palm oil
-
పామాయిల్ సాగు చేయండి.. దర్జాగా బతకండి
నల్లగొండ: రైతులు పామాయిల్ సాగు చేస్తే.. మీసం మీద చేయి వేసుకుని దర్జాగా బతకొచ్చని వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. బుధవా రం నల్లగొండలోని ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కె ట్లో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. పామాయిల్ పంట తక్కువ నీటితో సాగవుతుందని చెప్పారు. తాను వంద ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నానని.. మీరు మంత్రి కోమటిరెడ్డిని వెంటబెట్టుకుని వచ్చి చూడవచ్చని రైతులకు సూచించారు. నల్లగొండ జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తే.. ఇక్కడే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని.. మిగిలిన రుణమాఫీని కూడా చేయా లని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం ఎటు పోయిందో.. ఎవరు తిన్నారో కూడా తెలియదని.. రూ.50 వేల కోట్ల అప్పులయితే ఉన్నాయని చెప్పా రు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినవారే ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని విమర్శించారు. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నా మని.. ఆ ధాన్యం కొనుగోలు చేసి రేషన్ కార్డు దారులకు, హాస్టళ్లకు బియ్యం సరఫరా చేస్తామ న్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మళ్లీ మంత్రిగా రావడంతోనే సొరంగ మార్గం పనులు మొద లయ్యాయని, ఆయన హయాంలోనే సొరంగ మార్గం పూర్తవుతుందని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేకపోయిందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని చెప్పారు. -
పామాయిల్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదా? ఎందుకని?
పామాయిల్ అనేది పామ్ పండ్ల నుంచి తీసే ఒక రకమైన కూరగాయ నూనె ఇది. దీన్ని ప్రాసెసింగ్ చేసే ఆహారపదార్థాల్లోనూ, సౌందర్య సాధనాలు, గృహోపకరణాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. తక్కువ ధరలోనే లభించే నూనె కావడంతో చాలామంది దీన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అయితే పామాయిల్ ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతుంటారు. అదీగాక ఈ పామాయిల్ చెట్ల పెంపకం అటవీ నిర్మూలన, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు వంటి పర్యావరణ నష్టాలతో ముడిపడి ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అసలు నిజంగానే ఈ పామాయిల్ ఆరోగ్యానికి మంచిది కాదా? ఎందువల్ల? తదితరాల గురించి సవివరంగా చూద్దాం. ఎలా ఆరోగ్యానికి హానికరం అంటే..ఇందులో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి సుమారు 50% వరకు ఉంటాయి. అందువల్ల దీన్ని అధికంగా ఉపయోగిస్తే శరీరంలో ఎల్డీఎల్ అనే చెడు కొలస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్ చేసిన పామాయిల్లో సంభావ్య ట్రాన్స్ఫ్యాట్స్లు ఏర్పడతాయి. ఇవి గుండెజబ్బులు, మంట, ఇన్సులిన్ నిరోధకతతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.అంతేగాదు అధిక ఉష్ణోగ్రతల వద్ద ప్రాసెస్ చేయడం వల్ల ఆ ఆయిల్లో ఆరోగ్యానికి హానికరమైన కలుషితాలు ఉత్పత్తి అవుతాయి. ఈ సమ్మేళనాలు కేన్సర్ కలిగించేవని పరిశోధనల్లో తేలిందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు జంతు అధ్యయనంలో మూత్రపిండాలు, కాలేయం సంబంధ సమస్యలను కలిగిస్తుందని తేలిందని వెల్లడించారు. కొన్ని అధ్యయనాల్లో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్‌లో ఈ పామాయిల్ శరీరంలో మంటను పెంచుతుందని తేలింది కూడా. దీర్ఘకాలిక మంట అనేది గుండె జబ్బులు, మధుమేహం, కేన్సర్లతో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పామాయిల్‌ను కలిగి ఉండే ఆహారాలు తరుచుగా ప్రాసెస్ చేసినవి, కేలరీలు దట్టమైనవి. అందువల్ల తరుచుగా ఇవి తినడం వల్ల బరువు పెరిగి ఊబకాయానికి దారితీస్తుంది. పైగా టైప్ 2 మధుమేహం, గుండెజబ్బులు, కేన్సర్ వంటి దీర్ఘకాలికి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే పామాయిల్ ఉత్పత్తి ప్రక్రియలో పురుగుమందుల అవశేషాలు, ఇతర పర్యావరణ కలుషితాలు కలిగి ఉండవచ్చు. ఇది ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుంది. ముడి పామాయిల్లో విటమిన్ ఈ, బీటా కెరోటిన్ వంటి ప్రయోజనకరమైన పోషకాలు ఉంటాయి. అయినప్పటికీ ఆహార ఉత్పత్తులలో ఉపయోగించే చాలా పామాయిల్ శుద్ధి చేయబడిందే. దీనిలో ప్రయోజనకరమైన పోషకాలు ఉండనే ఉండవని చెబుతున్నారు. పామాయిల్ మితంగా వినియోగిస్తే సమతుల్య ఆహారంలో భాగం కావచ్చు. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారని చెబుతున్నారు నిపుణులు. అయితే ఏదీఏమైనా పామాయిల్ కంటే ఆలివ్, కొబ్బరి లేదా అవకాడో వంటి ఆరోగ్యకరమైన వంట నూనెలకే ప్రాధాన్యత ఇవ్వమని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: పీసీఓసీ ఉంటే పాల ఉత్పత్తులు నివారించాలా..?) -
ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు మంచి లాభాలు
-
‘పామ్’ తోటల ఖమ్మం
సాక్షిప్రతినిధి, ఖమ్మం : రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్ పామ్ సాగుకు చిరునామాగా మారుతోంది. గత పదిహేనేళ్లుగా పామ్ తోటలు సాగుచేసే రైతులు నెమ్మదిగా పెరుగుతున్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా పామాయిల్‌కు డిమాండ్ ఉండటంతో ప్రభుత్వం కూడా రైతులకు రాయితీలు కల్పిస్తూ ఈ పంట సాగును ప్రోత్సహిస్తోంది. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఖమ్మంలో 17,834 ఎకరాల్లో రైతులు పామాయిల్ సాగు చేయగా.. ప్రస్తుతం అది 73,938 ఎకరాలకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఈ పంట సాగు ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో సాగుకు అనుకూలమైన వాతావరణం, నేలలు ఉండటంతో ఒక వైపు పంట సాగు విస్తరిస్తుండగా, పామాయిల్‌ను ఉత్పత్తిచేసే ఫ్యాక్టరీలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేటల్లో టీఎస్ ఆయిల్‌ఫెడ్ కంపెనీ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసింది. అలాగే కొత్తగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మరో ఐదు వరకు ఫ్యాక్టరీలు రానున్నాయి. సాగు విస్తీర్ణం పెంపుపై ప్రభుత్వాల దృష్టి.. గ్లోబల్ ఈడిబుల్ ఆయిల్ మార్కెట్లో వ్యాపారం సాగే తొమ్మిది ప్రధాన నూనెల్లో పామాయిల్ ఒకటి. కాగా, ప్రపంచ మార్కెట్లో ఇండోనేసియా, మలేసియా మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రపంచ ముడి పామ్ ఆయిల్ ఉత్పత్తిలో ఈ రెండు దేశాల నుంచి 90 శాతం వరకు వాటా ఉంది. ప్రపంచ దేశాలతోపాటు మన దేశంలోనూ పామాయిల్‌కు డిమాండ్ పెరగడంతో ఇక్కడ కూడా సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రస్తుతం తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగవుతోంది. 2020 వరకు తెలంగాణలో టీఎస్ ఆయిల్‌ఫెడ్, గోద్రెజ్ ఆగ్రోవెట్, రుచిసోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే మూడు కంపెనీలు ఉండగా, ప్రస్తుతం వీటితోపాటు మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఎస్ ఆయిల్‌ఫెడ్, గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీల ద్వారా ఫ్యాక్టరీ జోన్లలో నర్సరీలు కూడా ఏర్పాటయ్యాయి. ప్రాసెసింగ్ ప్లాంట్లకు ప్రాధాన్యం.. పామాయిల్ దీర్ఘకాల పంట కావడంతో దేశీయంగా నూనె లభ్యతను పెంపొందించే ప్రక్రియలో ఆయిల్‌పామ్ సాగు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందుకోసం ప్రభుత్వాలు సాగుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాయి. 2000 సంవత్సరంలో ఈ పంట 17,834 ఎకరాల్లో సాగవగా, 2020 నాటికి 42,899 ఎకరాలకు, ప్రస్తుతం 73,938 ఎకరాలకు చేరుకుంది. సాగు విస్తీర్ణం పెరగడంతో ప్రభుత్వం ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చింది. డిమాండ్ పెరగడంతో ధర కూడా పెరుగుతూ వచ్చింది. 2010లో టన్ను గెలల ధర రూ.సగటున రూ.5,136 ఉండగా 2022 నాటికి రూ.18,069కి చేరింది మొదట్లో రెండు ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి.. 2005లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా అశ్వారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. తొలుత 5 టన్నుల సామర్థ్యంతో ప్రారంభించగా, పలు దఫాలుగా సామర్థ్యం పెరుగుతూ, ప్రస్తుతం 60 టన్నులకు చేరింది. ఇక్కడ పామాయిల్ గెలలను 120 నుంచి 160 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు స్టీమ్ చేస్తారు. ఆ తర్వాత యంత్రాలతో గెలల నుంచి ముడి నూనెను తీసి, నేరుగా పైపులైన్ల ద్వారా పెద్ద ట్యాంకుల్లోకి పంపి నిల్వ ఉంచుతారు. ఇలా నిల్వ చేసిన క్రూడాయిల్‌ను లారీ ట్యాంకర్లలో ప్రాసెస్ యూనిట్లకు తరలిస్తారు. స్టీమ్ చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను, నూనె గింజలను (నెట్) వేరు చేస్తారు. గెలల వ్యర్థాలను టన్నుల లెక్కన ఇతర అనుబంధ ఫ్యాక్టరీలకు విక్రయిస్తారు. అశ్వరావుపేట తర్వాత దమ్మపేట మండలం అప్పారావుపేటలో 2017 ఏప్రిల్‌లో మరో ఫ్యాక్టరీ ప్రారంభమైంది. రూ.80 కోట్ల వ్యయం, మలేసియా టెక్నాలజీతో అత్యాధునిక పరికరాలను ఉపయోగించి దీనిని నిర్మించారు. తొలుత ఇది 60 టన్నుల సామర్థ్యంతో ప్రారంభం కాగా.. ప్రస్తుతం 90 టన్నులకు పెరిగింది. ఈ ఫ్యాక్టరీకి 2018లో రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ రంగ విభాగంలో ఉత్తమ ఫ్యాక్టరీ అవార్డు దక్కింది. అదే ఏడాది కేంద్రం ద్వారా గ్లోబల్ అవార్డు వచ్చింది. కొత్త ఫ్యాక్టరీల నిర్మాణం.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 3 ఫ్యాక్టరీలు ఉండగా.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరిగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, అశ్వాపురం మండలం బి.జె.కొత్తూరు, ములకలపల్లి గ్రామాల్లో నూతనంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు కానున్నాయి. వీటి ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలో పామాయిల్ తోటల సాగు మరింతగా విస్తరించి దేశీయంగా నెలకొన్న కొరతను తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈయనే సాగు మొదలు పెట్టింది.. 1991లో ప్రభుత్వ సబ్సిడీ ఏమీ లేకుండా.. అశ్వారావుపేటకు చెందిన పిన్నమనేని మురళి అనే రైతు ఆయిల్‌పామ్ పంట సాగును ప్రయోగాత్మకంగా మొదట ఐదు ఎకరాల్లో ప్రారంభించారు. మొదట్లో ఆయన మొక్క రూ.25 చొప్పున కొనుగోలు చేశారు. సమీపంలో గెలల కొనుగోలు, ఫ్యాక్టరీ లేనప్పటికీ.. ఆయన ఈ పంట సాగు చేయడంతో మిగిలిన రైతులు కూడా ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం మురళి 100 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండటం, ఫ్యాక్టరీలు అందుబాటులో ఉండటంతో ఈ పంట ఆదాయం మెరుగ్గా మారిందని మురళి చెప్పారు. లాభదాయకమైన పంట.. పామాయిల్ సాగు ద్వారా రైతులకు ఏటా లక్షల్లో ఆదాయం వస్తుంది. పంట సాగు చేసిన నాలుగేళ్లలో ఆదాయం ప్రారంభమవుతుంది. సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇస్తోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పామాయిల్ సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఫ్యాక్టరీలు సైతం రైతులకు అందుబాటులోకి వస్తున్నాయి. –జినుగు మరియన్న, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం ఎకరం ఆయిల్‌పామ్‌సాగుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ.. మొక్కలకు(ఎకరానికి 57 మొక్కలు): రూ.11,600 ఎరువులు, అంతర పంటలకు ఏడాదికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లు: రూ.16,800 బిందు సేద్యం: రూ.22,518 మొత్తం రూ. 50,918 -
అధిక దిగుబడికి..ఎత్తుమడుల పద్ధతి
-
రైతులకు వరంగా పామాయిల్ సాగు
-
పామ్ ఆయిల్ పంటకు ప్రభుత్వం భారీగా రాయితీలు.. పెరిగిన డిమాండ్
-
అందుకే సన్‌రైజర్స్‌తో జట్టు కట్టాం.. ఇక ముందు ప్రత్యేక దృష్టి పెడతాం
సాక్షి, హైదరాబాద్: పామాయిల్ ఉత్పత్తుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నవభారత్ లిమిటెడ్ (ఎన్బీఎల్) కంపెనీ ఇకపై మరింత విస్తరణకు సిద్ధమైంది. ఇప్పటి వరకు దాదాపు పూర్తిగా హోల్‌సేల్ అమ్మకాలకే పరిమితమైన ఎన్బీఎల్ మున్ముందు రిటెయిలింగ్ ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఐపీఎల్లో హైదరాబాద్ టీమ్ ‘సన్‌రైజర్స్’తో ఎన్బీఎల్ జత కట్టి తమ ప్రచార కార్యక్రమాలను వేదికగా మార్చుకుంది. తాజా సీజన్లో రైజర్స్‌కు ‘సింప్లిఫై పార్ట్నర్’గా ఎన్బీఎల్ వ్యవహరించింది. బుధవారం ఎన్బీఎల్ బృందంతో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రైజర్స్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌తో పాటు కోచ్‌లు డేల్ స్టెయిన్, ముత్తయ్య మురళీధరన్, హేమంగ్ బదానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్బీఎల్ సంస్థ పురోగతి గురించి సీఈఓ శ్రీనివాస ప్రసాద్ వెల్లడించారు. ‘రూ. 40 కోట్లతో మొదలైన మా టర్నోవర్ ప్రస్తుతం రూ. 1700 కోట్లకు చేరింది. ఎక్కువగా పామాయిల్ ఉత్పత్తులపైనే దృష్టి పెట్టాం. సూపర్మతి ఆయిల్‌కు మంచి గుర్తింపు ఉంది. రిఫైనరీ ద్వారా రోజుకు సుమారు 850 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు తయారు చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఆయిల్ రంగంలో ఇతర సంస్థలకు పోటీగా సన్‌ఫ్లవర్, రైస్‌బ్రాన్ ఆయిల్ల రంగంలో కూడా అడుగుపెడుతున్నాం. రిటైల్‌పై ఇక ముందు ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనం ఆసక్తి చూపించే ఐపీఎల్ ఫ్రాంచైజీతో జత కట్టి ప్రచారం చేశాం’ అని వివరించారు. -
పామాయిల్ సాగుకు 4.36 లక్షల హెక్టార్లు అనుకూలం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా 27.99 లక్షల హెక్టార్ల భూమి పామాయిల్ సాగుకు యోగ్యంగా ఉండగా, అందులో 4.36 లక్షల హెక్టార్లు తెలంగాణలో ఉన్నాయని పేర్కొన్నారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్– ఆయిల్‌పామ్ కింద పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి వంటి జిల్లాలో ఈ భూమి విస్తరించి ఉందని, పామాయిల్ సాగు తెలంగాణ రైతులకు పెద్దఎత్తున లబ్ధిని చేకూరుస్తుందని వెల్లడించారు. పామాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశంలో 2019–20 నాటికి 3.5 లక్షల హెక్టార్లలో ఉన్న పామాయిల్ సాగును 2025–26 నాటికి 10 లక్షల హెక్టార్లకు పెంచాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈశాన్య రాష్ట్రాలలో 3.28 లక్షల హెక్టార్ల భూమిని, మిగిలిన రాష్ట్రాలన్నీ కలిపి 3.22 లక్షల హెక్టార్ల భూమిని పామాయిల్ సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు. ఈ పథకం అంచనా వ్యయం రూ. 11,040 కోట్లు కాగా, అందులో ఈశాన్య రాష్ట్రాలకు 90:10 ప్రాతిపదికన, మిగిలిన రాష్ట్రాలకు 60:40 ప్రాతిపదికన భారత ప్రభుత్వం రూ. 8,844 కోట్లు ఖర్చు చేయనుందని వివరించారు. మొత్తం వ్యయంలో రూ. 5,170 కోట్లను తెలంగాణ వంటి జనరల్ కేటగిరీ రాష్ట్రాలకు కేటాయించగా అందులో భారత ప్రభుత్వం చెల్లించవలసిన వాటా రూ.3,560 కోట్లుగా ఉందని తెలిపారు. ఎస్సీ 17, ఎస్టీలకు 8 శాతం చొప్పున లబ్ధి రైతులకు లబ్ధి చేకూర్చటమే ప్రధాన ఉద్దేశంగా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్– ఆయిల్‌పామ్ మార్గదర్శకాలను రూపొందించారు. ఈ పథకం కింద వనరులన్నింటినీ 17 శాతం ఎస్సీలకు, 8 శాతం ఎస్టీలకు లబ్ధి చేకూర్చటానికి కేటాయించారు. జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ/ఎస్టీలకు కేటాయింపులు చేయటానికి వీలు కల్పించారు. -
పండుగ తర్వాత షాకిచ్చిన కేంద్రం.. పెరగనున్న వంటనూనె ధరలు!
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాకిచ్చింది. పామాయిల్ దిగుమతి సుంకాలను 6-11 శాతం పెంచనుంది. తాజాగా నోటిఫికేషన్ ద్వారా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. ఆయిల్‌పై (Oil) దిగుమతి సుంకాల పెంపు నిర్ణయం వల్ల వినియోగదారులపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కందుల గింజల ధరల కారణంగా అల్లాడుతున్న రైతులను ఆదుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ ప్రకారం.. ముడి పామాయిల్ (CPO) దిగుమతి సుంకం టన్నుకు 858 డాలర్ల నుంచి 952డాలర్లకి పెరిగింది. అలాగే ఆర్బీడీ (RBD) పామాయిల్ దిగుమతి సుంకం టన్నుకు 905డాలర్ల నుంచి 962డాలర్లకు ఎగసింది. ఇతర పామ్ ఆయిల్ టారిఫ్ కూడా టన్నుకు 882 డాలర్ల నుంచి 957 డాలర్లకు పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ధరల నియంత్రణలో భాగంగా కేంద్రం ముడి పామాయిల్‌పై ప్రాథమిక దిగుమతి పన్నును రద్దు చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎడిబుల్ ఆయిల్స్, బంగారం, వెండి దిగుమతి ధరలను ప్రభుత్వం సవరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని ఎక్కువగా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న భారత్‌కు అధిక భాగం రష్యా, ఉక్రెయిన్, మలేషియా, ఇండోనేషియా నుంచి సరఫరా జరుగుతోంది. చదవండి: 45వేల ఉద్యోగులు కావాలి.. అంతా మహిళలే.. ఎక్కడంటే! -
వంట నూనెల హబ్.. 'కాకినాడ'
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పెన్షనర్స్ ప్యారడైజ్‌గా పిలిచే కాకినాడకు వంట నూనెల హబ్‌గానూ పేరుంది. ఈ విషయంలో కాకినాడ.. గుజరాత్ తర్వాత దేశంలోనే రెండో స్థానంలో నిలుస్తోంది. అలాగే రాష్ట్రంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంటోంది. ఇండోనేషియా, మలేషియా, ఉక్రెయిన్, రష్యా తదితర దేశాల నుంచి ఇక్కడకు ముడి పామాయిల్ దిగుమతి అవుతోంది. ఇక్కడున్న 12 రిఫైనరీలలో ముడి వంట నూనెలను శుద్ధి చేసి పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. భవిష్యత్‌లో వచ్చే కాకినాడ గేట్‌వే పోర్టుతో పారిశ్రామికంగా ఈ రంగం మరింత పరుగులు తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం కూడా ఇందుకు దోహదం చేయనుందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. కాకినాడలో ప్రభుత్వ రంగ యాంకరేజ్ పోర్టు, ప్రైవేటు రంగంలో కేఎస్పీఎల్ (కాకినాడ సీపోర్ట్సు లిమిటెడ్) రెండు పోర్టులు ఉన్నాయి. పలు రాష్ట్రాల రిఫైనరీలు.. ఇండోనేషియా, మలేషియా, ఉక్రెయిన్ నుంచి ఏటా 9 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ పామాయిల్‌ను కాకినాడ సీపోర్ట్సుకు దిగుమతి చేసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చే ముడి నూనెలను ఓడ సముద్రతీరాన జట్టీలో ఉన్నప్పుడే నేరుగా రిఫైనరీకి తరలించే ప్రత్యేక ఏర్పాటు ఇక్కడ ఉంది. అందుకే పలు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రిఫైనరీల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. పోర్టు నుంచి రిఫైనరీలకు నేరుగా పైపులైన్లు ఉండటంతో సమయం, ఖర్చులు ఆదా అవుతున్నాయంటున్నారు. 12 రిఫైనరీలలో శుద్ధి.. ప్యాకింగ్.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ పామాయిల్‌ను కాకినాడ పరిసరాల్లో వాకలపూడి, వలసపాకల, సూర్యారావుపేటలలో 12 రిఫైనరీలలో శుద్ధి చేసి ప్యాకింగ్ చేస్తున్నారు. అదానివిల్మార్, అగర్వాల్, లోహియా, జెమిని, అమ్మిరెడ్డి, రుచిసోయ, భగవతి, సంతోíÙమాత, శ్రీ గాయత్రి, వెంకట రమణ తదితర కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ రిఫైనరీల్లో శుద్ధి చేసిన వంట నూనెలను వివిధ బ్రాండ్ల పేరుతోఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు తదితర రాష్ట్రాలకు ప్యాకింగ్ ఆయిల్, లూజు ఆయిల్గా రవాణా చేస్తున్నారు. రోజూ ట్యాంకర్ల ద్వారా 500 మెట్రిక్ టన్నుల ఆయిల్ (లూజు), 2,500 మెట్రిక్ టన్నులు లీటర్ చొప్పున ప్యాక్ చేసి ట్రక్కులలో కాకినాడ నుంచి పంపుతున్నారు. ప్రత్యక్షంగా సుమారు 20 వేల మంది, పరోక్షంగా 50 వేల మంది ఏడాది పొడవునా ఉపాధి పొందుతున్నారు. చదవండి: ముర్రా.. మేడిన్ ఆంధ్రా కాకినాడ తర్వాత కృష్ణపట్నం.. దేశవ్యాప్తంగా ప్రజల వినియోగానికి కోటి 40 లక్షల మెట్రిక్ టన్నుల వంట నూనెలు అవసరమని అంచనా. దేశీయంగా అందుబాటులో ఉండే వంట నూనెలు మినహాయిస్తే.. విదేశాల నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నులు వరకు దిగుమతి అవుతున్నాయి. వీటిలో గుజరాత్‌లోని రెండు పోర్టులు ముడి వంట నూనెల దిగుమతిలో మొదటి స్థానంలో ఉన్నాయి. దేశంలో రెండో స్థానంలో, రాష్ట్రంలో మొదటి స్థానంలో కాకినాడ పోర్టు ఉంది. దేశవ్యాప్తంగా దిగుమతి అవుతున్న ముడి వంట నూనెల్లో 20 శాతం రాష్ట్రంలోని పోర్టులకు దిగుమతి అవుతున్నాయి. కాకినాడ సీపోర్టు ద్వారా ఏటా 9 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కాకినాడ తర్వాత రెండో స్థానాన్ని కృష్ణపట్నం పోర్టు దక్కించుకుంటోంది. క్రియాశీలకంగా కాకినాడ సీపోర్టు.. క్రూడ్ పామాయిల్ దిగుమతిలో కాకినాడ సీపోర్టు క్రియాశీలకంగా ఉంది. పోర్టు నుంచి నేరుగా రిఫైనరీల వరకు పైపులైన్ ఉండటంతో ముడి నూనె ఎటువంటి వృథా కాకుండా రవాణా అవుతుండటం కంపెనీలకు కలిసివస్తోంది. –ఎన్.మురళీధరరావు, సీఈవో, కాకినాడ సీపోర్టు లిమిటెడ్ రవాణా రంగానికి ఊపిరి.. కాకినాడ సీపోర్టును ఆనుకుని పలు ఆయిల్ రిఫైనరీలు నిర్వహిస్తుండటంతో రవాణా రంగానికి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. డ్రైవర్లు, ట్రక్ యజమానులు, క్లీనర్లు తదితరులు వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. – బావిశెట్టి వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు, లారీ ట్యాంకర్స్ యూనియన్, కాకినాడ -
పల్నాడు: పొట్లూరు వద్ద పామాయిల్ ట్యాంకర్ బోల్తా
-
పెరిగిన పామాయిల్ దిగుమతులు, ఎన్నిటన్నులంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పామాయిల్ దిగుమతులు స్వల్పంగా వృద్ది చెంది జూన్ మాసంలో 5,90,921 టన్నులు నమోదైంది. సోయాబీన్ ఆయిల్ దిగుమతులు 12 శాతం ఎగసి 2.30 లక్షల టన్నులు, పొద్దు తిరుగుడు నూనె 32 శాతం తగ్గి 1.19 లక్షల టన్నులకు వచ్చి చేరింది. టారిఫ్ రేట్ కోటా కింద డ్యూటీ ఫ్రీ ముడి సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనె దిగుమతులకై కేటాయింపులు పెంచాల్సిందిగా సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. క్రితం ఏడాదితో పోలిస్తే వంటలకు ఉపయోగించే నూనెలతోసహా అన్ని రకాల నూనెలు 9.96 లక్షల టన్నుల నుంచి ఈ ఏడాది జూన్‌లో 9.91 లక్షల టన్నులకు దిగొచ్చాయి. మొత్తం దిగుమతుల్లో పామాయిల్ వాటా ఏకంగా 50 శాతముంది. టారిఫ్ రేట్ కోటా కింద 2022–23, 2023–24 సంవత్సరాలకుగాను ముడి సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనె ఒక్కొక్కటి 20 లక్షల టన్నులు దిగుమతికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. -
పామాయిల్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఇకనైనా ధరలు తగ్గేనా
ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెట్రోలు ధరలను తగ్గించిన కేంద్రం కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించింది. వీటితో పాటు వంట నూనె ధరల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ధరలు అదుపు చేసే ప్రయత్నంలో భాగంగా పామాయిల్‌పై బేస్ దిగుమతి సుంకం తగ్గించింది. ఈ మేరకు కేంద్రం మంగళవారం పొద్దు పోయాక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తాజాగా బేస్ దిగుమతి సుంకాలు సవరించడంతో టన్ను క్రూడ్ పామాయిల్ దిగుమతికి ఇంతకు ముందు 1703 డాలర్లు అవగా ఇప్పుడు 1625 డాలర్లకే రానుంది. రిఫైన్డ్ చేసిన పామాయిల్ విషయానికి వస్తే ఆర్బీడీ పామ్ ఆయిల్ ధర 1765 నుంచి 1733 డాలర్లకు దిగివచ్చింది. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో పామాయిల్ ధరలు తగ్గుతాయని ఆనందించేలోపు సోయా రూపంలో ప్రమాదం వచ్చి పడింది. సోయా ఆయిల్ టన్ను ధర 1827 నుంచి 1,866కి పెరిగింది. చదవండి: ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీ తగ్గింపు -
ఒక్కసారి వేస్తే 30 ఏళ్ల పాటు పంట: ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం
తగరపువలస/విశాఖపట్నం: సేద్యంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు భీమిలి నియోజకవర్గ రైతులు. ఒక్క సారి పెట్టుబడి పెడితే.. 30 ఏళ్లు వరసగా ఆదాయం పొందే ఆయిల్‌పామ్ తోటల వైపు మళ్లుతున్నారు. భీమిలి డివిజన్లో నారాయణరాజుపేట, దాకమర్రి, సంగివలస, రావాడ, గెద్దపేట, కురపల్లి, రెడ్డిపల్లి, కుసులవాడ, మజ్జిపేట తదితర పంచాయితీల్లో 200 ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ సాగు చేస్తుండగా.. ప్రస్తుతం దిగుబడి ఇస్తున్నాయి. ఏడాదిలో 8 నెలల పాటు 15 రోజులకొకసారి ఎకరానికి 10–12 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను ఆయిల్‌పామ్ గెలల ధర రూ.21 వేలకు కంపెనీల యజమానులు కొనుగోలు చేస్తున్నారు. నర్సీపట్నం వద్ద బంగారుమెట్ట, విజయనగరం జిల్లా పార్వతీపురంలో కంపెనీలకు ఆయిల్‌పామ్ గెలలను తరలిస్తున్నారు. మొదటి నాలుగేళ్లే.. నిరీక్షణ సాధారణంగా ఎక్కువ ఎకరాలు భూమి కలిగిన రైతులు ఆయిల్‌పామ్ తోటలను సాగు చేస్తుంటారు. ఒకసారి పంటకు ఉపక్రమించిన తర్వాత నాలుగేళ్లు వరసగా పెట్టుబడి పెట్టాలి. గోదావరి జిల్లాల్లో అయితే చిన్న కమతాలు కలిగిన రైతులు కూడా ఆయిల్‌పామ్‌కే మొగ్గు చూపుతారు. గత ప్రభుత్వాల హయాంలో రూ.60 ఉండే ఆయిల్‌పామ్ మొక్కను రాయితీ పోను మూడు ఎకరాల్లోపు రైతులకు రూ.5, మూడు నుంచి ఐదు ఎకరాల్లోపు రైతులకు రూ.10, ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు రూ.30 వంతున ప్రభుత్వం సరఫరా చేసేది. ప్రస్తుతం రూ.300 ఉన్న మొక్కను.. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రైతులకు ఎన్ని కావాలంటే అన్ని అందిస్తోంది. గత ప్రభుత్వాలు దిగుబడి వచ్చే నాలుగేళ్ల వరకు హెక్టారుకు ఏడాదికి రూ.4 వేల విలువైన ఎరువులు ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం రూ.4 వేల నగదును నేరుగా రైతుల ఖాతాకు జమ చేస్తోంది. పెట్టుబడి గోరంత.. ఆదాయం కొండంత ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు మొక్కలు ఉచితంగా లభిస్తుండగా ఎకరాకు గాను పెట్టుబడి నిమిత్తం రూ.30 వేల నుంచి 40 వేలు అవుతుంది. మొక్కకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో రోజుకు 250 లీటర్ల నీరు, మూడు నెలలకు ఒకసారి మొక్కకు 3–4 కిలోల ఎరువులు, అవసరమైన చోట మట్టలు నరకడం చేస్తే సరిపోతుంది. నాలుగేళ్ల తర్వాత ఏడాదిలో ఎనిమిది మాసాలకు కలిపి 16సార్లు దిగుబడి వస్తుంది. దీంతో ఖర్చులు పోను ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం లభిస్తుంది. అంతర పంటగా వేస్తే అదనపు ఆదాయం 2013లో నాకున్న 9 ఎకరాల్లో మొదట ఆయిల్‌పామ్ వేశాను. తర్వాత 18 ఎకరాలకు విస్తరించాను. మొత్తంగా 27 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌తో పాటు అరటి, బొప్పాయి అంతర పంటలుగా వేశాను. మధ్యలో కోళ్ల ఫారాలు ఏర్పాటు చేశాను. సోలార్ ద్వారా బిందుసేద్యం మొదలుపెట్టాను. ఆయిల్‌పామ్ నాలుగేళ్లు తర్వాత దిగుబడి ప్రారంభయి జీవితకాలం 30 ఏళ్ల వరకు ఆదాయం ఇస్తుంది. అరటి, బొప్పాయి వలన ఏడాదికి రూ.లక్ష అదనపు ఆదాయం లభిస్తుంది. మార్కెటింగ్ సమస్య లేదు. – కాద సూర్యనారాయణ, సర్పంచ్, నారాయణరాజుపేట, భీమిలి మండలం పక్షుల బెడద ఉంటుంది ఆయిల్‌పామ్‌కు తెగుళ్ల బాధ తక్కువ. ఒకవేళ తెగుళ్లు సోకినా ఇబ్బంది లేదు. పంట దిగుబడి సమయంలో ఆయిల్‌పామ్ పండ్లను గోరపిట్టలు, కాకులు, ఉడతలు తినేస్తుంటాయి. సాధారణంగా ఆయిల్‌పామ్ గెల 30 కిలోలు ఉండగా.. గెలకు అరకిలో వరకు నష్టం ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా రక్షణ చర్యలు తీసుకోవాలి. వచ్చే ఆదాయం ముందు నష్టం ఏమంత కాదు. – మజ్జి చినపైడితల్లి, రైతు, మజ్జిపేట, భీమిలి మండలం -
పామాయిల్ ఎగుమతులకు ఇండోనేసియా ఓకే
జకార్తా: నెల రోజుల క్రితం పామాయిల్ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ఇండోనేసియా ప్రభుత్వం గురువారం తెలిపింది. దేశీయంగా సరఫరా పెరగడం, చమురు ధరలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. వంటనూనె ఎగుమతులు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతాయని అధ్యక్షుడు జొకొ విడొడొ తెలిపారు. ప్రపంచ పామాయిల్ ఉత్పత్తిలో ఇండోనేసియా, మలేసియాలు 85% వాటా కలిగి ఉన్నాయి. ఈ రెండు దేశాలకు పామాయిల్ ఎగుమతులే ప్రధాన ఆదాయ వనరు. నిషేధం తొలగడంతో, భారత్‌లో పామాయిల్ ధరలు దిగివస్తాయని భావిస్తున్నారు. చదవండి: అదృష్టం అంటే వీరిదే.. లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట -
కీలక నిర్ణయం తీసుకున్న ఏషియన్ కంట్రీ.. కుకింగ్ ఆయిల్ ధరలు తగ్గేనా?
అదీఇదీ అని తేడా లేదు. సబ్బు బిళ్ల నుంచి బస్సు ఛార్జీల వరకు ఒకటా రెండా మూడా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకో వస్తువు ధర పెరిగిందన్న వార్తలే వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వంట నూనెల ధర కాస్త తగ్గవచ్చనే ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి. ఎగుమతులపై నిషేధం ప్రపంచంలోనే పామాయిల్ ఎగుమతుల్లో ఇండోనేషియా దేశం నంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే దేశీయంగా పామాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో పామాయిల్ ఎగుమతులను నిషేధిస్తున్నట్టు 2022 ఏప్రిల్ 28న అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇండోనేషియా నుంచి పామాయిల సరఫరా ఆగిపోతుందనే వార్తలతో వంట నూనె ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. మే 23 నుంచి గత మూడు వారాలుగా పామాయిల్ ఎగుమతులపై నిషేధం కారణంగా ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టు ఇండోనేషియా ప్రభుత్వం గుర్తించింది. దీంతో 2022 మే 23 నుంచి తిరిగి ఎగుమతులకు అవకాశం ఇస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో మే 19న ప్రకటించారు. ధర తగ్గడంతో నిషేధం విధించేప్పుడు టోకు మార్కెట్లో లీటరు పామాయిల్ ధర 19,800 రూపయల దగ్గర ఉంది. నిషేధం కారణంగా ఆక్కడ పామాయిల్ ధర దిగివచ్చి ప్రస్తుతం 17 వేల రూపాయల దగ్గర ట్రేడవుతోంది. అయితే ఆ దేశం పెట్టుకున్న టార్గెట్ మాత్రం లీటరు పామాయిల్ 14 వేల రూపాలయకు దిగిరావాలని, అయితే దేశీయంగా పామాయిల్ నిల్వలు సమృద్ధిగా ఉండటంతో పాటు స్థానిక వాణిజ్య రంగాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ధర తగ్గేనా? ఇండోనేషియా నుంచి పామాయిల్ ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో దేశీయంగా కుకింగ్ ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇండోనేషియా నుంచి భారత్ భారీ ఎత్తున పామాయిల్ దిగుమతి చేసుకుంటుంది. ఇండోనేషియా నిషేధాన్ని సాకుగా చూపుతూ మిగిలిన అన్ని వంటి నూనెల ధరలు పెంచాయి వ్యాపార వర్గాలు. కానీ త్వరలో పామాయిల్ దిగుమతి అవడం వల్ల డిమాండ్ మీద ఒత్తిడి తగ్గి ధరలు అదుపలోకి వచ్చేందుకు ఆస్కారం ఉంది. చదవండి: ‘పామాయిల్’ సెగ తగ్గేదెలా! -
‘పామాయిల్’ సెగ తగ్గేదెలా!
దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న వంట నూనెల ధరలపై తీవ్ర ఆందోళనతో ఉన్న కేంద్రం ప్రభుత్వం వీటి ధరలను అందుబాటులోకి తెచ్చే మార్గాలపై అన్వేషణ చేస్తోంది. ముఖ్యంగా భారత్‌కు అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తిదారుగా ఉన్న ఇండోనేషియా ప్రకటించిన ఎగుమతులపై ఆకస్మిక నిషేధం ప్రభావం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై సమాలోచనలు జరుపుతోంది. ఇందులో భాగంగా వంట నూనెల దిగుమతులపై విధించే సెస్‌ను తగ్గించాలని యోచిస్తోంది. మరోపక్క వంట నూనెల ప్రధాన ఎగుమతిదారులైన బ్రెజిల్, అర్జెంటీనాల నుంచి దిగుమతులు పెంచేకునే మార్గాలను వెతుకుతోంది. భారత్‌లో వంట నూనెల అవసరాల్లో 70 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. మొత్తంగా దిగుమతి అవుతున్న నూనెల్లో 50 శాతం పామాయిల్ ఉంటుండగా, దీనిలో ఇండోనేషియో వాటానే ఏకంగా 47 శాతానికి పైగా ఉంది. ఏటా ఇండోనేషియో నుంచి 8.8 మిలియన్ టన్నుల పామాయిల్ భారత్‌కు ఎగుమతి అవుతోంది. అయితే అక్కడి ప్రభుత్వం స్థానిక మార్కెట్లలో ధరలను తగ్గించేందుకు వీలుగా ఏప్రిల్ 28 నుంచి ఎగుమతులపై నిషేధం విధించింది. దీని ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడనుంది. దీనికి తోడు ఇప్పటికే ఉక్రెయిన్–రష్యా యుధ్దం కారణంగా సన్‌ఫ్లవర్ నూనెల సరఫరా తగ్గింది. రష్యా నుంచి 60 శాతానికి పైగా సన్‌ఫ్లవర్ నూనె మన దేశానికి ఎగుమతి అవుతుండగా, తూర్పు యూరప్‌లో వివాదం కారణంగా వీటి రవాణాలో వేగం తగ్గింది. యుధ్దం కొనసాగినంత కాలం నూనెల సరఫరాల్లో ఆటంకాలు తప్పేలా లేవు. ఈ కారణాల రీత్యా ఇప్పటికే గత ఫిబ్రవరిలో పామాయిల్ లీటర ధర రూ.120–130 వరకు ఉండగా.. అది ఇప్పుడు రూ.165–175కి చేరింది. ఈ ధర మరో 20 నుంచి 25 శాతానికి పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పామాయిల్ సరఫరా పెంచే మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. ఎగుమతులకు ప్రోత్సాహం..లభ్యత పెంచడం పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధంతో తలెత్తిన తక్షణ సంక్షోభాన్ని అధిగమించేలా దేశంలో తగినంత వంటనూనెల నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. దేశంలో నెలకు సగటు పామాయిల్ వినియోగం 1–1.10 మిలియన్ టన్నుల మేర ఉండగా, ప్రస్తుతం దేశంలో 2.1 మిలియన్ టన్నుల మేర నిల్వలుండగా, మరో 1.2 మిలియన్ టన్నులు ఈ నెలాఖరుకు దేశానికి చేరుతాయని అంచనా వేసింది. అంటే మూడు నెలల అవసరాలకు సరిపడా నిల్వలున్నాయని అంటోంది. ఒకవేళ అప్పటికీ ఇండోనేషియా నిషేధం కొనసాగిన పక్షంలో అర్జెంటీనా, బ్రెజిల్, మలేషియా దేశాల నుంచి ఎగమతులను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. దీనిలో భాగంగానే వంట నూనెలపై విధిస్తున్న వ్యవసాయ మౌలిక సదుపాయిల సెస్‌ను తగ్గించాలనే ఆలోచనలో ఉంది. నిజానికి గత నవంబర్లోనే ప్రభుత్వం పామాయిల్‌పై సెస్‌ను 20 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించగా, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై 5 శాతానికి తగ్గించింది.. దీనిని మరో 5 శాతం తగ్గించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలను రేకెత్తిస్తున్న నేపథ్యంలో.. ఆకస్మిక ఎగుమతి నిషేధంపై ఇండోనేషియాతో భారత్ ద్వైపాక్షిక చర్చలు కూడా నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వంలోని కీలక అధికారుల నుంచి సమాచారం అందుతోంది. – సాక్షి, న్యూఢిల్లీ -
మంట నూనెలు!
ఇది ఒక విచిత్ర పరిస్థితి. ఒక వస్తువును అత్యధికంగా ఉత్పత్తి చేసి, అతి పెద్ద ఎగుమతిదారుగా నిలిచే దేశంలోనే ఆ వస్తువుకు కొరత ఏర్పడితే? ఆ ఉత్పత్తి మీద అక్కడి ప్రభుత్వం ధరల నియంత్ర ణలు, రవాణాపై నిరోధాలు పెడితే? ఎగుమతులపై పూర్తిగా నిషేధం విధిస్తే? ప్రపంచంలోకెల్లా పామాయిల్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఇండోనేషియాలోని చిత్రమైన పరిస్థితి ఇప్పుడు ఇదే. నిజానికి, గత ఏడాది చివరి నుంచి ప్రపంచవ్యాప్త ముడి పామాయిల్ (సీపీఒ) ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ శాక నూనెల సరఫరా తగ్గడం, పామాయిల్ ఉత్పత్తిలో రెండో అతి పెద్ద దేశమైన మలేషియాలో కరోనాతో శ్రామికుల కొరత, ప్రపంచవ్యాప్త ఆహార ఇన్ఫ్లేషన్, ఉక్రె యిన్ యుద్ధం – ఇలా కర్ణుడి చావుకు కారణాలెన్నో! అందుకే, ఇండొనేషియా పామాయిల్ ధరలపై నియంత్రణ పెట్టింది. దానివల్ల అక్రమ నిల్వలు, తిరిగి అమ్మడాలు పెరిగాయి. చివరకు ఈ ఏప్రిల్ 28 నుంచి ఎగుమతుల నిషేధం విధించింది. భారతదేశపు శాకనూనెల వినియోగంలో 40 శాతం పామాయిలే! అక్కడి సంక్షోభంతో భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ధరలకు రెక్కలొచ్చాయి. ముడి పామాయిల్ వరకు నిషేధం లేదని ఇండొనేషియా చెప్పినా, ఇప్పటికీ వంట నూనెల్లో విదేశీ దిగు మతులపై ప్రాథమికంగా ఆధారపడుతున్న మనం దీర్ఘకాలిక పరిష్కారం చూడాలని గుర్తు చేశాయి. వివరంగా చెప్పాలంటే, ఇండొనేషియాలో పామాయిల్ కొరతకు ప్రధానంగా రెండు కారణాలు. మొదటి కారణం– పామాయిల్ తర్వాత ప్రపంచంలో అధికంగా ఎగుమతి అయ్యే సన్‌ఫ్లవర్, సోయాబీన్ లాంటి ఇతర వంటనూనెల సరఫరాకు అంతరాయాలు ఏర్పడడం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం ఉక్రెయిన్, రష్యాలవే. తీరా ఫిబ్రవరి 24న మొదలైన ఉక్రెయిన్ యుద్ధంతో నౌకా రవాణా చిక్కుల్లో పడింది. రష్యాపై ఆంక్షలతో సన్‌ఫ్లవర్ ఆయిల్ వాణిజ్యానికీ అడ్డు ఏర్పడింది. మరోపక్క దక్షిణ అమెరికాలో పొడి వాతావరణంతో సోయాబీన్ ఉత్పత్తి ఆరేళ్ళలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోనుందని అంచనా. వెరసి, యుద్ధం, వర్షాభావంతో సన్‌ఫ్లవర్, సోయా బీన్ నూనెల కొరవడి, భారం పామాయిల్ మీద పడింది. ఇక, రెండో కారణం – బయో ఇంధనంగా పామాయిల్ వినియోగం పెరగడం. ఇండొనేషియా ప్రభుత్వం 2020 నుంచి శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించడం కోసం డీజిల్‌లో 30 శాతం మేర పామాయిల్‌ను కలపడం తప్పనిసరి చేసింది. ఇలా బయో ఇంధనం దిశగా పామాయిల్‌ను మళ్ళించడంతో దేశీయ వంట నూనె వాడకం, ఎగుమతి విషయంలో కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఇండొనేషియాలో పామాయిల్ ధరలు పైపైకి ఎగబాకి, అక్కడి ప్రభుత్వం నియంత్రణలు, చివరకు ఎగుమతుల నిషేధం బాట పట్టింది. ఇండొనేషియాలోని సంక్షోభం భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచంలో వంటనూనెలు అత్యధికంగా దిగుమతి చేసుకొనేది మన దేశమే. మన వార్షిక దిగుమతులైన 14–15 మిలియన్ టన్నుల వంట నూనెల్లో 8–9 మిలియన్ టన్నులతో సింహభాగం పామాయిలే. తర్వాత స్థానంలో సోయాబీన్ (3–3.5), సన్‌ఫ్లవర్ నూనె (2.5 మిలియన్ టన్నులు) వస్తాయి. మూడింటికీ ఇబ్బంది వచ్చిపడడంతో మన వంట నూనెల మార్కెట్ కుదుపునకు లోనైంది. ఇండొనేషియాలో ఈ జనవరి చివరలో పెట్టిన ఎగుమతి నియంత్రణల దెబ్బకే మన దేశంలో సీపీఓ మూల్యం 38 శాతం పెరిగింది. కొత్త నిషేధంతో పరిస్థితి మరింత జటిలమైంది. అయితే, శుద్ధి చేసిన ‘రిఫైన్డ్ బ్లీచ్డ్ డీ–ఓడరైజ్డ్’ (ఆర్బీడీ) పామోలిన్ ఎగుమతి మీదే నిషేధం పెట్టామనీ, ముడి పామాయిల్‌కు ఆ నిషేధం వర్తించదనీ ఇండొనేషియన్ అధికారులు తాజాగా వివరణ ఇచ్చింది. ఇటు వినియోగదారులకూ, అటు విధాన నిర్ణేతలకూ ఇది కొంత సాంత్వన. కనీసం ముడి పామాయిల్‌ను తెప్పించుకొని, ఉన్న దేశీయ నూనె శుద్ధి వసతులతో రిఫైన్డ్ వంటనూనె సిద్ధం చేసుకొనే వీలు అయినా మిగిలింది. అలా కాకుండా పూర్తి నిషేధమంటే గనక మన వార్షిక వంటనూనెల అవసరాల్లో నాలుగో వంతు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వచ్చేది. మన ఆహార మార్కెట్లో సంక్షోభం తలెత్తేది. యుద్ధంతో ఈ మార్చిలో ప్రపంచవ్యాప్త ఆహార ధరలు 13 శాతం పెరిగాయని ఐరాస లెక్క. కనివిని ఎరుగని రీతిలో ఇండొనేషియా సర్కార్ చేసిన నిషేధ ప్రకటనతో ఇతర శాకనూనెల ప్రపంచ ధరలు నింగి వైపు చూడసాగాయి. ప్రకటన వెలువడ్డ ఏప్రిల్ 22నే సోయాబీన్ నూనె ధర ఒక్క సారిగా 4.5 శాతం హెచ్చింది. ఈ ఒక్క ఏడాదే మన దేశంలో 29 శాతం పెరిగింది. కొన్ని దశాబ్దాలు గానే మనకీ పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెలు అలవాటు. ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడి, ఆ ధరల హెచ్చుతగ్గులు భరించే బదులు, వాటిని క్రమంగా తగ్గించుకుంటూ దేశీయ వంట నూనెల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలి. వేరుసెనగ నూనె, ఆవనూనె, నువ్వుల నూనె లాంటి స్థానిక సాంప్రదాయిక నూనెల వినియోగాన్ని పెంచాలి. చౌకధరల దుకాణాల్లో పంపిణీ లాంటి ఆలోచనలు చేయవచ్చు. అప్పుడే దేశీయంగా వంటనూనెల విషయంలో భద్రత సాధ్యం. వంటనూనెలపై మన దేశ విధా నాలు సైతం తాత్కాలిక ఉపశమన ధోరణిలో సాగడం మరో సమస్య. 1.25 లక్షల హెక్టార్లలో పామా యిల్ సాగును సబ్సిడీలతో ప్రోత్సహించి, ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం గత ఏడాదే ఓ ప్రణాళికను ప్రకటించింది. కానీ, పామాయిల్ చెట్లు ఫలించడానికి అయిదారేళ్ళు పడు తుంది. ఈలోగా పరిస్థితి ఏమిటి? ఎగుమతుల నిషేధంతో ఇండొనేషియాలో ధరలు తగ్గచ్చేమో కానీ, మన దగ్గర చుక్కలనంటడం ఖాయం. రానున్నది మంటనూనెల కష్టకాలమని భయపడుతున్నది అందుకే! -
గెల.. గలగల!
దేవరపల్లి, రంగంపేట (తూర్పు గోదావరి): మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్న పామాయిల్ రైతన్నలకు కాసులు కురిపిస్తోంది. రెండేళ్లలో పామాయిల్ గెలల ధర గరిష్ట స్థాయికి చేరడంతో సాగుదారులు మంచి ఆదాయం పొందుతున్నారు. ప్రస్తుతం టన్ను గెలల ధర రూ.21890 చొప్పున పలికి సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. జనవరిలో రూ.17,500 ఉన్న ధర మార్చిలో రూ.19,300కి చేరుకోగా తాజాగా మరింత పెరిగింది. యుద్ధం.. దిగుమతులు ఆగడంతో ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పామాయిల్ దిగుమతులకు ఆటంకం తలెత్తడంతో మార్కెట్లో వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. 2019లో టన్ను గెలల ధర రూ.ఆరు వేలు మాత్రమే ఉండగా 2020లో రూ.8,000 పలికింది. 2021లో రూ.10,000కి చేరుకుంది. ఈనెల 4వ తేదీన ఉద్యాన శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్.ఎస్ శ్రీధర్ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రైతులకు ఏప్రిల్ నుంచి టన్ను పామాయిల్ గెలలకు రూ.21,890 చొప్పున చెల్లించాలి. ఈ మేరకు కాకినాడ జిల్లా పెద్దాపురంలోని రుచి సోయా పామాయిల్ కంపెనీతో పాటు మిగిలిన 12 కంపెనీలు కూడా ఇదే ధర చెల్లించాల్సి ఉంది. ఉభయ గోదావరిలో భారీగా సాగు కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజక వర్గాల పరిధిలో 55 వేల ఎకరాల్లో పామాయిల్ పంట సాగులో ఉంది. అనపర్తి, పెద్దాపురం, గండేపల్లిలోనూ సాగు చేపట్టారు. గత మూడు నెలల వ్యవధిలో ఆరు వేల ఎకరాల్లో కొత్తగా నాట్లు వేయడంతో ఉభయ గోదావరిలో సాగు విస్తీర్ణం 81 వేలకు పెరిగిపోయింది. జూన్, జూలైలో మరో ఐదు వేల ఎకరాల్లో నాట్లు వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. పొగాకుకు ప్రత్యామ్నాయంగా పొగాకు పంట గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగు చేసి లాభాలు పొందుతున్నారు. పొగాకు భూముల్లో రెండేళ్లుగా రైతులు పామాయిల్ తోటలు వేస్తున్నారు. దాదాపు 8,000 ఎకరాల్లో ఈ తోటలు వేసినట్లు సమాచారం. పెట్టుబడి తక్కువ, ఆదాయం బాగుండటంతో వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఎకరాకు రూ.2.20 లక్షల ఆదాయం పామాయిల్ ఎకరాకు 10 టన్నుల గెలలు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను గెలల ధర రూ.21,890 ఉండడంతో రూ.2.20 లక్షలు వరకు ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు. అన్ని పంటల కంటే ఆయిల్ పామ్‌కు మంచి ధర లభిస్తోందని, మెట్ట రైతులను పామాయిల్ ఆదుకుందని ఆనందంగా చెబుతున్నారు. రైతులను ఆదుకుంది.. ఈ ఏడాది పొగాకు మినహా అన్ని పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉంది. పామాయిల్ పంట రైతులను ఆదుకుంది. ఎకరాకు 10 టన్నుల దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఎకరాకు రూ.30 వేలు అవుతుంది. సగటున ఎకరాకు రూ.1.70 లక్షల నికర ఆదాయం వస్తుంది. – నరహరిశెట్టి రాజేంద్రబాబు, డైరెక్టర్, రాష్ట్ర ఆయిల్‌పామ్ బోర్డు, యర్నగూడెం ఊహించని ధర ఇంత ధర ఊహించలేదు. పామాయిల్ తోటలు రైతులను ఆదుకుంటున్నాయి. 30 ఎకరాల్లో సాగు చేస్తున్నా. 300 టన్నుల దిగుబడి వచ్చింది. ఎకరాకు సగటున రూ.1.50 లక్షలు మిగులుతుంది. మార్కెట్లో ధర మరింత పెరిగే అవకాశ«ం ఉంది. – యాగంటి వెంకటేశ్వరరావు, రైతు, దేవరపల్లి లాభాల పంట ఆయిల్ పామ్ లాభాల పంట. రెండేళ్ల నుంచి మంచి ఆదాయం వస్తోంది. ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం లభిస్తోంది. డ్రిప్ ద్వారా నీటితడులు, పశువుల ఎరువు వాడడం వల్ల దిగుబడులు పెరిగాయి. ఎకరాకు 10 నుంచి 11 టన్నుల దిగుబడి వస్తోంది. గత రెండు సంవత్సరాలు దిగుబడులు, రేటు ఆశాజనకంగా లేక లాభాలు తగ్గాయి. 11 ఎకరాల్లో తోట ఉంది. 112 టన్నులు దిగుబడి వచ్చింది. – పల్లి వెంకటరత్నారెడ్డి, రైతు, త్యాజంపూడి -
పామాయిల్ ‘పంట’ పండుతోంది!
-
వంట నూనెల దిగుమతులు పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల దిగుమతులు ఫిబ్రవరిలో 9,83,608 టన్నులకు చేరింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 23 శాతం అధికం. 2021 ఫిబ్రవరిలో 7,96,568 టన్నుల వంట నూనె భారత్‌కు సరఫరా అయింది. ప్రధానంగా శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులలో గణనీయమైన పెరుగుదల కారణంగా ఈ స్థాయిలో వృద్ధి నమోదైందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ వెల్లడించింది. అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. గతేడాదితో పోలిస్తే 2022 ఫిబ్రవరిలో శుద్ది చేసిన పామాయిల్ 6,000 నుంచి ఏకంగా 3,02,928 టన్నులకు చేరింది. వంటలకు కాకుండా ఇతర ఉత్పత్తుల తయారీలో వాడే నూనెలు 42,039 నుంచి 36,389 టన్నులకు వచ్చి చేరింది. ఇతర ఉత్పత్తులకు వినియోగించే నూనెలతో కలిపి మొత్తం నూనెల దిగుమతులు 8,38,607 నుంచి 10,19,997 టన్నులకు ఎగశాయి. 2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి మధ్య అన్ని రకాల నూనెలు 7 శాతం అధికమై 46,94,760 టన్నులుగా ఉంది. శుద్ధి చేసిన పామోలిన్ 21,601 నుంచి 5,19,450 టన్నులకు చేరాయి. ముడి పామాయిల్ 24,89,105 నుంచి 15,62,639 టన్నులకు దిగొచ్చింది. ప్రతి నెల సగటున 1.75–2 లక్షల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ విదేశాల నుంచి భారత్‌కు వస్తోంది. యుద్ధం కొనసాగితే.. ‘రష్యా–ఉక్రెయిన్ వివాదం సన్‌ఫ్లవర్ (పొద్దు తిరుగుడు) నూనె సరఫరాకు అంతరాయం కలిగించింది. ఫిబ్రవరి 2022లో దాదాపు 1,52,000 టన్నులు భారతదేశానికి దిగుమతైంది. అదే పరిమాణం ఈ నెలలోనూ వచ్చే అవకాశం ఉంది. యుద్ధానికి ముందు బయలుదేరిన ఓడలు ప్రస్తుత నెలలో భారతీయ ఓడరేవులకు చేరుకుంటాయి. యుద్ధం కొనసాగితే తరువాతి నెలల్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ రవాణా తగ్గుతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ లభ్యత స్వల్పంగా తగ్గినప్పటికీ దేశీయంగా సోయాబీన్, ఆవనూనెల అధిక లభ్యత ఉపశమనం కలిగిస్తుంది. దేశీయ విక్రయాల పరిమితిని 20 నుంచి 30 శాతానికి పెంచుతూ మార్చి 9న ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇండోనేషియా ఎగుమతి పరిమాణాన్ని మరింత తగ్గిస్తుంది. అలాగే ప్రపంచ ఎగుమతి సరఫరాలను కఠినతరం చేస్తుంది. ఈ అంశాలు అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరల్లో గత కొన్ని రోజులుగా అధిక అస్థిరతకు దారితీస్తున్నాయి. పామాయిల్ ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి భారత్‌కు వస్తోంది. ముడి సోయాబీన్ నూనె అర్జెంటీనా, బ్రెజిల్ నుండి దిగుమతి అవుతోంది. ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్, రష్యా నుండి భారత్‌కు సరఫరా అవుతోంది’ అని అసోసియేషన్ తెలిపింది. -
వంట నూనెలకు యుద్ధం సెగ
తాడేపల్లిగూడెం: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం ప్రభావం వంట నూనెలపై పడింది. రష్యా, ఉక్రెయిన్ల నుంచి పామాయిల్, పొద్దు తిరుగుడు నూనెల (సన్‌ఫ్లవర్ ఆయిల్)దిగుమతి భారత్‌కు దాదాపుగా ఆగిపోయింది. మన దేశానికి రష్యా, ఉక్రెయిన్, మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి పామ్‌క్రూడ్, పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతాయి. ఇండోనేషియా డొమెస్టిక్ సేల్స్ పేరిట పామ్‌క్రూడ్, పామాయిల్‌ను ఇతర దేశాలకు పంపించడం లేదు. రష్యా నుంచి 30 శాతం, ఉక్రెయిన్ నుంచి 70 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్ మనకు దిగుమతి అవుతుంది. కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల మీదుగా ఈ నూనెలు తెలుగు రాష్ట్రాల ప్రజల అవసరాల నిమిత్తం దిగుమతి చేస్తారు. మలేషియా, ఇండోనేషియా నుంచి పామాయిల్, పామ్‌క్రూడ్ దిగుమతి అవుతాయి. మార్కెట్ పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఆయా దేశాల నుంచి నూనెల దిగుమతులు తగ్గాయి. ఉన్నట్టుండి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తెరపైకి రావడంతో ఈ ప్రభావం నూనెల ధరలపై పడింది. లీటరుకు రూ.30 నుంచి రూ.40 పెరుగుదల దిగుమతులు తగ్గడంతో వంట నూనెల ధర వారం రోజుల వ్యవధిలో లీటరుకు ఏకంగా రూ.30 నుంచి రూ.40 వరకు పెరిగింది. పామాయిల్ ధర లీటరు రూ.115 నుంచి రూ.145కు చేరింది. మార్కెట్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ నిల్వలు నిండుకోగా.. లీటరు ధర రూ.130 నుంచి రూ.170కి ఎగబాకింది. ధరలకు «రెక్కలు రావడంతో స్థానికంగా లభించే రైస్‌బ్రాన్ ఆయిల్ ధర కూడా పెరిగింది. లీటర్ రూ.145 నుంచి రూ.170కి చేరింది. వేరుశనగ నూనె ధర లీటరు రూ.139 నుంచి రూ.165కు పెరిగింది. పెరిగిన ధరలతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దిగుమతిదారుల వద్దే నిల్వలు రష్యా, ఉక్రెయిన్, మలేషియా, ఇండోనేషియా నుంచి పామ్‌క్రూడ్, పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెలను దిగుమతి చేసుకున్న ఐదారు కంపెనీలు నిల్వలను తమ వద్దే ఉంచుకున్నాయి. యుద్ధ ప్రభావం వల్ల రష్యా, ఉక్రెయిన్ల నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి నిలిచిపోయింది. ఇండోనేషియాలో స్థానిక అవసరాల నిమిత్తం డొమెస్టిక్ సేల్స్ పేరిట ఎగుమతులను ఆ దేశం నిలిపివేసింది. మలేషియాలోనూ ఇదే పరిస్థితి. దీంతో ఫిబ్రవరి మొదటి వారం వరకు కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు దిగుమతి అయిన ఈ నూనెలు అక్కడే ఉండిపోయాయి. భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దిగుమతిదారులు ఆచితూచి సరుకును గుత్త వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. దీంతో నూనెల కొరత మార్కెట్‌ను వెంటాడుతోంది. రాష్ట్రంలోని గుత్త, రిటైల్ వ్యాపారుల వద్ద నూనెల నిల్వలు దాదాపుగా అయిపోతున్నాయి. దిగుమతిదారుల నుంచి సరుకు వచ్చే అవకాశాలు తగ్గాయి. దీంతో ఉన్న సరుకు హాట్‌కేక్‌లా అమ్ముడుపోతోంది. -
భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. రిటైల్ మార్కెట్లో రేట్లు ఇలా..!
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం వంటనూనె ధరలు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యవసర సరుకుల ధరలతో సతమతమవుతున్న జనాలకు వంటనూనె ధరలు కొద్దిగా ఊరట కలిగిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. దేశంలోని రిటైల్ మార్కెట్లో వంట నూనె ధరలు భారీగా తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రధాన రిటైల్ మార్కెట్లలో కిలో వంటనూనెపై రూ.5-20 వరకు ధరలు తగ్గినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. రిటైల్ మార్కెట్లో వేరుశెనగ నూనె ఆల్ ఇండియా సగటు రిటైల్ ధర కిలో రూ.180, ఆవనూనె కిలో రూ.184.59, సోయా ఆయిల్ కిలో రూ.148.85, సన్ ఫ్లవర్ ఆయిల్ కిలో 162.4, పామాయిల్ కిలో ధర రూ.128.5గా ఉన్నట్లు తెలిపింది. అయితే, అక్టోబర్ 1, 2021న ఉన్న ధరలతో పోలిస్తే వేరుశెనగ & ఆవనూనెల రిటైల్ ధరలు కిలోకు రూ.1.50-3 తగ్గాయి. సోయా & సన్ ఫ్లవర్ నూనెల ధరలు కిలోకు రూ.7-8 తగ్గినట్లు కేంద్రం తెలిపింది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అదానీ విల్మార్, రుచి ఇండస్ట్రీస్ కంపెనీలతో సహా ఇతర ప్రధాన వంట నూనె కంపెనీలు లీటరుకు రూ.15-20 ధరలను తగ్గించాయి. వంటనూనెల ధరలను తగ్గించిన కంపెనీలలో జెమిని ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా, హైదరాబాద్, మోడీ నేచురల్స్, ఢిల్లీ, గోకుల్ రీ-ఫాయిల్స్ మరియు సాల్వెంట్, విజయ్ సాల్వక్స్, గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ ఉన్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్లో కమోడిటీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, వంటనూనె ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో వాటి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత సంవత్సరం భారీగా ఉన్న నూనె ధరలు.. అక్టోబర్ 2021 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. వంట నూనెల మీద దిగుమతి సుంకాలు తగ్గించడం, నకిలీ నిల్వలను నిరోధించేందుకు స్టాక్ పరిమితులపై ఆంక్షలు విధించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టడంతో వంట నూనెల ధరలు తగ్గడానికి ఒక కారణం. వంటనూనెల విషయంలో దేశం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుండటంతో.. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి పెంచడానికి సిద్దం అయ్యింది. అందుకు తగ్గట్టుగా మిషన్ ఆఫ్ ఆయిల్‌పామ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఈ మిషన్ ఆయిల్‌పామ్ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. (చదవండి: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్..! వాటిపై 80 శాతం డిస్కౌంట్) -
పామాయిల్ రంగంలో స్వావలంబనే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: వంట నూనెలలో స్వావలంబనే తమ లక్ష్యమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. ‘వంట నూనె– ఆయిల్ పామ్ జాతీయ మిషన్ బిజినెస్ సమిట్’ను హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పామాయిల్ రంగంలో దేశం స్వావలంబన సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఈ జాతీయమిషన్‌కు వనరుల కొరత ఉండబోదని తెలిపారు. ప్రస్తుతం సుమారు 3 లక్షల హెక్టార్ల భూమి పామాయిల్ సాగులో ఉండగా, ఆయిల్ పామ్ సేద్యానికి అనువుగా ఉన్న 28 లక్షల హెక్టార్ల భూమిని సాగులోకి తీసుకురావడం తమ లక్ష్యమన్నారు. పామాయిల్ ఉత్పత్తిని పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి మాట్లాడుతూ మనం వంట నూనె దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ వ్యవసాయశాఖ మంత్రి పి.ప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్ పామ్‌ను ప్రోత్సహించడానికి కేరళ ప్రభు త్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్పారు. 30 లక్షల ఎకరాలు ఆయిల్‌పాం: నిరంజన్‌రెడ్డి తెలంగాణలో పంటల మార్పిడిని ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం 30 లక్షల ఎకరాలు ఆయిల్‌పాం లక్ష్యంగా పెట్టుకుందని, నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్‌పామ్ కింద కేంద్ర ప్రభుత్వం ఆమోదించి నిధులు కేటాయించాలని ఆయన కోరారు. ఆయిల్ పామ్ ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ (ఎఫ్‌ఎఫ్‌బీ) టన్నుకు రూ. 15 వేలు కనీస ఖచ్చితమైన ధర నిర్ణయించి ఆయిల్ పామ్ సాగుకు రైతులను ప్రోత్సహించాలని, అందుకు అవసరమయ్యే బిందు సేద్యం యూనిట్ ధరను పెంచి విస్తీర్ణ పరిమితిని ఎత్తేయాలని కోరుతూ కేంద్ర మంత్రి తోమర్‌కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగుకు పూర్తి సహకారం అందిస్తామని తోమర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ, 3–4 సంవత్సరాలలో తెలంగాణ దేశంలోనే అతిపెద్ద ఆయిల్ పామ్ ఉత్పత్తి ప్రాంతంగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు ఉత్పత్తి సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల పంపిణీ కూడా జరిగింది. అంతకుముందు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ ప్రభుత్వ దార్శనికతను వివరించారు.