‘సన్‌ఫ్లవర్‌’ సలసలా | Oil imports from Russia: andhra pradesh | Sakshi
Sakshi News home page

‘సన్‌ఫ్లవర్‌’ సలసలా

Published Tue, Jun 11 2024 4:56 AM | Last Updated on Tue, Jun 11 2024 4:56 AM

Oil imports from Russia: andhra pradesh

ఉక్రెయిన్‌లో ఉత్పత్తులు పడిపోవడమే కారణం.. 

రష్యా నుంచి నూనెల దిగుమతులు 

అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులతో ఒక్కసారిగా పెరిగిన ధర  

సెప్టెంబర్‌ వరకు ఈ పరిస్థితి ఇంతే  

తాడేపల్లిగూడెం: సన్‌ఫ్లవర్‌ నూనెకు ధరల స్ట్రోక్‌ తగిలింది. ఇటీవలి కాలంలో పామాయిల్‌ కంటే తక్కువ రేటుకు పడిపోయిన ఈ నూనె ధరలు ఇప్పుడు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. పామాయిల్, పామ్‌ క్రూడ్, రిఫైన్డ్‌ పామాయిల్‌ మలేసియా, ఇండోనేíÙయా దేశాల నుంచి దిగుమతి అవుతాయి. మలేసియాలో పంట దిగుబడులు, కూలీల లభ్యత, వాతావరణ పరిస్థితుల ఆధారంగా, అంతర్జాతీయ విపణి సూత్రం ఆధారంగా డాలర్ల ధరల్లో వ్యత్యాసాలతో పామాయిల్‌ ధరలు ప్రభావితమయ్యేవి. రిఫైన్డ్‌ పామాయిల్‌ దిగుమతి ఖర్చుతో కూడుకునే వ్యవహారం కావడంతో, పామ్‌ క్రూడ్‌ను మాత్రమే రాష్ట్రంలోని కాకినాడ, కృష్ణపట్నం వంటి పోర్టుల ద్వారా దిగుమతి చేసుకునేవారు.

ఈ పోర్టుల సమీపంలో ఉండే నూనె శుద్ధి కర్మాగారాలు (రిఫైనరీలు) పామ్‌ క్రూడ్‌ను శుద్ధిచేసి మార్కెట్లకు పంపించేవి. ఒకప్పుడు ఆకాశాన్నంటిన పామాయిల్‌ ధరలు ఇటీవల దాదాపుగా దిగొచ్చాయి. పామాయిల్‌తో పోల్చుకుంటే సన్‌ఫ్లవర్‌ నూనె ధర ఎక్కువగా ఉండేది. దీనికి భిన్నంగా పామాయిల్‌ ధర కంటే దిగువకు సన్‌ఫ్లవర్‌ నూనె దిగింది. అంతర్జాతీయ విపణిలో మార్పుల నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా సన్‌ఫ్లవర్‌ నూనె ధర పెరిగింది.   

ఉక్రెయిన్‌ ప్రభావం 
సన్‌ఫ్లవర్‌ ఎక్కువగా మన ప్రాంతానికి ఉక్రెయిన్‌ నుంచి దిగుమతి అవుతుంది. అక్కడ ఉత్పత్తులు పడిపోయిన కారణంగా రష్యా నుంచి ఈ నూనెను దిగుమతి చేసుకుంటున్నారు. ఉక్రెయిన్‌ కంటే భారతదేశానికి రష్యా మీదుగా నూనెను రవాణా చేయడంతో ఖర్చు అధికం అవుతోంది. ప్రీమియంగా పేర్కొనే ధర టన్నుకు వంద డాలర్లు పెరుగుతోంది. దీంతో గుత్త మార్కెట్‌లో టన్నుకు రూ.200కు పైబడి ధర పెరుగుతోంది. ఈ ధర ఇటీవల పెరుగుతూ వెళ్తోంది. రష్యా నుంచి సన్‌ఫ్లవర్‌ నూనెను దిగుమతి చేసుకోవాల్సిందే. ఈ పరిస్థితి సెపె్టంబరు వరకు ఉంటుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.   

నిర్ణిత కొలతలు లేవు 
గతంలో మాదిరిగా నూనెలకు నిర్ణీత కొలతలు లేవు. కిలో, అరకిలో, లీటరు వంటి ప్యాకింగ్‌లకు కాలం చెల్లింది. ఫుడ్‌ అండ్‌ వెయిట్‌ అండ్‌ మెజర్స్‌ నిబంధనల్లో ఇటీవల కేంద్రం మార్పులతో చట్టం చేసింది. దీంతో ప్యాకింగ్‌ ఎంతైనా చేసుకోవచ్చు. ప్యాకెట్‌పై మాత్రం కొలత, గ్రాము ధర ఎంతనే వివరాలు కచ్చితంగా ఉండాలి. ఈ కారణంగా మార్కెట్‌లో లీటర్‌ పౌచ్‌లు లేవు. 850 గ్రాముల నూనె ప్యాకెట్లు మాత్రమే దొరుకుతున్నాయి. 

సన్‌ఫ్లవర్‌ ప్యాకెట్‌ రూ.110 
ప్రస్తుతం మార్కెట్‌లో సన్‌ఫ్లవర్‌ ప్యాకెట్‌ ధర రూ.110లు ఉంది. గతంలో ఈ ధర రూ.86కు పడిపోయింది. పామాయిల్‌ 850 గ్రాముల ధర రూ.86లు ఉంది. రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ ప్యాకెట్‌ రూ.115లు, వేరుశనగ నూనె ప్యాకెట్‌ రూ.160లు ఉంది. ఈ ధరలు సెపె్టంబరు వరకు ఇదే రకంగా ఉండే అవకాశాలున్నాయి.  

రష్యా నుంచి దిగుమతి వల్లే ధర పెరుగుదల 
మార్కెట్‌లో సన్‌ఫ్లవర్‌ నూనెల ధరలు సెప్టెంబరు వరకు ఇదే విధంగా ఉండే అవకాశాలున్నాయి. ఉక్రెయిన్‌ నుంచి కాకుండా రష్యా నుంచి సన్‌ఫ్లవర్‌ నూనె దిగుమతి అవుతున్నందున మార్కెట్‌లో ఈ నూనె ధర పెరిగింది.  – పవన్, వ్యాపారి, తాడేపల్లిగూడెం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement