Russia-Ukraine War: యుద్ధం– శాంతి కింకర్తవ్యం! | Russia-Ukraine War: A solution to the Russia-Ukraine war is urgently needed | Sakshi
Sakshi News home page

Russia-Ukraine War: యుద్ధం– శాంతి కింకర్తవ్యం!

Published Thu, Oct 13 2022 2:04 AM | Last Updated on Thu, Oct 13 2022 2:02 PM

Russia-Ukraine War: A solution to the Russia-Ukraine war is urgently needed - Sakshi

(ఎస్‌.రాజమహేంద్రారెడ్డి) ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరం బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. రష్యా సేనలు ప్రతీకారేచ్ఛతో ముందూ వెనకా చూసుకోకుండా వరుసపెట్టి దాడులు చేస్తున్నాయి. కీవ్‌ను హస్తగతం చేసుకుని ఉక్రెయిన్‌ను తమ కబంధ హస్తాలతో ఆక్రమించుకోవాలనేదే రష్యా ఆశగా కనిపిస్తోంది. తలవంచడానికి సిద్ధంగా లేని ఉక్రెయిన్‌ వీరోచితంగా ఎదురొడ్డి నిలుస్తోంది. ఈ స్థాయి ప్రతిఘటనను ఆర్నెల్ల కింద యుద్ధం మొదలైనప్పుడు ఎవరూ ఊహించలేదు. రష్యా ఒక్క ఉదుటున ఉక్రెయిన్‌లోకి చొరబడి దాడికి దిగగానే కథ రెండు మూడు వారాల్లోనే ముగుస్తుందని భావించారు. ఉక్రెయిన్‌ పరిస్థితిని చూసి జాలి పడ్డవాళ్లూ ఉన్నారు.

అటు నాటో కానీ, ఇటు అమెరికా కానీ తొలినాళ్లలో ఉక్రెయిన్‌కు అండగా నిలిచేందుకు సంశయించాయి. కానీ, ఆర్నెల్లు దాటిపోయినా యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాడులు, ప్రతి దాడులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అంచనాలను వమకమే చేస్తూ ఉక్రెయిన్‌ నిలబడి పోరాడుతూనే ఉంది. ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మంకుపట్టు వీడటం లేదు. అటు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ స్థైర్యాన్ని కోల్పోవడం లేదు. మరి యుద్ధం ఎప్పుడు ముగిసేను?! ఉక్రెయిన్‌ రష్యా నీడలోకి వచ్చేదాకా అని పుతిన్‌ అంటాడు, వచ్చే ఏడాదిలో తమ విజయంతోనే ముగుస్తుందని అంటాడు!

పెనం నుంచి పొయ్యిలోకి...
ఉక్రెయిన్‌లో యుద్ధం ఇప్పుడు రెండు ప్రాంగణాలుగా విడిపోయింది. తూర్పులో డోన్బాస్‌ ప్రాంతాన్ని రష్యా దాదాపు పూర్తిగా ఆక్రమించేసుకుంది. మిగతా కొద్ది ప్రాంతాన్ని కాపాడుకుందామని ఉక్రెయిన్‌ సేనలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు దక్షిణాన చేజారిన ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకోవడానికి ఉక్రెయిన్‌ సంసిద్ధమవుతోంది. ప్రాణనష్టం లెక్కలపై వైరిపక్షాలు ఎంత బింకానికి పోయినా భారీ మూల్యాన్నే చెల్లించాయి.

రష్యా దాదాపు 80 వేల మంది సైనికులను కోల్పోయిందని పెంటగాన్‌ అంచనా. క్షతగాత్రులు ఇంకెంతమందో! రష్యా అమ్ములపొది కూడా ఖాళీ అవుతూ వస్తోంది. ఉక్రెయిన్‌కూ ప్రాణనష్టం భారీగానే ఉంది. అధికారిక లెక్కల ప్రకారం దాడుల తీవ్రతను బట్టి రోజుకు 100 నుంచి వెయ్యి మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా కనీసం 12 వేల మంది సామాన్యులు కూడా చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని ఐరాస అంచనా. నిజానికి పౌర నష్టం అంచనాలకు మించి ఉందనేది నిపుణుల వాదన. మరింత ఆయుధ సాయం చేయాలనడమే కాకుండా నేరుగా కీవ్‌లో అమెరికా రక్షణ దళాలను మోహరించాలని జెలెన్‌స్కీ తాజాగా అభ్యర్థించడం పరిస్థితికి అద్దం పడుతోంది.

తిండికి అల్లాడుతున్న దేశాలు
యుద్ధానికి మరోవైపు చూస్తే ఆహార సంక్షోభం పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గోధుమలు, మొక్కజొన్నలు, బార్లీ ఉత్పత్తుల్లో రష్యా, ఉక్రెయిన్‌లదే ప్రపంచంలో అగ్ర స్థానం. యుద్ధం వల్ల రవాణా నిలిచిపోవడంతో ఈ రెండు దేశాల దిగుమతులపై ఆధారపడ్డ పలు దేశాలు దాదాపు కరువు పరిస్థితులతో అల్లాడుతున్నాయి. గత నెల రెండు దేశాలు ఒప్పందానికి వచ్చి ఉక్రెయిన్‌లోని ఆహార ధాన్యాల ఎగుమతులకు అంగీకరించాయి. కానీ 45 దేశాల్లోని కోట్లాది మందికి ఇవి సరిపోతాయా అన్నదే ప్రశ్న. మరోవైపు యుద్ధానికి ముగింపు ఎప్పుడన్నది ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్నగానే ఉంది.

ఇటీవలే పశ్చిమ దేశాలు సమకూర్చిన అత్యాధునిక ఆయుధాలతో ఉక్రెయిన్‌ స్థైర్యం కాస్త ఇనుమడించింది. దేశ దక్షిణాది ప్రాంతాల్లో తిష్ట వేసి కూర్చున్న రష్యా సేనలను తరిమికొట్టడమే వ్యూహంగా ఉక్రెయిన్‌ సాగుతోంది. అత్యంత కీలకమైన ఖెర్సన్‌ను తిరిగి చేజిక్కించుకుంటే ఉక్రెయిన్‌ ఒక ముందడుగు వేసినట్టేనని నిపుణుల అంచనా. అదే జరిగితే రష్యాకు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. అసలే అరకొర సైన్యంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రష్యాను ఇది మరిన్ని కష్టాల్లోకి నెడుతుంది. రిటైరైన సైనికులను సైతం యుద్ధానికి సన్నద్ధం చేయాల్సి వస్తుంది.

ఇది పుతిన్‌కు సుతరామూ ఇష్టం లేకున్నా, తప్పేట్టు లేదు. ఒకవేళ రష్యా ఉక్రెయిన్‌ దక్షిణ ప్రాంతంలో తమ పట్టును కొనసాగిస్తే జెలెన్‌స్కీకి కష్టకాలం మొదలైనట్టే. మరీ మొండితనానికి పోయి యావత్‌ సైన్యాన్ని దక్షిణంలోనే మోహరించడానికి ఉక్రెయిన్‌ సిద్ధపడితే తూర్పు ప్రాంతంలో రష్యాకు పూర్తిగా తలొంచక తప్పదని అంచనా. ఇదంతా ఒకెత్తయితే ఇప్పటిదాకా అంటీముట్టనట్టు ఉన్న చైనా బాహాటంగా రష్యాకు తమ మద్దతు ప్రకటించి రంగంలోకి దిగితే యుద్ధ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. యుద్ధం తొలినాళ్లలోనే చైనాను రష్యా సైనిక మద్దతు కోరడం తెలిసిందే.

మరో ప్రచ్ఛన్న యుద్ధం దిశగా...
ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక, ఆయుధ సాయం ఒకరకంగా యుద్ధాన్ని ప్రేరేపించినట్టే అయిందన్న వాదన కూడా ఉంది. చినికిచినికి గాలివాన అయినట్టు చివరికిది రెండు అగ్రరాజ్యాల మధ్య పోరుగా మారితే పరిణామాలు భయానకంగా ఉంటాయి. ప్రపంచ శాంతి అల్లకల్లోలం అవుతుంది. అణ్వాయుధ ప్రయోగానికి కూడా వెనకాడనంటూ పుతిన్‌ ఇప్పటికే బెదిరించడం తెలిసిందే. నాటోకు, రష్యాకు మధ్య ఈ పోరు ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీయకముందే అమెరికా వంటి దేశం సంధికి ప్రయత్నిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

లేదంటే మధ్యేమార్గంగా కనీసం యుద్ధ విరామానికన్నా ప్రయత్నించి చర్చలకు తెర తీయాలి. పోనీ, యుద్ధం కొనసాగుతుండగానే చర్చలను మొదలుపెట్టినా బాగానే ఉంటుంది. ఏదో ఒక ముగింపు తప్పక దొరికే అవకాశముంటుంది. రష్యా తన విధ్వంసక దాడులను ఆపకపోతే అటు అమెరికా, ఇటు నాటో ఉక్రెయిన్‌కు ఇలాగే సాయాన్ని కొనసాగించడం తప్పనిసరవుతుంది. కాబట్టి యుద్ధానికి రాజకీయ పరిష్కారం దిశగా రెండు దేశాలు కదిలేలా చేయడానికి ఇదే సరైన సమయం. ఈ బాధ్యతను అమెరికా, నాటో దేశాలే భుజానికెత్తుకోవాలి. లేదంటే దౌత్యం కూడా వీలుపడని స్థాయికి పరిస్థితి చేజారే రోజు ఎంతో దూరం లేదు! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement