నిత్యావసరాలు ఖాళీ, ఫ్లైట్స్‌ లేవు.. ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థుల వెతలు | No Food, No Money: Telugu Students Stuck In Ukraine | Sakshi
Sakshi News home page

నిత్యావసరాలు ఖాళీ, ఫ్లైట్స్‌ లేవు.. ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థుల వెతలు

Published Fri, Feb 25 2022 11:47 AM | Last Updated on Fri, Feb 25 2022 5:27 PM

No Food, No Money: Telugu Students Stuck In Ukraine - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ దాడులు ఎంతకాలం కొనసాగుతాయో, పరిస్థితి ఎలా మారుతుందో అని బిక్కుబిక్కుమంటున్నారు. రష్యాదాడుల ప్రభావం మొదలైందని, ప్రధానదారులను మూసివేశారని.. ఏటీఎంలు మూతపడుతున్నాయని అక్కడి తెలుగు విద్యార్థులు ‘సాక్షి’ప్రతినిధికి వివరించారు. 

వైద్య విద్యార్థులే ఎక్కువ
ఉక్రెయిన్‌లోని జెఫ్రోజియా, కీవ్, కార్కీవ్, మరియప్పల్‌ యూనివర్సిటీల్లో దాదాపు 20వేల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారు 3 వేలకుపైనే ఉన్నట్టు అంచనా. వీరిలో ఎంబీబీఎస్‌ చేసే విద్యార్థులు ఎక్కువ. ఉక్రెయిన్‌ వాతావరణ పరిస్థితులు భారత్‌కు సరిపోలడంతో, మంచి విద్య అందుబాటులో ఉండటంతో అక్కడ చదువుతున్నారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో తెలుగు విద్యార్థులకు సమస్య మొదలైంది. వారు ఫోన్లు చేసి విషయం చెప్తుండటం, టీవీల్లో ఉక్రెయిన్‌ సంక్షోభం వార్తలు చూస్తూ.. ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళనకు లోనవుతున్నారు. తమ బిడ్డలను క్షేమంగా తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలంటూ రాజకీయ నాయకులకు విజ్ఞప్తులు చేస్తున్నారు.
చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా దాడి: హృదయ విదారకం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

భయం భయంగా ఉంటున్నాం..
ప్రస్తుత పరిస్థితులతో ఉక్రెయిన్‌లో భయంభయంగా గడుపుతున్నామని తెలుగు విద్యార్థులు చెప్తున్నారు. ‘‘యూనివర్సిటీ దాటి వెళ్లొద్దని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని, దేనినైనా తట్టుకోవాలని అంటున్నారు. ఇవన్నీ వింటుంటే భయం వేస్తోంది..’’అని జెఫ్రోజియా యూనివర్సిటీ విద్యార్థి సుమాంజలి పేర్కొన్నారు. ఇక ‘‘తాగునీటి సరఫరా తగ్గింది. మంచినీళ్లు చూసి వాడాల్సి వస్తోంది. ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు ఫోన్లు చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓదార్చడానికి మా దగ్గర మాటల్లేవు’’అని అక్కడ ఎంబీబీఎస్‌ నాల్గో సంవత్సరం చదువుతున్న శ్రీనిఖిత తెలిపారు. కరీంనగర్‌కు చెందిన ఆమె.. త్వరలో పరీక్షలు పూర్తయి ఇండియా వెళ్లాల్సి ఉందని, ఇంతలోనే ఉపద్రవం వచ్చిపడిందని వాపోయారు.

నిత్యావసరాలు ఖాళీ
జెఫ్రోజియా పరిసర ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిందని.. మాల్స్‌లో నిత్యావసరాలు ఖాళీ అయ్యాయని తెలుగు విద్యార్థులు చెప్తున్నారు. కొద్దిరోజులుగా యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో చాలా మంది ముందే నిత్యావసరాలు కొనేసుకున్నారని అంటున్నారు. తమ మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌లో నిత్యావసరాలు ఖాళీ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘యుద్ధం కొనసాగితే నిత్యావసరాలు అందడం కష్టమే. లేకుంటే వారం రోజుల తర్వాత తిండి తిప్పలకు ఇబ్బంది తప్పదని యూనివర్సిటీ అధికారులే చెప్తున్నారు..’’అని ఎంబీబీఎస్‌ మూడో ఏడాది చదువుతున్న రమ తెలిపారు.
చదవండి: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: పిల్లలు ఎలా ఉన్నారో ఏమో..!

ఇండియాకు వెళ్దామన్నా.. ఫ్లైట్లు లేక..
‘‘ఇండియాకు వెళ్లాలనుకునే వాళ్లంతా వెళ్లొచ్చని, అవసరమైతే ఆన్‌లైన్‌ క్లాసులూ పెడతామని యూనివర్సిటీ అధికారులు చెప్పారు. ఈ భయంతో చాలామంది ఇండియాకు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. కానీ విమానాలను నిలిపివేయడంతో ఆగిపోవాల్సి వచ్చింది’’కార్కీవ్‌లో ఉంటున్న రమణ ప్రభాకర్‌ చెప్పారు. ఉక్రెయిన్‌ పంపినవారికి సాధ్య మైనంత వరకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్‌కు చెందిన కన్సల్టెంట్‌ రాజు తెలిపారు. తాజాగా యుద్ధం మొదలవడంతో కీవ్‌ ఎయిర్‌పోర్టును అక్కడి ప్రభుత్వం మూసివేసిందని, దీంతో ఇండియాకు రావాల్సిన 20 మంది విద్యార్థులు ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారని వెల్లడించారు. ఓ ప్రత్యేక బస్సు ద్వారా కన్సల్టెన్సీ సంస్థ వారిని తిరిగి యూనివర్సిటీకి చేర్చిందని తెలిపారు. 

భయంగా ఉంది
పరిస్థితి చూస్తే భయమేస్తోంది. యుద్ధం ముదిరితే మొబైల్స్‌ కూడా పనిచేయకపోవచ్చని అంటున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడలేకపోతామని ఆందోళనగా ఉంది. భారతీయ విద్యార్థులెవరూ క్యాంపస్‌లు దాటి బయటికి వెళ్లొద్దని ఇండియన్‌ ఎంబసీ ఆదేశాలిచ్చింది. మరి అవసరమైన ఏర్పాట్లు ఎలాగో అర్థంకావడం లేదు. భారత ప్రభుత్వం మాకు తగిన సాయం చేయాలి.
– జోత్స్య భార్గవి, ఉక్రెయిన్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థి

తిండికి, నీళ్లకు ఇబ్బంది..
మంచి నీళ్లకు, ఆహారానికి ఇబ్బంది.. ఇతర రకరకాల భయాలతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. చేతిలో డబ్బులు అయిపోతున్నాయి. ఇంటి నుంచి తల్లిదండ్రులు డబ్బులు పంపినా.. ఇక్కడ ఏటీఎంలు పనిచేయడం లేదు. భారత ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలి.    
– అభిలాష్‌రెడ్డి, ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థి

ఇండియా ఎంబసీ టచ్‌లో ఉంది
‘‘ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలోని వర్సిటీ క్యాంపస్‌లో ఉన్నాం. ఇంటికి తిరిగొచ్చేయడానికి ఇండియా ఎంబసీని సంప్రదించాం.  ఏ క్షణమైనా అప్‌డేట్‌ చేస్తామని.. విషయం తెలియగానే పశ్చిమ ప్రాంతానికి రావాలని సూచించారు.    డబ్బుల కోసం ప్రజలు ఏటీఎంల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూ కట్టారు.
ముడుంబై ఆచార్య శేషఫణి చంద్ర, భఃజఫ్రరోజియా వర్సిటీ విద్యార్థి (యాదాద్రి)

పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం
చాలామంది విద్యార్థులను ఉక్రెయిన్‌లో చదువు కోసం పంపాం. అక్కడ పరిస్థితిని అనుక్షణం పరిశీలిస్తున్నాం. అక్కడి మా వాళ్లతో విద్యార్థులకు ధైర్యం చెప్పిస్తున్నాం. మేం కూడా నేరుగా మాట్లాడుతున్నాం. ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న వారిని రక్షించడంలో సాయం చేశాం. సమస్యను భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం.  
– దివ్య, కన్సల్టెంట్‌

మా దగ్గరి ఎయిర్‌పోర్టును పేల్చేశారు
జనగామ: ‘‘నేను ఉక్రెయిన్‌ వెస్ట్‌ రీజియన్‌ ఇవానో ఫ్రాంక్విస్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్నాను. గురువారం తెల్లవారుజామున మేం ఉన్న ప్రాంతానికి సమీపంలోని ఎయిర్‌పోర్టును రష్యా పేల్చేసింది. ఇండియాకు తిరిగి వెళ్లేందుకు ఫ్లైట్‌ టికెట్లను ముందే బుక్‌ చేసుకున్నా.. ఎయిర్‌పోర్టు, విమాన సేవలు మూతపడ్డాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే కాకుండా స్థానికులూ భయాందోళనలో ఉన్నారు’’ అని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం రాఘవాపూర్‌కు చెందిన ఉప సర్పంచ్‌ కాసాని మల్లయ్య కుమారుడు సతీశ్‌ ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement