Sunflower oil
-
‘సన్‌ఫ్లవర్’ సలసలా
తాడేపల్లిగూడెం: సన్‌ఫ్లవర్ నూనెకు ధరల స్ట్రోక్ తగిలింది. ఇటీవలి కాలంలో పామాయిల్ కంటే తక్కువ రేటుకు పడిపోయిన ఈ నూనె ధరలు ఇప్పుడు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. పామాయిల్, పామ్ క్రూడ్, రిఫైన్డ్ పామాయిల్ మలేసియా, ఇండోనేíÙయా దేశాల నుంచి దిగుమతి అవుతాయి. మలేసియాలో పంట దిగుబడులు, కూలీల లభ్యత, వాతావరణ పరిస్థితుల ఆధారంగా, అంతర్జాతీయ విపణి సూత్రం ఆధారంగా డాలర్ల ధరల్లో వ్యత్యాసాలతో పామాయిల్ ధరలు ప్రభావితమయ్యేవి. రిఫైన్డ్ పామాయిల్ దిగుమతి ఖర్చుతో కూడుకునే వ్యవహారం కావడంతో, పామ్ క్రూడ్‌ను మాత్రమే రాష్ట్రంలోని కాకినాడ, కృష్ణపట్నం వంటి పోర్టుల ద్వారా దిగుమతి చేసుకునేవారు.ఈ పోర్టుల సమీపంలో ఉండే నూనె శుద్ధి కర్మాగారాలు (రిఫైనరీలు) పామ్ క్రూడ్‌ను శుద్ధిచేసి మార్కెట్లకు పంపించేవి. ఒకప్పుడు ఆకాశాన్నంటిన పామాయిల్ ధరలు ఇటీవల దాదాపుగా దిగొచ్చాయి. పామాయిల్‌తో పోల్చుకుంటే సన్‌ఫ్లవర్ నూనె ధర ఎక్కువగా ఉండేది. దీనికి భిన్నంగా పామాయిల్ ధర కంటే దిగువకు సన్‌ఫ్లవర్ నూనె దిగింది. అంతర్జాతీయ విపణిలో మార్పుల నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా సన్‌ఫ్లవర్ నూనె ధర పెరిగింది. ఉక్రెయిన్ ప్రభావం సన్‌ఫ్లవర్ ఎక్కువగా మన ప్రాంతానికి ఉక్రెయిన్ నుంచి దిగుమతి అవుతుంది. అక్కడ ఉత్పత్తులు పడిపోయిన కారణంగా రష్యా నుంచి ఈ నూనెను దిగుమతి చేసుకుంటున్నారు. ఉక్రెయిన్ కంటే భారతదేశానికి రష్యా మీదుగా నూనెను రవాణా చేయడంతో ఖర్చు అధికం అవుతోంది. ప్రీమియంగా పేర్కొనే ధర టన్నుకు వంద డాలర్లు పెరుగుతోంది. దీంతో గుత్త మార్కెట్లో టన్నుకు రూ.200కు పైబడి ధర పెరుగుతోంది. ఈ ధర ఇటీవల పెరుగుతూ వెళ్తోంది. రష్యా నుంచి సన్‌ఫ్లవర్ నూనెను దిగుమతి చేసుకోవాల్సిందే. ఈ పరిస్థితి సెపె్టంబరు వరకు ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నిర్ణిత కొలతలు లేవు గతంలో మాదిరిగా నూనెలకు నిర్ణీత కొలతలు లేవు. కిలో, అరకిలో, లీటరు వంటి ప్యాకింగ్‌లకు కాలం చెల్లింది. ఫుడ్ అండ్ వెయిట్ అండ్ మెజర్స్ నిబంధనల్లో ఇటీవల కేంద్రం మార్పులతో చట్టం చేసింది. దీంతో ప్యాకింగ్ ఎంతైనా చేసుకోవచ్చు. ప్యాకెట్‌పై మాత్రం కొలత, గ్రాము ధర ఎంతనే వివరాలు కచ్చితంగా ఉండాలి. ఈ కారణంగా మార్కెట్లో లీటర్ పౌచ్‌లు లేవు. 850 గ్రాముల నూనె ప్యాకెట్లు మాత్రమే దొరుకుతున్నాయి. సన్‌ఫ్లవర్ ప్యాకెట్ రూ.110 ప్రస్తుతం మార్కెట్లో సన్‌ఫ్లవర్ ప్యాకెట్ ధర రూ.110లు ఉంది. గతంలో ఈ ధర రూ.86కు పడిపోయింది. పామాయిల్ 850 గ్రాముల ధర రూ.86లు ఉంది. రైస్‌బ్రాన్ ఆయిల్ ప్యాకెట్ రూ.115లు, వేరుశనగ నూనె ప్యాకెట్ రూ.160లు ఉంది. ఈ ధరలు సెపె్టంబరు వరకు ఇదే రకంగా ఉండే అవకాశాలున్నాయి. రష్యా నుంచి దిగుమతి వల్లే ధర పెరుగుదల మార్కెట్లో సన్‌ఫ్లవర్ నూనెల ధరలు సెప్టెంబరు వరకు ఇదే విధంగా ఉండే అవకాశాలున్నాయి. ఉక్రెయిన్ నుంచి కాకుండా రష్యా నుంచి సన్‌ఫ్లవర్ నూనె దిగుమతి అవుతున్నందున మార్కెట్లో ఈ నూనె ధర పెరిగింది. – పవన్, వ్యాపారి, తాడేపల్లిగూడెం -
ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ 10 లీటర్ల రిలీజ్
-
భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు
-
రూ.280 కోట్లతో ‘కార్గిల్’ వంటనూనెల శుద్ధి కర్మాగారం
సాక్షి, అమరావతి: ప్రముఖ ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ కార్గిల్ ఇండియా తమ దక్షిణ భారతదేశ వ్యాపార విస్తరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేదికగా ఎంచుకున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ.280 కోట్లతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ప్రపంచస్థాయి ప్రమాణాలతో వివిధ వంట నూనెల తయారీ కేంద్రాన్ని కొనుగోలు చేసి ఆధునీకరించినట్లు తెలిపింది. బుధవారం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘జెమిని ప్యూరిట్’ బ్రాండ్ పేరుతో సన్‌ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా కార్గిల్ ఇండియా ఇన్‌గ్రిడియంట్స్ (దక్షిణాసియా) కన్జూమర్ బిజినెస్ లీడర్ అవినాష్ త్రిపాఠి మాట్లాడుతూ దేశవ్యాప్త సన్‌ఫ్లవర్ వినియోగంలో 70 శాతం దక్షిణ భారతదేశంలోనే జరుగుతోందని, దీంతో దక్షిణ దేశ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ‘జెమిని ప్యూరిట్’ని విజయవాడలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణపట్నం వద్ద సన్‌ఫ్లవర్, రిఫైండ్ పామాయిల్, పామోలిన్, వనస్పతి, బేకరీ షార్టెనింగ్స్‌ను తయారు చేసి అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం దేశంలోనే అతిపెద్ద 4.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
నెంబర్‌వన్ బ్రాండ్‌గా ఫ్రీడమ్ రిఫైండ్
హైదరాబాద్: సన్‌ఫ్లవర్ ఆయిల్ విభాగం అమ్మకాల్లో ‘ఫ్రీడమ్’ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దేశంలోనే అగ్రగామి బ్రాండ్‌గా నిలిచింది. రాజీలేని నాణ్యత, ఉత్పత్తిలో స్థిరత్వం, విస్తృతస్థాయి పంపిణీ నెట్వర్క్, ఫ్రీడమ్ బ్రాండ్ల పట్ల కస్టమర్లకు ఉన్న నమ్మకంతోనే ఈ ఘనత సాధించినట్లు కంపెనీ తెలిపింది. ‘‘సన్‌ఫ్లవర్ ఆయిల్ విభాగపు మార్కెట్లో 20.5శాతం వాటాను సొంతం చేసుకొని దేశంలోనే నెంబర్ వన్ బ్రాండ్‌గా నిలువడం సంతోషంగా ఉంది’’ అని జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ చౌదరి తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఫ్రీడమ్ బ్రాండ్‌ను దేశమంతా విస్తరించేందుకు వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గత దశాబ్ద కాలంగా కస్టమర్లు చూపుతున్న విశ్వాసం, అందిస్తున్న మద్దతు, ప్రోత్సాహానికి ఆయిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ శ్రీ పీ చంద్రశేఖర రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, భారత్‌కు భారీ షాక్!
ముంబై: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం భారత్‌కు భారీ షాక్ తగలనుంది. యుద్ధం కారణంగా ముడి పొద్దు తిరుగుడు నూనె (సన్‌ఫ్లవర్ ఆయిల్) సరఫరాపై ప్రభావం ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడించింది. ‘భారత్‌కు దిగుమతి అవుతున్న ముడి పొద్దు తిరుగుడు నూనెలో ఉక్రెయిన్ వాటా 70 శాతం, రష్యా నుంచి 20 శాతం సమకూరుతోంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి ముడి సన్‌ఫ్లవర్ అయిల్ సరఫరా 25 శాతం తగ్గనుంది. అంటే 4–6 లక్షల టన్నుల కొరత ఏర్పడుతుంది. దేశీయంగా వంట నూనెలను ప్రాసెస్ చేసే సంస్థల జమ, ఖర్చుల పట్టీ సరఫరా అంతరాయాలను తట్టుకునేంత పటిష్టంగా ఉంటుంది. కానీ వీటి ఉత్పత్తి ప్రణాళికపై ప్రభావం చూపుతాయి’ అని క్రిసిల్ వివరించింది. ముడి వంట నూనెల దిగుమతుల్లో 75 శాతం వాటా సోయాబీన్, పామాయిల్ కైవసం చేసుకున్నాయి. శుద్ధి చేసిన వంట నూనెల సగటు ధర ఏడాదిలో 25 శాతం అధికమైంది. ఇతర నూనెలపై.. దేశంలో ఏటా 230–240 లక్షల టన్నుల వంట నూనెల వినియోగం అవుతోంది. ఇందులో సన్‌ఫ్లవర్ వాటా 10 శాతం. డిమాండ్‌లో 60 శాతం దిగుమతులే దిక్కు. దేశీయ ప్రాసెసింగ్ కంపెనీలు సాధారణంగా 30–45 రోజులకు సరిపడ ముడి పదార్థాలను నిల్వ చేస్తాయి. ఇది తక్షణ కాలంలో సరఫరా ఇబ్బందులను అధిగమించడంలో సహాయపడుతుంది. యుద్ధం కొనసాగితే సరఫరా, ధరలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో అర్జెంటీనా నుంచి ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. బ్రెజిల్లో పంట దిగుబడి లేక ముడి సోయాబీన్ నూనె ధర చాలా పెరిగింది. ఇండేనేషియా, మలేషియాలో ఉత్పత్తి తగ్గి ముడి పామాయిల్ ధర దూసుకెళ్లింది. అయితే కొరతను అధిగమించే స్థాయిలో సరఫరా లేకపోవడంతో ప్రాసెసింగ్ కంపెనీలు ఇతర నూనెలపై దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ సంయుక్తంగా ఏటా 100 లక్షల టన్నుల ముడి పొద్దు తిరుగుడు నూనెను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి’ అని క్రిసిల్ తన నివేదికలో తెలిపింది. -
ఆల్‌టైం రికార్డు ధరకు సన్‌ఫ్లవర్ ఆయిల్...!
ఉక్రెయిన్-రష్యా వార్ నేపథ్యంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. డిమాండ్‌కు తగ్గట్లుగా సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను సమకూర్చేందుకుగాను కేంద్ర ప్రభుత్వం పలు చర్యలను తీసుకునేందుకు సిద్దమైంది. ఉక్రెయిన్ నో అంది రష్యాకు సై..! భారత్‌లో సన్‌ఫ్లవర్ ధరలు భారీగా పెరగడంతో సామాన్యులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య నెలకొన్న యుద్దంతో సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు భారీ డిమాండ్ నెలకొంది. కాగా భారత్‌కు సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను సరఫరా చేయడం ఉక్రెయిన్ ఆపివేసింది. దీంతో సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతిలో భాగంగా ఉక్రెయిన్‌కు ప్రత్యామ్నాయంగా రష్యాను సంప్రదించాలని భారత్ భావించగా అందుకోసం రష్యా నుంచి 45 వేల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్‌ను కొనుగోలు చేసుకునేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్నడూలేనంతగా రికార్డు ధరకు ఈ సన్ ఫ్లవర్ ఆయిల్ షిప్మెంట్లను భారత్ కొనుగోలు చేసినట్లు సమాచారం. రికార్డు ధరకు సన్‌ఫ్లవర్ ఆయిల్ సన్‌ఫ్లవర్ సరఫరాను ఉక్రెయిన్ నిలిపివేయండంతో భారత్ రష్యా వైపుగా వెళ్లాల్సి వచ్చిందని జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి చెప్పారు. ఈ క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆల్‌టైం రికార్డు ధర ఒక టన్నుకు 2,150 డాలర్లు పలికినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ రష్యా వార్‌కు ముందు ఒక టన్ను సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను 1,630 డాలర్లకు భారత్ దిగుమతి చేసుకుంది. చదవండి: ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై బిమ్స్టెక్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు -
సామాన్యులకు భారీ షాక్, వంట నూనె రేట్లు మరింత పైకి!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో మన దేశంలో వంట నూనెల ధరలు గతంలో ఎన్నడూ లేని రోజు రోజుకీ ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ - రష్యా సంక్షోభం ప్రారంభమైన ఫిబ్రవరి నెల నుంచి భారత్‌లో వంట నూనెల ధరలు అంతకంతకూ పెరుగుతున్నట్లు రిటైల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ బిజోమ్ డేటా తెలిపింది. బ్రాండెడ్ సన్ ఫ్లవర్, వనస్పతి, ఆవాలు, వేరుశెనగ నూనె ధరలు పెరుగుతున్నాయని, రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. రష్యా - ఉక్రెయిన్ దేశాలు సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరా చేసే ప్రధాన దేశాలలో ఉక్రెయిన్, రష్యా దేశాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వంట నూనెల రవాణా చేస్తూ డిమాండ్‌ను తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రెండు దేశాలు ప్రతి ఏడాది భారత్‌కు 2.5 నుంచి 3 మిలియన్ టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేస్తున్నాయి. ఇందులో దాదాపు 70% ఉక్రెయిన్ నుండి వస్తుందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ఇలా