ముంబై: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం భారత్‌కు భారీ షాక్ తగలనుంది. యుద్ధం కారణంగా ముడి పొద్దు తిరుగుడు నూనె (సన్‌ఫ్లవర్ ఆయిల్) సరఫరాపై ప్రభావం ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడించింది. ‘భారత్‌కు దిగుమతి అవుతున్న ముడి పొద్దు తిరుగుడు నూనెలో ఉక్రెయిన్ వాటా 70 శాతం, రష్యా నుంచి 20 శాతం సమకూరుతోంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి ముడి సన్‌ఫ్లవర్ అయిల్ సరఫరా 25 శాతం తగ్గనుంది. అంటే 4–6 లక్షల టన్నుల కొరత ఏర్పడుతుంది.
దేశీయంగా వంట నూనెలను ప్రాసెస్ చేసే సంస్థల జమ, ఖర్చుల పట్టీ సరఫరా అంతరాయాలను తట్టుకునేంత పటిష్టంగా ఉంటుంది. కానీ వీటి ఉత్పత్తి ప్రణాళికపై ప్రభావం చూపుతాయి’ అని క్రిసిల్ వివరించింది. ముడి వంట నూనెల దిగుమతుల్లో 75 శాతం వాటా సోయాబీన్, పామాయిల్ కైవసం చేసుకున్నాయి. శుద్ధి చేసిన వంట నూనెల సగటు ధర ఏడాదిలో 25 శాతం అధికమైంది.
ఇతర నూనెలపై..
దేశంలో ఏటా 230–240 లక్షల టన్నుల వంట నూనెల వినియోగం అవుతోంది. ఇందులో సన్‌ఫ్లవర్ వాటా 10 శాతం. డిమాండ్‌లో 60 శాతం దిగుమతులే దిక్కు. దేశీయ ప్రాసెసింగ్ కంపెనీలు సాధారణంగా 30–45 రోజులకు సరిపడ ముడి పదార్థాలను నిల్వ చేస్తాయి. ఇది తక్షణ కాలంలో సరఫరా ఇబ్బందులను అధిగమించడంలో సహాయపడుతుంది. యుద్ధం కొనసాగితే సరఫరా, ధరలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో అర్జెంటీనా నుంచి ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. బ్రెజిల్‌లో పంట దిగుబడి లేక ముడి సోయాబీన్ నూనె ధర చాలా పెరిగింది. ఇండేనేషియా, మలేషియాలో ఉత్పత్తి తగ్గి ముడి పామాయిల్ ధర దూసుకెళ్లింది.
అయితే కొరతను అధిగమించే స్థాయిలో సరఫరా లేకపోవడంతో ప్రాసెసింగ్ కంపెనీలు ఇతర నూనెలపై దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ సంయుక్తంగా ఏటా 100 లక్షల టన్నుల ముడి పొద్దు తిరుగుడు నూనెను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి’ అని క్రిసిల్ తన నివేదికలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment