బలపడుతున్న భారత్‌–నాటో బంధం? | Sakshi
Sakshi News home page

బలపడుతున్న భారత్‌–నాటో బంధం?

Published Wed, Jul 12 2023 12:30 AM

Sakshi Guest Column On India NATO relationship

భారతదేశం సాంప్రదాయికంగా నాటోతో వ్యవహారంలో జాగరూకతతో వ్యవహరిస్తోంది. కూటమి చారిత్రక లక్ష్యం, మన సన్నిహిత సైనిక భాగస్వామి రష్యాపై దాని వైఖరిని దృష్టిలో ఉంచుకుంటే ఈ ధోరణి అర్థం చేసుకోదగినదే. ఇంత స్పష్టమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ, భారత్‌ గత రెండు దశాబ్దాలుగా నాటోతో ఆశ్చర్యకరమైన రీతిలో అన్యోన్యతను కలిగి ఉంది. హిందూ మహాసముద్రంలో దొంగతనాల (పైరసీ) విషయంలో ఉమ్మడి భాగస్వామ్య సవాలుపై భారత్, నాటో మధ్య ఆచరణాత్మక సహకారం స్పష్టంగా ఉంది.

కాబూల్‌ నుండి అమెరికా బలగాల ఉపసంహరణకు ముందు భారత అధికారులు నాటో అధికారులతోనూ తమ దృష్టికోణాలను పంచుకున్నారు. 2007లో ఎస్తోనియాపై గణనీయమైన సైబర్‌ దాడుల తర్వాత భారత్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ (సెర్ట్‌–ఇన్‌) ఫిన్లాండ్‌తో, నాటోతో సహకరించింది.

నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో) వార్షిక శిఖరాగ్ర సమావేశం లిథువేనియా రాజధాని విల్నియస్‌లో జరుగుతోంది (జూలై 11–12). ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల పరస్పర రక్షణ కూటమిగా 1949 నుండి ఉంటూ వస్తున్న నాటోను ఇటీవలి వరకు చాలామంది ప్రచ్ఛన్న యుద్ధ అవశేషంగానే భావించారు.

(ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్‌ మెక్రాన్‌ అయితే 2019లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాటో బ్రెయిన్‌ డెత్‌ గురించి ప్రముఖంగా ప్రకటించారు కూడా.) కానీ ఉక్రెయిన్ లో రష్యా యుద్ధం నాటో కూటమిలో సరికొత్త ప్రయోజనాత్మక లక్ష్యాన్ని నింపింది. గత సంవత్సరంలో ఫిన్లాండ్‌ను నాటోలో చేర్చుకున్నారు. సభ్యులందరి ఆమోదానికి లోబడి స్వీడన్‌ కూడా కూటమిలో చేరుతుందని భావిస్తున్నారు. దీంతో నాటో సభ్యత్వం 32 దేశాలకు పెరగనుంది.

పైగా, మంగోలియా, పాకిస్తాన్‌ వంటి విభిన్న దేశాలతో సహా 39 దేశాలతో నాటో అధికారిక భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. వాటిలో మూడు (రష్యా, బెలారస్, అఫ్గానిస్తాన్‌) దేశాల సభ్యత్వాన్ని  ప్రస్తుతం నిలిపివేశారు. ఇవి పార్లమెంటరీ వ్యవహారాల నుండి సాంకేతిక సహకారం వరకు వివిధ స్థాయుల్లో ప్రమేయాన్ని కలిగి ఉన్నాయి. కొన్ని నాటో భాగస్వామ్య దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌... రష్యాకు వ్యతిరేకంగా సమన్వయం విషయంలో మరింత సన్నిహితంగా ఉన్నాయి. 

నాటో 2022 వ్యూహాత్మక భావన అనేది రష్యాపై దృష్టిని తిరిగి కేంద్రీకరించడం, కూటమి సభ్యత్వ విస్తరణను చేపట్టడంతో సహా చైనా ప్రజా రిపబ్లిక్‌కు (పీఆర్‌సీ) కొంత ప్రాధాన్యమిచ్చింది. బీజింగ్‌  ‘ప్రకటిత ఆశయాలు, దాని బలవంతపు విధానాలు, మన ఆసక్తులను, భద్రతను, విలువలను సవాలు చేస్తున్నాయి’ అని ప్రకటించింది. ‘యూరో–అట్లాంటిక్‌ భద్రతకు పీఆర్‌సీ ద్వారా ఎదురయ్యే దైహిక సవాళ్లను పరిష్కరిస్తా’మని ఈ డాక్యుమెంట్‌ ప్రతినబూనింది.

నాటో ఆందోళన చెందుతున్న అంశాల్లో చైనాను కూడా చేర్చడం వల్ల భారత్‌తో ఈ కూటమి చర్చలకు ఎక్కువ అవకాశం ఉంది. ఇండో–పసిఫిక్‌ దేశాలతో నిమగ్నమవ్వడానికి జపాన్‌లో నాటో కార్యాలయాన్ని ప్రారంభించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. మారుతున్న ప్రపంచ వాస్తవాలకు అనుగుణంగా దాని వ్యూహాత్మక ప్రాధాన్యాలు ఉంటున్నాయి.

భారతదేశం సాంప్రదాయికంగా నాటోతో వ్యవహారంలో జాగరూకతతో వ్యవహరిస్తోంది. కూటమి చారిత్రక లక్ష్యం, భారతదేశ సన్నిహిత సైనిక భాగస్వామి రష్యాపై దాని వైఖరిని దృష్టిలో ఉంచుకుంటే ఈ మౌనం కొంతవరకు అర్థం చేసుకోదగినదే. ఇంత స్పష్టమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ, భారత్‌ గత రెండు దశాబ్దాలుగా నాటోతో ఆశ్చర్యకరమైన రీతిలో అధికారిక అన్యోన్యతను కలిగి ఉంది.

భారత్, నాటో మధ్య ప్రారంభ  వ్యవహారాలు... ఆయుధాల నియంత్రణ, తీవ్రవాద వ్యతిరేక సమస్యలతో నడిచాయి. వాటి మొదటి అధికారిక ఒడంబడిక 2005లో జరిగింది. తరువాతి రెండేళ్లలో, అంటే 2006, 2007లో ఇండియా తరఫున ప్రణబ్‌ ముఖర్జీ రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిగా ఇరు హోదాల్లో నాటో సెక్రటరీ జనరల్‌తో సమావేశమయ్యారు.

నాటో డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ 2007లో భారత్‌ను సందర్శించారు. 2019లో నాటో–భారత్‌ మధ్య జరిగిన రాజకీయ చర్చల్లో చైనా, తీవ్రవాదం, పాకిస్తాన్‌ వంటి అంశాలు చోటు చేసుకున్నాయి. రెండు సంవత్సరాల తరువాత, నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్ స్టోల్టెన్ బర్గ్‌ న్యూఢిల్లీలో యేటా జరిగే ‘రైజీనా డైలాగ్‌’ని ఉద్దేశించి ప్రసంగించారు.

హిందూ మహాసముద్రంలో దొంగతనాల(పైరసీ) విషయంలో ఉమ్మడి భాగస్వామ్య సవాలుపై భారత్, నాటో మధ్య ఆచరణాత్మక సహకారం చాలా స్పష్టంగా ఉంది. 2009, 2011 మధ్య, బీజింగ్‌లో చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఆతిథ్య భేటీలోనూ, బ్రస్సెల్స్‌లో నాటో నిర్వహించిన సమావేశంలోనూ గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్ లో పైరసీ వ్యతిరేక ప్రయత్నాలను సమన్వయం చేయడంలో భారత్, నాటో అధికారులు పాల్గొన్నారు. భారత నౌకాదళం వాలెన్సియాలోని నాటో ర్యాపిడ్‌ డిప్లాయబుల్‌ కోర్‌తో కూడా పరిచయాలను ఏర్పరచుకుంది.

ఈ దశలు కొన్ని కచ్చితమైన ఫలితాలను అందించాయి. ఉదాహరణకు, 2011 మే నెలలో, అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల దాడిని అడ్డుకోవడానికి భారత నౌకాదళం నాటో పెట్రోలింగ్‌ నౌకలతో సమన్వయం చేసుకుంది. రెండు సంవత్సరాల తరువాత, నాటో నౌకాదళ వాహనాలు గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్ లో 14 మంది భారతీయ నావికులను రక్షించడంలో సహాయపడ్డాయి.

నాటో, భారత్‌ మధ్య కాలానుగుణమైన అధికారిక వ్యవహారాలు అఫ్గానిస్తాన్, సైనిక విద్య, శాంతి పరిరక్షక కార్యకలాపాలు, సైబర్‌ భద్రత వంటి ఇతర రంగాలకు విస్తరించాయి. కాబూల్‌ నుండి అమెరికా బలగాల ఉపసంహరణకు ముందు, భారత అధికారులు అక్కడి అంతర్జాతీయ భద్రతా సహాయ దళం (ఐఎస్‌ఏఎఫ్‌)లో పాల్గొన్న నాటో అధికారులతోనూ, సైనిక కమాండర్లతోనూ తమ దృష్టికోణాలను పంచుకున్నారు.

2007లో ఎస్తోనియాపై గణనీయమైన సైబర్‌ దాడుల తర్వాత భారత్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ (సెర్ట్‌–ఇన్‌) ఫిన్లాండ్‌తో, నాటోతో సహకరించింది. తర్వాత 2008లో ఉత్తర సముద్రంలో నాటో కసరత్తులకు భారత అధికారులను పరిశీలకులుగా ఆహ్వానించారు. ఇటీవల, కమాండెంట్‌ నేతృత్వంలోని భారత జాతీయ రక్షణ కళాశాల ప్రతినిధి బృందం, నాటో మారిటైమ్‌ ఇంటర్‌డిక్షన్‌ ఆపరేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను సందర్శించింది.

బ్రస్సెల్స్‌ సదస్సు దృక్పథం నుండి అఫ్గానిస్తాన్‌ ఇప్పుడు వెనక్కిపోయి ఉండవచ్చు. అయినప్పటికీ ఇది న్యూఢిల్లీకి అధిక ప్రాధాన్యంకలిగిన అంశమే. ఏదేమైనా, అతి వ్యాప్తి చెందుతున్న వారి ఎజెండాల స్వరూపాలు నేడు మరింత సులభంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సముద్ర భద్రత, సైబర్‌ భద్రత, ఇండో–పసిఫిక్‌లో రాజకీయ పరిణామాలు, వృత్తిపరమైన సైనిక విద్య, వాతావరణ మార్పులు, బహుశా ఆయుధాల నియంత్రణతోపాటు అణు ఎస్కలేటరీ డైనమిక్స్‌ ఇందులో ఉన్నాయి. సహజంగానే, వేర్వేరు ప్రయోజనాలు, ఆసక్తులు, తరచుగా భిన్నమైన భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల దృష్ట్యా... భారత్, నాటోలు రష్యాతో పరస్పర చర్చలకు భిన్నమైన విధానాలను కొనసాగిస్తాయనడంలో సందేహం లేదు.

ఆర్మేనియా, కజకిస్తాన్, సెర్బియా వంటి రష్యాతో సన్నిహితంగా ఉన్న అనేక భాగస్వామ్యదేశాలతో నాటో తలపడుతోంది. అంతే కాకుండా, ఇటీవలి వరకు అది న్యూఢిల్లీతో కంటే బీజింగ్, మాస్కోలతో మరింత విస్తృతమైన సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ అధికారులు నాటోతో విద్యా శిక్షణా కార్యకలాపాల్లో పాల్గొన్నారు.

నవంబర్‌ 2021 వరకు, మాస్కోలో నాటో తన కార్యాలయం కూడా కలిగి ఉంది. వాటి మధ్య విభిన్న అనుకూలతలు ఉన్నప్పటికీ... ఇండో–పసిఫిక్‌లో పెరుగుతున్న వ్యూహాత్మక పోటీని నాటో అంగీకరించడం అనేది భారతదేశంతో విస్తృతమైన, లోతైన సంభాషణకు తలుపులు తెరుస్తుంది.

ధ్రువ జైశంకర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, ఓఆర్‌ఎఫ్‌ అమెరికా;
అమ్మార్‌  నైనార్, జూనియర్‌ ఫెలో, ఓఆర్‌ఎఫ్‌ అమెరికా
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)  

Advertisement
 
Advertisement
 
Advertisement