పామాయిల్‌కు పాడె కడుతున్న సర్కారు
రాష్ట్రంలో అగచాట్లు పడుతున్న ఆయిల్‌పాం రైతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పామాయిల్ రైతు సమస్యల వలయంలో చిక్కుకున్నాడు. తాను పండించిన ఆయిల్‌పాం గెలలను అమ్ముకోవడానికి అవకాశం లేక ఆర్థికంగా నష్టపోతున్నాడు. ఆయిల్‌పాం సాగు పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నా.. అందుకు తగ్గట్లు గెలలను కొనుగోలు చేయడంలో విఫలమవుతోంది. దీంతో గత్యంతరం లేక రైతులు ప్రైవేటు ఫ్యాక్టరీలకు తెగనమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటుచేయకుండా, ఉన్న ఫ్యాక్టరీని విస్తరించకుండా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోరాటానికి సిద్ధమయ్యారు.
ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో దాదాపు 31 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలున్నాయి. వీటి గెలలను క్రషింగ్ చేసేందుకు ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో క్రషింగ్ ఫ్యాక్టరీ ఉంది. దాని సామర్థ్యం రోజుకు 360 టన్నులే. కానీ సరాసరి రోజుకు వెయ్యి టన్నుల ఆయిల్‌పాం గెలలు వస్తున్నాయి. గెలలు నిల్వ ఉంటే చెడిపోతాయి.. దీన్ని ఆసరాగా తీసుకుంటున్న ఏపీ ఫ్యాక్టరీల యజమానులు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ఫలితంగా రైతులు టన్నుకు రూ. 430 నష్టపోతున్నారు.
రెండో ఫ్యాక్టరీ ఏర్పాటులో ఆలస్యం
రాష్ట్రంలో ఒకే ఒక్క ఫ్యాక్టరీ ఉండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. రెండో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని 2013లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించినా అది కార్యరూపం దాల్చలేదు. దమ్మపేట మండలం అప్పారావుపేటలో రెండో ఫ్యాక్టరీకి సంబంధించి ప్రస్తుతం రూ. 52 కోట్లతో టెండర్లు ఖరారు చేశారు. మలేిసియాకు చెందిన ప్రీ-యూనిక్ కంపెనీకి టెండర్ కట్టబెట్టారు. కానీ కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న అశ్వారావుపేట ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని రెండింతలు పెంచాలని యోచిస్తున్నారు. ఈ ఏడాది నుంచి పంట దిగుబడి 50 శాతం అదనంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విస్తరణ అయినా వేగంగా జరగకపోతే రైతులు మరిన్ని కష్టాలను ఎదుర్కొనక తప్పదు. తాము త్వరలో ముఖ్యమంత్రి, వ్యవసాయమంత్రిని కలసి తమ సమస్యలపై విన్నవిస్తామని దమ్మపేట ఆయిల్‌పాం రైతు సేవా సంఘం అధ్యక్షుడు డి.తాతారావు ‘సాక్షి’కి చెప్పారు.