- కేంద్ర మంత్రులు సదానంద గౌడ, వెంకయ్య నాయుడు, అనంతకుమార్, సిద్దేశ్వర్
- కేంద్ర మంత్రుల హోదాలో తొలిసారిగా ఉద్యాన నగరికి రాక
- ఘనంగా సన్మానించిన బీజేపీ రాష్ర్ట శాఖ
- ఓపెన్ టాప్ వాహనంలో ఊరేగింపు
సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో తమను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని కేంద్ర మంత్రులు సదానందగౌడ, వెంకయ్యనాయుడు, అనంతకుమార్, సిద్దేశ్వర్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రుల హోదాలో శువ్రారం తొలిసారిగా బెంగళూరు వచ్చిన వీరికి రాష్ర్ట పార్టీ స్థానిక ప్యాలెస్ మైదానంలో ఘనంగా సన్మానించింది.
ఈ సందర్భంగా సదానంద గౌడ మాట్లాడుతూ... ఎంతో నమ్మకంతో ప్రతిష్టాత్మకమైన రైల్వే శాఖను నరేంద్రమోడీ తనకు కేటాయించారన్నారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో రైల్వే లైన్ల పెంపునకు తన వంతు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా దక్షిణభారత దేశ ప్రవేశ ద్వారంగా పేరుగాంచిన కర్ణాటకలో రైల్వే సౌకర్యాలు పెంచాల్సి ఉందన్నారు. ఇప్పటికే కర్ణాటకకు అవసరమైన రైల్వే పనులకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ మంత్రి ఆర్.అశోక్, ప్రహ్లాద్‌జోషి తదితరులు నివేదిక
తయారు చేశారన్నారు.
వచ్చే జులైలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతకుమార్ మాట్లాడుతూ.. ఈసారి దేశ ప్రజలకు అవ సరమైన విత్తన, ఎరువుల కొరత రానివ్వబోమన్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారన్నారు. దేశంలో అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన రిక్ షాపులను ప్రారంభించనున్నామన్నారు. ‘జన ఔషధ’ పేరుతో పథకాన్ని ప్రారంభించి ప్రాణాంతక వ్యాధులకు వాడే మందుల ధరలు వాటి మార్కెట్ ధరతో పోలిస్తే దాదాపు 40 శాతం తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేది ప్రధాని నరేంద్రమోడీ ఆశయమన్నారు.
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... దేశంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పెంపునకు కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇళ్లను సమకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జీ.ఎం సిద్దేశ్వర మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ఫలితాలు చూస్తుంటే అర్థమవుతోందన్నారు. ఈ ఫలితాలతో బీజేపీపై ఎక్కువ బాధ్యత పెరిగిందన్నారు. తన వల్ల కర్ణాటకకు సాధ్యమైనంత మేరకు మేలు చేకూరుస్తానన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి, మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, జగదీష్ శెట్టర్ తదితరులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మచ్చుకైనా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు వీధి పోరాటాలు చేస్తున్నా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని ఘాటుగా విమర్శలు చేశారు.
అపూర్వ స్వాగతం : ప్రధాని నరేంద్రమోడీ మంత్రి వర్గంలో స్థానం సంపాదించి మొదటిసారిగా బెంగళూరు వచ్చిన రాష్ట్రానికి చెందిన సదానందగౌడ, వెంకయ్యనాయుడు, అనంతకుమార్, జీఎం సిద్దేశ్వరకు రాష్ట్ర బీజేపీ శాఖ ఘనంగా స్వాగతించింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓపెన్‌టాప్ వాహన ంలో వారిని పురవీధుల్లో ఊరేగించారు. దారి పొడవునా ఫ్లెక్సీలు, కటౌట్‌లను ఏర్పాటు చేశారు.