‘మధ్యంతరం’ తప్పదు
- సిద్ధు ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు
- కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, సిద్ధరామయ్య ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ అన్నారు. రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందని కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బెంగళూరులోని సర్దార్ పటేల్ భవనంలో బీజేపీ ఎస్‌సీ, ఎస్‌టీ విభాగం ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్ త్వరలో తన పుట్టిన రోజు వేడుకను జరుపుకోబోతున్నారని, అదే రోజు పార్టీలో తనకున్న బలాన్ని ప్రదర్శించేందుకు ఆయన సన్నాహాలు చేయడంతో పాటు సిద్ధరామయ్యను పదవి నుంచి తప్పించేందుకు వ్యూహం పన్నారని విశ్లేషించారు. ఇది వాస్తవమైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత లేకుండా పోయిందని అన్నారు. సీఎం మాటను మంత్రులెవరూ లెక్క చేయడం లేదని తెలిపారు. దళితుల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం దళితుల సంక్షేమానికి ఎలాంటి పథకాలు తీసుకురావడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఎస్సీ వర్గానికి చెందన బీజేపీ నాయకులు గోవిందకారజోళ, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.