మునుపెన్నడూ లేనివిధంగా ఐక్యరాజ్య సమితిలో భారత దేశం వ్యవహరించింది. తొలిసారిగా భద్రతా మండలిలో మిత్రపక్షం రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి.. రష్యాను విమర్శించకుండా, కీలక ఓటింగ్‌లకు భారత్ దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే.. అగ్రరాజ్యం అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఈ విషయంలో భారత్ తీరును తప్పుబడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం జరిగిన ప్రొసీజరల్ ఓటింగ్‌లో భారత్, రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. పదిహేను దేశాల సభ్యత్వం ఉన్న భద్రతా మండలిని ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ వీడియో టెలి కాన్ఫరెన్స్ ద్వారా తొలుత ప్రసంగించాడు.
ప్రసంగం కోసమే..
ఉక్రెయిన్ 31వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. జెలెన్‌స్కీని ప్రసంగించేందుకు భద్రతా మండలి ఆహ్వానించింది. అయితే భద్రతా మండలిలో ప్రసంగం ఎప్పుడూ నేరుగా ఉండాలే తప్ప.. ఇలా టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జరగకూడదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రష్యా ప్రతినిధి వసెల్లీ నెబెంజియా.. కావాలంటే జెలెన్‌స్కీని న్యూయార్క్‌ను పిలవండని లేదంటే ఉక్రెయిన్ ప్రతినిధిని ప్రసంగించేందుకు అనుమతించాలని కోరారు. అయినప్పటికీ జెలెన్‌స్కీ ప్రసంగానికే అమెరికా ప్రతినిధి పట్టుబట్టారు. దీంతో ప్రోసీజరల్ ఓటింగ్ నిర్వహించాలని రష్యా కోరింది. దీనికి భద్రతా మండలి అంగీకరించింది. అనంతరం జరిగిన ఓటింగ్‌లో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది.
రష్యా వ్యతిరేక ఓటు వేయగా.. చైనా తెలివిగా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. భారత్ తరపున.. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్.. ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రసంగానికి మద్దతుగా ఓటేశారు. దీంతో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటేసిందన్న విమర్శ తెరపైకి వచ్చింది. ఇక ఈ టెలీ వీడియో కాన్ఫరెన్స్‌లో ఊహించినట్లుగానే రష్యాను చీల్చి చెండాడాడు జెలెన్‌స్కీ.
అది రష్యాకు వ్యతిరేకం కాదు
వ్యతిరేక విమర్శల నేపథ్యంలో భారత్ స్పందించింది. జెలెన్‌స్కీ ప్రసంగానికి మద్దతుగా ఓటేసినంత మాత్రానా.. భారత్ స్టాండ్ మారినట్లు కాదని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పష్టం చేశారు. స్వేచ్ఛ కోణంలోనే భారత్ ఆలోచించిందని, అంతేకానీ.. ఎవరికో వ్యతిరేకంగా ఓటేసినట్లు కాదని ఆయన అన్నారు. గతంలోనూ రెండుసార్లు జెలెన్‌స్కీ యూన్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది మూడోసారి. అందుకు మద్దతుగా భారత్ ఓటేసింది. అంతేతప్ప ఇది రష్యాకు వ్యతిరేకంగా ఓటేసినట్లు కాదు.. అసలు అలాంటి ప్రశ్నే లేదు అని ఆయన తెలిపారు. అలాగే అధికారులు సైతం.. భారత్ తీరు మారలేదని.. మారబోదని.. కేవలం జెలెన్‌స్కీ ప్రసంగ సమయంలో భారత్ ఓటు కీలకంగా మారినందునా అలాంటి నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
ఆయిల్ కాదు.. అది మా రక్తం
ఇక ఉక్రెయిన్‌కు ఔషధాల పంపిణీ విషయంలో ఇప్పటికే భారత్, ఉక్రెయిన్ విదేశాంగ శాఖతో మాట్లాడింది. నైతికంగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చింది. అయితే ఉక్రెయిన్ మాత్రం భారత్ వ్యవహారంపై అసంతృప్తితోనే ఉంది. కారణం.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని సైతం పెంచుకుంటూ పోవడం. ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా తీవ్రంగా స్పందించారు. అది ముడి చమురు కాదని.. తమ రక్తం చెల్లిస్తున్న డిస్కౌంట్ అని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే భారత్ మాత్రం దేశం కోసం.. ప్రజల కోసం.. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోక తప్పడం లేదని సమర్థించుకుంది.
డిసెంబర్‌తో ముగింపు
ఇదిలా ఉంటే.. ఐరాస భద్రతా మండలిలో ఓటింగ్ సందర్భంగా.. రుచిరా కాంబోజీ ప్రసంగిస్తూ.. దౌత్యం, చర్చల ద్వారా ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారం అవుతుందని భారత్ భావిస్తోందని, అలాగే.. మానవ దృక్ఫథంతో అందించాల్సిన సాయం భారత్ ఈ సంక్షోభం వల్ల ప్రభావితం అవుతున్న దేశాలకు అందిస్తుందని తెలిపారు. భారత్ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం కాదు. రెండేళ్ల కాలపరిమితితో సభ్యురాలిగా కొనసాగుతోంది. ఈ డిసెంబర్‌లో ఆ కాలపరిమితి ముగుస్తుంది.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌లా పోరాడడం మా వల్ల కాదు!
Comments
Please login to add a commentAdd a comment