ఉక్రెయిన్ వ్యవహారం ఇప్పుడిక రావణకాష్ఠం. యుద్ధం మొదలై సరిగ్గా 49 రోజులు గడిచినా, ఇప్పుడిప్పుడే అది ఆగేలా లేదు. పైపెచ్చు, రోజుకో పరిణామంతో రష్యా – ఉక్రెయిన్ వ్యవహారం రానురానూ జటిలంగా తయారవుతోంది. ఉక్రెయిన్ వైఖరి దృష్ట్యా చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందనీ, ఆశలు పోయాయనీ, దీని పర్యవసానాలు తప్పక ఉంటాయనీ రష్యా తీవ్రస్వరంలో మాట్లాడుతోంది. ఇంకోపక్క, అమెరికా ఈ యుద్ధాన్ని పచ్చి ‘సామూహిక హత్యాకాండ’గా అభివర్ణిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ల మధ్య జరిగిన తాజా వర్చ్యువల్ సమావేశం అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక ఇద్దరు వర్చ్యువల్‌గా భేటీ కావడం ఇది రెండోసారి. ఆ మార్గదర్శనంతోనే ఇరుదేశాల నాలుగో విడత ‘టూ ప్లస్ టూ’ మంత్రుల స్థాయి చర్చలు సాగాయి. అనివార్యమైన ఉక్రెయిన్ ప్రస్తావనతో, రెండు దేశాలూ తమదైన భిన్న స్వరాలను బలంగా వినిపించాయి. రష్యా నుంచి ఇంధన దిగుమతులు చేసుకోవడం భారత్‌కు మంచిది కాదని అమెరికా అంటే, రష్యా నుంచి ఒక మధ్యాహ్నం యూరప్ కొనే చమురు కన్నా నెలలో మేము కొనేవి తక్కువేనని భారత్ బదులిచ్చింది. బుచాలో నరమేధాన్ని ఖండిస్తూ, శాంతి స్థాపన కోరుతూనే రష్యాతో బంధాన్ని వదులుకోబోమన్న తన వైఖరిని భారత్ బలంగా చెప్పింది.
రష్యా తీరుపై గత నెలన్నర పైగా భారత, అమెరికాల మధ్య స్పష్టమైన అభిప్రాయభేదాలున్నాయి. కానీ, అవేవీ తమ చర్చలపై నీడలు ప్రసరించకుండా చూసుకున్నాయి. రక్షణ, అంతరిక్షం, కృత్రిమ మేధ, సైబర్‌స్పేస్ సహా వివిధ రంగాలలో వ్యూహాత్మక సహకారాన్ని భారత్, అమెరికాలు పునరుద్ఘాటించాయి. అటు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, ఇటు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో ప్రతినిధి బృందాలు పాల్గొన్న ఈ సమావేశం ఆ రకంగా సఫలమే. ఐరాస భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వానికీ, అలాగే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు చోటుదక్కడానికీ మద్దతునిస్తామంటూ అమెరికా మరోమారు మాట ఇచ్చింది. ఎన్‌ఎస్‌జీ సభ్యదేశాలు అంతర్జాతీయ విపణుల నుంచి ఎలాంటి అడ్డంకులూ లేకుండా కావాల్సినవి సేకరించుకొని, అణు రియాక్టర్లను నిర్మించుకోవడానికీ, నిర్వహించడానికీ వీలుంటుంది. అందుకే, దాని మీద భారత్‌కు అంత ఆసక్తి. కానీ, పాకిస్తాన్‌తో కలసి చైనా అది పడనివ్వడం లేదు. ప్రస్తుతానికైతే, భారత – అమెరికా పౌర అణుశక్తి కార్యాచరణ బృందం పక్షాన మన దేశానికి అణు సహకారం అందుతోంది.
స్వేచ్ఛాయుత ఇండో– పసిఫిక్, ‘క్వాడ్’ను బలంగా తీర్చిదిద్దడం వగైరాలలో ఢిల్లీ, న్యూయార్క్‌లది ఒకటే మాట. అలాగే, తీవ్రవాదం విషయంలో ఇటు పాకిస్తాన్ పాలకులకూ, అటు ఆఫ్ఘానిస్తాన్‌ను పాలిస్తున్న తాలిబన్లకూ గట్టిగానే సందేశం పంపాయి. ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నా సరే, తమ ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాలకే భారత్ – అమెరికాల ప్రాధాన్యమని తాజా చర్చలు మరోసారి స్పష్టం చేశాయి. ఇంధనం విషయంలో ఇన్నేళ్ళుగా రష్యాపై ఆధారపడిన ఐరోపా ఇప్పటికిప్పుడు దాన్ని మార్చుకోవడం కష్టం. అలాగే, రష్యాతో ఇన్ని దశాబ్దాల బంధాన్ని భారత్ సవరించుకోలేదు. కాకపోతే, ఉక్రెయిన్ వ్యవహారంతో రష్యా కాస్తా చైనాకు జూనియర్ మిత్రుడిగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో క్రమంగా ఇండో– పసిఫిక్‌లో పట్టు బిగించాలన్న డ్రాగన్ వ్యూహానికి చెక్ పెట్టాలంటే, భారత్‌కు ఇటు అమెరికాతో అనుబంధమూ కీలకమే.
ఇలా ఉండగా, ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం ఇప్పుడు యుద్ధ కేంద్రంగా మారింది. ఎప్పటికప్పుడు తన వ్యూహం మార్చేస్తున్న రష్యా ప్రస్తుతం డాన్‌బాస్ ప్రాంతంపై దృష్టి పెట్టి, దాడుల తీవ్రత పెంచింది. రష్యా యుద్ధ నేరాలూ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ మధ్య అమెరికా అధ్యక్షుడు సరిహద్దుల్లో, ఇటీవల బ్రిటన్ ప్రధాని ఏకంగా ఉక్రెయిన్‌లో పర్యటించి, నైతిక మద్దతునిచ్చారు. ఎవరెన్ని మాట్లాడినా, అవి యుద్ధం వేడిని పెంచుతున్నవే తప్ప, తగ్గిస్తున్నది శూన్యం. యుద్ధ నివారణలో ఐరాస లాంటి అంతర్జాతీయ వేదికల వైఫల్యమూ ప్రతిరోజూ కళ్ళకు కడుతోంది. రెక్కలు విరిచిన శాంతి కపోతాలను ఎగరేస్తున్న వేళ ఉక్రెయిన్ యుద్ధం చివరకు ఎలా ముగుస్తుందో తెలియదు. ఐరోపా సహా మిగతా ప్రపంచం ఇక మునుపటిలా ఉండబోదన్నది మాత్రం తథ్యం. ప్రచ్ఛన్న యుద్ధానంతర సంబంధాలు బహుశా శాశ్వతంగా మారిపోతాయి.
రష్యాలో పుతిన్ గనక అధికారంలో కొనసాగితే, తాను యుద్ధ నేరస్థుడిగా పేర్కొన్న వ్యక్తితోనే ద్వైపాక్షిక, బహుళ పక్ష వేదికలపై ఎలా వ్యవహరించాలో అమెరికా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అటు భద్రతామండలి శాశ్వత సభ్యదేశాలలో వీటో హక్కున్న రష్యా, చైనాలకు పాశ్చాత్య ప్రపంచం ఇప్పుడు ఉమ్మడి శత్రువైంది. ఆ విషయంలో ఆ రెండు దేశాలూ మరింత దగ్గరయ్యాయి. చైనాతో సరిహద్దు సమస్యల నేపథ్యంలో భారత్ పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. అందుకే, ఉక్రెయిన్ కథలో అటు రష్యాకూ, ఇటు పాశ్చాత్య ప్రపంచానికీ మధ్య సమతూకం పాటించడానికి భారత్ కత్తి మీద సాము చేస్తూనే ఉంది. భారత తటస్థ వైఖరితో మిత్రదేశాలు గుర్రుగా ఉన్నాయి. కానీ, ఆర్థిక, వ్యూహాత్మక పర్యవసానాల దృష్ట్యా ఇరుపక్షాలతోనూ స్నేహం భారత్‌కు కీలకం. అమెరికాతో తాజా భేటీలోనూ భారత్ దానికే కట్టుబడింది. భిన్నస్వరాల మధ్యనే ఏకతా రాగం ఆలపించింది. వ్యూహాత్మకమైతేనేం, ప్రపంచంలోని రెండు అతి పెద్ద ప్రజాస్వామ్యాల ఆచరణవాద స్నేహగీతమే సమకాలీన అవసరం.
Comments
Please login to add a commentAdd a comment