మొత్తంగా ఉక్రెయిన్, రష్యాలు కలిసి గతేడాది ఎడిబుల్ ఆయిల్ ను 1.6 మిలియన్ టన్నులను సరఫరా చేస్తూ.. దిగుమతుల్లో దాదాపు 13% వాటాను కలిగి ఉన్నాయి. అయితే ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న కారణంగా భారత్‌లో వంట నూనెల ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగినట్లు బిజోమ్ అంచనా వేసింది. దేశంలోని 7.5 మిలియన్ల రిటైల్ అవుట్లెట్లలో ప్యాక్ చేసిన వినియోగ వస్తువుల విక్రయాల ఆధారంగా ప్యాకేజ్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు ఫిబ్రవరిలో వరుసగా 4% పెరిగాయి. అయితే మస్టర్డ్ ఆయిల్ 8.7%, సోయాబీన్ నూనె ధరలు స్వల్పంగా 0.4% తగ్గగా, వనస్పతి 2.7% పెరిగింది. వేరుశెనగ నూనె 1% పెరగ్గా.. భారతీయ గృహాలలో విస్తృతంగా వినియోగించే పామాయిల్ ధరలు 12.9% తగ్గాయి. ఫిబ్రవరి 2020తో పోలిస్తే పామాయిల్ ధరలు ఇప్పటికీ 22.9% పెరిగాయి. కొంచెం సర్ధుబాటు భారతదేశంలో ఎడిబుల్ ఆయిల్ ధరలు సెప్టెంబరు, డిసెంబర్ త్రైమాసికం మధ్య కొంత దిద్దుబాటుకు గురయ్యాయి. జనవరి నెలలో బిజోమ్ డేటా ప్రకారం.. గత రెండు సంవత్సరాల గరిష్ట స్థాయి నుండి ధరలను 10-30% సడలింపుగా సూచించింది. అయినప్పటికీ, ఫిబ్రవరి నెల చివరలో ఉక్రెయిన్‌లో జరిగిన వివాదం వంట నూనెతో సహా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా ఒత్తిడి తెచ్చింది. ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా గత రెండు త్రైమాసికాలుగా ఎడిబుల్ ఆయిల్ ధరలు కొంత స్థిరత్వాన్ని కనబరుస్తున్నాయని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆ ధోరణిని మార్చడానికి దారితీసిందని బిజోమ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అక్షయ్ డిసౌజా అన్నారు. మార్చిలో రిలీజ్ కానీ డేటా ఎడిబుల్ ఆయిల్ ధరలు సంవత్సరానికి 15-20% పెరిగాయని, మార్చి 17న విడుదల చేసిన ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ట్రాకర్ నివేదిక బీఎన్పీ పారిబాస్ ఇండియా హెడ్ కునాల్ వోరా తెలిపారు. చాలా ఎడిబుల్ ఆయిల్స్ ధరలు ఇప్పటికీ ప్రీ-కోవిడ్ స్థాయిలు. ప్రీ-కోవిడ్ కాలంతో పోలిస్తే లేదా ఫిబ్రవరి 2020, ఉదాహరణకు, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర 50%, వనస్పతి నూనె 58% పెరిగింది, సోయాబీన్ నూనె దాదాపు 20% పెరిగింది. -
వంట నూనెలు భగభగ.. వార్తో ‘వంద’ పెరిగింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వంట నూనెలు భగభగమండుతున్నాయి. లీటర్ పొద్దుతిరుగుడు నూనె ప్యాకెట్ ధర నెలరోజుల్లో దాదాపుగా రూ.100 పెరిగింది. గత నెలలో రూ.120 నుంచి రూ.130 ఉన్న నూనె ధరలు ఏకంగా రూ. 225 వరకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లోని హోల్‌సేల్ మార్కెట్లలో కూడా ఎప్పటికప్పుడు కొత్త ఎంఆర్పీ ధరల స్టిక్కర్లతో సన్‌ఫ్లవర్ నూనెలను విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఇక్కడ నూనె తయారీ సంస్థలే ఎంఆర్పీ ధరలను సవరిస్తూ విక్రయిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. యుద్ధం నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ నుంచి సన్‌ఫ్లవర్ ముడి చమురు కంటెయినర్లు ఇప్పట్లో తయారీ సంస్థల వద్దకు రావని అర్థం కావడంతో, మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను ఆధారం చేసుకొని 5 నుంచి 7రోజులకోసారి ఎంఆర్పీలను సవరించి మార్కెట్లకు పంపిస్తున్నారు. తద్వారా ఈరోజు ఉన్న ధర రేపు ఉండని పరిస్థితి. ఇతర కంపెనీలతో పాటే ప్రభుత్వ సంస్థ ‘విజయ’కూడా సన్‌ఫ్లవర్ నూనె ధరను రూ. 225గా ప్రింట్ చేసి విక్రయిస్తోంది. వారం క్రితం విజయ ఎంఆర్పీ రూ.196 మాత్రమే. వేరుశనగ, రైస్‌బ్రాన్, సోయాబీన్ ధర పెరిగినా రూ.170 నుంచి రూ. 180 ఎంఆర్‌పీగా ఉన్నాయి. పామాయిల్ నూనె లీటర్‌కు రూ. 150 నుంచి రూ. 160కి విక్రయిస్తున్నారు. పామాయిల్ ధరలు నెల క్రితంతో పోలిస్తే 20 రూపాయల వరకు పెరగగా, దీని వినియోగం రాష్ట్రంలో పెరిగింది. సూపర్ మార్కెట్లు, హోల్‌సేల్ వ్యాపారులు కూడా నూనెలపై డిస్కౌంట్ సేల్ ఎత్తేసి ఎంఆర్పీకే విక్రయిస్తున్నారు. సన్‌ఫ్లవర్‌తో పోలిస్తే ఇతర నూనెల ధరలు అంతగా పెరగకపోవడంతో పల్లి నూనె, రైస్‌బ్రాన్, సోయాబీన్, పామాయిల్ నూనెల వైపు ప్రజలు మరలుతున్నారని మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. దీంతో ఈ నూనెల ధరలు పెంచడంపైనా కంపెనీలు దృష్టిపెట్టాయి. ఇప్పటికే బ్లాక్ మార్కెట్‌కు తరలించిన ఏజెన్సీలు త్వరలోనే కొత్త ధరలను ప్రింట్ చేసి మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమచారం. స్టిక్కర్లు మార్చి... ఈ ఫొటోలో ఉన్న ఓ కంపెనీకి చెందిన సన్‌ఫ్లవర్ నూనె ప్యాకెట్లు పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఓ సూపర్ మార్కెట్‌లోనివి. ఆ కంపెనీ నూనె ప్యాకెట్ ధర వారం రోజుల క్రితం ఎంఆర్పీ రూ.175 ఉండగా, ప్రస్తుతం 217కి చేరింది. అయితే ఆ సూపర్ మార్కెట్ యజమాని నిల్వ ఉన్న ప్యాకెట్లపై పాతరేట్లను తొలగించి రూ. 205 ధరతో కొత్త స్టిక్కర్లు వేసి విక్రయించాడు. ఇది పెద్దపల్లి జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇదే దందా. -
వంట నూనెలకు యుద్ధం సెగ
తాడేపల్లిగూడెం: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం ప్రభావం వంట నూనెలపై పడింది. రష్యా, ఉక్రెయిన్ల నుంచి పామాయిల్, పొద్దు తిరుగుడు నూనెల (సన్‌ఫ్లవర్ ఆయిల్)దిగుమతి భారత్‌కు దాదాపుగా ఆగిపోయింది. మన దేశానికి రష్యా, ఉక్రెయిన్, మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి పామ్‌క్రూడ్, పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతాయి. ఇండోనేషియా డొమెస్టిక్ సేల్స్ పేరిట పామ్‌క్రూడ్, పామాయిల్‌ను ఇతర దేశాలకు పంపించడం లేదు. రష్యా నుంచి 30 శాతం, ఉక్రెయిన్ నుంచి 70 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్ మనకు దిగుమతి అవుతుంది. కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల మీదుగా ఈ నూనెలు తెలుగు రాష్ట్రాల ప్రజల అవసరాల నిమిత్తం దిగుమతి చేస్తారు. మలేషియా, ఇండోనేషియా నుంచి పామాయిల్, పామ్‌క్రూడ్ దిగుమతి అవుతాయి. మార్కెట్ పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఆయా దేశాల నుంచి నూనెల దిగుమతులు తగ్గాయి. ఉన్నట్టుండి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తెరపైకి రావడంతో ఈ ప్రభావం నూనెల ధరలపై పడింది. లీటరుకు రూ.30 నుంచి రూ.40 పెరుగుదల దిగుమతులు తగ్గడంతో వంట నూనెల ధర వారం రోజుల వ్యవధిలో లీటరుకు ఏకంగా రూ.30 నుంచి రూ.40 వరకు పెరిగింది. పామాయిల్ ధర లీటరు రూ.115 నుంచి రూ.145కు చేరింది. మార్కెట్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ నిల్వలు నిండుకోగా.. లీటరు ధర రూ.130 నుంచి రూ.170కి ఎగబాకింది. ధరలకు «రెక్కలు రావడంతో స్థానికంగా లభించే రైస్‌బ్రాన్ ఆయిల్ ధర కూడా పెరిగింది. లీటర్ రూ.145 నుంచి రూ.170కి చేరింది. వేరుశనగ నూనె ధర లీటరు రూ.139 నుంచి రూ.165కు పెరిగింది. పెరిగిన ధరలతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దిగుమతిదారుల వద్దే నిల్వలు రష్యా, ఉక్రెయిన్, మలేషియా, ఇండోనేషియా నుంచి పామ్‌క్రూడ్, పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెలను దిగుమతి చేసుకున్న ఐదారు కంపెనీలు నిల్వలను తమ వద్దే ఉంచుకున్నాయి. యుద్ధ ప్రభావం వల్ల రష్యా, ఉక్రెయిన్ల నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి నిలిచిపోయింది. ఇండోనేషియాలో స్థానిక అవసరాల నిమిత్తం డొమెస్టిక్ సేల్స్ పేరిట ఎగుమతులను ఆ దేశం నిలిపివేసింది. మలేషియాలోనూ ఇదే పరిస్థితి. దీంతో ఫిబ్రవరి మొదటి వారం వరకు కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు దిగుమతి అయిన ఈ నూనెలు అక్కడే ఉండిపోయాయి. భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దిగుమతిదారులు ఆచితూచి సరుకును గుత్త వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. దీంతో నూనెల కొరత మార్కెట్‌ను వెంటాడుతోంది. రాష్ట్రంలోని గుత్త, రిటైల్ వ్యాపారుల వద్ద నూనెల నిల్వలు దాదాపుగా అయిపోతున్నాయి. దిగుమతిదారుల నుంచి సరుకు వచ్చే అవకాశాలు తగ్గాయి. దీంతో ఉన్న సరుకు హాట్‌కేక్‌లా అమ్ముడుపోతోంది. -
రష్యా ఉక్రెయిన్ వివాదం: భారతీయులకు మరోసారి షాక్ తప్పదా?
Ukraine Crisis Effect: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య వివాదం ఇప్పుడు ప్రపంచ దేశాల్ని కలవరపెడుతోంది. ఈ దేశాల మధ్య నెలకొన్న సంక్షోభం ప్రపంచ మార్కెట్లను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడు ఈ దేశాల మధ్య నెలకొన్న సంక్షోభం భారతీయుల వంటిళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా పెరగనున్న ధరలు..! ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదంతో వంట నూనె ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఉక్రెయిన్ తో గల సంబంధమే. మనదేశంలో ఎంతో డిమాండ్ ఉన్నటువంటి సన్ ఫ్లవర్ నూనెను ఉక్రెయిన్ నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో ఉక్రెయిన్ సంక్షోభం వల్ల ఆయిల్ కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కొరత ప్రభావంతో భారత మార్కెట్లలో సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు భారీగా పెరగనున్నాయి. రష్యా, అర్జెంటీనావంటి దేశాల ద్వారా భారత మార్కెట్లోకి సన్ ఫ్లవర్ వంట నూనె దిగుమతి అవుతోంది. అయితే ఉక్రెయిన్, రష్యా వివాదం వల్ల ఇప్పుడు ఈ దిగుమతి దాదాపుగా ఆగిపోనుంది. ఇండియాలో సన్‌ఫ్లవర్ కుకింగ్ ఆయిల్ దిగుమతికి ఉక్రెయిన్ ప్రధాన ఆధారంగా ఉంది. సన్ ఫ్లవర్ వాడకం ఎక్కువ..! మనదేశంలో ఉపయోగించే వంట నూనెల్లో సన్ ఫ్లవర్ నూనే ఎక్కువగా ఉంటుంది. పామ్ ఆయిల్ తర్వాత సన్ ఫ్లవర్ ఆయిల్‌ను ఇండియాలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. గతేడాది ఇండియా సుమారు 1.89 మిలియన్ టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. ఇందులో 74 శాతం దాకా ఆయిల్ ఉక్రెయిన్ నుంచి ఇండియాకు వచ్చింది. కాగా క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడం వల్ల ఉక్రెయిన్‌లో సంక్షోభం ఏర్పడడం.. తద్వారా సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై కూడా ప్రభావం పడింది. ఉక్రెయిన్, రష్యాల మధ్య కొనసాగుతోన్న రాజకీయ ఉద్రిక్తతల వల్ల సన్ ఫ్లవర్ ఆయిల్ రిటైల్ ధరలు పెరగడమే కాకుండా, సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. -
భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. రిటైల్ మార్కెట్లో రేట్లు ఇలా..!
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం వంటనూనె ధరలు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యవసర సరుకుల ధరలతో సతమతమవుతున్న జనాలకు వంటనూనె ధరలు కొద్దిగా ఊరట కలిగిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. దేశంలోని రిటైల్ మార్కెట్లో వంట నూనె ధరలు భారీగా తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రధాన రిటైల్ మార్కెట్లలో కిలో వంటనూనెపై రూ.5-20 వరకు ధరలు తగ్గినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. రిటైల్ మార్కెట్లో వేరుశెనగ నూనె ఆల్ ఇండియా సగటు రిటైల్ ధర కిలో రూ.180, ఆవనూనె కిలో రూ.184.59, సోయా ఆయిల్ కిలో రూ.148.85, సన్ ఫ్లవర్ ఆయిల్ కిలో 162.4, పామాయిల్ కిలో ధర రూ.128.5గా ఉన్నట్లు తెలిపింది. అయితే, అక్టోబర్ 1, 2021న ఉన్న ధరలతో పోలిస్తే వేరుశెనగ & ఆవనూనెల రిటైల్ ధరలు కిలోకు రూ.1.50-3 తగ్గాయి. సోయా & సన్ ఫ్లవర్ నూనెల ధరలు కిలోకు రూ.7-8 తగ్గినట్లు కేంద్రం తెలిపింది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అదానీ విల్మార్, రుచి ఇండస్ట్రీస్ కంపెనీలతో సహా ఇతర ప్రధాన వంట నూనె కంపెనీలు లీటరుకు రూ.15-20 ధరలను తగ్గించాయి. వంటనూనెల ధరలను తగ్గించిన కంపెనీలలో జెమిని ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా, హైదరాబాద్, మోడీ నేచురల్స్, ఢిల్లీ, గోకుల్ రీ-ఫాయిల్స్ మరియు సాల్వెంట్, విజయ్ సాల్వక్స్, గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ ఉన్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్లో కమోడిటీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, వంటనూనె ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో వాటి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత సంవత్సరం భారీగా ఉన్న నూనె ధరలు.. అక్టోబర్ 2021 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. వంట నూనెల మీద దిగుమతి సుంకాలు తగ్గించడం, నకిలీ నిల్వలను నిరోధించేందుకు స్టాక్ పరిమితులపై ఆంక్షలు విధించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టడంతో వంట నూనెల ధరలు తగ్గడానికి ఒక కారణం. వంటనూనెల విషయంలో దేశం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుండటంతో.. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి పెంచడానికి సిద్దం అయ్యింది. అందుకు తగ్గట్టుగా మిషన్ ఆఫ్ ఆయిల్‌పామ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఈ మిషన్ ఆయిల్‌పామ్ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. (చదవండి: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్..! వాటిపై 80 శాతం డిస్కౌంట్) -
పండుగ వేళ ప్రజలకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం సోయాబీన్, సన్ ఫ్లవర్, ముడి పామ్ ఆయిల్ పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే మార్చి 2022 వరకు వీటిపై విధిస్తున్న అగ్రి సెస్ కూడా తొలగించినట్లు పేర్కొంది. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పండుగ సీజన్లో వంట నూనె ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు అనేది అక్టోబర్ 14 నుంచి మార్చి 31, 2022 వరకు అమల్లో ఉంటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ)ఒక నోటిఫికేషన్ లో తెలిపింది. ఈ సుంకం తగ్గింపు తర్వాత పామాయిల్, సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్ ముడి రకాలపై కస్టమ్స్ సుంకం వరుసగా 8.25 శాతం, 5.5 శాతం, 5.5 శాతంగా ఉంటుంది. అంతేగాకుండా, శుద్ధి చేసిన రకాల పొద్దు తిరుగుడు, సోయాబీన్, పామోలిన్, పామాయిల్ నూనెపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గించారు. "పండుగ సీజన్లో అధిక ధరల కారణంగా ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాలను తగ్గించింది" అని సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బివీ మెహతా తెలిపారు.(చదవండి: 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్‌ను ముంచే విధ్వంసం) -
పొద్దుతిరుగుడు పువ్వు నూనె కొండెక్కి కూచుంది!
సాక్షి, న్యూఢిల్లీ: మెజారిటీ మధ్య తరగతి ప్రజలు వంట నూనెగా వినియోగించే పొద్దుతిరుగుడు పువ్వు నూనె కొండెక్కి కూచుంది. గడిచిన ఏడెనిమిది మాసాల్లో వంట నూనెల ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర 70 శాతం వరకు పెరిగింది. ఉత్తరాదిన ఎక్కువగా వినియోగించి ఆవ నూనె, సోయాబీన్ నూనె ధరలు 50 శాతం వరకు, రైస్‌బ్రాన్ ఆయిల్ ధర 50 శాతం వరకు, పామాయిల్ ధర 55 శాతం వరకు పెరిగాయి. ఏడాది క్రితం కిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 100 లకు లభించగా, ఇదే నూనె మార్చి 1 నాటికి కిలో ధర రూ. 150కి అటుఇటుగా ఉంది. తాజాగా ఈ నెల రోజుల్లో మరో పది శాతం పెరిగి రూ. 170కి చేరింది. మార్చి 28న ముంబై, భువనేశ్వర్ ప్రాంతాల్లో గరిష్టంగా కిలోకు రూ. 185 గా ఉంది. వేరుశనగ నూనె గరిష్టంగా తిరునల్వేలిలో కిలో ధర రూ. 194గా ఉంది. ఆవ నూనె గరిష్టంగా తిరుపతిలో కిలో ధర రూ. 200గా ఉంది. వనస్పతి గరిష్టంగా దర్బంగాలో కిలో రూ. 150గా ఉంది. ఇక పామాయిల్ గరిష్టంగా భువనేశ్వర్‌లో రూ. 143గా ఉంది. దిగుమతులపైనే ఆధారం.. మన దేశం పెట్రో ఉత్పత్తుల తరహాలోనే వంట నూనెల విషయంలో దిగుమతులపై ఆధారపడి ఉంది. దేశానికి అసవరమయ్యే వంట నూనెల్లో దాదాపు 60 శాతానికి పైగా దిగుమతుల ద్వారా సమకూర్చకుంటోంది. 2015–16 సంవత్సరం నుంచి వరుసగా 14.85 మిలియన్ మెట్రిక్ టన్నులు, 15.32, 14.59, 15.57, 13.34 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర వంట నూనెలు దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా 2015–16 నుంచి ఇప్పటివరకు వరుసగా 8.63 మిలియన్ మెట్రిక్ టన్నులు, 10.09, 10.38, 10.35, 10.65 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర వంట నూనెల లభ్యత ఉంది. 2019–20లో సోయాబీన్ ఆయిల్ 3.38 మిలియన్ టన్నుల మేర దిగుమతి చేసుకుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ 2.52 మిలియన్ టన్నుల మేర దిగుమతి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల నిల్వలు తగ్గి సరఫరా తగ్గడంతో వీటి ధరలు అమాంతం పెరుగుతూ వచ్చాయి. ధరల పెరుగుదల దెబ్బకు వంట నూనెల దిగుమతి తగ్గింది. అంతకుముందు ఏడాది ఫిబ్రవరిలో 10,89,661 టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకోగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 7,96,568 టన్నుల వంట నూనెలు దిగుమతి అయ్యింది. నవంబరు 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్యకాలంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ 7,70,364 టన్నులు దిగు మతి అయింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 9,89,565 టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అయ్యింది. దిగుమతులు తగ్గి సరఫరా తగ్గడంతో మన దేశంలో వాటి ధర మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తుల తగ్గుముఖం ఉక్రెయిన్, రష్యా దేశాల్లో పొద్దు తిరుగుడు పంట ఉత్పత్తి భారీగా తగ్గడంతో ఈ వంట నూనెల ధరలపై ప్రభావం పడింది. మలేషియా, ఇండోనేషియా దేశాల్లో పామాయిల్ ఉత్పత్తి భారీగా తగ్గింది. కూలీల కొరత వల్ల ఈ సమస్య ఏర్పడింది. అర్జెంటీనా నుంచి సోయాబీన్ ఆయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంటుంది. అర్జెంటీనా, బ్రెజిల్ తదితర దేశాలు ఎల్‌నినో కారణంగా తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. అర్జెంటీనా ఓడ రేవుల్లో సమ్మె నడవడంతో అక్కడి నుంచి కొద్ది రోజులపాటు ఎగుమతులకు ఆటంకం కలిగింది. ఈ కారణాలన్నీ వంట నూనెల పెరుగదలకు దారితీశాయి. ఈ పరిస్థితులన్నీ చక్కబడితే మార్చి, ఏప్రిల్ మాసాల వరకు వంట నూనెల ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుదని పరిశ్రమ వర్గాలు గతంలో అంచనా వేశాయి. కానీ మార్చి మాసంలో మరో 10 శాతం ధరలు పెరగడంతో నూనెల ధరల్లో పూర్వ స్థితి చేరుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. సన్‌ఫ్లవర్, సోయాబీన్ వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటడంతో పామాయిల్‌ను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దిగుమతి సుంకం తగ్గాల్సిందేనా? గత నవంబరు 27న కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 37.5 శాతం నుంచి 27.5 శాతానికి తగ్గించింది. క్రూడ్ పామాయిల్‌పై 2013 జనవరి 23న 2.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకం.. 24.12.2014న 7.5 శాతానికి పెరిగింది. 11.08.2017న 15 శాతంగా ఉంది. 17.11.2017న 30 శాతానికి పెరిగింది. మార్చి 1, 2018న ఇది 44 శాతానికి పెరిగింది. 01.01.2019న 40 శాతంగా, 01.01.2020న 37.5 శాతంగా, 27.11.2020న 27.5 శాతంగా ఉంది. ఇక రిఫైండ్ సన్‌ఫ్లవర్ నూనెపై 17.03.2012న 7.5 శాతం దిగుమతి సుంకం ఉండగా.. 20.01.14న 10 శాతంగా, 24.12.2014న 15 శాతంగా, 17.09.2015న 20 శాతంగా, 14.06.18న 45 శాతంగా ఉంది. దేశంలో రైతులు పండించే నూనె గింజల ఉత్పత్తులకు మద్దతు ధర లభించేందుకు వీలుగా దిగుమతి సుంకం విధిస్తున్నప్పటికీ.. ధరల పెరిగిన సందర్భంలో తగిన రీతిలో సడలింపులు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ చదవండి: COVID-19: అక్టోబర్ 11 తర్వాత మళ్లీ... భవిష్యత్తులో భారత్ మంచి మార్కెట్ కానుంది: కేఎఫ్‌సీ -
చర్మకాంతి కోసం...
ఎలాంటి చర్మ తత్వం వాళ్లయినా రాత్రి పడుకునేముందు తప్పని సరిగా ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇందుకోసం సబ్బును ఉపయోగించకూడదు. సబ్బులో ఉండే గాఢ రసాయనాలు చర్మానికి హాని చేస్తాయి. పదిచుక్కల సన్‌ఫ్లవర్ ఆయిల్ లేదా నువ్వుల నూనెలో రెండు టేబుల్స్పూన్ల పాలను కలిపి ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం పొడిచర్మం గల వారికి బాగా పనిచేస్తుంది. మూడు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్లో బాగా మగ్గిన అరటిపండు గుజ్జు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా పట్టించి అరగంట తరువాత కడుక్కోవాలి.పుదీనా పేస్ట్‌లో బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమంలో తగినంత వేడినీటిలో కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత కడుక్కోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తుంటే చర్మకాంతి పెరుగుతుంది. రెండు టీస్పూన్ల పెరుగులో కొద్దిగా బియ్యపు పిండిని కలిపి బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట ప్యాక్‌లా వేసుకోవాలి. తర్వాత ఆ ప్రదేశంలో వేళ్లతో వలయాలుగా చుడుతూ సున్నితంగా మసాజ్ చేయాలి. ఎక్కువ మసాజ్చేస్తే చర్మం ఎర్రగా అయ్యే అవకాశం ఉంది. వారంలో 3 సార్లు ఈ విధంగా చేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గిపోతాయి. -
నూనె.. వాడకం పెరిగెనే
తాడేపల్లిగూడెం: గతంతో పోలిస్తే వంటనూనె వినియోగం బాగా పెరిగింది. అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి సోయాబిన్, మలేషియా, ఇండోనేషియా నుంచి పామాయిల్ దిగుమతులు పెరగడం కూ డా నూనె వినియోగం పెరగడానికి కారణాలుగా ఉన్నాయి. గతంలో ఒక కుటుంబం నూనె విని యోగం నెలకు రెండు కిలోలు ఉంటే ప్రస్తుతం నాలుగు నుంచి ఐదు కిలోలకు చేరింది. పామాయిల్ వాడకాన్ని గత ఐదేళ్లలో వినియోగదారులు 30 శాతం వరకు తగ్గించారు. ఆ స్థానంలో సన్‌ఫ్లవర్ వినియోగం పెరిగింది. పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోవడం, సన్‌ఫ్లవర్‌లో కొవ్వు శాతం ఉండదనే భా వంతో దీని వినియోగం పెరిగినట్టు తెలుస్తోంది. వాడకం పెరిగిందిలా.. వంట నూనెల వినియోగం గత 18 ఏళ్ల కాలంతో చూసుకుంటే భారీగా పెరిగింది. సగటున పెరుగుదల 30 శాతం వరకు ఉంది. దేశంలో వంట నూ నెల వినియోగం 2000లో 175.6 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా 2013 320.87 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. 2018 నాటికి దీనికి మరో 30 శాతం పెరిగినట్టు అంచనా. వినియోగదారుల అవసరాలకు సరిపడా నూనెలను, నూనె గిం జలను ఉత్పత్తి చేసే అవకాశం దేశంలో లేదు. దీంతో మొత్తం డిమాండ్‌లో 48.10 శాతం నూనెలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచంలోనే అత్యధికంగా నూనెలను దిగుమతి చేసుకునే ప్రధాన మూడు దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉంది. నూనెలను మారుస్తున్నారు పూర్వం మాదిరిగా ఒకే నూనెను వాడే అలవాటులో ఇటీవల మార్పు వచ్చింది. సన్‌ఫ్లవర్ వాడితే కొవ్వు ఉండదు, ఆరోగ్యానికి మంచిదనే భావన చాలా మందిలో వచ్చింది. దీంతో పామాయిల్ బదులు సన్‌ఫ్లవర్, సన్‌ఫ్లవర్ బదులు వేరుశనగ, వేరుశనగకు బదులు తవుడు నూనెలను చాలా మంది వాడుతున్నారు. పామాయిల్ వినియోగం 25 శాతం తగ్గి, ఆస్థానంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగం పెరిగింది. అదీకాకుండా ప్రజల ఆహారపు అలవాట్లలో ఇటీవల పెనుమార్పు వచ్చింది. నూనె వస్తువులను ఎక్కువగా ఇష్టపడటంతో వినియోగం పెరిగినట్టు తెలుస్తోంది. దేశంలో నిల్వలు ఇలా.. దేశంలోని వివిధ పోర్టుల్లో ఈనెల 11 నాటికి నూ నెల నిల్వలు ఇలా ఉన్నాయి. పామాయిల్ 1,03,739 టన్నులు, క్రూడ్ పామాయిల్ (సీపీఓ) 2,03,506 టన్నులు, సోయా 1,51,779 టన్నులు, సన్‌ఫ్లవర్ ఆయిల్ 2,21,206 టన్నులు, కెనో లా ఆయిల్ 7,458 టన్నులు, ఇతర రకాల నూనెలు 15,659 టన్నులు మొత్తంగా 7,09,350 టన్నులు. కాకినాడ పోర్టులో.. రాష్ట్రంలో వ్యాపారులు, రిఫైనరీల యజమానులు రాష్ట్ర అవసరాల నిమిత్తం కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా నూనెలు దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లా వ్యాపారులు కాకినాడ పోర్టు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈనెల 11 నాటికి కాకినాడ పోర్టులో నూనెల నిల్వలు ఇలా ఉన్నా యి. పామ్ కెర్నోల్ (పామాయిల్ పిక్కల నుంచి తీసిన నూనె) 700 టన్నులు, రిఫైన్డ్ బ్లీచ్డ్ పామాయిల్ (ఆర్బీడీ) 4,165 టన్నులు, సీపీఎస్ 4,682 టన్నులు, పామ్ క్రూడ్ 24,335 టన్నులు, సన్‌ఫ్లవర్ ఆయిల్ 51,680 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి. జిల్లాలో నెలకు 5 వేల టన్నులు జిల్లా జనాభా సుమారు 40 లక్షలు ఉండగా సుమారు 10 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఒ క్కో కుటుంబానికి నెలకు ఐదు కిలోల వం తు న నూనె వాడుతుంటే వినియోగం 50 లక్షల కి లోలు ఉంటుంది. ఈ లెక్కన 5,000 టన్నుల నూనెను జిల్లా ప్రజలు నెలకు వినియోగిస్తున్నారన్నమాట. మార్చి వాడటం మేలు ఒక్కో మనిషి సగటున నెలకు అరకిలో నూనె వాడుతున్నారు. నూనెలు వాడటం వల్ల కొవ్వు ఏర్పడుతుందనే భావన సరికాదు. శరీరంలో సహజంగానే కొవ్వు ఏర్పడుతుంది. ఒకే నూనె వాడకుండా మూడు నెలలకు ఒకసారి నూనెల రకాన్ని మార్చడం శ్రేయస్కరం. సన్‌ఫ్లవర్, రైస్‌బ్రాన్ ఆయిల్, వేరుశనగనూనె వంటివి 90 రోజులకు ఒకసారి మార్చి వినియోగించడం ఆరోగ్యరీత్యా మేలు. – డాక్టర్ నార్ని భవాజీ, తాడేపల్లిగూడెం 30 శాతం వరకు పెరిగింది గతంలో కంటే నూనెలను మార్చి మార్చి వినియోగదారులు వాడుతున్నారు. సన్‌ఫ్లవర్‌లో కొవ్వుశాతం ఉండదు. వేరుశనగలో అన్నీ ఉంటాయి. రైస్‌బ్రాన్ ఆయిల్లో పోషకాలు ఉంటాయి. నూనెల వినియోగం ఐదేళ్లలో 30 శాతం వరకు పెరిగింది. పామాయిల్‌కు ప్రత్యామ్నాయంగా సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను వాడుతున్నారు. – గమిని సుబ్బారావు, నూనె వ్యాపారి, తాడేపల్లిగూడెం పామాయిల్ తగ్గించాం గతంలో కంటే నూనె వాడకం పెరిగింది. ప్రస్తుతం అన్నిరకాలు వినియోగిస్తున్నాం. సన్‌ఫ్లవర్ ఎక్కువగా వాడుతున్నాం. పామాయిల్ వాడకం తగ్గిం చాం. అల్పాహారం, ఇతర వంటకాల కోసం నూనె వినియోగం పెరగడంతో నెలకు రెండు కిలోలకు బదులు మూడు కిలోల వరకు నూనె ఖర్చవుతోంది. – కర్రి పార్వతి, గృహిణి, పెంటపాడు -
నూనెకు సుంకం సెగ
శ్రీకాకుళం: నూనెల ధరలు మండిపోతున్నాయి. దిగుమతులపై సుంకాన్ని కేంద్రం పెంచుతుండటంతో పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెల ధరలు ని ప్పులు కక్కుతున్నాయి. కిలో నూనెపై ఒక్కరోజులో రూ.10 పెరిగింది. డబ్బా పరంగా (15 కిలోలు) చూసుకుంటే రూ. 150 పెరిగింది. నూనెల మార్కె ట్ చరిత్రలో ఇంత పెరుగుదల కనిపించడం ఇదే ప్రథమం. మలేషియా నుంచి రాష్ట్రంలోని కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల మీదుగా పామ్‌క్రూడ్ (శుద్ధి చేయని పామాయిల్), పామాయిల్ (రిఫైన్డ్ చేసిన పామాయిల్), సన్‌ఫ్లవర్ నూనె దిగుమతి అవుతోంది. దిగుమతులను ప్రోత్సహించే క్రమంలో 200 శాతం ఉన్న సుంకాన్ని గత యూపీఏ ప్రభుత్వం క్రమేణా తగ్గించుకుంటూ వచ్చింది. చివరకు దిగుమతి సుంకం జీరోకు చేరుకుంది. దేశంలో పా మాయిల్ సాగు విస్తరించడం, విదేశాల నుంచి ఈ నూనెను దిగుమతి చేసుకుంటే దేశీయ రైతులకు నష్టం వాటిల్లుతుందనే కారణంగా కేంద్రం ఇటీవల పామ్‌క్రూడ్ దిగుమతులపై సుంకాలు విధించడం మొదలైంది. 12 శాతంగా మొదలై 30 శాతానికి చేరుకుంది. బుధవారం నుంచి ఇది మరింత ఎగసి 44 శాతానికి పెరిగింది. దీనిపై సంక్షేమ సర్‌చార్జీలు 4.4 శాతం కలిపితే దిగుమతి సుంకం 48.4 శాతా నికి చేరుకుంది. ఈ ప్రభావం నేరుగా ధరపై పడి ఒక్కరోజులో కిలో పామాయిల్ ధర రిటైల్ మార్కెట్లో రూ.10 పెరిగి రికార్డు సృష్టించింది. రిఫైన్డ్ బ్లీచ్డ్ డీ ఆక్సైడ్ ఆయిల్ (డీబీడీ) శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులపై కూడా సుంకాలు పెరిగాయి. 40 శాతంగా ఉన్న దిగుమతి సుంకం 59.40 శాతానికి చేరుకుంది. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో పామాయిల్, సన్‌ఫ్లవర్‌కు, ఇతర నూనెల ధ రలకు రెక్కలు వచ్చాయి. పది కిలోల పామాయిల్ రూ.670 నుంచి రూ.770కి చేరుకుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ 10 కిలోల ధర రూ.750 నుంచి రూ.850 కి చేరుకుంది. వీటి ప్రభావం మిగిలిన నూనెల ధరలపై కూడా పడింది. 10 కిలోల రిఫైన్డ్ కాటన్ సీడ్ ఆయిల్ ధర రూ.723 నుంచి రూ.790కు పెరిగింది. చేతులెత్తేసిన దిగుమతిదారులు కాకినాడ, కృష్ణపట్నం రేవుల్లో సుమారు 10 మంది దిగుమతిదారులు నూనెల దిగుమతులు నిలిపివేశారు. ఒక్కసారిగా రికార్డు స్థాయిలో నూనెల ధర పెరగడంతో మార్కెట్లో నూనె వ్యాపారం స్తంభించిపోయింది. ఈ కారణంగా జిల్లాలోని హోల్‌సేల్ నూనె వ్యాపారుల కొనుగోలు చేయడం నిలిపివేశారు. ఈ ప్రభావం ఇప్పటికే ఉన్న స్టాక్ పడి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. కొందరి వ్యాపారుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రూ.10 కోట్ల వరకూ భారం పెరిగిన ఒక్క పామాయిల్, సన్‌ఫ్లవర్ ధరలను చూసుకుంటే రాష్ట్రంలోని వినియోగదారులపై రూ.8 కోట్ల భారం పడినట్టు తెలుస్తోంది. రోజుకు రాష్ట్రానికి రెం డు పోర్టుల ద్వారా 90 ట్యాంకుల పామాయిల్ దిగుమతి అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీని ప్రకారం నెలకు 2,700 ట్యాంకర్ల ద్వారా నూనె దిగుమతి అవుతోంది. ఒక్కో ట్యాంకరులో వెయ్యి కిలోల నూనె ఉంటుంది. ఒక్కొక్క ట్యాంకరుకు రూ.21వేల ధర పెరుగుతోంది. 90 ట్యాంకర్లకు కలిపితే రూ.18 .90 లక్షల పెరుగుదల ఉండగా, మొత్తంగా రూ.8కో ట్ల పైమాటే. జిల్లా విషయానికి వస్తే రోజుకి 6 టన్ను ల పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ విక్రయం అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈలెక్కన రోజుకు జిల్లా ప్రజలపై రూ.60వేల భారం పడుతుంది. గతంలో ఎప్పుడూ లేనంత పెరుగుదల తొలిసారిగా నూనెల ధర ఒక్కసారిగా పెరగడం చూస్తున్నా. ఇంతలా మార్కెట్ చరిత్రలోనే నమోదుకాలేదు. ఏకంగా కిలోకు రూ.8 దాటి పెరుగుదల ఉంది. సర్‌చార్జీ, పన్నులు కలుపుకొని కిలోకు రూ.10 పెరిగింది. దిగుమతి సుంకం 12 శాతం నుంచి సుమారు 50 శాతం దాటి పెరిగింది. ఈ ధరల్లో నూనె వ్యాపారం చేస్తే సొమ్ముకు వడ్డీ కూడా దండగలా ఉంది. – శ్రీనివాసరావు,హోల్‌సేల్ నూనెల వ్యాపారి, శ్రీకాకుళం -
వంట నూనెల మార్కెట్లోకి ‘గోల్డీవియా’..
విస్తరణలో సౌత్ ఇండియా కృష్ణా ఆయిల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ వంట నూనెల మార్కెట్లో మరో కొత్త బ్రాండ్ వచ్చి చేరింది. ఇండోనేసియాకు చెందిన ముసిమ్ మస్ అనుబంధ కంపెనీ సౌత్ ఇండియా కృష్ణా ఆయిల్, ఫ్యాట్స్ (సికాఫ్) గోల్డీవియా బ్రాండ్‌తో సన్‌ఫ్లవర్ నూనెను బుధవారమిక్కడ ప్రవేశపెట్టింది. కంపెనీ ఇప్పటికే సూర్య గోల్డ్ పేరుతో 17 రాష్ట్రాల్లో సన్‌ఫ్లవర్ నూనెతోపాటు ఇతర బ్రాండ్లలో వంట నూనెలు, ఫ్యాట్స్‌ను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా నెలకు 18 లక్షల టన్నుల పొద్దు తిరుగుడు నూనె అమ్ముడవుతోంది. ఇందులో మహారాష్ట్రతోపాటు దక్షిణాది రాష్ట్రాలు 60 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. ఈ స్థాయిలో డిమాండ్ ఉన్న నేపథ్యంలో విస్తరణలో భాగంగా కొత్త బ్రాండ్‌ను తీసుకొచ్చామని సికాఫ్ ఇండియా హెడ్ పి.సుబ్రమణియం తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్యాకేజ్డ్ వంట నూనెల మార్కెట్లో సికాఫ్‌కు 10-15 శాతం వాటా ఉందన్నారు. మరిన్ని పెట్టుబడులు.. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,400 కోట్ల టర్నోవర్ సాధించింది. రెండేళ్లలో రూ.2,240 కోట్ల లక్ష్యాన్ని విధించుకున్నట్టు సికాఫ్ కమాడిటీస్ మేనేజర్ పి.శారద తెలిపారు. కొద్ది రోజుల్లో రైస్ బ్రాన్ ఆయిల్ విభాగంలోకి ప్రవేశిస్తామని చెప్పారు. 70 దేశాల్లో తమ సంస్థ పెట్టుబడులు పెట్టిందని ముసిమ్ మస్ ప్రతినిధి యుప్ యూన్ జీ వెల్లడించారు. ఇక్కడి కంపెనీల కొనుగోళ్లకు, కొత్త రిఫైనరీల ఏర్పాటుకు సిద్ధమేనని పేర్కొన్నారు. చైనా, భారత్‌లపై భారీ ఆశలు పెట్టుకున్నామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో నెలకు 700 టన్నుల నూనె విక్రయిస్తోంది. ఇది 3 వేల టన్నుల స్థాయికి చేరితే కాండ్లా ప్రాంతంలో రిఫైనరీ నెలకొల్పుతామని సుబ్రమణియం వెల్లడించారు. -
బ్యూటిప్స్
వంట నూనెతోనూ కేశసౌందర్యాన్ని పెంచుకోవచ్చు. జుట్టు రాలడం వంటి సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కూడా ట్రై చేసి చూడండి. అది జుట్టుకు మంచి కండీషనర్‌గా ఉపయోగపడుతుంది. తలస్నానానికి ముందు సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో మర్దన చేసుకోవాలి. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది. పొడిబారిన చర్మంతో బాధపడేవారు ఈ చిన్న చిట్కాను పాటించండి. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే ముఖానికి పెసర పిండిలో నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ప్యాక్ వేసుకోవాలి, 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా ఓ రెండు వారాలు చేస్తే ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.