sadanandagauda
-
వేర్వేరు హైకోర్టుల ఏర్పాటును పరిశీలించండి...
ఉమ్మడి హైకోర్టు సీజేకు కేంద్ర మంత్రి సదానందగౌడ లేఖ ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది గచ్చిబౌలిలో భవనాన్ని కూడా గుర్తించింది లేఖలో సీజే దృష్టికి తీసుకొచ్చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకూ రెండు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తాకు కేంద్ర న్యాయశాఖ మంత్రి డి.వి.సదానందగౌడ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన రెండు రోజుల క్రితం జస్టిస్ సేన్‌గుప్తాకు ఓ లేఖ రాశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా గత ఏడాది జూన్ 2న ఏర్పడిన విషయం మీకు తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సచివాలయం, శాసనసభ, మండలి భవనాలను రెండు రాష్ట్రాలకూ విభజించారు. ఇవి రెండూ అన్ని సౌకర్యాలతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో కొనసాగుతున్నాయి. అయితే రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటు మాత్రం జరగలేదు. తెలంగాణకు చెందిన న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రానికి వేరే హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న రెండు రాష్ట్రాలకూ రెండు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటు చేయాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. హైకోర్టుకు గచ్చిబౌలి ప్రాంతంలో 4.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఓ బహుళ అంతస్తుల భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి, అందులో అన్ని సౌకర్యాల కల్పనకు ముందుకొచ్చింది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో రెండు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటుకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రత్యేక హైకోర్టు డిమాండ్‌తో న్యాయవాదులు గత కొంత కాలంగా కోర్టు విధులను బహిష్కరించారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో తగిన చర్యలు తీసుకుంటామన్న హామీతో వారు ఆందోళన విరమించారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాలకూ రెండు వేర్వేరు హైకోర్టులను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించగలరు’ అని సదానందగౌడ తన లేఖలో పేర్కొన్నారు. -
స్పీడ్ అందుకోలేదని..
సదానందగౌడ శాఖ మార్పు రైల్వే నుంచి న్యాయశాఖకు మోదీ కర్ణాటక కు అన్యాయం చేశారన్న ఖర్గే సదానంద ఏ శాఖనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారన్న అశోక్ బెంగళూరు : ఊహించనంత చురుగ్గా పనిచేయలేక పోవడం.. రైల్వే శాఖలో అనుకున్నంత వేగంగా మార్పులను చేపట్టకపోవడం.. కుమారుడు కార్తీక్‌గౌడ, నటి మైత్రేయిగౌడ మధ్య తలెత్తిన వివాదం.. ఇవన్నీ కలిసి సదానందగౌడను శక్తివంతమైన రైల్వే శాఖ నుంచి దూరం చేశాయి. ఆదివారం జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా సదానంద గౌడ తన వద్ద ఉన్న రైల్వేశాఖను చేజార్చుకున్న విషయం తెలిసిందే. కాగా కేంద్ర న్యాయశాఖ మంత్రిగా సదానందగౌడ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రత్యేక బడ్జెట్‌తో పాటు కేబినెట్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న రైల్వేశాఖ నుంచి పెద్దగా ప్రాముఖ్యత లేని న్యాయశాఖను సదానందగౌడకు కేటాయించడంపై రాష్ట్రానికి చెందిన నేతలు స్పం దించారు. సదానందగౌడ నుంచి రైల్వేశాఖను లాక్కొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తప్పు చేశారని పార్లమెంట్లో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. గుల్బర్గాలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...‘తన ఆప్తులకు మేలు చేకూర్చేందుకు గాను కర్ణాటకకు చెందిన పార్లమెంటు సభ్యుడికి కేటాయించిన శక్తివంతమైన రైల్వేశాఖను లాక్కోవడం ఎంత మాత్రం సరికాదు. ప్రధాని నరేంద్ర మోదీ వన్‌మ్యాన్ షో తరహాలో ప్రవర్తిస్తున్నారు. తనవల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందనే భావనతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారు. ప్రజా ప్రభుత్వంలో ఏకచత్రాధిపత్యంలా వ్యవహరించడం సరికాదు. ఈ మంత్రివర్గ విస్తరణలో కర్ణాటకకు తీవ్ర అన్యాయమే జరిగింది’ అని పేర్కొన్నారు. ఏశాఖనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు.. అశోక్ ఇక సదానందగౌడ శాఖ మార్పుపై కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్ స్పందించారు. సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ....‘ రైల్వేశాఖ నుంచి సదానంద గౌడను తప్పించడం కాస్తంత ఇబ్బందికరమైన అంశమే. అయితే ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే ఏ నిర్ణయానికైనా ఓ కారణమంటూ ఉంటుంది. కేంద్ర న్యాయశాఖ కూడా ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న శాఖ. ఇప్పటి వరకు రైల్వేశాఖను చాలా సమర్థవంతంగా నిర్వహించిన సదానందగౌడ ఏ శాఖనైనా సమర్థవంతంగా నిర్వహించగలరనే నమ్మకం నాకుంది’ అని అన్నారు. -
కార్తీక్ నా భర్త
వర్ధమాన నటి మైత్రేయి న్యాయం జరిగే వరకూ పోరాటం మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు 420 సెక్షన్ కింద కార్తీక్‌పై కేసు నమోదు వాస్తవమని తేలితే చర్యలు తప్పవు : సిద్ధు సాక్షి, బెంగళూరు : కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ తన భర్త అని వర్ధమాన నటి మైత్రేయి స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని ఆమె తేల్చి చెప్పారు. గురువారం మీడియాతో ఆమె మాట్లాడారు. రెండున్నరేళ్ల క్రితమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, అయితే తాజా ఘటనకు తాను కాంగ్రెస్ కార్యకర్త కావడానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇటీవల తనకు దూరంగా ఉంటున్న కార్తీక్ ఫోన్ చేసి ‘వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయింది, ఇకపై నీతో కలిసి ఉండేందుకు వీలుకాదు. మీడియా ముందుకు వెళ్లొద్దు. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తా’నని చెప్పారని వివరించారు. అయితే తనను భార్యగా అంగీకరించేంత వరకూ న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. కాగా, తనకు జరిగిన అన్యాయంపై బుధవారం రాత్రి ఆర్టీ నగర పోలీస్ స్టేషన్లో మైత్రేయి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కార్తీక్‌గౌడపై ఐపీసీ 376, 420 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం మైత్రేయికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వాస్తవమని తేలితే చర్యలు తప్పవు ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ... మైత్రేయికి అన్యాయం జరిగినట్లు తేలితే దోషులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి తారతమ్యం ఉండబోదని స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించి సదానందగౌడను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వివరణ కోరినట్లు సమాచారం. మైత్రేయికు నోటీస్ జారీ ఫిర్యాదుకు సంబంధించి తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను అందించేందుకు గురువారం మధ్యాహ్నాం 12.30 గంటలకు పోలీస్ స్టేషన్‌కు రావాలని మైత్రేయికి బుధవారం రాత్రి పోలీసులు సూచించారు. అయితే సాయంత్రం మూడు గంటలు దాటిపోయినా ఆమె పోలీస్ స్టేషన్‌కు చేరుకోలేదు. దీనిపై వివరణ కోరుతూ మైత్రేయికి ఆర్టీ నగర పోలీసులు నోటీస్ జారీ చేశారు. కాగా, ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి మాట్లాడుతూ... దర్యాప్తు పూర్తి అయిన తర్వాత వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. ఈ విషయంపై సదానందగౌడతో మాట్లాడినట్లు చెప్పారు. కార్తీక్ గౌడ ఎలాంటి తప్పు చేయలేదని ఆయన వివరించారని పేర్కొన్నారు. -
‘మధ్యంతరం’ తప్పదు
సిద్ధు ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, సిద్ధరామయ్య ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ అన్నారు. రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందని కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బెంగళూరులోని సర్దార్ పటేల్ భవనంలో బీజేపీ ఎస్సీ, ఎస్టీ విభాగం ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్ త్వరలో తన పుట్టిన రోజు వేడుకను జరుపుకోబోతున్నారని, అదే రోజు పార్టీలో తనకున్న బలాన్ని ప్రదర్శించేందుకు ఆయన సన్నాహాలు చేయడంతో పాటు సిద్ధరామయ్యను పదవి నుంచి తప్పించేందుకు వ్యూహం పన్నారని విశ్లేషించారు. ఇది వాస్తవమైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత లేకుండా పోయిందని అన్నారు. సీఎం మాటను మంత్రులెవరూ లెక్క చేయడం లేదని తెలిపారు. దళితుల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం దళితుల సంక్షేమానికి ఎలాంటి పథకాలు తీసుకురావడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఎస్సీ వర్గానికి చెందన బీజేపీ నాయకులు గోవిందకారజోళ, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
సదా వ్యక్తిగత కార్యదర్శిగా పొన్నురాజ్
శివమొగ్గ : కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ వ్యక్తిగత కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి వి. పొన్నురాజ్ నియమితులు కానున్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు అందినట్లు సమాచారం. పొన్నురాజ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందగానే తాను వెళ్లనున్నట్లు చెప్పారు. కాగా, శివమొగ్గ కలెక్టర్‌గా పొన్నురాజ్ రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. -
ప్రజల శ్రేయస్సే లక్ష్యం
కేంద్ర మంత్రులు సదానంద గౌడ, వెంకయ్య నాయుడు, అనంతకుమార్, సిద్దేశ్వర్ కేంద్ర మంత్రుల హోదాలో తొలిసారిగా ఉద్యాన నగరికి రాక ఘనంగా సన్మానించిన బీజేపీ రాష్ర్ట శాఖ ఓపెన్ టాప్ వాహనంలో ఊరేగింపు సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో తమను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని కేంద్ర మంత్రులు సదానందగౌడ, వెంకయ్యనాయుడు, అనంతకుమార్, సిద్దేశ్వర్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రుల హోదాలో శువ్రారం తొలిసారిగా బెంగళూరు వచ్చిన వీరికి రాష్ర్ట పార్టీ స్థానిక ప్యాలెస్ మైదానంలో ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా సదానంద గౌడ మాట్లాడుతూ... ఎంతో నమ్మకంతో ప్రతిష్టాత్మకమైన రైల్వే శాఖను నరేంద్రమోడీ తనకు కేటాయించారన్నారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో రైల్వే లైన్ల పెంపునకు తన వంతు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా దక్షిణభారత దేశ ప్రవేశ ద్వారంగా పేరుగాంచిన కర్ణాటకలో రైల్వే సౌకర్యాలు పెంచాల్సి ఉందన్నారు. ఇప్పటికే కర్ణాటకకు అవసరమైన రైల్వే పనులకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ మంత్రి ఆర్.అశోక్, ప్రహ్లాద్‌జోషి తదితరులు నివేదిక తయారు చేశారన్నారు. వచ్చే జులైలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతకుమార్ మాట్లాడుతూ.. ఈసారి దేశ ప్రజలకు అవ సరమైన విత్తన, ఎరువుల కొరత రానివ్వబోమన్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారన్నారు. దేశంలో అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన రిక్ షాపులను ప్రారంభించనున్నామన్నారు. ‘జన ఔషధ’ పేరుతో పథకాన్ని ప్రారంభించి ప్రాణాంతక వ్యాధులకు వాడే మందుల ధరలు వాటి మార్కెట్ ధరతో పోలిస్తే దాదాపు 40 శాతం తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేది ప్రధాని నరేంద్రమోడీ ఆశయమన్నారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... దేశంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పెంపునకు కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇళ్లను సమకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జీ.ఎం సిద్దేశ్వర మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ఫలితాలు చూస్తుంటే అర్థమవుతోందన్నారు. ఈ ఫలితాలతో బీజేపీపై ఎక్కువ బాధ్యత పెరిగిందన్నారు. తన వల్ల కర్ణాటకకు సాధ్యమైనంత మేరకు మేలు చేకూరుస్తానన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి, మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, జగదీష్ శెట్టర్ తదితరులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మచ్చుకైనా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు వీధి పోరాటాలు చేస్తున్నా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని ఘాటుగా విమర్శలు చేశారు. అపూర్వ స్వాగతం : ప్రధాని నరేంద్రమోడీ మంత్రి వర్గంలో స్థానం సంపాదించి మొదటిసారిగా బెంగళూరు వచ్చిన రాష్ట్రానికి చెందిన సదానందగౌడ, వెంకయ్యనాయుడు, అనంతకుమార్, జీఎం సిద్దేశ్వరకు రాష్ట్ర బీజేపీ శాఖ ఘనంగా స్వాగతించింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓపెన్‌టాప్ వాహన ంలో వారిని పురవీధుల్లో ఊరేగించారు. దారి పొడవునా ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేశారు.