాంగ్రెస్.. కర్ణాటకలో తమ వ్యూహాలను పకడ్బందీగా అమల్లో పెట్టింది. ప్రచారంలోనూ దూకుడుగా వ్యవహరించిన కాంగ్రెస్.. విజయంపై తొలి నుంచి ధీమాగానే ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడానికి ముందే ప్రచార రంగంలోకి దూకింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలు దఫాలుగా రాష్ట్రాన్ని చుట్టేశారు. మరోవైపు సిద్దరామయ్య ఇమేజ్, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అంతగా లేని వ్యతిరేకత తమకు కలసి వస్తాయని కాంగ్రెస్ ఆశించింది. రాహుల్ దేవాలయాల సందర్శన, లింగాయత్‌లకు మైనారిటీ హోదా.. తదితరాలు కూడా ఓట్లు కురిపిస్తాయనుకుంది. కానీ ఫలితాలు వేరుగా వచ్చాయి. సాధారణంగా అయితే, ఓటమిని అంగీకరించి, మౌనంగా ఉండే కాంగ్రెస్.. ఈసారి ఊహించని దూకుడును ప్రదర్శించింది. ఫలితాలు వెలువడుతుండగానే రంగంలోకి దిగింది. రాహుల్ ఇంట్లో జరిగిన ‘లంచ్ మీట్’లో ప్లాన్ బీని సిద్ధం చేసింది. ఫలితాలకు ముందు రోజే బెంగళూరు చేరుకున్న ఆజాద్ ద్వారా జేడీఎస్‌తో రాయబారం నడిపింది. ప్రభుత్వ ఏర్పాటులో కలసి నడుద్దామని, జేడీఎస్‌కు మద్దతిచ్చేందుకు సిద్దమని సమాచారం పంపింది. సీఎంగా కుమారస్వామి ఉంటారన్న డిమాండ్ సహా జేడీఎస్ నుంచి వచ్చిన డిమాండ్లకు వెంటనే ఆమోదం తెలిపింది. సీనియర్ నేతలు ఆజాద్, అశోక్ గెహ్లాట్‌లు స్వయంగా కాంగ్రెస్ ప్రణాళికను దగ్గరుండి మరీ అమలు చేసేలా చూసింది. ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో గవర్నర్ వద్దకు కుమారస్వామితో పాటు ఆజాద్‌నూ పంపించింది. లాస్ట్ ‘రిసార్ట్’..: ఇప్పుడు తమ ఎమ్మెల్యేలతో పాటు జేడీఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కాంగ్రెస్‌కు ప్రధాన సమస్యగా మారింది. ఎమ్మెల్యేలు చేజారకుండా రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. ఇలాంటి విషయాల్లో అనుభవజ్ఞుడైన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు ఈ బాధ్యతను అప్పగించింది. తొలుత బెంగళూరు శివార్లలోని ఈగల్టన్ రిసార్ట్‌లో ఎమ్మెల్యేలను భద్రంగా దాచిన శివకుమార్, మరింత భద్రత కోసం అనూహ్యంగా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌కు తరలించి, బలపరీక్ష రోజే(శనివారం) అసెంబ్లీకి చేరుకునేలా ప్రణాళిక రచించారు. అంతకుముందు, వారిని కొచ్చికి తరలిస్తున్నట్లుగా లీకులిచ్చి, గందరగోళం సృష్టించారు. ‘మిస్’ అయిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప గౌడను కూడా మళ్లీ సొంత గూటికి తెచ్చారు. ఇలా అనూహ్యంగా దూకుడుగా వ్యవహరించిన కాంగ్రెస్ మొత్తానికి బీజేపీకి చెక్ పెట్టింది. ఈ మొత్తం వ్యూహాన్ని సోనియా గాంధీ, రాహుల్ సోదరి ప్రియాంక వాద్రా కూడా స్వయంగా పర్యవేక్షించారు. కోర్టులోనూ క్రియాశీలకంగా.. యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించిన తరువాత కూడా కాంగ్రెస్ శీఘ్రంగా స్పందించింది. పార్టీ సీనియర్ నేతలు, ప్రముఖ న్యాయవాదులైన అభిషేక్ మను సింఘ్వీ, చిదంబరంలను రంగంలోకి దింపింది. యడ్యూరప్పను ఆహ్వానించడాన్ని, బలనిరూపణకు 15 రోజుల గడవు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో ప్రశ్నించింది. బుధవారం అర్ధరాత్రే సుప్రీంకోర్టు తలుపు తట్టి, తమ పిటిషన్‌ను విచారించాలని కోరింది. దాంతో అప్పటికప్పుడు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన వాదనలు తెల్లవారే వరకు నడిచాయి. కానీ యెడ్డీ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోలేకపోయాయి. ఆ తరువాత ఇరుపక్షాల వాడీవేడి వాదనల అనంత రం ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువును పక్కనబెట్టి, శనివారం సాయంత్రం 4 గంటలకు విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని యడ్యూరప్పను ఆదేశించింది. ఈ తీర్పు కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. – సాక్షి నేషనల్ డెస్క్ -
యడ్డి రాజీనామా...తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక బలపరీక్షలో ఓటింగ్ జరగడానికి ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది. తమ దగ్గర 104 మంది ఎమ్మేల్యేలు మాత్రమే ఉన్నారని, అందుకే బలపరీక్షలో ఓడిపోయామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప తెలిపారు. అనంతరం ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. యడ్యూరప్ప రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రిగా జేడీఎస్ చీఫ్ కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసేందుకు మార్గం సుగుమం అయింది. కుమారస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా సమర్థిస్తూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు సంతకాలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ప్రజాస్వామ్యమే గెలిచిందని, బీజేపీకి సరైన గుణపాఠం అని హర్షం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ వద్ద బాణసంచి కాల్చి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయలను వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విజయం...ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన సుప్రీంకోర్టు, మీడియా వారికి ధన్యవాదాలు. నియంతలా వ్యవహరించిన బీజేపీకి సరైన బుద్ది వచ్చింది. 2019 లో జరిగే ఎన్నికలకు ఈ ఫలితాలు పునాది. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. - గీతారెడ్డి, పీఏసీ ఛైర్మెన్ ఇది ప్రజాస్వామ్య విజయం. - రఘువీరారెడ్డి ఏపీసీసీ చీఫ్. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. యడ్యూరప్ప రాజీనామా కాంగ్రెస్ విజయం, ప్రజాస్వామ్య విజయం. ఎట్టకేలకు ప్రజాస్వామ్యమే గెలిచింది. 2019 నాటి ఎన్నికలకు ఇది పునాది. - ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచింది.15రోజులు అవకాశం ఇచ్చి ఉంటే గొర్లను కొన్నట్లుగా ఎమ్మెల్యేలను కొనేవారు.కర్ణాటక ఎమ్మెల్యేలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. - వీహెచ్, కాంగ్రెస్ నేత న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు. గవర్నర్ వ్యవస్థలో మార్పులు రావాలి. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తే సాధ్యాసాధ్యాలను గవర్నర్ పరిశీలించాలి.కర్ణాటక గవర్నర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులు ఏకం కావాలి. - మర్రి శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ నేత సుప్రీంకోర్టు లేకపోతే ప్రజాస్వామ్యం కూని అయ్యేది. సుప్రీమ్ న్యాయమూర్తులకు ధన్యవాదాలు. మోడీ అమిత్ షా విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ కు అధికారదాహం లేదు. అందుకే జేడీఎస్ కు మద్దతు ఇచ్చింది.కర్ణాటకలో బీజేపీకి పట్టిన గతి ఇక్కడ టీఆర్ఎస్కు పడుతుంది. - సర్వే సత్యనారాయణ ప్రజాస్వామ్యం గెలిచి నిలిచింది. ప్రజాస్వామ్య పునాదులు పెకిలించే శక్తులకు అడ్డుకట్ట పడింది. గవర్నర్‌ను రీ కాల్ చేయాలి. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారు. మా ఫోన్ లు ట్యాపింగ్ చేస్తున్నారు. దీని పై కూడా విచారణ జరిపించాలి. - పొన్నాల లక్ష్మయ్య -
వంద శాతం గెలుస్తాం
బెంగళూరు: బల పరీక్షలో వంద శాతం గెలుస్తానని కర్ణాటక సీఎం యడ్యూరప్ప అన్నారు. ‘ఈ రాజకీయ క్రీడలో మేం మా ఆధిక్యాన్ని నిరూపించుకుంటాం. బలపరీక్షలో నెగ్గుతాం’ అని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనంత సాధారణ ఆధిక్యం లేకుండానే సీఎంగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప.. పీఠమెక్కిన దాదాపు 55 గంటల్లోనే విశ్వాసపరీక్షను ఎదుర్కోనున్నారు. మా ఎమ్మెల్యేను ఢిల్లీలో ఉంచారు: ఆజాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌ని బీజేపీ అధిష్టానం బేరసారాల కోసం ఢిల్లీకి పిలిపించుకుందనీ, అక్కడ నుంచి ఆయన తిరిగిరాకుండా కట్టడి చేస్తోందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ శుక్రవారం ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్థానం లో ఉన్న గవర్నర్.. ఆయన చేతులతోనే రాజ్యాంగం పీక నొక్కుతున్నారని ఆజాద్ మండిపడ్డారు. గవర్నర్ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించారనడానికి సుప్రీం ఉత్తర్వులే నిదర్శనమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
యడ్డీ ప్రమాణాన్ని అడ్డుకోలేం!
న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయంపై సుప్రీంకోర్టులో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకూ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్–జేడీఎస్‌లు సుప్రీంలో ఉమ్మడి పిటిషన్ దాఖలు చేయగా.. ప్రమాణ స్వీకారంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి మెజార్టీ ఉండగా.. బీజేపీ నేత యడ్యూరప్పను ప్రమాణస్వీకారానికి గవర్నర్ ఆహ్వానించారని, దానిని అడ్డుకోవాలని అర్థరాత్రి 12 గంటల సమయంలో కాంగ్రెస్–జేడీఎస్‌లు సుప్రీం తలుపుతట్టాయి. అప్పటికప్పుడే వాదనలు వినాలని ఆ పార్టీ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఇంటికి వెళ్లి అభ్యర్థించారు. దీంతో జేడీఎస్–కాంగ్రెస్‌లు ఉమ్మడిగా దాఖలు చేసిన పిటిషన్ విచారణ కోసం అప్పటికప్పుడు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని సీజేఐ ఏర్పాటు చేశారు. గురువారం తెల్లవారుజామున 2.11 గంటలకు కాంగ్రెస్–జేడీఎస్ పిటిషన్‌పై ప్రత్యేక ధర్మాసనం విచారణ ప్రారంభించింది. 5.28 గంటలకు మధ్యంతర ఆదేశాలిస్తూ.. ‘ యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై మేం స్టే ఇవ్వలేం. అయితే ప్రమాణస్వీకారం, కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు అనేవి కేసు తుది తీర్పునకు లోబడి ఉంటాయి’ అని స్పష్టం చేసింది. గవర్నర్, యడ్యూరప్ప లేఖల్ని సమర్పించండి.. మెజార్టీ ఉన్న కాంగ్రెస్–జేడీఎస్ కూటమిని ఆహ్వానించకపోవడం అప్రజాస్వామికమని, గురు వారం ఉదయం 9 గంటలకు ప్రమాణస్వీకారం ఉండడం వల్లే అర్ధరాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని కాంగ్రెస్–జేడీఎస్‌ల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేశ్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించాలని, లేదంటే వాయిదా వేయాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అందుకు సుప్రీం నిరాకరిస్తూ.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలాకు యడ్యూరప్ప పంపిన లేఖ, యడ్యూరప్పను ఆహ్వానిస్తూ గవర్నర్ పంపిన సమాధానాన్ని శుక్రవారంలోగా తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ధర్మాసనం వాయిదావేసింది. అర్ధరాత్రి పిటిషన్ వేయాల్సిన అవసరమేంటి? ఈ కేసులో కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, బీజేపీ ఎమ్మెల్యేలు గోవింద్ కర్జోల్, ఉదాసి, బసవరాజ్ బొమ్మైల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీలు వాదనలు వినిపిస్తూ.. ప్రమాణ స్వీకారం వాయిదా, స్టే విధించాలన్న అభ్యర్థనను వ్యతిరేకించారు. ‘యడ్యూరప్ప, గవర్నర్ల మధ్య సమావేశంలో ఏం జరిగిందో మనకు తెలియదు. మొత్తం వ్యవహారం అస్పష్టంగా ఉంది. ఇంతవరకూ అన్నీ ఊహాగానాలే’ అని వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పిటిషన్ దాఖలు చేయడాన్ని రోహత్గీ ప్రశ్నిస్తూ.. ‘ఒకరి ప్రమాణ స్వీకారంతో ఏదైనా ఘోరం జరిగిపోతుందా? ఇది చావు బతుకుల సమస్యో లేక ఎవరినో ఉరితీస్తున్న అంశమో కాదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పార్టీని ఆహ్వానించడం గవర్నర్‌కున్న రాజ్యాంగ విధి.. ఆయన చర్యలు ఎప్పుడూ న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ కేసులో లాగానే యథాపూర్వ స్థితిని కొనసాగించమని కోర్టు ఆదేశించవచ్చు’ అని రోహత్గీ వాదించారు. ఆ సయయంలో సింఘ్వీ జోక్యం చేసుకుంటూ.. బలనిరూప ణ కోసం గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. అలా చేయడం వల్ల ప్రలోభాలకు, ఎమ్మెల్యేల కొనుగోలుకు దారితీసే ప్రమాదముందన్నారు. -
గుమస్తా నుంచి సీఎంగా
సాక్షి,బెంగళూరు: నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీఎస్ యడ్యూరప్ప జీవితంలో కూడా ఎన్నో మలుపులు, వివాదాలున్నాయి. సాధారణ ప్రభుత్వ గుమస్తా నుంచి ప్రభుత్వ అధినేతగా ఎదిగిన ఆయన జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. మాండ్యా జిల్లా బూకనకెరె గ్రామంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సిద్దలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు 1943, ఫిబ్రవరి 27న యడ్యూరప్ప జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై హిందుత్వ విధానాలను అనుసరించారు. డిగ్రీ పూర్తయ్యాక కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖలో క్లర్కు ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ఉద్యోగం వదిలి స్వగ్రామంలోని ఒక రైస్ మిల్లులో పని చేశారు. ఆ మిల్లు యజమాని కుమార్తె మైత్రిదేవిని ప్రేమించి పెళ్లాడారు. 1980లో బీజేపీలో చేరి 1983లో తొలిసారిగా శికారిపుర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2007, 2008, 2018లలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. షాకిచ్చిన జేడీఎస్: 2006లో ధరమ్‌సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ సర్కారును కూల్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జేడీఎస్‌తో చేతులు కలిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. యడ్డీ 2007లో తొలిసారి సీఎంగా ప్రమాణం చేసినా జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో వారంలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించడంతో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అవినీతి ఆరోపణలు రావడంతో 2011లో రాజీనామా చేయ డంతోపాటు జైలుకెళ్లాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలైన తరువాత బీజేపీని వీడి కర్ణాటక జనతా పక్ష పార్టీ పేరిట సొంత పార్టీని స్థాపించారు. 2013 ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు సీట్లే గెలుచుకుంది. 2014 ఎన్నికలకు ముందు తన పార్టీని బీజేపీలో విలీనం చేసి షిమోగా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. -
సీట్లెందుకు రాలేదంటే..
ఐదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదని ఎన్నికలకు ముందు అంచనాలు వెలువడ్డాయి. దానికి అనుగుణంగానే 2013తో పోల్చి చూస్తే కాంగ్రెస్‌కు తాజా ఎన్నికల్లో 1.4 శాతం ఓట్లు ఎక్కువే వచ్చాయి. గత ఎన్నికల్లో 36.6 శాతం ఓట్లతో ఏకంగా 122 స్థానాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. ఇప్పడు మాత్రం 38 శాతం ఓట్లను దక్కించుకున్నప్పటికీ కాంగ్రెస్ 78 సీట్లకే పరిమితమవాల్సి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య త్రిముఖ పోరు నెలకొనడం, గత ఎన్నికల్లో విడివిడిగా పోటీచేసిన యడ్యూరప్ప, శ్రీరాములు ఈసారి బీజేపీ గూటికి చేరుకోవడం వంటి కారణాలు కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బకొట్టాయి. 2013 ఎన్నికల్లో బీజేపీ, యడ్యూరప్ప, శ్రీరాములు విడివిడిగా పోటీ చేయ డంతో వారి ఓట్లు చీలిపోయాయి. అందరికీ కలిపి 32 శాతం ఓట్లు వచ్చాయి. కానీ ఈ ఎన్నికల్లో అందరూ కలిసిపోవడంతో 4 శాతం అధిక ఓట్లు సాధించడమేగాక, వాటిని సీట్లుగా మార్చుకోవడంలోనూ బీజేపీ విజయం సాధించింది. అతి తక్కువ ఓట్ల తేడాతో కూడా ఎలా విజయం సాధించాలని కమలనాథులు క్షేత్రస్థాయిలో చేసిన కసరత్తు ఫలించి బీజేపీకి ఓట్లు రాకపోయినా సీట్లయినా వచ్చేలా చేసింది. బీజేపీతో పోల్చి చూస్తే కాంగ్రెస్‌కు పాత మైసూరు, హైదరాబాద్ కర్ణాటక, బాంబే కర్ణాటక ప్రాంతాల్లో అత్యధికంగా ఓట్లు వచ్చాయి. కానీ మిగతా ప్రాంతాల్లో బీజేపీతో పోటీ పడలేక కాంగ్రెస్ చతికిలపడిపోయింది. ఇలా కాంగ్రెస్ మూడు ప్రాంతాల్లో అత్యధికంగా ఓట్లు సంపాదించడంతో గెలిచిన అభ్యర్థులు ఎక్కువ ఆధిక్యం పొందారు. కానీ బీజేపీ గెలిచిన స్థానాల్లో అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ తక్కువగా ఉంది. ఎస్సీ అభ్యర్థులకు కేటాయించిన స్థానాల్లో బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఓటు శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, సీట్లు గెలవడంలో వెనకపడిపోయింది. లింగాయత్‌ల ప్రభావం ఉన్న స్థానాల్లో కూడా కాంగ్రెస్‌కు ఓట్లు వచ్చినా సీట్లు మాత్రం రాలేదు. ఇక జేడీఎస్ 2013 ఎన్నికల్లో 20.2 శాతం ఓట్లు సాధించింది. ఈ ఎన్నికలకు వచ్చేసరికి 18.3 శాతానికి తగ్గిపోయింది. కానీ కాంగ్రెస్‌తో పోల్చిచూస్తే ఓట్లను సీట్లుగా మార్చుకోవడంలో సఫలమైంది. ఒక్కళిగ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో జేడీ(ఎస్)గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించడం కూడా కాంగ్రెస్‌ను దెబ్బ తీసింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నేడు యడ్యూరప్ప ప్రమాణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సస్పెన్స్‌కు తాత్కాలికంగా తెరపడింది. బుధవారం చోటుచేసుకున్న పలు నాటకీయ పరిణామాల అనంతరం.. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటూ బీజేపీ పక్షనేత యడ్యూరప్పను గవర్నర్ వజూభాయ్ వాలా ఆహ్వానించారు. బలనిరూపణకు 15 రోజుల గడువిచ్చారు. ఈలోగా విశ్వాసపరీక్షను ఎదురుకోవాలన్నారు. దీంతో గురువారం ఉదయం 9 గంటలకు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మాజీ అటార్నీ జనరల్‌లు సోలీ సొరాబ్జీ, ముకుల్ రోహత్గీలను సంప్రదించిన తర్వాతే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, తమకు అవసరమైన బలముందని లేఖలు సమర్పించినా.. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వటాన్ని కాంగ్రెస్, జేడీఎస్ తీవ్రంగా ఖండించాయి. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అర్ధరాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును తక్షణమే విచారణకు స్వీకరించాలని సీజేఐని కోరింది. అటు, కాంగ్రెస్, జేడీఎస్ రిసార్టు రాజకీయాలను ప్రారంభించాయి. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్, జేడీఎస్‌లు వారందరినీ బెంగళూరు శివార్లలోని ఈగల్టన్ రిసార్టులోకి ప్రత్యేక బస్సుల్లో తరలించాయి. యడ్డీ ఒక్కరే! కాంగ్రెస్–జేడీఎస్ నేతల వ్యతిరేకతలు, హెచ్చరికల మధ్య బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. దీంతో బీజేపీ పక్షనేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం 9 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బలనిరూపణలో గెలిచిన తర్వాతే మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. యడ్డీ ప్రమాణానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా హాజరుకాకపోవచ్చని సమాచారం. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే ఆందోళనలు చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో రాజ్‌భవన్ చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు. నగరంలోనూ భద్రతను పటిష్టం చేయాలని పోలీసుశాఖను ఆదేశించినట్లు తెలిసింది. ఉదయం నుంచీ హైడ్రామా! హంగ్ తీర్పుతో రాజుకున్న కన్నడ రాజకీయాల్లో బుధవారం కూడా సస్పెన్స్ కొనసాగింది. ప్రభుత్వం ఎవరు ఏర్పాటుచేస్తారు? గవర్నర్ ఎవరిని ఆహ్వానిస్తారనేదానిపై స్పష్టత రాకపోవడం. బలాన్ని కాపాడుకునేందుకు జేడీఎస్–కాంగ్రెస్ కూటమి, బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేయటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. అయితే, సోమవారం గవర్నర్‌కు సమర్పించిన కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖలో ముగ్గురు ఎమ్మెల్యేల సంతకాల్లేకపోవటం మధ్యాహ్నం కలకలం రేపింది. వీరంతా బీజేపీతోనే ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. దీనికి తోడు బీజేపీ కూడా కాంగ్రెస్‌లోని లింగాయత్ ఎమ్మెల్యేలు, జేడీఎస్ కూటమిలోని ఆరుగురు తమతోనే ఉన్నారని లీకులు ఇవ్వడంతో ప్రత్యర్థి కూటమిలో ఆందోళన నెలకొంది. జేడీఎస్‌తో జవదేకర్ చర్చలు! బీజేపీ ఎమ్మెల్యేలంతా బుధవారం ఉదయం పార్టీ కార్యాలయంలో సమావేశమై యడ్యూరప్పను తమపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం ఉదయం జేడీఎస్ అధినేత కుమారస్వామితో రహస్యంగా మంతనాలు జరిపారు. ఇవి విఫలం కావడంతో జేడీఎస్‌లో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే ఆందోళన పెరిగింది. కాగా, రాణీ బెన్నూరు స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్ కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ సీనియర్‌నేత ఈశ్వరప్పపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక్క ఎమ్మెల్యేను కాపాడుకోలేరా?’ అని మండిపడ్డారు. అయితే, శంకర్ బుధవారం బీజేపీకి మద్దతు ప్రకటించారు. అటు, పలువురు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నాయకత్వంతో టచ్‌లో లేకుండా పోయారన్న వార్తలను ఆ పార్టీ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ ఖండించారు. వారు ఎక్కడున్నా తమకే మద్దతు తెలుపుతారన్నారు. బీజేపీ ప్రలోభాలు: కుమారస్వామి తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెడుతోందని జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి ఆరోపించారు. ‘ఆపరేషన్ కమల్’ను ఎట్టిపరిస్థితుల్లో విజయవంతం కానీయబోమన్నారు. బుధవారం బెంగళూరులోని ఓ ప్రముఖ హోటల్లో జేడీఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. కుమారస్వామిని తమ పక్షనేతగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మా ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోంది. ఒక్కొక్కరికి రూ.100 కోట్ల నగదుతో పాటు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేస్తోంది. మేం తలుచుకుంటే బీజేపీ నుంచి రెట్టింపు ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారు’ అని పేర్కొన్నారు. కాగా సమావేశానికి ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వీరిద్దరూ ఫోన్లోనూ అందుబాటులో లేరని తెలుస్తోంది. కాగా, తను బీజేపీతో చేతులు కలుపుతున్నట్లు వచ్చిన వదంతులను దేవేగౌడ రెండో కుమారుడు, ఎమ్మెల్యే రేవణ్ణ తోసిపుచ్చారు. కుమారస్వామిని జేడీఎస్ పక్ష నేతగా ఎన్నుకున్నామని తెలిపారు. కుమారస్వామి ఆరోపణలను జవదేకర్ ఖండించారు. అంతపెట్టి ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం లేదన్నారు. మోదీ ప్రోద్బలంతోనే తమ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరుపుతోందని సిద్దరామయ్య అన్నారు. శెట్టర్ గెలుపును నిర్ధారించిన ఈసీ సాక్షి, బళ్లారి: హుబ్లీ–ధార్వాడ సెంట్రల్ నియోజకవర్గంలో బీజేపీ నేత, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. మంగళవారం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పోలైన ఓట్లకు, ఈవీఎంలో నమోదైన ఓట్ల మధ్య స్వల్ప తేడా వచ్చింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్ నలవాడ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో ఫలితాన్ని నిలిపివేశారు. సమగ్ర పరిశీలన అనంతరం మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత శెట్టర్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బీజేపీ బలం 104కు చేరుకుంది. రాజ్‌భవన్‌కు క్యూ కట్టిన పార్టీలు .బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్ ముందు ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. యడ్యూరప్ప, ఇతర బీజేపీ సీనియర్ నేతలు తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. అతిపెద్ద పార్టీగా నిలిచినందుకు తమకే అవకాశమివ్వాలని కోరారు. మరోవైపు, 2008 తరహాలోనే ఈసారి కూడా తమ ఎమ్మెల్యేలను లాక్కుంటుందనే అనుమానంతో కాంగ్రెస్‌పార్టీ చాలా జాగ్రత్తపడింది. వెంటనే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావాలని ఆదేశించింది. అనంతరం జేడీఎస్–కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్న ఈ పార్టీ నేతలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సంఖ్యా బలం తమకుందని ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ కోరారు. అయితే ఇరు పక్షాలకూ గవర్నర్ ఒకే సమాధానం ఇచ్చారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులతో చర్చించి వీలయినంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. -
రేపు ప్రమాణ స్వీకారం చేస్తా
-
నేడే కన్నడ పోల్
-
నేడే కన్నడ సంగ్రామం
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నేడే కన్నడ సంగ్రామం. గెలుపు గుర్రాన్ని అధిరోహించేదెవరో నిర్ణయమయ్యే రోజు. 2600 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యే రోజు. మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌ల్లో కన్నడ ఓటరు ఎవరికి పట్టం కడతాడో తేలే రోజు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజే జరగనున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాల్లో.. వాయిదా పడిన ఆర్ఆర్ నగర్, జయనగర మినహా 222 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దాదాపు 55,600 పోలింగ్ బూత్‌ల్లో, మూడున్నర లక్షల మంది సిబ్బంది పర్యవేక్షణలో 4.96 కోట్ల ఓటర్లు తమ తీర్పును ఈ రోజే ప్రకటించనున్నారు. రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కన్నడ నాట కీలక పార్టీ జేడీఎస్‌లు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. కాంగ్రెస్, బీజేపీల నుంచి దిగ్గజ నేతలు స్వయంగా రంగంలోకి దిగి, ప్రచారం నిర్వహించడం ఈ ఎన్నికల్లో గెలుపు వారికి ఎంత అవసరమో స్పష్టం చేస్తున్నాయి. చరిత్ర పునరావృతమయ్యేనా! 1985 నుంచి నేటి వరకు కర్ణాటకలో ఏ పార్టీ కూడా వరుసగా రెండుసార్లు అధికారంలో లేదు. ఈ సంప్రదాయాన్ని బద్దలుకొట్టి మళ్లీ అధికారంలోకి వస్తామని సిద్దరామయ్య ట్వీట్ చేశారు. మరోవైపు, చరిత్రను పునరావృతం చేయాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. 130 సీట్లు గెలుస్తామని ఆ పార్టీ చీఫ్ అమిత్ షా ధీమాగా ఉన్నారు. ప్రధాని మోదీ చేసిన సుడిగాలి ప్రచారం తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది. పోటీ ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే నెలకొంది. ఈ ఎన్నికలు తమ పార్టీకి జీవన్మరణ సమస్యని, ఓడిపోతే మరణమే శరణ్యమని జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. నలుగురు తాజా, మాజీ సీఎంలు ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. చాముండేశ్వరి, బాదామీల నుంచి సిద్దరామయ్య, షికారిపుర నుంచి యడ్యూరప్ప, చెన్నపట్నం, రామనగర నుంచి కుమారస్వామి, హుబ్లీ–ధార్వాడ్ నుంచి జగదీశ్ షెట్టర్లు పోటీ చేస్తున్నారు. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 122 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంది. కీలక నేతలపైనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల్లోని కీలక నేతలు పోటీచేస్తున్న నియోజకవర్గాలపైనే అందరి దృష్టి ఉంది. సిద్దరామయ్య: సీఎం సిద్దరామయ్య చాముండేశ్వరి, బాదామీ రెండుస్థానాల్లో పోటీ చేస్తున్నారు. చాముండేశ్వరిలో జేడీఎస్ నేత జీటీ దేవెగౌడ, బాదామీలో బీజేపీ నేత శ్రీరాములు నుంచి ఇతనికి గట్టి పోటీ ఎదురుకానుంది. చాముండేశ్వరిలో జేడీఎస్ అభ్యర్థి (వక్కలిగ)కి బలమైన మద్దతుంది. ఇక్కడ ‘అహిందా’ ఓట్లనే సీఎం నమ్ముకున్నారు. ఈ 2 నియోజకవర్గాల్లోనూ సీఎంకు గట్టి పోటీ ఉండటం, రెండుస్థానాల్లో సీఎం ఓడిపోతారని అమిత్ చెప్పడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్ అశోక్: ఇతను దక్షిణ బెంగళూరు పరిధిలోని పద్మనాభసాగర్ నుంచి బరిలో ఉన్నారు. డీలిమిటేషన్‌కు ముందు దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గమైన ఉత్తరహళ్లి నుంచి పోటీ చేసి గెలిచారు. వక్కలిగ వర్గానికి చెందిన అశోక్ బీజేపీలో కీలక నేత. అశోక్‌కే విజయావకాశాలు ఎక్కువ. ప్రియాంక్ ఖర్గే: పార్లమెంట్లో కాంగ్రెస్ పక్షనేత మల్లిఖార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే. గుల్బర్గా జిల్లా చిత్తాపూర్ నుంచి బరిలో ఉన్నారు. కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. బీజేపీ నుంచి వాల్మీకీ నాయక్ పోటీలో ఉన్నారు. నాయక్, ఖర్గే మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. జి. పరమేశ్వర్: తుముకూరు జిల్లా కొరటగేరే (ఎస్సీ రిజర్వ్డ్) నుంచి ఈయన బరిలో ఉన్నారు. 2013లో జేడీఎస్ నేత సుధాకర్ చేతిలో ఓడిపోయారు. జేడీఎస్ నేత సుధాకర్ లాల్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. సీనియర్ నేత కావడంతో ఈసారి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. బి. శ్రీరాములు: యడ్యూరప్ప తర్వాత బీజేపీలో జనాకర్షకనేతగా శ్రీరాములు ఎదిగారు. పార్టీ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎంగా ఎన్నికవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇతను సీఎం సిద్ధరామయ్యపై బాదామీలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ పోటీ నువ్వా–నేనా అనే రీతిలో ఉంది. ములకల్మూరు నుంచి కూడా శ్రీరాములు బరిలో ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే (బీజేపీ అసంతృప్త) తిప్పేస్వామికి టిక్కెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ శ్రీరాములు గెలిచే అవకాశం ఉంది. ఎస్ సురేశ్‌కుమార్: ఇతను బీజేపీ తరఫున రాజాజీనగర్ నుంచి బరిలో ఉన్నారు. గతంలో న్యాయశాఖమంత్రిగా పనిచేశారు. పద్మావతి (కాంగ్రెస్) నుంచి ఈయనకు పోటీ ఉన్నప్పటికీ.. సురేశ్కుమార్కే ఇక్కడ విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సినీ నటుడు సాయికుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న బాగేపల్లిపై కూడా సర్వత్రా ఆసక్తి ఉంది. బీజేపీ తరఫున ఈయన బరిలో ఉన్నారు. పదేళ్లక్రితం పోటీచేసి ఓడిపోయిన తర్వాత మళ్లీ నియోజకవర్గంలో కనిపించలేదనే అపవాదు ఉంది. జేడీఎస్ నుంచి ఇతనికి గట్టిపోటీ ఎదురుకానుంది. బీటీఎం నుంచి తెలుగువ్యక్తి, ప్రస్తుత హోంమంత్రి రామలింగారెడ్డి, శివాజీ నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున రోషన్‌బేగ్‌లు గెలిచే అవకాశాలున్నాయి. పచ్చనోట్ల పందేరం ఎన్నికలను ఇరుపార్టీలు కీలకంగా తీసుకోవడంతో గురు, శుక్రవారాల్లో కర్ణాటకలో పచ్చనోట్ల పందేరం జరిగింది. నగదు పంపిణీతో పాటు చీరలు, ప్రెషర్ కుక్కర్లు, సెల్ఫోన్లు, ముక్కపుడకలు, క్రికెట్ కిట్లు, పంపిణీ చేశారు. బీటీఎం, విజయనగర నియోజకవర్గాల్లో ఓటుకు 3–5వేల వరకు పంచారని.. బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు నాన్సిన్ తెలిపారు. ఇదే నియోజకవర్గంలో ముక్కపుడకలు కూడా పంపిణీ చేస్తున్నారని సోమనాథ్ అనే కిరాణాకొట్టు నిర్వాహకుడు చెప్పారు. పలుచోట్ల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా 100–150 కోట్లు ఖర్చు చేస్తున్నారని అంచనా. రాజరాజేశ్వరీనగర్ నియోజకవర్గంలో 10వేల నకిలీ ఓటరు గుర్తింపుకార్డులను ఈసీ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని ఎక్కడెక్కడ ఈ పరిస్థితి ఉందోనని ఏపీ బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఆర్ నగర్ ఎన్నిక వాయిదా 10వేల నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు పట్టుబడ్డ రాజరాజేశ్వరి నగర్ (ఆర్ఆర్ నగర్) నియోజకవర్గ ఎన్నికను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. మే 28 ఎన్నిక నిర్వహించి 31వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సంజీవ్ కుమార్ శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఆర్ఆర్ నగర్ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో కానుకలతో పాటు సుమారు 10 వేల నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. బెంగళూరు జయనగరలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయకుమార్ ఆకస్మిక మృతితో అక్కడ వాయిదా వేశారు. ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని ఈసీ ప్రకటించలేదు. దావణగెరెలో మహిళలకు ప్రత్యేకించిన పింక్ పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగుతున్న ఓ ఓటరు -
కర్నాటక ఎన్నికలు: బీజేపీ మెనిఫేస్టో విడుదల
-
బీజేపీ మానిఫెస్టో.. మహిళలే టార్గెట్
బెంగుళూరు : ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కర్ణాటకలో ప్రధాన పార్టీలు తమ దూకుడు పెంచాయి. ఓటర్లలో ప్రధాన వర్గమైన పేద, మధ్యతరగతి వర్గాల మహిళలను ఆకర్షించడానికి అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వీరిని ఆకర్షించడమే ధ్యేయంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఉచితంగా స్మార్ట్ఫోన్లు, కేవలం 1శాతం వడ్డీతోనే రుణాల మంజూరు, మహిళల భద్రత కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు వంటి హమీలతో మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే మహిళల భద్రత కోసం ‘కిట్టూరు రాణి చెన్నమ్మ’ పేరిట ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేస్తామని బీజేపీ తన మ్యానిఫెస్టోలో తెలిపింది. అంతేకాక మహిళల సమస్యలను పరిష్కరించడానికి మహిళా పోలీసు అధికారి అధ్వర్యంలో ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్’ను ప్రారంభించి, 1000 మంది మహిళా పోలీసు అధికారులను నియమిస్తామని తెలిపింది. ‘స్త్రీ సువిధ పథకం’ కింద బీపీఎల్ కుంటుంబాల మహిళలకు, ఆడ పిల్లలకు ఉచితంగా, మిగితా స్త్రీలకు కేవలం ఒక్క రూపాయకే సానిటరీ నాప్కిన్లను అందజేస్తామని ప్రకటించింది. అంతేకాక ‘ముఖ్యమంత్రి స్మార్ట్‌ఫోన్ యోజన’ కింద బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా స్మార్ట్ఫోన్లను ఇస్తామని తెలిపింది. అలానే 10 వేల కోట్ల రూపాయలతో ‘స్త్రీ ఉన్నతి ఫండ్’ను, ‘స్త్రీ ఉన్నతి స్టోర్’లను ఏర్పాటు చేయడమే కాక పొదుపు సంఘాల మహిళలకు 1 శాతం వడ్డీకే 2 లక్షల రూపాయల రుణం ఇస్తామని ప్రకటించింది. మహిళలను మాత్రమే కాక రైతులను ఆకట్టుకోవడం కోసం 15 వేల కోట్ల రూపాయలతో వివిధ సాగునీటి పథకాలను ప్రారంభిస్తామని బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యురప్ప తెలిపారు. -
కర్ణాటక సీఎం నేనే..!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ఒక వైపు కొనసాగుతుండగానే తామే కాబోయే సీఎంలమంటూ ప్రధాన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు ప్రకటించేసుకున్నారు. ప్రమాణ స్వీకార ముహూర్తాలు పెట్టేసుకున్నారు. వారు ఏం చెప్పారో చూద్దాం.. మే 17, 18లలో ముహూర్తం శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం, బీజేపీ గెలవడం తథ్యం. నేను మే 17 లేదా 18వ తేదీల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రధాని మోదీ, లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు, మద్దతుదారుల సమక్షంలో బాధ్యతలు చేపడతా. రెండు చోట్లా గెలుస్తా చాముండేశ్వరి, బాదామి నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తా. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. ఫలితాల అనంతరం వారంలోగా నేనే మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడతా. నాన్నకు బర్త్‌డే గిఫ్ట్‌గా.. మా జేడీఎస్ పార్టీ జయకేతనం ఎగురవేయటం ఖాయం. మే 18న మా నాన్న హెచ్డీ దేవెగౌడ జన్మదినం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నా తండ్రికి బహుమతిగా ఇస్తా. -
ఆ రెండింటి మధ్య వాడివేడిగా 'సోషల్ వార్'
న్యూఢిల్లీ : కర్ణాటకలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. కేవలం బహిరంగ ప్రచారాల్లోనే కాక, సోషల్ మీడియా వేదికగా కూడా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వార్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో, ఎలాగైనా ఈ సారి కర్ణాటక పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ తీవ్రంగా కృషిచేస్తోంది. ఈ నేపథ్యంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీజేపి రాష్ట్ర అద్యక్షుడు యడ్యూరప్ప వరుస ట్వీట్లతో ఒకరిపై ఒకరు విమర్శల అస్త్రాలను సంధించుకుంటున్నారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ డ్రైవ్ కంటే కమీషన్ డ్రైవ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టిందని విమర్శించారు. దీనిపై సిద్ధరామయ్య స్పందిస్తూ... ''మైసూరు వాసులను ఎవరూ మోసం చేయలేరు. తెల్లవారితో పోరాడిన పులిబిడ్డలు పుట్టిన ప్రాంతం ఇది. భూ సంస్కరణలు తీసుకువచ్చిన ఆధునిక రాష్ట్రం కర్ణాటక. కొంతమంది చౌకబారు విమర్శలను కర్ణాటక ప్రజలు ఆహ్వానించరు'' అని ట్వీట్ చేశారు. సిద్ధరామయ్య చేసిన ఈ ట్వీట్‌పై సోషల్ మీడియా వేదికగా యడ్యూరప్ప విరుచుపడ్డారు. ఇలా వరుస ట్వీట్లతో రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ జోరుగాసాగుతోంది. వరుస ట్వీట్ల రహస్యం ఇదే ఎన్నికల ప్రచారం అంటే పాదయాత్రలు, ఇంటింటికి తిరగడం, బహిరంగ సభలు, ర్యాలీలు తీయడం సహజం. దీంతో పాటు ఇటీవల కాలంలో సోషల్ మీడియా కూడా ఎన్నికల ప్రచారంలో ప్రముఖ పాత్ర వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజకీయా పార్టీలు తమ ప్రచారానికి సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారు. విద్యావంతులైన ప్రజలు ఇంటర్నెట్ను పూర్తి స్థాయిలో ఉపయోగిస్తున్నారు. అంతేకాక యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటు ప్రజలను, అటు యువతను ఆకట్టుకోవడానికి ఈ మాధ్యమాన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార అస్త్రంగా ఎంచుకుంటున్నారు. సోషల్ ప్రచారానికి ఏకంగా టీమ్‌లనే ఏర్పాటు చేసుకుంటున్నారు. యడ్యూరప్ప ఉత్తర బెంగళూరులో ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకునిసోషల్ మీడియా టీంను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా నిపుణుడు రాజ్‌నీతి సారథ్యంలో తమ ప్రచారం నిర్వహిస్తున్నారు. 25 మందితో కూడిన ఈ టీమ్, మూడు నెలల క్రితమే బెంగుళూరులో యడ్యూరప్పను కలిశారు. తాజా సంఘటనల ఆధారంగా ఈ టీమ్ యడ్యూరప్పకు అనుకూలంగా ప్రచారం సాగిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం సామాజిక మీడియా నిపుణులచే సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. దీనికి సిద్ధరామయ్య తనయుడు సారథ్యం వహిస్తున్నాడు. ఓ ఇంగ్లీష్ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ..''మాకు గత సంవత్సరం సెప్టెంబర్ వరకు సోషల్ మీడియా టీమ్ లేదు. ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ల ద్వారా కాంగ్రెస్ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నాం'' అని తెలిపారు. -
ముగ్గురు సీఎంలను మార్చిన ఘనత బీజేపీదే
శివాజీనగర/యశ్వంతపుర: గతంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చి పాలనను అస్థిర పరిచిన ఘనత ఆ పార్టీదేనని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీ.ఎస్.యడ్యూరప్పలకు వ్యతిరేకంగా రాజాజీనగర అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. కర్ణాటక విద్యుత్ మండలి అధ్యక్షుడు ఎస్.మనోహర్ మాట్లాడుతూ అక్రమ గనుల తవ్వకాలు, ప్రేరణ ట్రస్ట్ డీ నోటిఫిషన్ విషయంలో అప్పటి సీఎం యడ్యూరప్ప, అప్పటి మంత్రులు జైలుకు వెళ్లి వచ్చిన విషయం ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్రంలో అవినీతికి చోటు లేకుండా ఉత్తమ పాలన కొనసాగిస్తున్న సిద్దరామయ్యను రాష్ట్ర ప్రజలు మెచ్చుకుంటున్నారన్నారు. దీన్ని ఓర్చలేని బీజేపీ నేతలు సిద్ధరామయ్యపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బెంగళూరు నగర జిల్లా కాంగ్రెస్ ప్రచార సమితి అధ్యక్షుడు జి.జనార్ధన్, నాయకులు సలీం, ఆనంద్, రామకృష్ణ, బాబు, హేమరాజ్, ఆదిత్య, ఆశా, రచనా తదితరులు పాల్గొన్నారు. -
ఐదేళ్లూ అధికారంలో ఉన్నింటే
గుజరాత్ కంటే ఎక్కువగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేవాన్ని సొంత పార్టీ వారే ఓర్చలేకపోయారు మాజీ సీఎం యడ్యూరప్ప ఆవేదన సాక్షి, బెంగళూరు : ‘నేను ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే కర్ణాటకను గుజరాత్ కంటే అధిక స్థాయిలో అభివృద్ధి చేసి చూపేవాన్ని, కానీ ఏం చేస్తాం సొంత పార్టీలోని కొందరు వ్యక్తులు మోకాలడ్డడం వల్ల పదవిని వదులుకోవాల్సి వచ్చింది’ అని మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప ఆవేదనను వెళ్లగక్కారు. కర్ణాటక వీరశైవ అభివృద్ధి సంస్థ న గరంలో రూ.18 కోట్ల వ్యయంతో ‘బసవేశ్వర సుజ్ఞాన మంటప, అల్లమ ప్రభు ఆత్మజ్ఞాన మంటప’ను నిర్మించారు. ఆదివారమిక్కడ నిర్వహించిన మంటప ప్రారంభోత్సవ కార్యక్రమానికి యడ్యూరప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ...దళితులు, వెనకబడిన వర్గాల వారు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం తాను శ్రమించానని తెలిపారు. అయితే తన అభివృద్ధి కార్యక్రమాలను ఓర్చుకోలేని కొందరు తమ పార్టీ నేతలు తనపై లేనిపోని అబద్దపు ప్రచారాలు చేయడంతో తాను పదవిని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బసవేశ్వర సంశోధనా కేంద్రం ఏర్పాటుకు రూ.25 కోట్లను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నానని, అయితే తన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ నిధులను మంజూరు చేయలేదని అన్నారు. దేశ మంతటా ప్రస్తుతం వర్షాభావం కారణంగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వరుణ దేవుని కృపకోసం ప్రార్థనలు నిర్వహించాలని కోరారు. తాను ఇకముందు రాజకీయాల గురించి మాట్లాడబోనని, ప్రధాని నరేంద్రమోదీతో కలిసి దేశంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాన ని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనంతకుమార్, కర్ణాటక వీరశైవ విద్యాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు బి.ఎస్.పరమ శివయ్య, మాజీ వి.మంత్రి సోమణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ర్టంలో బీజేపీ అధికారమే ధ్యేయం
ఆరు నెలల్లో సీఎం కుర్చీ దిగుతారు ఆ గనులను ఎందుకు వేలం వేయలేదో సీఎం స్పష్టం చేయాలి రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప సాక్షి, బళ్లారి : కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపి బీజేపీని అధికారంలోకి తేవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కే.ఎస్.ఈశ్వరప్ప సీఎం సిద్ధరామయ్యపై తీవ్ర విమర్శలు చేశారు. బళ్లారి ఎంపీ శ్రీరాములును అత్యధిక మెజార్టీతో గెలిపించిన కార్యకర్తలకు అభినందనలు తెలిపేందుకు నగరంలోని బసవభవన్‌లో గురువారం సాయంత్రం బీజేపీ శాఖ ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి యడ్యూరప్ప, శ్రీరాములు విడిపోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. తిరిగి వారిద్దరి కృషితో పాటు మోడీ హవా కారణంగా రాష్ర్టంలో తమ పార్టీకి 17 లోక్‌సభ స్థానాలు దక్క డం సంతోషంగా ఉందన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 9 సీట్లు మాత్రమే రావడం ఆపార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు తేటతెల్లం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన సిద్ధరామయ్య ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్డడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమ ఖనిజ తవ్వకాలు సాగించిన 51 కంపెనీలను వేలం వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినా.. సీఎం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. గనుల అక్రమార్కులనుంచి సీఎం మామూళ్లు తీసుకుంటున్నందుకే వాటిని వేలం వేయలేదని ఆరోపించారు. గనుల అక్రమాలపై బెంగళూరు నుంచి బళ్లారికి డ్యాన్స్‌లు చేస్తూ పాదయాత్ర చేపట్టిన సిద్దరామయ్య ప్రస్తుతం ఎందుకు మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మోడీని సిద్ధరామయ్య నరహంతకుడుగా విమర్శించారని, ఇప్పుడు మోడీ ప్రధాని అయ్యారని, దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మోడీ తన ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడం ఆయన స్నేహ హస్తానికి నిదర్శనమన్నారు. త్వరలో సీఎం సిద్ధరామయ్య తన కుర్చీ దిగడం ఖాయమన్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలో రానున్నట్లు జోస్యం చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారం మాత్రమే బీజేపీకి దక్కుతుందన్నారు. దేశాన్ని ఏకతాటిపై తీసుకుని వచ్చిన మోడీని ప్రపంచ దేశాలు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కర్ణాటక సమగ్రాభివృద్ధికి తామంతా కృతనిశ్చయంతో ఉన్నామని, జాబితా తయారు చేసి ప్రధానమంత్రి వద్దకు వెళ్దామని సీఎం కు సూచించారు. కార్యక్రమంలో బళ్లారి లోక్‌సభ సభ్యుడు బీ.శ్రీరాములు, కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి, మాజీ ఎంపీలు శాంత, సన్న పక్కీరప్ప, విధాన పరిషత్ సభ్యులు మృ త్యుంజయ జినగ, శశీల్ నమోషీ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, బీజేపీ నాయకులు మహిపాల్, కే.ఎస్.దివాకర్, ఎ.ఎం.సంజయ్, సుధీర్, సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేనే వద్దన్నా
కేంద్ర మంత్రి పదవిపై యడ్డి సాక్షి,బెంగళూరు : కేంద్రంలో మంత్రి పదవి వద్దని నరేంద్ర మోడీకి తానే చెప్పానని మాజీ ముఖ్యమంత్రి, శివమొగ్గ పార్లమెంటు సభ్యుడు యడ్యూరప్ప పేర్కొన్నారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోర్టులో కేసులు ఉండటం వల్ల నరేంద్ర మోడీ తనకు కేంద్ర మంత్రి మండలిలో స్థానం కల్పించలేదంటూ వెలువడుతున్న వార్తలు అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. బీజేపీని మరింత బలోపేతం చేయడం కోసమే తాను కేంద్రంలో మంత్రి పదవిని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన ముగ్గురు పార్లమెంటు సభ్యులకు కేంద్ర మంత్రి మండలిలో స్థానం దక్కడం సంతోషం కలిగించిందన్నారు. భవిష్యత్‌లో మరింత మందికి మంత్రి మండలిలో స్థానం దక్కునుందని యడ్యూరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్యే పదవికి యడ్యూరప్ప రాజీనామా
సాక్షి, బెంగళూరు : మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గత శాసన సభ ఎన్నికల్లో యడ్యూరప్ప శికారిపుర నియోజక వర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో తిరిగి మాతృ పార్టీ బీజేపీలో చేరి శివమొగ్గ పార్లమెంటు స్థానం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా మూడు రోజుల క్రితం స్పీకర్ కాగోడు తిమ్మప్పకు పంపారు. ఈ విషయంపై స్పీకర్ కాగోడు తిమ్మప్ప బెంగళూరులో మీడియాతో ఆదివారం మాట్లాడుతూ...యడ్యూరప్ప శాసనసభ స్థానానికి రాజీనామా చేశారని దీనిని ఆమోదించాల్సి ఉందన్నారు. -
అనంత కుమార్‌కు కేంద్ర మంత్రి పదవి ?
నేడు ప్రమాణ స్వీకారం ! ఆరుగురికి అధికారిక ఆహ్వానం నేడు జగన్నాథ భవన్లో వేడుకలు ఢిల్లీకి రాష్ర్ట నాయకులు సాక్షి, బెంగళూరు : తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల సహా బెంగళూరు దక్షిణ పార్లమెంటు స్థానం నుంచి ఆరు పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన అనంతకుమార్‌కు కేంద్ర మంత్రి మండలిలో స్థానం దక్కడం దాదాపు ఖాయమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఆయన భార్య తేజస్వినీతో కలిసి ఢిల్లీలో మకాం వేసినట్లు తెలుస్తోంది. సోమవారం నరేంద్రమోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వేదికపై అనంతకుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒకవేళ రాష్ట్రానికి రెండు కేంద్ర మంత్రి పదవులు కేటాయించాలని మోడీ భావిస్తే మరో పదవి మాజీ సీఎం డీ.వీ సదానంద దక్కనుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. కేంద్ర మంత్రి పదవుల కోసం తాజా ఎంపీలు యడ్యూరప్ప, రమేష్ జిగజిణగిలు చివరి వరకూ పోరాడినా ఫలితం లేకపోయింది. ‘సాధ్యమైనంత తక్కువ సంఖ్యలో మంత్రి మండలి, ఎన్డీఏలోని మిత్రపక్షాలకూ మంత్రిమండలిలో స్థానం’ ఇవ్వాలని కాబోయే ప్రధాని నరేంద్రమోడీ భావిస్తుండటంతో ప్రస్తుతానికి కర్ణాటకకు ఒకటి లేదా రెండు మంత్రి పదవులు మాత్రమే దక్కాయని కర్ణాటక కమలనాథులు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర శాఖకు చెందిన ఆరుగురికి అధికారిక ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. వీరిలో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్, మాజీ ఉపముఖ్యమంత్రి కే.ఎస్, మాజీ మంత్రులు అరవింద లింబావళి, సీ.టీ రవి, గోవిందకారజోళ, సంతోష్‌లు ఉన్నారు. వీరు కాక నూతనంగా ఎన్నికైన 17 మంది పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొననున్నారు. మరోవైపు మోడీ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రాష్ట్రంలోని వివిధ నగరాల్లో వేడుకలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్రశాఖ నిర్ణయించింది. బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్‌తోపాటు మైసూరు సర్కిల్ వద్ద వేడుకలు నిర్వహించి కమలనాథులు ప్రజలకు మిఠాయిలు పంచనున్నారు. అయితే బీజేపీలోని అనంతకుమార్ వ్యతిరేక వర్గీయులు మాత్రం తద్విరుద్ధంగా చెబుతున్నారు. అద్వానీ శిష్యుడిగా ముద్రపడ్డ అనంతకుమార్‌కు ఇప్పట్లో కేంద్రమంత్రి పదవి ఇచ్చే ఆలోచన మోడీకి లేదని చెబుతున్నారు. అందువల్లే ఆయన ఢిల్లీలో ఉంటూ ఆర్ఎస్ఎస్ నేతనలను ప్రసన్నం చేసుకుని అమాత్య పదవిని పొందాలని వ్యూహ రచన చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా మరో కొన్ని గం టల్లో రాష్ట్రానికి చెందిన ఎంతమందికి కేంద్ర మం త్రి మండలిలో స్థానం దక్కనుందో తేలిపోనుంది. -
నాలుగో స్థానంపై కాంగ్రెస్ కన్ను
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో నాలుగో స్థానాన్ని గెలుచుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రారంభించింది. జేడీఎస్‌తో కలసి ఆ స్థానాన్ని గెలుచుకునే దిశగా పావులు కదుపుతోంది. జూన్ 19న నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. శాసన సభలో సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్ సులభంగా రెండు స్థానాలు, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకుంటుంది. ఎమ్మెల్యేల నుంచి 46 తొలి ప్రాధాన్యత ఓట్లు లభించిన అభ్యర్థి తొలి విడత లెక్కింపులోనే విజయం సాధిస్తాడు. ప్రస్తుతం శాసన సభలో కాంగ్రెస్‌కు 122 మంది సభ్యులున్నారు. ఇద్దరు అభ్యర్థులకు 92 ఓట్లు పోను 30 మిగులు ఓట్లు ఉంటాయి. కాగా, జేడీఎస్‌కు 40 మంది సభ్యులున్నారు. సొంతంగా ఓ అభ్యర్థిని గెలుచుకునే సంఖ్యా బలం ఆ పార్టీకి లేదు. కనుక జేడీఎస్ సహకారంతో కాంగ్రెస్ మరో స్థానాన్ని కైవశం చేసుకోడానికి వ్యూహాలు రచిస్తోంది. బీజేపీకి 43 మంది సభ్యులున్నారు. బీఎస్ఆర్ సీపీ ఇంకా బీజేపీలో విలీనం కాలేదు. ఆ లాంఛనాలన్నీ పూర్తవడానికి కొంత సమయం పడుతుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శ్రీరాములు ఇదివరకే తెలిపారు. అయితే ఆ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడానికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవు. కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ) అధ్యక్షుడు యడ్యూరప్ప సహా ముగ్గురు ఎమ్మెల్యేలు ఇదివరకే బీజేపీలో చేరారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంకా కేజేపీలోనే కొనసాగుతున్నారు. కనుక బీజేపీ కూడా ఒక సీటును సులభంగా గెలుచుకుంటుంది. పాతవారికే చోటు.. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఎస్ఎం. కృష్ణ, బీకే. హరిప్రసాద్‌లను తిరిగి ఎగువ సభకు పంపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మూడో అభ్యర్థి బీజేపీ వ్యక్తి కాగా, నాలుగో అభ్యర్థిగా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ. చిదంబరం కాంగ్రెస్ తరఫున రంగ ప్రవేశం చేయనున్నట్లు సమాచారం. జేడీఎస్ మద్దతుతో ఆయన ఎగువ సభలో ప్రవేశించాలని ఉవ్విళ్లూరుతున్నారు. జేడీఎస్ అధినేత హెచ్డీ. దేవెగౌడ 1996లో ప్రధాని పదవిని చేపట్టినప్పుడు చిదంబరం ఆయన మంత్రి వర్గంలో ఆర్థిక శాఖను నిర్వహించారు. ఇప్పటికీ వారి మధ్య సత్సంబంధాలున్నాయి. రాజ్యసభకు వెళ్లాలన్న తన అభిప్రాయాన్ని ఆయన ఫోన్ ద్వారా ఇటీవల దేవెగౌడ చెవిన వేసినట్లు తెలిసింది. వచ్చే వారం బెంగళూరుకు వచ్చి కలుసుకుంటానని కూడా చెప్పినట్లు సమాచారం. మొత్తానికి దేవెగౌడ సమ్మతిస్తేనే చిదంబరానికి ఎగువ సభ యోగం పడుతుంది. అయితే జేడీఎస్ మద్దతును కోరాలనుకోవడంపై కాంగ్రెస్‌లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర ఏకీకరణ సమితికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు కేజేపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడగట్టుకుని, ద్వితీయ ప్రాధాన్యతా ఓటు ద్వారా నాలుగో స్థానాన్ని చేజిక్కించుకోవచ్చని కాంగ్రెస్‌లోని జేడీఎస్ వ్యతిరేకులు లెక్కలు చెబుతున్నారు. ఇదిలాఉంటే కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకుడు కుపేంద్ర రెడ్డి జేడీఎస్ మద్దతుతో రాజ్యసభలో ప్రవేశించాలనుకుంటున్నారు. జేడీఎస్ మద్దతునిస్తే, విజయానికి అవసరమైన మిగిలిన ఆరు ఓట్లను ఎలాగో తెచ్చుకోగలుగుతానని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. -
కమలోత్సాహం
మోడీ ప్రభంజనం 28 స్థానాల్లో 17 కైవసం 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం జేడీఎస్‌కు రెండు స్థానాలు ఓడిన ‘ఆధార్’ నందన్ నిలేకని డబుల్ హ్యాట్రిక్ సాధించిన అనంత ‘కోస్తా’పై మళ్లీ పట్టుసాధించిన కమలం అనుకున్నట్లే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. రాష్ర్టంలో మోడీ హవా.. పార్టీలోకి యడ్డి, శ్రీరాములు రాకతో బీజేపీ విజయం సులభమైంది. అధికారంలో ఉన్నా కాంగ్రెస్ కేవలం తొమ్మిది సీట్లకే పరిమితమైంది. అయితే కేంద్ర మంత్రులు గట్టునపడ్డారు. ఆధార్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ నందన్ నిలేకనిపై అనంత కుమార్ విజయం సాధించారు. రాష్ర్టంలో ఆప్ హవా కన్పించలేదు. సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభంజనం ముందు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. మొత్తం 28కు గాను 17 స్థానాల్లో బీజేపీ విజయ బావుటాను ఎగురవేసింది. అధికార కాంగ్రెస్ తొమ్మిది స్థానాలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. జేడీఎస్ రెండు స్థానాలకు పరిమితమైంది. బెంగళూరులోని మూడు స్థానాలనూ బీజేపీ నిలబెట్టుకుంది. గత నెల 16న పోలింగ్ జరుగగా, శుక్రవారం ఓట్ల లెక్కింపును చేపట్టారు. 2009లో 19 స్థానాలను గెలుచుకున్న బీజేపీ, రెండు సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. గత ఏడాది మే నెలలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ, ఈ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్‌పై ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లయింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో పునఃప్రవేశించిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప శివమొగ్గ నుంచి 3,62,780 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మరో మాజీ ముఖ్యమంత్రి డీవీ. సదానంద గౌడ బెంగళూరు ఉత్తర నియోజక వర్గం నుంచి గెలుపొందారు. కేంద్ర మంత్రులు మల్లిఖార్జున ఖర్గే, కేహెచ్. మునియప్ప, వీరప్ప మొయిలీలు గెలుపు బాట పట్టారు. బళ్లారి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ మంత్రి బీ. శ్రీరాములు భారీ తేడాతో విజయం సాధించారు. హాసనలో మాజీ ప్రధాని హెచ్డీ. దేవెగౌడ తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఏ. మంజుపై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. పని చేయని ఐటీ మంత్రం బెంగళూరు దక్షిణ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ఆధార్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ నందన్ నిలేకని ఓటమి పాలయ్యారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి అనంత కుమార్ ఘన విజయం సాధించారు. వరుసగా ఆయన ఆరో సారి గెలుపును సొంతం చేసుకున్నారు. ఈ నియోజక వర్గంలో పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలున్నందున, ఆ ఉద్యోగుల ఓట్లన్నీ నిలేకనికి గంప గుత్తగా పడిపోతాయని ఆశించిన కాంగ్రెస్‌కు భంగపాటు ఎదురైంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మినహా నిలేకనికి కాంగ్రెస్ నాయకుల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. ఆయన కార్పొరేట్ సంసృతి సాధారణ ఓటరుకు అంతగా నచ్చినట్లు లేదు. పైగా ఈ నియోజక వర్గం ఆది నుంచీ పెట్టని కోటలా ఉండడం, మోడీ మంత్రం పని చేయడంతో బీజేపీకి విజయం సునాయాసమైంది. కోస్తాపై మళ్లీ పట్టు : గత ఏడాది జరిగిన శాసన సభ ఎన్నికల్లో కోస్తా జిల్లాల్లో ఓటమి చవి చూసిన బీజేపీ ఈ ఎన్నికల్లో తిరిగి పట్టు సాధించింది. ఉత్తర, దక్షిణ కన్నడలతో పాటు ఉడిపి-చిక్కమగళూరు నియోజక వర్గంలో విజయ కేతనం ఎగురు వేసింది. మాజీ మంత్రి శోభా కరంద్లాజె ఉడిపి-చిక్కమగళూరు స్థానంలో తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ సిట్టింగ్ అభ్యర్థి జయప్రకాశ్ హెగ్డేపై లక్షా 81 వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జనార్దన పూజారి దక్షిణ కన్నడ నియోజక వర్గంలో ఓటమి పాలయ్యారు. ఉత్తర కన్నడ స్థానంలో రాష్ర్ట ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్వీ. దేశ్‌పాండే తనయుడు ప్రశాంత దేశ్‌పాండే ఓడిపోయారు. వరుస విజేతలు : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పీసీ. మోహన్ (బెంగళూరు సెంట్రల్), గద్దిగౌడర్ (బాగలకోటె), ప్రహ్లాద జోషి (ధార్వాడ) హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు. కోలారు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మంత్రి కేహెచ్. మునియప్ప వరుసగా ఏడో సారి గెలుపొందారు. బెంగళూరు దక్షిణ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనంత కుమార్ వరుసగా ఆరో సారి విజయాన్ని సొంతం చేసుకున్నారు. దావణగెరె నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జీఎం. సిద్ధేశ్వర్ వరుసగా నాలుగో సారి గెలుపు సాధించారు. బిజాపుర నుంచి అదే పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన రమేశ్ జిగజిణగి వరుసగా ఐదో సారి ఎన్నికయ్యారు. -
గెలవలేకనే ప్రధాని కొత్త ఇల్లు వెదుక్కుంటున్నారు
కాంగ్రెస్‌కు 75 నుంచి 80 సీట్లకు మించి రావు ప్రధాని పదవిపై రాహుల్, సోనియా ఆశలు వదిలేసుకున్నారు శక్తివంతమైన భారత్ కోసం మోడీకి మద్దతివ్వండి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప దావణగెరె, న్యూస్‌లైన్ : కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో పరాజయం తప్పదనే భావనతోనే ప్రధాని మన్మోహన్ కొత్త ఇల్లు వెదుక్కునే పనిలో ఉన్నారని, ఇక ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ ప్రధాని పదవిపై ఆశ వదులుకున్నారని మాజీ సీఎం యడ్యూరప్ప ఎద్దేవా చేశారు. దేశభవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీకి పట్టం కట్టి శక్తివంతమైన భారత్ ఆవిష్కరణకు ఓటర్లు సహకరించాలని కోరారు. దావణగెరె తాలూకా, ఆనగోడు గ్రామంలో బీజేపీ అభ్యర్థి జీఎం సిద్దేశ్వర్ తరఫున బుధవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. సూర్యచంద్రులున్న మాట ఎంత వాస్తవమో ఈ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ ప్రధాని కావడం కూడా అంతే సత్యమని జోష్యం పలికారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి 75-80 కి మించి స్థానాల్లో గెలవలేదని అన్ని రకాల సర్వేలు చెబుతున్నాయన్నారు. మోడీ ప్రధాని అవుతారనే భావనతో యావత్ ప్రపంచం దృష్టి భారత్‌పైనే ఉందన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పినట్లుగా 2020 నాటికి భారతదేశం శక్తిమంతమైన దే శంగా ఎదగాలన్న కల నిజం కావాలంటే నరేంద్ర మోడీ ప్రధాని అయితేనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎస్ఏ రవీంద్రనాథ్, ప్రతిపక్ష ముఖ్య సచేతకులు డాక్టర్ ఏహెచ్ శివయోగిస్వామి, మాజీ ఎమ్మెల్యే బసవరాజ్ నాయక్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అణబేరు జీవనమూర్తి, ప్రొఫెసర్ ఎన్.లింగణ్ణ, జెడ్పీ సభ్యులు సహనా రవి, శారదా ఉమేష్ నాయక్, బీఎం సతీష్ తదితరులతో పా టు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీతోనే పేదల సంక్షేమం సింధనూరు టౌన్: బీజేపీతోనే పేదల సంక్షేమం సాధ్యమని మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప పేర్కొన్నారు. తాలూకాలోని మాడసిరివార గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన బీజేపీ ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. యూపీఏ పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదన్నారు. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీకి పట్టం కట్టేందుకు కొప్పళ బీజేపీ అభ్యర్థి కరడి సంగణ్ణకు ఓట్లు వేసి గెలిపించాలని మనవి చేశారు. తాలూకా పంచాయతీ మాజీ సభ్యుడు హంసరాజ్, బీజేపీ వెనుకబడిన వర్గాల జిల్లా అధ్యక్షుడు ఎం.దొడ్డబసవరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.రంగనగౌడ గొరేబాళ, ఇంగళి శరణేగౌడ గొరేబాళ, ఫకీరప్ప హెడగినాళ, భీమప్ప, కరియప్ప హరేటనూరు, సిద్దప్ప మాడశిరివార తదితరులు పాల్గొన్నారు. -
అవినీతిపరుడు యడ్యూరప్ప
మోడీ అధికారంలోకి వస్తే యడ్యూరప్ప టెలికాం మంత్రి కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగిన అరవింద్ కేజ్రీవాల్ సాక్షి, బెంగళూరు/దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్/ చిక్కబళ్లాపురం, న్యూస్‌లైన్: కర్ణాటకలోని రాజకీయ నాయకుల్లో అత్యంత అవినీతి పరుడైన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పేనని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకులు అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. యడ్యూరప్ప తరువాతి స్థానంలో హరతాళు హాలప్ప, ఆనంద్‌సింగ్, జనార్దన్ రెడ్డి, డి.కె.శివకుమార్‌లు అవినీతిపరుల జాబితాలో స్థానం సంపాదించారని అన్నారు. కర్ణాటకలో రెండు రోజుల పర్యటన నిమిత్తం నగరానికి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం చిక్కబళ్లాపుర, దొడ్డబళ్లాపుర, యలహంక ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. అనంతరం బెంగళూరులోని ఫ్రీడం పార్కులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఫ్రీడం పార్కులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్ మొదటగా రాష్ట్రంలోని కన్నడిగులందరికి నా శుభాకాంక్షలు అంటూ కన్నడలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అవినీతి పరుడని యడ్యూరప్పను ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించిన బీజేపీ నుంచి బయటికి వెళ్లిన యడ్యూరప్పను మళ్లీ పార్టీలోకి ఎందుకు చేర్చుకుందో అర్థం కావడం లేదని అన్నారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయితే యడ్యూరప్పకు టెలికాం మంత్రిగా, శ్రీరాములుకు మైనింగ్ శాఖ మంత్రిగా పదవులు అప్పగిస్తారని పేర్కొన్నారు. ఇక బీజేపీ అవినీతితో ప్రజలు విసిగిపోయిన సమయంలో అవినీతి నిర్మూలన మంత్రంతో రాష్ట్రంలో అధికారంలోకి వ చ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అవినీతిని ప్రోత్సహిస్తూనే ఉందని అన్నారు. అవినీతి పరులైన డి.కె.శివకుమార్, రోషన్‌బేగ్‌లకు తన మంత్రి వర్గంలో ఎందుకు చోటు కల్పించాల్సి వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాన్ని కూడా అప్పగించేస్తారా... గుజరాత్‌ను ఎంతో అభివృద్ధి చేశానని నరేంద్రమోడీ చెప్పుకుంటున్నారని అయితే గుజరాత్‌లోని దాదాపు 60 వేల చిన్నతరహా పరిశ్రమలు ఆయన హయాంలోనే మూతపడ్డాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. చిన్న చిన్న పరిశ్రమలన్నింటిని మూతపడేలా చేసి పారిశ్రామిక రంగాన్నంతా అంబానీ, టాటా వంటి నాలుగు కుటుంబాలకే అప్పగించాలనేది మోడీ ఉద్దేశమని అన్నారు. ఇక మోడీ ప్రధాని అయితే దేశాన్ని కూడా ఆ నాలుగు వ్యాపార కుటుంబాలకే అప్పగించేస్తారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కర్ణాటకతో పాటు దేశంలోని ప్రజలందరికీ ప్రత్యామ్నాయంగా ఆప్ కనిపిస్తోందని, దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురాగల సామర్ధ్యం ఒక్క ఆప్కే ఉందని అన్నారు. కాగా శనివారం సాయంత్రం కేజ్రీవాల్‌తో విందు కార్యక్రమం ద్వారా రూ.50 లక్షల విరాళాలను సేకరించినట్లు ఆప్ ప్రకటించింది. ఆప్‌కు విరాళాలు అందించిన వారందరి వివరాలను వెబ్సైట్లో ప్రకటిస్తామని ఆప్ వెల్లడించింది. దొడ్డబళ్లాపురలో... అడవి దొంగ వీరప్పన్ కంటే కేంద్రమంత్రి వీరప్పమొయిలీ ఎక్కువగానే సంపాదించుకున్నారని, రిలయన్స్‌కు అడ్డగోలుగా గ్యాస్ కేటాయింపులు చేయడం ద్వారా కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని అరవింద్క్రేజీవాల్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిక్కబళ్లాపురం లోక్‌సభ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న అర్కేశ్ తరఫున ప్రచారం చేసిన ఆయన ఇక్కడి పాత బస్టాండులో రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు. ప్రసంగం ఆద్యంతం ఆయన వీరప్పమొయిలీ, నరేంద్ర మోడీలపై నిప్పులు చెరిగారు. అభివృద్ధిని విస్మరించిన మొయిలీని ఈసారి ఎన్నికల్లో ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. చిక్కబళ్లాపురలో.... రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను ఓడించి ఆప్ అభ్యర్థికి మద్దతునివ్వాలని కేజ్రీవాల్ కోరారు. చిక్కబళ్లాపురలోని టౌన్‌హాల్ మీదుగా ఆదివారం కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. గతంలో చిక్కబళ్లాపుర పార్లమెంటు స్థానం నుంచి వీరప్పమొయిలీని గెలిపించి పంపిస్తే ఆయన ఇక్కడి ప్రజలకు ఏ ప్రయోజనం చేకూర్చలేక పోయారని విమర్శించారు. చిక్కబళ్లాపురలో అభివృద్ధి జరగాలంటే ఈ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. -
మావోల హిట్ లిస్ట్‌లో యడ్డి
= ఉనికి చాటుకునేందుకు వ్యూహాలు = అదనపు భద్రతకు పోలీసుల చర్యలు సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్ట్‌లు తహతహలాడుతున్నారు. ఇందుకోసం రానున్న లోక్‌సభ ఎన్నికలను వినియోగించుకోవడానికి వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్లు రాష్ట్ర హోంశాఖకు సమాచారం అందింది. దీంతో మావోల వ్యూహాలకు చెక్‌పెట్టేందుకు అనుసరించాల్సిన విధివిధానాల తయారీలో పోలీసు ఉన్నతాధికారులు తలములకలై ఉన్నారు. రాష్ట్రంలో చాలా కాలంగా మావోయిస్టుల కార్యాకలాపాలు స్తబ్దుగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సముద్రతీర, అటవీప్రాంతం ఎక్కువగా ఉన్న మలెనాడు, కరావళి ప్రాంతాల్లో అడపాదడపా మావోయిస్టు కార్యకలాపాలు బయటికి వస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకాలాపాలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ ఉనికిని కోల్పోవలసి వస్తుందని మావోయిస్టు నాయకులు భావిస్తున్నారు. దీంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రానికి చెందిన అగ్రనాయకులు నిర్వహించే ప్రచార సభలు, ర్యాలీలపై మెరుపు దాడులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ నుంచి రాష్ట్ర హోం శాఖకు సమాచారం అందింది. ముఖ్యంగా మైసూరు, ఉడిపి-చిక్కమగళూరు, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, శివమొగ్గ జిల్లాల్లో జరిగే రాజకీయ ప్రచార కార్యక్రమలపై దాడులు నిర్వహించాలనేది మావోయిస్టుల వ్యూహంగా కనిపిస్తోంది. ఇక వీరి హిట్‌లిస్ట్‌లో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతోపాటు బీజేపీ నాయకులు సీటీ రవి, నలిన్‌కుమార్ కటిల్, జీవరాజ్, ప్రస్తుత ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే తదితర నాయకులు ఉన్నట్లు సమాచారం. భద్రత రెట్టింపు మావోయిస్టుల దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు హిట్‌లిస్ట్‌లో ఉన్న నాయకులందరికీ కల్పించే భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం కల్పిస్తున్న వ్యక్తిగత భద్రత సిబ్బందిని రెట్టింపు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఏకే- 47 సమర్చే ఆలోచనలో పోలీసుబాసులు ఉన్నారు. తద్వారా మావోయిస్టులు దాడికి పాల్పడితే వారిని సమర్థంగా ఎదుర్కొనడానికి వీలవుతుందనేది హోంశాఖ భావన. అయితే ఇందుకు కేంద్రం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన చాలా మంది రాజకీయనాయకుల వ్యక్తిగత భద్రతా సిబ్బంది పిస్టల్, కార్బైన్, ఎస్.ఎల్.ఆర్ తదితర ఆయుధాలను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న చోట నిర్వహించే ఏ ఎన్నికల ప్రచారానికైనా రెండు నుంచి మూడు రోజుల ముందు డీజీపీ కార్యాలయం అనుమతి తీసుకోవడమే కాకుండా ప్రచారానికి సంబంధించిన రూట్‌మ్యాప్‌ను పోలీసులకు అందించేలా ఆదేశాలు జారీ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు విశ్వసనీయ వ ర్గాల సమాచారం. -
బీజేపీ తొలి జాబితా
బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ శనివారం ఢిల్లీలో విడుదల చేసింది. 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో ఎనిమిది స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. తొలి జాబితాలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప (శివమొగ్గ)కు చోటు లభించింది. ప్రస్తుత ఎంపీలు డీబీ. చంద్రే గౌడ (బెంగళూరు ఉత్తర), సన్న ఫకీరప్ప (రాయచూరు), శివరామే గౌడ (కొప్పళ)లకు తిరిగి అభ్యర్థిత్వాలను నిరాకరించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర శాఖ సిఫార్సు చేసిన 20 మందికీ ఆమోదం లభించింది. పార్టీ సీనియర్ నాయకులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, అనంత కుమార్, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, జగదీశ్ శెట్టర్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తావర్‌చంద్ గెహ్లాట్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
సొంత గూటికి శ్రీరాములు ..?
సాక్షి, బళ్లారి : బీఎస్ఆర్ సీపీ అధినేత బీ.శ్రీరాములు బీజేపీలోకి చేరనున్నారా..? ఇక్కడి పరిస్థితులు, ఆదివారం కంప్లిలో శ్రీరాములు మాట్లాడిన తీరును బట్టి చూస్తే నిజమే అనిపిస్తోంది. బీజేపీ జాతీయ,రాష్ట్ర నేతలు నుంచి శ్రీరాములును, గాలి వర్గాన్ని బీజేపీలోకి చేర్చుకునేందుకు పచ్చ జెండా ఊపారా? శ్రీరాములు, గాలి శిబిరం కూడా బీజేపీలోకి చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారా? పై ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానాలు వెలువడుతున్నాయి. బళ్లారి జిల్లాలో ఏ నలుగురు కలిసినా ఇదే టాపిక్‌పై చర్చించుకుంటున్నారు. ఈ చర్చకు త్వరలో తెరపడనుంది. శ్రీరాములు బీజేపీలోకి చేరేందుకు దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. బీఎస్‌ఆర్‌సీపీని బీజేపీలోకి విలీనం చేయడం దాదాపు ఖాయమని సంకేతాలు వెలువడుతున్నాయి. 2008 సంవత్సరంలో దక్షిణ భారత దేశంలో బీజేపీ అధికారంలోకి రావడానికి యడ్యూరప్పతోపాటు గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు కృషి ఎంతో ఉంది. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా మంత్రిగా ఉన్నప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేసి, అనంతరం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత అ బీజేపీ నుంచి బయటకు వచ్చి బీఎస్‌ఆర్‌సీపీ ఏర్పాటు చేశారు. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరాములు, యడ్యూరప్ప బీజేపీని వీడటంతో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్ పార్టీకి ముకుతాడు వేసేందుకు బీజేపీ నుంచి దూరం అయిన ముఖ్య నేతలను తిరిగి ఆ పార్టీ జాతీయ నేతలు ,రాష్ట్ర నేతలు యడ్యూరప్పను బీజేపీలోకి తిరిగి చేర్చుకున్న సంగతి తెలిసిందే. అనంతరం కేజేపీని బీజేపీలోకి విలీనం చేయడంతో బీజేపీకి కొండంత బలం చేకూరింది. లింగాయత్ సమాజిక వర్గానికి చెందిన యడ్యూరప్ప బీజేపీలోకి చేరడంతో కాంగ్రెస్ పార్టీకి కొంత భయం పుట్టుకుంది. అదే సందర్భంలో మాస్‌లీడర్‌గా గుర్తింపు పొందిన శ్రీరాములు బలమైన వాల్మీకి సమాజానికి చెందిన వాడు. ఆయన బీజేపీలోకి చేరితే గాలి శిబిరం కూడా బీజేపీలోకి చేరుతుంది. దీంతో రాష్ట్ర నేతలు మాజీ సీఎం జగదీష్‌శెట్టర్, ఈశ్వరప్పలు తొలుత పావులు కదిపారు. జాతీయ ఆర్ఎస్ఎస్ సమావేశాలు బళ్లారిలో జరుగుతున్న సమయంలో మాజీ సీఎం జగదీష్‌శెట్టర్ స్వయానా గాలి జనార్దనరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. అనంతరం రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు ఈశ్వరప్ప బళ్లారిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు ఆయన స్వయానా శ్రీరాములుతో చర్చలు జరిపి బీజేపీలోకి ఆహ్వానించారు. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని శ్రీరాములు స్వయంగా కలిసి తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకే శ్రీరాములు కూడా కంప్లిలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ బీజేపీలోకి చేరడం దాదాపు ఖాయమని, కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో శ్రీరాములు , గాలి శిబిరం తిరిగి బీజేపీలోకి చేరడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా బళ్లారిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బళ్లారి ఎంపీ శాంతా, కంప్లి ఎమ్మెల్యే సురేష్‌బాబు, మిత్రులు గాలి జనార్దన రెడ్డి, గాలి సోమశేఖర రెడ్డి తదితర పార్టీ నేతలతో మాట్లాడి నాలుగైదు రోజుల్లో పార్టీ విలీనం గురించి ప్రకటిస్తానని చెప్పడం గమనార్హం. ‘అంబి త్వరలో కోలుకుంటారు’ సాక్షి,బెంగళూరు: శాండిల్‌వుడ్ నటుడు, రాష్ట్ర మంత్రి అంబరీష్ త్వరలో కోలుకోనున్నారని సింగపూర్‌లోని మౌంట్ఎలిజిబెత్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈమేరకు ఆదివారం అక్కడి ఆస్పత్రి ఒక బులిటెన్ విడుదల చేసింది. శ్వాసకోసం సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన్ను ఉత్తమ చికిత్సకోసం బెంగళూరులోని విక్రం ఆస్పత్రి నుంచి సింగపూర్‌కు తరిలించిన విషయం తెలిసిందే. కోలివుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు గతంలో చికిత్స అందించిన డాక్టర్ శెట్టి నేతృత్వంలోని వైద్య బృందం అంబరీష్‌కు చికిత్స అందిస్తున్నారు. అంబరీష్ వెంట ఆయన భార్య సుమలత, కుమారుడు అభిషేక్ తదితరులు ఉన్నారు. -
అంబరీష్ ఆరోగ్యంగా ఉన్నారు : సుమలత
* రాష్ట్రవ్యాప్తంగా అంబి అభిమానుల పూజలు *లండన్ నుంచి బయలుదేరిన కుమారుడు * అంబిని పరామర్శించిన దేవెగౌడ, యడ్యూరప్ప, దర్శన్, మోహన్ బాబు బెంగళూరు, న్యూస్‌లైన్ : శాండిల్‌వుడ్ రెబల్‌స్టార్, రాష్ట్ర మంత్రి అంబరీష్ ఆరోగ్యం కుదుటపడుతోందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సతీమణి, బహుభాష నటి సుమలత అన్నారు. ఆదివారం సుమలత విక్రమ్ ఆస్పత్రిలో వైద్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అంబరీష్ ఆరోగ్యం విషమించిందని వస్తున్న వదంతులు నమ్మరాదని విజ్ఞప్తి చేశారు. శ్వాసకోశ సమస్యతో అంబరీష్ చికిత్స పొందుతున్నాడని, విక్రమ్ ఆస్పత్రి వైద్యులు సతీష్, రంగనాథ్, విజయ్, రఘు తదితరులు చికిత్స చేస్తున్నట్లు ఆమె తెలిపారు. త్వరలో ఆయనను జనరల్ వార్డుకు మారుస్తామని వైద్యులు తెలిపారని సుమలత వివరించారు. అంబరీష్ ఐసీయులో వెంటిలేటర్‌తో ఉన్నందువల్ల మాట్లాడటానికి వీలు కావడం లేదని, ఆయన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, కన్నడ సినీనటుడు దర్శన్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని అంబరీష్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే అంబరీష్ ఆరోగ్యం కుదుటపడాలని బెంగళూరు నగరంతో సహ రాష్ట్ర వ్యాప్తంగా హోమాలు, పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లండన్ నుంచి బయలుదేరిన కుమారుడు అంబరీష్, సుమలతల కుమారుడు అభిషేక్ లండన్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నాడు. తండ్రి అనారోగ్యం విషయం తెలుసుకున్న అతడు లండన్ నుంచి బెంగళూరు బయలుదేరాడు. సోమవారం అభిషేక్ బెంగళూరు చేరుకుంటారని అంబరీష్ సన్నిహితులు తెలిపారు. అంబిని పరామర్శించిన మోహన్ బాబు శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతూ విక్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంబరీష్‌ను ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు పరామర్శించారు. ఆదివారం నగరానికి చేరుకున్న వీరు నేరుగా ఆస్పత్రికి చేరుకుని అంబరీష్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంబరీష్‌ను పరామర్శించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. -
‘ప్రతీకార’ ప్రణాళికలు !
