రష్యా దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న లిదియా, యుద్ధంలో ధ్వంసమైన లిదియా ఇల్లు
సాక్షి, హైదరాబాద్: ‘మేం ఈ యుద్ధాన్ని ఎప్పుడూ కోరుకోలేదు, రష్యా మా దేశంపై దండెత్తింది. దీని వల్ల మా ఉనికి ప్రమాదంలో పడింది. మేం కోల్పోయిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను తిరిగి నిలబెట్టుకొనేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నాం’ అని ఉక్రెయిన్ మహిళ, సామాజిక కార్యకర్త, ప్రముఖ భారతీయ నృత్యకారిణి లిదియా జురాలెవా లక్ష్మి అన్నారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్ నృత్యకళాకారిణి మాత్రమే కాకుండా భారతీయ కళలు, సంస్కృతి, జీవనవిధానంతో ఆత్మీయ అనుబంధం కలిగిన లిదియా ఉక్రెయిన్ యుద్ధ బీభత్సం, అక్కడి భయానక పరిస్థితులపై ‘సాక్షి’ ప్రతినిధి పగిడిపాల ఆంజనేయులుతో ప్రత్యేకంగా మాట్లాడారు.
‘ఇప్పటికే అనేక నగరాలు ధ్వంసమయ్యాయి. రష్యా సాగిస్తున్న మానవ హననంలో వేలాదిమంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వైద్యం, మందుల కోసం అల్లాడుతు న్నాం. మాకు మానవతా సాయం అందించండి’ అని విజ్ఞప్తి చేశారు. చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారని, చివరకు డైపర్లు కూడా వాళ్లకు లభించడం లేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రపంచం కళ్లు తెరిచి చూడాలి
‘నెలరోజులుగా ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇప్పటికైనా ప్రపంచం కళ్లు తెరిచి చూడాలి. ఉక్రెయిన్ ఉగ్రవాద దేశం కాదు. అయినా రష్యా మా ఇళ్లపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికి వెయ్యికిపైగా క్షిపణి దాడులు జరిగాయి. ఇక్కడ తాగునీళ్లు కూడా లభించడం లేదు. పోలండ్, హంగేరి, రుమేనియా తదితర దేశాల నుంచి ట్రక్కుల ద్వారా అందే మానవతాసాయాన్ని కూడా రష్యా సైనికులు అడ్డుకుంటున్నారు.
మేం బాధల్లో, కష్టాల్లో ఉన్నాం, మమ్మల్ని ఆదుకోండి’ అని ఆమె కోరారు. ఉక్రెయిన్ ఆసుపత్రుల్లో కనీసం నొప్పి నివారణ మందులు కూడా లభించడంలేదని పేర్కొన్నారు. భారతీయ సమాజంతో తనకు దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ భారత్ సాయాన్ని అభ్యర్థించారు.
అత్యవసర సేవల్లో లిదియా
లిదియా, ఆమె భర్త నెల రోజులుగా యుద్ధప్రాంతాల్లో అత్యవసర సేవలను అందజేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. నిరాశ్రయులను ఆదుకొనేందుకు సహాయ కార్యక్రమాలను చేపడుతున్నారు. అధికారయంత్రాంగంతో కలసి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారం క్రితం రష్యా సైనికులు జరిపిన కాల్పుల్లో ఆమె గాయాలపాలయ్యారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. రెండురోజుల క్రితం కీవ్‌కు సమీపంలో రష్యా జరిపిన బాంబు దాడిలో లిదియా ఇల్లు కూడా నేలమట్టమైంది. ఆత్మరక్షణలో భాగంగా ఆమె తన భర్తతో కలిసి ఈ నెల రోజులుగా వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటోంది. 2014 నాటి యుద్ధంలో ఆమె తల్లిదండ్రులు, తోబుట్టువులు చనిపోయారు. ఇప్పుడు ఆమె అదే యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదని ఆమె ఆవేదన చెందారు.
Comments
Please login to add a commentAdd a comment