ప్రొద్దుటూరు టౌన్: ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బంగారుతల్లి పథకాన్ని పక్కన పెట్టేశారు. ఎన్నికలు ముగిసి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఒక్కరికి కూడా డబ్బు ఇవ్వకపోవడంతో ఈ పథకం అమలు సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎంతో ఆర్భాటంగా గతంలో అధికారంలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదటి విడతలో ఆడ పిల్ల పేరున రూ.2,500 ప్రోత్సాహక మొత్తాన్ని జమ చేసింది. తెల్లరేషన్ కార్డులు కలిగిన కుటుంబాల్లో 2013 మే 1 నుంచి పుట్టిన ఆడ పిల్లలకు బంగారుతల్లి పథకం వర్తిస్తుందని, ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు 21 సంవత్సరాలు నిండేలోపు ఒక్కొక్కరికి రూ.2లక్షల వరకు వారి చదువులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది.
బిడ్డ పుట్టగానే రూ.2,500, మొదటి, రెండో ఏడాదిల్లో రూ.1000 చొప్పున, 3-5 ఏళ్ల వరకు రూ.1500 చొప్పున, 6-10 ఏళ్ల వరకు రూ.2వేలు చొప్పున, 11-12 సంవత్సరాల వరకు రూ.2,500 చొప్పున, 13వ సంవత్సరం రూ.2,500, 14-15 సంవత్సరం రూ.3వేలు, 16-17 సంవత్సరాలకు రూ.3,500, 18-21 సంవత్సరాల వరకు రూ.4వేలు చొప్పున, ఇంటర్ పూర్తి చేశాక రూ.50వేలు, డిగ్రీ పూర్తి చేశాక రూ.లక్ష వారి ఖాతాల్లో జమ చేసే విధంగా పథకాన్ని రూపొందించారు. దీని ద్వారా ఆడ పిల్లల భ్రూణ హత్యల నివారణతోపాటు ఆడ పిల్లల సంరక్షణకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నదే లక్ష్యం.
జిల్లా వ్యాప్తంగా బంగారు తల్లి నమోదు, మొదటి విడత జమలు ఇలా
జిల్లా కేంద్రమైన కడపలో 998 మంది దరఖాస్తు చేసుకోగా 953 మందికి అర్హత లభించింది. కేవలం 62 మందికి మాత్రమే రూ.లక్షా 55వేలు మొదటి విడత ఖాతాల్లో జమ చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 685 మంది దరఖాస్తు చేసుకోగా 633 మంది అర్హత పొందారు. వీరిలో 238 మందికి మొదటి విడత రూ.5.95 లక్షలు బ్యాంక్ ఖాతాలో జమ అయింది. బద్వేలు మున్సిపాలిటీలో 367 మంది దరఖాస్తు చేసుకోగా 344 మంది అర్హత పొందారు. వీరిలో 28 మందికి మాత్రమే రూ.70వేలు జమ చేశారు. అలాగే జమ్మలమడుగు మున్సిపాలిటీలో 223 దరఖాస్తు చేసుకోగా 210 మంది అర్హత సాధించారు. వీరిలో 26 మందికి రూ.65వేలు వారి ఖాతాల్లో జమ చేశారు. మైదుకూరు మున్సిపాలిటీలో 232 మందికి 213 మంది అర్హత సాధంచగా కేవలం 12 మందికి రూ.30వేలు వారి ఖాతాల్లో వేశారు. పులివెందుల మున్సిపాలిటీలో 356 మందికి 332 మంది అర్హత సాధించగా వీరిలో 60 మందికి రూ.1.50లక్షలు వారి ఖాతాల్లో జమ అయింది. రాజంపేట మున్సిపాలిటీలో 109 మందికి 101 మంది అర్హత సాధించగా 15 మందికి రూ.37,500 వారి ఖాతాల్లో వేశారు. రాయచోటి మున్సిపాలిటీలో 172 మందికిగాను 164 మంది అర్హత సాధించగా 67 మందికి రూ.1,67,500 ఖాతాల్లో జమ అయింది.
ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 192 మందికిగాను 169 మంది అర్హత సాధించగా 35 మందికి రూ.87,500 వారి ఖాతాల్లో జమ చేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 3334 మంది దరఖాస్తు చేసుకోగా 3199 మంది అర్హత సాధించారు. వీరిలో 543 మందికి మాత్రమే మొదటి విడత రూ.13 లక్షల 59 వేల 500 లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన ఈ పథకం గురించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
బంగారు తల్లీ ఎక్కడమ్మా..!
Published Thu, Mar 5 2015 1:31 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement