Senior Journalist ABK Prasad Guest Column On Ukraine Russia War - Sakshi
Sakshi News home page

అందుకే రష్యాను సమర్థించక తప్పదు

Published Thu, May 12 2022 12:27 AM | Last Updated on Thu, May 12 2022 11:16 AM

Sakshi Guest Column On Russia

అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడల్లా ఒక యుద్ధం తరుముతూ వస్తోంది. ఉక్రెయిన్‌లోని చమురు సంపదపైన కన్నువేసిన పశ్చిమ రాజ్యాలు రష్యా నుంచి ఉక్రెయిన్‌ను విడగొట్టేందుకు చాలాకాలంగా కుట్ర పన్నుతూ వచ్చాయి. సామ్రాజ్యవాద కూటమి చేతిలో కీలుబొమ్మగా మారిన ఉక్రెయిన్‌ నేటి పతనావస్థను చేజేతులా ఆహ్వానించింది. ‘శాశ్వత శాంతి కోసం శాశ్వత యుద్ధం’ అన్న అమెరికా లక్ష్యం నిజానికి శాశ్వత శ్మశాన శాంతి మాత్రమే! తమకు భౌగోళికంగానూ, సైద్ధాంతికంగానూ ఏ సంబంధమూ లేని ఉక్రెయిన్‌లో వనరుల దోపిడీ కోసమే తిష్ఠ వేసిన సామ్రాజ్యవాద కూటమిని నిష్క్రమింపజేయడమే శాంతికాముక దేశాల కర్తవ్యం కావాలి. అందువల్లే రష్యా రక్షణకు పుతిన్‌ తీసుకుంటున్న చర్యలను సమర్థించక తప్పదు.

‘‘మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభ మయినట్టే. శాంతి స్థాపనాయత్నంలో విఫల మైనప్పుడల్లా ప్రజల్ని యుద్ధంలోకి నెడతారు. ఇది నేడు పునరావృతం అవుతున్న సమకాలీన చరిత్ర. అమెరికా భీకరమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దరిమిలా ముంచుకొచ్చింది ఏమిటి? యుద్ధం. ‘డాట్‌ కాం’ సంక్షోభం తరువాత ముమ్మరించిందేమిటి? యుద్ధం. మనం జీవిత కాలంలో కనీవినీ ఎరుగనంతటి పెను విపత్కర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోబోతున్నాం. మనం అంటే ప్రపంచ ప్రజలం కోవిడ్‌–ఫ్లూతో ప్రారంభమైన యుద్ధం నుంచి, ఉక్రెయిన్‌ యుద్ధానికి చేరుకున్నాం. ఇక్కడినుంచి ప్రపంచ యుద్ధం వైపుగా, మూడో ప్రపంచ యుద్ధానికి సాగిపోతున్నాం. ఈ దశలో అమెరికా, బ్రిటన్, నాటోలు రష్యాలో పశ్చిమ రాజ్యాల సైనిక స్థావరంగా పెంచి పోషిస్తున్న ఉక్రెయిన్‌ రక్షణ పేరిట మరిన్ని ఆయుధాలను గుప్పించే యత్నంలో ఉన్నాయి.’’
– సుప్రసిద్ధ ప్రపంచ పరిణామాల విశ్లేషకుడు,పరిశోధకుడు గెరాల్డ్‌ సిలెంటీ

మరొక ప్రసిద్ధ అమెరికా రాజకీయ వ్యాఖ్యాత, పరిశోధకుడు అయిన స్టీఫెన్‌ లెండ్‌మాన్‌ మాటల్లో – రష్యాలో అంతర్భాగమైన ఉక్రెయిన్‌లోని చమురు సంపదపైన కన్నువేసిన అమెరికా నేతృత్వంలోని పశ్చిమ రాజ్యాలు, నాటో సైనిక కూటమి... రష్యా నుంచి ఉక్రెయిన్‌ను విడ గొట్టేందుకు కుట్ర పన్నుతూ వచ్చాయి. ఇందుకు గోర్బచేవ్‌ సోవి యట్‌ను రెక్‌జావిక్‌ (ఐస్‌లాండ్‌ రాజధాని) సమావేశంలో ఆంగ్లో– అమెరికన్‌ సామ్రాజ్యవాదులకు పాదాక్రాంతం చేయడంతో సోవియట్‌ రిపబ్లిక్‌లలో పాశ్చాత్య రాజ్యాల జోక్యానికి మరింతగా దారులు తెరిచి నట్టయింది. చాపకింద నీరులా పాకుతూ వచ్చిన ఈ దురాక్రమణ పరిణామాల్ని లెండ్‌మాన్‌ ఇలా వర్ణించాడు: ‘‘అమెరికా పాలకపక్షాలు తమ కంట్రోల్‌లో లేని దేశాలను సహించలేవు. ఈ విషయంలో చిన్న, పెద్ద దేశాలన్న తారతమ్యం వాటికి ఉండదు’’. 

అసలు తమ పెత్తనానికీ, అధికార ప్రయోజనాలకూ ప్రపంచ దేశాలు అడ్డు రాకూడదన్నది ఆంగ్లో–అమెరికన్, నాటో దురాక్రమణ కూటమి లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగానే ఉక్రెయిన్‌ సహజ వనరుల దోపిడీ కోసం సామ్రాజ్యవాద కూటమి పన్నుగడ పన్నింది. కృశ్చేవ్, గోర్బచేవ్‌ నాయకత్వాలు సోవియట్‌ యూనియన్‌ను సోషలిస్టు రిపబ్లిక్‌గా నిలవకుండా దాని విచ్ఛిత్తికి పన్నిన కుట్రకు సోవియట్‌ రిపబ్లిక్కులు బలయ్యే ప్రమాదం ముమ్మరించింది. అందువల్లే ఉక్రె యిన్‌ సామ్రాజ్యవాద కూటమి చేతిలో కీలుబొమ్మగా మారి, నేటి పతనావస్థను చేజేతులా ఆహ్వానించింది.

ఇంతకుముందు – 2004లోనే ఉక్రెయిన్‌ రిపబ్లిక్‌లో అమెరికా ‘ఆరెంజ్‌ రివల్యూషన్‌’ పేరిట కుట్ర పన్నింది. అప్పుడు జరిగిన ఉక్రె యిన్‌ అధ్యక్ష ఎన్నికల్లో రష్యా అనుకూల అభ్యర్థిగా విక్టర్‌ యానుకోవిచ్‌ విజయం సాధించాడు. చూస్తూచూస్తూ ఉక్రెయిన్‌ను సామ్రాజ్యవాద ‘నాటో’ సైనిక కూటమిలో భాగస్వామిని చేయడాన్ని అతను వ్యతిరేకిం చాడు. పశ్చిమ రాజ్యాలతో సాధారణ సంబంధాలు కొనసాగించ డానికి మాత్రమే సానుకూలత వ్యక్తం చేశాడు.

అయితే ఉక్రెయిన్‌లో అప్పట్లో ఉన్న పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలకు అనుకూల సుప్రీం కోర్టు యానుకోవిచ్‌ ఎన్నికను కాస్తా నిష్కారణంగా రద్దుచేసి, పశ్చిమ సామ్రాజ్యవాద దేశాల కూటమి సానుకూల అభ్యర్థి ఎన్నికైనట్టు చిత్రించింది. కానీ ఆరేళ్లలో (2010) తిరిగి ఉక్రెయిన్‌ రిపబ్లిక్‌లో జరిగిన ఎన్నికల్లో మరోసారి యానుకోవిచ్‌ ఘనంగా గెలుపొందాడు. మళ్లీ ఆ పిమ్మట నాలుగేళ్లలోనే (2014) ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులు ఒబామా – బైడెన్‌లు తలపెట్టిన కుట్రలో బల వంతంగా యానుకోవిచ్‌ అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. 

అప్పటికీ క్రిమియన్లూ, డాన్‌బాస్‌ ప్రజలూ తాము అభిలషిస్తున్న ప్రజాస్వామిక పాలన కోసం ఫాసిస్టు పరిపాలనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అందుకు అనుగుణంగానే క్రిమియన్లు అసంఖ్యాకంగా ముందుకొచ్చి రిఫరెండం (జనవాక్య సేకరణ) ద్వారా రష్యాలో చేరడానికి సానుకూలతను వ్యక్తం చేసిన తరువాతనే ప్రస్తుత రష్యా అధినేత వ్లాదిమీర్‌ పుతిన్, రష్యన్‌ ఉన్నతాధికారులూ సమ్మతించారు. ఆ మార్గంలోనే డాన్‌బాస్‌ ప్రాంత ప్రజలూ అసంఖ్యాకంగా కదిలి డోనెస్క్, లుగాస్క్‌లతో కలిపి ఉమ్మడిగా ‘ప్రజా రిపబ్లిక్‌’నూ నెల కొల్పుకున్నారు.

అయినాసరే, 2014 ఏప్రిల్‌లో సోవియెట్‌ రిపబ్లిక్‌ల పైనా, నాటి ప్రజా బాహుళ్యంపైనా అమెరికన్‌ సామ్రాజ్యవాద కూటమి జోక్యంతో, ప్రోత్సాహంతో యుద్ధం మొదలైంది. చివరికి రష్యన్‌ రిపబ్లిక్స్‌లో ఒకటైన ఉక్రెయిన్‌ను స్థావరంగా మార్చుకుని, దాని సహజవనరులను దోపిడీ చేస్తూ, రష్యన్‌ రిపబ్లిక్స్‌లో శాంతి, సామ రస్యాలను నాశనం చేయడమే ఆంగ్లో–అమెరికన్‌–నాటో సామ్రాజ్య వాద కూటమి లక్ష్యమంటారు అమెరికన్‌ వ్యాఖ్యాత స్టీఫెన్‌ లెండ్‌మాన్‌. అందులో భాగంగానే రష్యా సరిహద్దుల చుట్టూ బెదిరింపు చర్యగా అమెరికా–నాటో కూటమి తమ సైన్యాలను దఫదఫాలుగా మోహరిం పజేసే ఎత్తుగడలకు పాల్పడిందన్నారు. 

‘శాశ్వత శాంతి కోసం శాశ్వత యుద్ధం’ అన్న అమెరికా సామ్రాజ్య వాదం లక్ష్యం శాశ్వత శ్మశాన శాంతి కోసం తహతహలాడుతున్నట్టుగా ఉందని మరో ప్రసిద్ధ విమర్శకుడు గోరే విడాల్‌ వ్యాఖ్యానించారు. అంతేగాదు, శాశ్వత యుద్ధాలను శాంతికి పవిత్రమైన ఆనవాళ్లుగా అమెరికా భావిస్తోందని ప్రసిద్ధ చరిత్రకారుడు హారీ ఎల్మెర్‌ బార్నెస్‌ విమర్శించారు. బహుశా అందుకే ఏనాడో సుప్రసిద్ధ ప్రపంచ అణు శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ ‘అణు విచ్ఛిత్తి మన ఆలోచనా ధోరణిని తప్ప అన్నిం టినీ మార్చేసిం’దని చెబుతూ– ‘‘మన ఆలోచనకు కూడా అందనంత మహా విపత్తు వైపు మనం పయనిస్తున్నాం. కనుక మానవాళి బతికి బట్టకట్టాలంటే మన ఆలోచనా ధోరణిలోనే సమూల మార్పు రావలసి ఉంటుంది’’ అన్నాడు. 

అణ్వస్త్ర పితామహుడైన రాబర్ట్‌ ఓపెన్‌ హీమర్‌ ‘నేనే మృత్యువుని, ప్రపంచ వినాశకుడిని’ అంటూ భగవద్గీతను ఉదాహరిస్తూ మనో వేదనను వ్యక్తం చేశారు. ఇంతమంది ఉద్దండుల్ని మనం ఎందుకు ఉదాహరించుకోవలసి వస్తోందంటే... సామ్రాజ్యవాద దుష్ట కూటమి కుట్రలకూ, కుహకాలకూ నిలయమైన ఉక్రెయిన్‌ యావత్తు రష్యా ఉనికికే ప్రమాదకరంగా మారినందుననేనని ఇప్పటికైనా గ్రహించాలి.

రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసిన నాజీ జర్మనీ కుట్రలకు బలైన పుడు... స్టాలిన్‌ నాయకత్వాన అనుసరించిన ఎత్తుగడల వల్లనే సోవి యట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ తాను బతికి బట్టకట్టడమేగాక యావత్‌ ప్రపంచ దేశాల రక్షణకు ‘ఏడుగడ’గా నిలబడింది. చివరికి హిట్లర్‌ చావు కూడా స్టాలిన్‌ యుద్ధతంత్రం ద్వారానే ఖాయమైంది! అంత వరకూ నాటకాలాడుతూ వచ్చిన అమెరికా–బ్రిటన్‌ –ఫ్రాన్స్‌ అధినే తలు స్టాలిన్‌కూ, సోవియట్‌కూ కృతజ్ఞతలు తెల్పుకోవలసి వచ్చింది. 

అలాంటి ఘట్టాలే ప్రస్తుతం ఆంగ్లో–అమెరికన్‌–నాటో కూటమి కుట్రలకు బలవుతున్న ఉక్రెయిన్‌ వల్ల రష్యా విషయంలోనూ పునరా వృతం అవుతున్నాయి. అందుకే  తమకు భౌగోళికంగానూ, సైద్ధాంతి కంగానూ ఎలాంటి సంబంధమూ లేని ఉక్రెయిన్‌లో కేవలం వనరుల దోపిడీ కోసం తిష్ఠ వేసిన ఆంగ్లో–అమెరికన్‌–నాటో సామ్రాజ్యవాద సైనిక కూటమిని అక్కడినుంచి నిష్క్రమింపజేయడమే శాంతికాముక దేశాల, ప్రజల కర్తవ్యంగా ఉండాలి. అందుకే రష్యా రక్షణకూ, ఉక్రె యిన్‌ రిపబ్లిక్‌ పరిరక్షణకూ రష్యన్‌ ప్రభుత్వమూ, దాని అధ్యక్షుడుగా పుతిన్‌ తీసుకుంటున్న చర్యలను సమర్థించక తప్పదు. సామ్రాజ్య వాదుల చంకలో దూరిన ఉక్రెయిన్‌ అస్తుబిస్తు పాలకవర్గం వల్ల మొత్తం రష్యా ఉనికికే ప్రమాదం ఏర్పడిన దశలో ప్రపంచ ప్రజలు కొమ్ముకాయవలసింది – కేవలం పుతిన్‌కూ, రష్యా రక్షణకూ, ఉక్రెయిన్‌ ప్రజల రక్షణకూ మాత్రమే! 

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 

abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement