ఉక్రెయిన్‌పైకి ఖండాంతర క్షిపణి    ప్రయోగించిన రష్యా | Russia fires intercontinental ballistic missile at Ukraine | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పైకి ఖండాంతర క్షిపణి    ప్రయోగించిన రష్యా

Published Thu, Nov 21 2024 4:13 PM | Last Updated on Fri, Nov 22 2024 4:49 AM

Russia fires intercontinental ballistic missile at Ukraine

యుద్ధంలో తొలిసారిగా ఐసీబీఎంతో దాడి

కీవ్‌: అమెరికా తొలిసారిగా అందించిన శక్తివంత దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా మీదకు ప్రయోగించిన ఉక్రెయిన్‌ ఊహించని దాడిని ఎదుర్కొంది. యుద్ధంలో ఎన్నడూలేని విధంగా తొలిసారిగా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ఉక్రెయిన్‌ భూతలం మీదకు రష్యా ప్రయోగించింది. అభివృద్ధిచేశాక పరీక్ష కోసం పలుదేశాలు ఎన్నోసార్లు ఈ రకం క్షిపణులను ప్రయోగించినా యుద్ధంలో వినియోగించడం మాత్రం ఇదే తొలిసారికావడం గమనార్హం. మధ్యతూర్పు ఉక్రెయిన్‌లోని డినిప్రో నగరంపైకి బుధవారం రాత్రి ఇంటర్‌కాంటినెంటల్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌(ఐసీబీఎం) వచ్చి పడిందని ఉక్రెయిన్‌ టెలిగ్రామ్‌ మెసెంజింగ్‌ యాప్‌లో ప్రకటించింది. 

వేయి కిలోమీటర్ల దూరంలో రష్యాలో కాస్పియన్‌ సముద్రతీర ఆస్ట్రాఖన్‌ ప్రాంతం నుంచి అది దూసుకొచ్చిందని ఉక్రెయిన్‌ వాయుసేన పేర్కొంది. అయితే ఆ క్షిపణి సృష్టించిన విధ్వంసం, జరిగిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలను ఉక్రెయిన్‌ వెల్లడించలేదు. ‘‘ ఐసీబీఎంతోపాటు కింజార్‌ హైపర్‌సోనిక్‌ క్షిపణి, ఏడు కేహెచ్‌–101 క్రూజ్‌ క్షిపణులు వచ్చిపడ్డాయి. వీటిలో ఆరింటిని గాల్లోనే ధ్వంసంచేశాం. ఈ దాడిలో ఇద్దరు ఉక్రేనియన్లు గాయపడ్డారు. ఒక కర్మాగారం దెబ్బతింది. 

వికలాంగుల కోసం ఏర్పాటుచేసిన పునరావాసన శిబిరం నాశనమైంది’ అని స్థానిక యంత్రాంగం పేర్కొంది. అయితే ఆర్‌ఎస్‌–26 రూబెజ్‌ రకం ఐసీబీఎంను రష్యా ప్రయోగించి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్‌ఎస్‌–26 క్షిపణి ఏకంగా 800 కేజీల మందుగుండును మోసుకెళ్లగలదు. 5,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదు. ఈ క్షిపణితోపాటు మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీ–ఎంట్రీ వెహికల్స్‌(ఎంఐఆర్‌వీ) సాంకేతికతనూ రష్యా వాడినట్లు తెలుస్తోంది. యుద్ధంలో ఎంఐఆర్‌వీ టెక్నాలజీని వాడటం ఇదే తొలిసారి.

క్షిపణితో హెచ్చరించారా?
సాధారణంగా ఐసీబీఎంలను అణ్వస్త్రాల వంటి భారీ బాంబులను ప్రయోగించడానికి వినియోగిస్తారు. సాధారణ మందుగుండుతో రష్యా గురువారం ఐసీబీఎంను ప్రయోగించడం వెనుక వేరే ఉద్దేశ్యం ఉందని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా నుంచి అందుకున్న అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణుల అండ చూసుకుని విచక్షణారహితంగా తమపై దాడులకు తెగబడితే అణ్వాయుధం ప్రయోగించేందుకైనా వెనుకాడబోమని హెచ్చరించేందుకే రష్యా ఇలా ఐసీబీఎంను ప్రయోగించి ఉంటుందని భావిస్తున్నారు. అణ్వస్త్ర వినియోగానికి సంబంధించిన దస్త్రంపై సంతకం చేసిన రెండు రోజులకే రష్యా ఉక్రెయిన్‌పైకి తొలిసారిగా ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం గమనార్హం. ‘‘ ఉక్రెయిన్‌ నుంచి దూసుకొచ్చిన రెండు బ్రిటన్‌ తయారీ స్టార్మ్‌ షాడో క్షిపణులు, ఆరు హిమార్స్‌ రాకెట్లు, 67 డ్రోన్లను నేలకూల్చాం’’ అని గురువారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. స్టార్మ్‌షాడో క్షిపణులను తమ గగనతలరక్షణ వ్యవస్థలు కూల్చేశాయని రష్యా ప్రకటించడం ఇదే తొలిసారి.

 అయితే గురువారం ఉక్రెయిన్‌పై ఏ రకం ఖండాంతర క్షిపణిని ప్రయోగించారో, అసలు ప్రయోగించారో లేదో అన్న విషయాన్ని రష్యా వెల్లడించలేదు. ఇతర వివరాలు తెలిపేందుకు రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా సాధారణ పత్రికా సమావేశంలో మాట్లాడుతుండగా ఆమెకు ఫోన్‌కాల్‌ వచ్చింది. ‘‘ మనం ప్రయోగించిన ఖండాంతర క్షిపణి గురించి పశ్చిమదేశాలు అప్పుడే మాట్లాడటం మొదలెట్టాయి. ఐసీబీఎంను వాడిన విషయాన్ని ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించొద్దు’’ అని సంబంధిత ఉన్నతాధికారులు ఆమెకు ఫోన్‌లో చెప్పారు. సంబంధిత వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఏమిటీ ఖండాంతర క్షిపణి?
సుదూరంలోనే శత్రుస్థావరాలను తుదముట్టించేందుకు ఖండాంత క్షిపణి ఉపయోగపడుతుంది. 5, 500 కిలోమీటర్లకు మించి ప్రయా ణించగలవు. అణు, రసాయన, జీవాయుధాలను మోసుకెళ్లగలవు. సంప్రదాయక వార్‌హెడ్‌నూ మోస్తాయి. రష్యా వాడినట్లుగా చెబుతున్న ఆర్‌ఎస్‌26 రూబెజ్‌ క్షిపణి ఎంఐఆర్‌వీ టెక్నాలజీతో పనిచేసే ఘన ఇంధన మిస్సైల్‌. 2011 దీనిని అభివృద్ధిచేసి 2012లో తొలిసారి విజయవంతంగా పరీక్షించారు. అది ఆనాడు 5,800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తుత్తునియలు చేసింది. 

ద్రవ ఇంధనంతో పోలిస్తే ఘన ఇంధన క్షిపణులను వాడటం చాలా తేలిక. నేలమాళిగ, మొబైల్‌ లాంఛర్‌ నుంచి సులభంగా ప్రయోగించవచ్చు. ఇందులోని ఇంధనం, ఆక్సిడైజర్‌లను రబ్బర్‌లాంటి దానితో కలిపి మిశ్రమంగా తయారుచేసి ఒక గట్టి పెట్టెలో అమర్చుతారు. ప్రొపెలంట్‌ మండగానే ఇంధన ప్రజ్వలన రెప్పపాటులో భారీగా జరిగి క్షిపణి శరవేగంగా దూసుకుపోతుంది. ఇంధ్రధనస్సులాగా అర్ధచంద్రాకృతిలో ప్రయాణిస్తుంది. 

దాదాపు 4,000 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వేగంగా కిందకు పడపోవడం మొదలవుతుంది. ఈ దశలో ఇది ఏకంగా ధ్వని వేగానికి పది రెట్లు వేగంగా దూసుకొస్తుంది. ఎంఐఆర్‌వీ టెక్నాలజీతో ఒకే క్షిపణిలో వేర్వేరు వార్‌హెడ్‌లను ఒకేసారి ప్రయోగించవచ్చు. ఇవి వేర్వేరు లక్ష్యాలను ఛేదించగలవు. వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇవి ఢీకొట్టగలవు. ఒకేసారి ప్రయోగించిన రెండు వార్‌హెడ్‌ల మధ్య దూరం 1,500 కిలోమీటర్ల దూరం ఉన్నాసరే వాటిని క్షిపణి ఖచ్చిత దిశలో జారవిడచగలదు. 

తొలుత కనిపెట్టిన అమెరికా
ఎంఐఆర్‌వీ టెక్నాలజీని తొలుత అమెరికా అభివృద్ధిచేసింది. 1970లో ఐసీబీఎంను పరీక్షించింది. 1971లో జలాంతర్గామి వెర్షన్‌లో ఎస్‌సీబీఎంను పరీక్షించింది. ఈ సాంకేతికతను 1970 చివర్లో నాటి సోవియట్‌ రష్యా అభివృద్ధిచేసింది. దీని సాయంతో ఐసీబీఎం, జలాంతర్గామి వెర్షన్‌ ఎస్‌ఎల్‌బీఎంను రూపొందించింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భాగంగా అమెరికా, రష్యాలు స్వల్ప, దీర్ఘ, ఖండాంతర క్షిపణులను ధ్వంసంచేశాయి. 1991 జూన్‌ ఒకటోతేదీలోపు మొత్తంగా 2,692 క్షిపణులను నాశనంచేశాయి. అయితే ఈ ఒప్పందం నుంచి 2019లో అమెరికా వైదొలగింది. 

పశ్చిమ దేశాలకు రష్యా న్యూక్లియర్ వార్నింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement