
పండక్కి పామాయిల్ హుళక్కేనా?
- 11 లక్షల కార్డుదారులు ఎదురు చూపు
గుడ్లవల్లేరు : సాధారణ రోజుల్లో తిన్నా తినకపోయినా కనీసం పండగ రోజైనా పాయసం తిని పిండి వంటలు చేసుకోవాలనే పేదవాడి ఆశ నిరాశగానే మిగిలిపోతోంది. పేదలతో సహా సాధారణ, మధ్య తరగతి ప్రజానీకం సాదక, బాధకాలను పట్టించుకోని ప్రభుత్వపాలకులు, అధికారుల అలసత్వమే అందుకు కారణభూతమవుతోంది. దసరాకు ఎలాగో లేదు... ఈ దీపావళి పండుగకయినా రేషను దుకాణాల్లో పామాయిల్ సరఫరా చేస్తారనుకుంటే ఆ పరిస్థితులేవీ కనబడడం లేదు. గత దసరా నుంచే పామాయిల్‌ను పంపిణీ చేస్తామని మౌఖిక ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం ఆ విషయాన్నే మరచిపోయింది.
ఎన్నికల ముందు అమ్మహస్తం పథకం సమయంలో పామాయిల్‌ను అందుకున్న వినియోగదారులకు మళ్లీ రేషను సరుకుల్లో పామాయిల్ కనబడకుండా పోయింది. అమ్మహస్తం పథక నిర్వహణ సమయంలోనే ఆ సరుకులకు ప్రభుత్వం టెండర్లు పిలిచినపుడు కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో కిరణ్ ప్రభుత్వం జిల్లాలో పామాయిల్ పంపిణీ నిలిపేసింది. చంద్రబాబు సర్కార్ వచ్చాక పామాయిల్‌ను వినియోగదారులు అందుకున్న పాపం లేదు.
అమ్మహస్తం పథకం స్థానే వేరే పథకం పేరిట ఏఏ సరుకులు ఇవ్వాలనే విషయంలోప్రభుత్వం తర్జనభర్జన పడుతోందని తెలిసింది. కానీ దసరా నుంచి పామాయిల్ విడుదల చేస్తామన్న ప్రభుత్వం ఈ దీపావళికి కూడా అందించే టట్లుగా కనబడటం లేదు. పామాయిల్‌పై ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకునే లోగా హుదూద్ విలయతాండవంతో ఆ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోందని సమాచారం. నిర్ణయం తీసుకుని ఏపీలో పామాయిల్ పంపిణీ చేసేందుకు జనవరి వరకూ సమయం పడుతుందని సమాచారం.
ఈ విషయమై డీఎస్‌వో సంధ్యారాణిని వివరణ కోరగా ఎన్నికల ముందు నుంచి పామాయిల్ పంపిణీ నిలిచిపోయిందన్నారు. అమ్మహస్తం సరుకుల స్థానే మార్పు చేసి, ఏఏ సరుకులకు ప్రాధాన్యత ఇచ్చి విడుదల చేస్తారనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలిపారు. పామాయిల్ పంపిణీపై ఇప్పటివరకు తమకు ఎలాంటి ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి రాలేదని తేల్చి చెప్పారు.