కాంగ్రెస్ అభ్యర్థులు వీరే...
- ఎన్నికలకు జేడీఎస్ దూరం
- ‘ఉప’ ఖర్చు భరించలేమన్న దేవెగౌడ
- ఇతర పార్టీలకు మద్దతు కూడా ఉండదని ప్రకటన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో మూడు శాసన సభ స్థానాలకు ఈ నెల 21న జరుగనున్న ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. బళ్లారి గ్రామీణ నియోజక వర్గానికి ఎన్‌వై. హనుమంతప్ప సోదరుడు ఎన్.వై.గోపాలకృష్ణ, శివమొగ్గ జిల్లా శికారిపురకు మాజీ ఎమ్మెల్యే శాంత వీరప్ప గౌడ, చిక్కోడి-సదలగ స్థానానికి మాజీ మంత్రి ప్రకాశ్ హుక్కేరి తనయుడు గణేశ్ హుక్కేరి పేర్లను కేపీసీసీ అధిష్టానానికి సిఫార్సు చేసింది. ఎన్.వై. గోపాలకృష్ణ చిత్రదుర్గం జిల్లా మొలకాల్మూరు మాజీ ఎమ్మెల్యే.
గత ఎన్నికల్లో ఈయన ఓటమిపాలయ్యారు. స్థానికేతరుడైన గోపాలకృష్ణను బళ్లారి గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడంతో స్థానిక నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాగా, బీజేపీ ఇదివరకే తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. బళ్లారి గ్రామీణ నియోజక వర్గానికి ఓబులేశు, శికారిపురకు మాజీ సీఎం యడ్యూరప్ప తనయుడు బీవై. రాఘవేంద్ర, చిక్కోడి-సదలగ స్థానానికి మహంతేశ్ కవటగి మఠలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బళ్లారి నుంచి బీ. శ్రీరాములు, శివమొగ్గ నుంచి యడ్యూరప్ప, చిక్కోడి నుంచి ప్రకాశ్ హుక్కేరిలు ఎన్నికవడంతో ఉప ఎన్నికలు జరపాల్సి వచ్చింది.
జేడీఎస్ దూరం
ఈ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ. దేవెగౌడ తెలిపారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలు ధనవంత పార్టీలని తెలిపారు. వాటితో సమానంగా తమ పార్టీ ఎన్నికల్లో ఖర్చు చేయలేదని చెప్పారు. కనుక ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మంచిదని అనుభవ పూర్వకంగా చెబుతున్నానని వెల్లడించారు. అంతమాత్రాన తాము ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి మద్దతునిచ్చే ప్రసక్తే ఉండబోదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో తమ పార్టీ కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుందని తెలిపారు. కాగా లోక్‌సభ ఎన్నికల అనంతరం పార్టీ బలోపేతంప దష్టి సారించలేదని చెబుతూ, త్వరలో రాష్ట్ర పర్యటన చేపడతానని చెప్పారు. ఇందులో భాగంగా ఆగస్టులో నగరంలోని ప్యాలెస్ మైదానంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
పోటీ చేయకూడదనుకున్నా...
ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ సీనియర్ నాయకులు నిర్ణయించారని సమావేశంలో పాల్గొన్న మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. అయితే పోటీ చేయాలని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు. స్థానిక నాయకులతో చర్చించి దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.