యడ్యూరప్ప ఓటమికి రాజకీయ ఎత్తుగడలు శివమొగ్గ నియోజకవర్గంపై ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించిన సిద్దు ? బలమైన అభ్యర్థి కోసం గాలింపు శివమొగ్గ, న్యూస్‌లైన్ : శివమొగ్గ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ సీఎం బీఎస్.యడ్యూరప్పను సొంత ఊరిలోనే ఓడించి రాజకీయంగా మట్టికరిపించడానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య రహస్య ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం. మొదటి నుంచి యడ్యూరప్పకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య మధ్య సత్సంబంధాలు అంతంతమాత్రమే. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిద్ధు తీవ్ర విమర్శలు చేసేవాడు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సిద్ధు ముఖ్యమంత్రి కాగా యడ్యూరప్ప ప్రతిపక్షస్థానంలో ఉన్నారు. నాటి ప్రతీకారానికి పర్యవసానం : గత విధానసభ ఎన్నికల్లో వరుణా విధానసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిద్ధరామయ్యను ఓడించడానికి యడ్యూరప్ప తన వ్యక్తిగత కార్యదర్శి సిద్దలింగస్వామిని బరిలోకి నిలిపాడు. అయినా అంతిమంగా సిద్ధునే వరించింది. శివమొగ్గ లోక్‌సభ స్థానం నుంచి యడ్యూరప్ప పోటీ చేస్తుండటంతో ప్రతీకారం తీర్చుకోడానికి శివమొగ్గపై ప్రత్యేక దృషి సారించారు సిద్ధరామయ్య. ఇప్పటికే స్థానిక కాంగ్రెస్ నేతలతో, ఇంటెలిజెన్స్ ద్వారా నియోజకవర్గ సవ ూచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. యడ్యూరప్పను ఓడించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు.. కుల సమీకరణలను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో జేడీఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే విషయంపై చర్చ జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అభ్యర్థి ఎవ రనేది తీవ్ర ఉత్కంఠ కొనసాగుతునే ఉంది. మంత్రి కిమ్మనె రత్నాకర్‌ను పోటీ చేయాలని సూచించారు. తాను దగ్గరుండి గెలిపిస్తానని సీఎం భరోసా ఇచ్చినట్లు సమాచారం. అయితే రత్నాకర్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అనుభవజ్ఞుడైన కాగోడు తిమ్మప్ప పోటీ చేస్తే యడ్యూరప్పకు గట్టి పోటీ ఉంటుందని, జేడీఎస్ సైతం మద్దతు తెలిపే అవకాశం ఉండటంతో కాగోడును ఎన్నికల్లో పోటీ చేయించడానికి ఒత్తిడి తెస్తున్నారు. అయితే తాను లోక్‌సభ బరిలో నిలబడేది లేదని కాగోడు స్పష్టం చేసినట్లు సమాచారం. -
జేడీఎస్ అభ్యర్థిగా బరిలో గీత శివరాజ్ కుమార్
శివమొగ్గ నుంచి యడ్డి పోటీ మద్దతుదారుల ఒత్తిడితో అంగీకారం అయినా.. పార్టీ నిర్ణయమే అంతిమమని వెల్లడి జేడీఎస్ అభ్యర్థిగా బరిలో గీత శివరాజ్ కుమార్ బంగారప్పపై సానుభూతితో విజయం సాధిస్తుందని ధీమా ‘రాజ్ కుమార్’ అభిమానుల ఓట్లకూ గాలం వేసేలా ఎత్తు శివమొగ్గ, న్యూస్‌లైన్ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో శివమొగ్గ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నిర్ణయించారు. ఇటీవలే కేజేపీ నుంచి బీజేపీలో తిరిగి చేరిన ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తొలుత అనుకున్నారు. కానీ పార్టీతో పాటు మద్దతుదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో పోటీ చేయాలని నిర్ణయించారు. స్థానిక వినోభా నగర లేఔట్‌లోని తన నివాసంలో మంగళవారం రాత్రి ఆయన తనకు ఆప్తులైన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన కుమారుడు, ఎంపీ రాఘవేంద్రతో పాటు పార్టీ నాయకులు, మహా నగర పాలికె సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఆయన వారి అభిప్రాయాలను సేకరించారు. సమావేశంలో పాల్గొన్న వారంతా పోటీ చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. తాను వద్దనుకున్నట్లయితే రాఘవేంద్రను నిలపాలని, లేనట్లయితే బీజేపీ గెలుపు అసాధ్యమని వారు తేల్చి చెప్పారు. దీంతో యడ్యూరప్ప పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తూ, వెంటనే ఇంటింటికీ వెళ్లి ప్రచారం ప్రారంభించాల్సిందిగా సూచించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి అందరూ సమైక్యంగా ముందుకు సాగాలని కోరారు. ఏదేమైనా తన అభ్యర్థిత్వం విషయంలో పార్టీ నిర్ణయమే అంతిమమని చెప్పారు. రాఘవేంద్ర కూడా తన తండ్రి నిర్ణయానికి మద్దతు పలికారు. జేడీఎస్ అభ్యర్థి గీత శివరాజ్‌కుమార్ శివమొగ్గ నియోజక వర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా సినీ నటుడు శివ రాజ్ కుమార్ సతీమణి గీతను పోటీ చేయించాలని జేడీఎస్ నిర్ణయించింది. బీజేపీ అభ్యర్థి యడ్యూరప్పను ఎదుర్కోవడానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమార్తె అయిన గీత సరైన అభ్యర్థి అని పార్టీ భావించింది. కన్నడ నట దిగ్గజం దివంగత రాజ్ కుమార్ కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు. గత శాసన సభ ఎన్నికల్లో గీత సోదరుడైన మధు బంగారప్ప సొరబ నుంచి విజయం సాధించారు. దీనికి తోడు భద్రావతి, శివమొగ్గ గ్రామీణ నియోజక వర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులు గెలుపొందారు. యడ్యూరప్పపై గెలవాలంటే బలమైన అభ్యర్థి అవసరమని జేడీఎస్ గీత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. జిల్లాలో బంగారప్పపై ఉన్న సానుభూతి తమకు కలసి వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. -
పునరాగమనం
= నేడు యడ్డికి బీజేపీ తీర్థం = మరో నలుగురు ఎమ్మెల్యేల సహా = పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా అప్పను నియమించే అవకాశం = ఎంపీలు రాఘవేంద్ర, శివకుమార్లపై సస్పెన్షన్ ఎత్తివేత సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప గురువారం లాంఛనంగా బీజేపీలో చేరనున్నారు. ఆ పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటారు. ఎమ్మెల్యేలు గురుపాదప్ప నాగమారపల్లి, విశ్వనాథ పాటిల్, యూబీ. బణకార్‌లతో పాటు మాజీ మంత్రులు సీఎం. ఉదాసీ, శోభా కరంద్లాజె, కేంద్ర మాజీ మంత్రి ధనంజయ కుమార్ సహా పలువురు నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తమ పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి సహా పలువురు సీనియర్ నాయకులు గత వారంలో యడ్యూరప్పను లాంఛనంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కాగా కేజేపీతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారని పేర్కొంటూ శివమొగ్గ ఎంపీ, యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర, సీఎం. ఉదాసీ తనయుడు, హావేరి ఎంపీ శివ కుమార్‌లను బీజేపీ పార్లమెంటరీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేజేపీ విలీనం నేపథ్యంలో ఆ సస్పెన్షన్ రద్దు చేయాలని రాష్ట్ర శాఖ పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేసింది. బీజేపీలో చేరిన తర్వాత యడ్యూరప్పను పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడితో పాటు జాతీయ కార్యవర్గం ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించనున్నారు. ఈ నెల 18 నుంచి ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. ఆ సందర్భంగా యడ్యూరప్ప పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సహా అగ్ర నేతలను కలుసుకోనున్నారు. -
యడ్డి చేరికకు పచ్చజెండా!
= ఢిల్లీలో పార్టీ పెద్దల నిర్ణయం = అయినా సంక్రాంతి వరకూ ఆగాల్సిందే = ఆలోగా ఆద్వానీతో సయోధ్యకు యత్నాలు = ఎలాంటి షరతు లేకుండా చేరేందుకు ‘అప్ప’ సమ్మతి! సాక్షి, బెంగళూరు : కర్ణాటక జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప తిరిగి బీజేపీలోకి రావడానికి మార్గం సుగమమైంది. ఇప్పటికిప్పుడే కాకుండా సంక్రాంతి తర్వాత ఆయన సొంత గూటికి చేరుకోనున్నారు. ఈమేరకు పార్టీ హై కమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన బీజేపీ ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ఈ విషయంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో గుజరాత్ యడ్డి చేరికకు పచ్చజెండా! ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సీనియర్ నేతలైన ఎల్.కే అద్వానీ, సుష్మాస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం తర్వాత యడ్డి విషయం కమల నాథుల మధ్య చర్చకు వ చ్చింది. దేశమంతటా కాంగ్రెస్ వ్యతిరేక గాలి వీస్తున్న తరుణంలో కర్ణాటకలో దాని నుంచి పూర్తి స్థాయి లాభం పొందాలంటే యడ్యూరప్పను చేర్చుకోక తప్పదని రాష్ట్రం నుంచి వెళ్లిన బీజేపీ నాయకులు మాజీ సీఎం శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం అర్.అశోక్ పెద్దల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగే వర్గాల్లో మొదటిస్థానంలో ఉన్న లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ‘అప్ప’ను తప్పక పార్టీలోకి తీసుకోవలసిన అవసరం ఉందని వారు పునరుద్ఘాటించారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే సందర్భంలో కర్ణాటకలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో యడ్డి వేరుకుంపటి పెట్టుకోవడం వల్ల పార్టీ ఎలా నష్టపోయింది కూడా వారిరువురూ కమలనాథులకు వివరించారట. యడ్యూరప్ప కూడా రాజకీయంగా తనకు సన్నిహుతుడైన నరేంద్రమోడీని ప్రధాన మంత్రిగా చేయడం కోసం తన వ ంతు కృషి చేస్తానని పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. దీంతో పార్టీ హై కమాండ్ ‘అప్ప’ చేరికకు అంగీకరించిన ట్లు తెలుస్తోంది. అందరు పెద్దలు అంగీకరించినా బీజేపీ కురువృద్ధుడైన అద్వానీ మాత్రం ఇంకా సుముఖత వ్యక్తం చేయకపోవడం వల్లే వెంటనే కాకుండా సంక్రాంతి తర్వాత యడ్యూరప్ప బీజేపీ తీర్థం తీసుకోవడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతలోపు అద్వానీని ప్రసన్నం చేసుకోవచ్చని... అవసరమనుకుంటే యడ్డితోనే అద్వానీతో నేరుగా మాట్లాడించవచ్చనేది రాష్ట్ర నాయకుల ఆలోచన. ధనుర్మాసం వెళ్లిన తర్వాత అంటే సంక్రాంతి తర్వా త యడ్యూరప్ప బీజేపీలో చేరుతారనే వాదన అటు బీజేపీతో పాటు కేజేపీలో వినిపిస్తోంది. ఎటువంటి షరతు విధించకపోవడం వల్లే! ఇప్పటి వరకూ తనకు బీజేపీలో ఉన్నత పదవితోపాటు కేజేపీలోని మిగిలిన నాయకులకు పార్టీలో ‘సరైన స్థానం’ కోసం పట్టుబట్టిన యడ్యూరప్ప తన పట్టును సడలించి ఎటువంటి షరతులు విధించకపోవడం వల్లే ఆయన సొంతింటికి మార్గం సుగమం అయినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ గత సోమవారం శివమొగ్గ జిల్లాలోని సొరబలో యడ్డితో ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో వారిద్దరి మధ్య ‘భేషరతు విషయమై’ ఒప్పందం కుదరడం వల్లే యడ్డి చేరికకు మార్గం సుగమమైనట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు.