తాడేపల్లిగూడెం: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం ప్రభావం వంట నూనెలపై పడింది. రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి పామాయిల్, పొద్దు తిరుగుడు నూనెల (సన్‌ఫ్లవర్ ఆయిల్)దిగుమతి భారత్‌కు దాదాపుగా ఆగిపోయింది. మన దేశానికి రష్యా, ఉక్రెయిన్, మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి పామ్‌క్రూడ్, పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతాయి. ఇండోనేషియా డొమెస్టిక్ సేల్స్ పేరిట పామ్‌క్రూడ్, పామాయిల్‌ను ఇతర దేశాలకు పంపించడం లేదు. రష్యా నుంచి 30 శాతం, ఉక్రెయిన్ నుంచి 70 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్ మనకు దిగుమతి అవుతుంది. కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల మీదుగా ఈ నూనెలు తెలుగు రాష్ట్రాల ప్రజల అవసరాల నిమిత్తం దిగుమతి చేస్తారు. మలేషియా, ఇండోనేషియా నుంచి పామాయిల్, పామ్‌క్రూడ్ దిగుమతి అవుతాయి. మార్కెట్ పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఆయా దేశాల నుంచి నూనెల దిగుమతులు తగ్గాయి. ఉన్నట్టుండి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తెరపైకి రావడంతో ఈ ప్రభావం నూనెల ధరలపై పడింది.
లీటరుకు రూ.30 నుంచి రూ.40 పెరుగుదల
దిగుమతులు తగ్గడంతో వంట నూనెల ధర వారం రోజుల వ్యవధిలో లీటరుకు ఏకంగా రూ.30 నుంచి రూ.40 వరకు పెరిగింది. పామాయిల్ ధర లీటరు రూ.115 నుంచి రూ.145కు చేరింది. మార్కెట్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ నిల్వలు నిండుకోగా.. లీటరు ధర రూ.130 నుంచి రూ.170కి ఎగబాకింది. ధరలకు «రెక్కలు రావడంతో స్థానికంగా లభించే రైస్‌బ్రాన్ ఆయిల్ ధర కూడా పెరిగింది. లీటర్ రూ.145 నుంచి రూ.170కి చేరింది. వేరుశనగ నూనె ధర లీటరు రూ.139 నుంచి రూ.165కు పెరిగింది. పెరిగిన ధరలతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.
దిగుమతిదారుల వద్దే నిల్వలు
రష్యా, ఉక్రెయిన్, మలేషియా, ఇండోనేషియా నుంచి పామ్‌క్రూడ్, పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెలను దిగుమతి చేసుకున్న ఐదారు కంపెనీలు నిల్వలను తమ వద్దే ఉంచుకున్నాయి. యుద్ధ ప్రభావం వల్ల రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి నిలిచిపోయింది. ఇండోనేషియాలో స్థానిక అవసరాల నిమిత్తం డొమెస్టిక్ సేల్స్ పేరిట ఎగుమతులను ఆ దేశం నిలిపివేసింది. మలేషియాలోనూ ఇదే పరిస్థితి. దీంతో ఫిబ్రవరి మొదటి వారం వరకు కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు దిగుమతి అయిన ఈ నూనెలు అక్కడే ఉండిపోయాయి. భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దిగుమతిదారులు ఆచితూచి సరుకును గుత్త వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. దీంతో నూనెల కొరత మార్కెట్‌ను వెంటాడుతోంది. రాష్ట్రంలోని గుత్త, రిటైల్ వ్యాపారుల వద్ద నూనెల నిల్వలు దాదాపుగా అయిపోతున్నాయి. దిగుమతిదారుల నుంచి సరుకు వచ్చే అవకాశాలు తగ్గాయి. దీంతో ఉన్న సరుకు హాట్‌కేక్‌లా అమ్ముడుపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment