ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్‌లోని 4 కీలక ప్రాంతాలను వీలినం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా నిర్వహించి ‘చట్టవిరుద్ధ రిఫరెండం’పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్ జరిగింది. భారత్ ఈ ఓటింగ్‌లో పాల్గొనకుండా దూరంగా ఉండిపోయింది. రష్యా మాత్రం వీటో చేసింది. రష్యా రిఫరెండాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, ఆల్బేనియా దేశాలు భద్రతా మండలిలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనిపై శుక్రవారం ఓటింగ్ నిర్వహించారు. ఉక్రెయిన్‌లోని లుహాన్‌స్క్, డొనెట్‌స్క్, ఖేర్సన్, జపొరిజాజియాలను రష్యాలో విలీనం చేస్తూ ఒప్పంద పత్రాలపై పుతిన్ సంతకాలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఓటింగ్ జరగడం గమనార్హం.
అయితే, భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన రష్యా వీటో చేయడంతో అమెరికా, ఆల్బేనియా తీర్మానం ఆమోదం పొందలేదు. భద్రతా మండలిలో మొత్తం 15 సభ్యదేశాలు ఉండగా, 10 దేశాలు ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. భారత్, చైనా, గబాన్, బ్రెజిల్ మాత్రం ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఐరాసలో భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడారు. ఉక్రెయిన్ పరిణామాలు భారత్‌కు అందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి శాంతిని సాధించలేరని తెలిపారు. హింసకు స్వస్తి పలికితేనే ఉక్రెయిన్–రష్యా సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుందని సూచించారు. ఉక్రెయిన్‌లో రష్యా చేపట్టిన రిఫరెండం చెల్లదని ఐరాసలోని అమెరికా ప్రతినిధి లిండా థామస్–గ్రీన్‌ఫీల్డ్ తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment