సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో నాలుగో స్థానాన్ని గెలుచుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రారంభించింది. జేడీఎస్‌తో కలసి ఆ స్థానాన్ని గెలుచుకునే దిశగా పావులు కదుపుతోంది. జూన్ 19న నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. శాసన సభలో సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్ సులభంగా రెండు స్థానాలు, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకుంటుంది.
ఎమ్మెల్యేల నుంచి 46 తొలి ప్రాధాన్యత ఓట్లు లభించిన అభ్యర్థి తొలి విడత లెక్కింపులోనే విజయం సాధిస్తాడు. ప్రస్తుతం శాసన సభలో కాంగ్రెస్‌కు 122 మంది సభ్యులున్నారు. ఇద్దరు అభ్యర్థులకు 92 ఓట్లు పోను 30 మిగులు ఓట్లు ఉంటాయి. కాగా, జేడీఎస్‌కు 40 మంది సభ్యులున్నారు. సొంతంగా ఓ అభ్యర్థిని గెలుచుకునే సంఖ్యా బలం ఆ పార్టీకి లేదు. కనుక జేడీఎస్ సహకారంతో కాంగ్రెస్ మరో స్థానాన్ని కైవశం చేసుకోడానికి వ్యూహాలు రచిస్తోంది.
బీజేపీకి 43 మంది సభ్యులున్నారు. బీఎస్‌ఆర్ సీపీ ఇంకా బీజేపీలో విలీనం కాలేదు. ఆ లాంఛనాలన్నీ పూర్తవడానికి కొంత సమయం పడుతుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శ్రీరాములు ఇదివరకే తెలిపారు. అయితే ఆ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడానికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవు. కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ) అధ్యక్షుడు యడ్యూరప్ప సహా ముగ్గురు ఎమ్మెల్యేలు ఇదివరకే బీజేపీలో చేరారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంకా కేజేపీలోనే కొనసాగుతున్నారు. కనుక బీజేపీ కూడా ఒక సీటును సులభంగా గెలుచుకుంటుంది.
పాతవారికే చోటు..
ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఎస్‌ఎం. కృష్ణ, బీకే. హరిప్రసాద్‌లను తిరిగి ఎగువ సభకు పంపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మూడో అభ్యర్థి బీజేపీ వ్యక్తి కాగా, నాలుగో అభ్యర్థిగా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ. చిదంబరం కాంగ్రెస్ తరఫున రంగ ప్రవేశం చేయనున్నట్లు సమాచారం. జేడీఎస్ మద్దతుతో ఆయన ఎగువ సభలో ప్రవేశించాలని ఉవ్విళ్లూరుతున్నారు.
జేడీఎస్ అధినేత హెచ్‌డీ. దేవెగౌడ 1996లో ప్రధాని పదవిని చేపట్టినప్పుడు చిదంబరం ఆయన మంత్రి వర్గంలో ఆర్థిక శాఖను నిర్వహించారు. ఇప్పటికీ వారి మధ్య సత్సంబంధాలున్నాయి. రాజ్యసభకు వెళ్లాలన్న తన అభిప్రాయాన్ని ఆయన ఫోన్ ద్వారా ఇటీవల దేవెగౌడ చెవిన వేసినట్లు తెలిసింది. వచ్చే వారం బెంగళూరుకు వచ్చి కలుసుకుంటానని కూడా చెప్పినట్లు సమాచారం. మొత్తానికి దేవెగౌడ సమ్మతిస్తేనే చిదంబరానికి ఎగువ సభ యోగం పడుతుంది.
అయితే జేడీఎస్ మద్దతును కోరాలనుకోవడంపై కాంగ్రెస్‌లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర ఏకీకరణ సమితికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు కేజేపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడగట్టుకుని, ద్వితీయ ప్రాధాన్యతా ఓటు ద్వారా నాలుగో స్థానాన్ని చేజిక్కించుకోవచ్చని కాంగ్రెస్‌లోని జేడీఎస్ వ్యతిరేకులు లెక్కలు చెబుతున్నారు. ఇదిలాఉంటే కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకుడు కుపేంద్ర రెడ్డి జేడీఎస్ మద్దతుతో రాజ్యసభలో ప్రవేశించాలనుకుంటున్నారు. జేడీఎస్ మద్దతునిస్తే, విజయానికి అవసరమైన మిగిలిన ఆరు ఓట్లను ఎలాగో తెచ్చుకోగలుగుతానని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
నాలుగో స్థానంపై కాంగ్రెస్ కన్ను
Published Thu, May 22 2014 4:01 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement