వాషింగ్టన్: ఒకపక్క నాటో సభ్యత్వం కోరమని, వివాదాస్పద డొనెట్‌స్క్, లుహాన్స్‌క్ ప్రాంతాలపై చర్చకు సిద్ధమని ప్రకటించిన జెలెన్‌స్కీ బ్రిటన్ పార్లమెంట్ ముందు చేసిన ప్రసంగంలో భిన్నంగా స్పందించారు. తాము చివరి వరకు పోరాడతామని గతంలో విన్‌స్టన్ చర్చిల్ చేసిన ప్రసంగంలో భాగాలను ఉటంకించారు. అన్ని రకాలుగా తాము పోరాటం చేస్తామని, ప్రతి చోటా పోరాడతామని, ఎప్పటికీ ఓడిపోమని ఆయన యూఎస్ పార్లమెంట్‌నుద్దేశించి చేసిన ఆన్‌లైన్ ప్రసంగంలో చెప్పారు.
నాటో తమ కోరిక మేరకు నో–ఫ్లై జోన్ ప్రకటించలేకపోయిందని ఆయన విమర్శించారు. అయితే పాశ్చాత్య దేశాలు తమకు యుద్ధంలో ఎనలేని సాయం చేస్తున్నాయని కొనియాడారు. రష్యాపై ఆంక్షలను మరింత పెంచాలని ఆయన కోరారు. రష్యాను ఉగ్రదేశంగా ప్రకటించాలన్నారు. జెలెన్‌స్కీ ప్రసంగం లాంటి ప్రసంగాన్ని ఎవరూ చేయలేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రశంసించారు. రష్యాపై తప్పక మరిన్ని ఆంక్షలు విధిస్తామన్నారు.
రష్యా ఇంధన దిగుమతులపై యూఎస్ నిషేధం
రష్యా నుంచి అన్ని రకాల ఇంధన దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. అయితే ఈ చర్యతో తమ దేశంలో ఇంధన ధరలు పెరగవచ్చని, అందుకు అమెరికన్లు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అమెరికా ఇంధన దిగుమతుల్లో రష్యా వాటా 8 శాతముంటుంది. మరోవైపు యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఇంధనావసరాలకోసం అధికంగా ఆధారపడుతున్నాయి. అందుకే యూరప్ దేశాలు తమలాంటి నిర్ణయం తీసుకునే స్థితిలో లేవని గుర్తించామని బైడెన్ చెప్పారు. ఈ దేశాలు రష్యాపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు తాము సాయం చేస్తామన్నారు. తమ ఇంధన ఎగుమతులపై నిషేధం విధిస్తే క్రూడాయిల్ బ్యారెల్ ధర 300 డాలర్లకు చేరుతుందని ఇప్పటికే రష్యా హెచ్చరించింది.
యుద్ధం ఆగుతుందా?
ఉక్రెయిన్‌పై రష్యాదాడికి కీలక కారణమే నాటో సభ్యత్వం. దీనిపై జెలెన్‌స్కీ స్పష్టత ఇవ్వడంతో కాల్పుల విరమణ ప్రకటన వస్తుందని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే రష్యా కోరినట్లు ఉక్రెయిన్ తటస్థంగా ఉంటుందా?, ఈయూలో చేరికను కూడా కాదనుకుంటుందా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. తాము కోరిన డిమాండ్లపై పూర్తిస్థాయి స్పష్టత వస్తే తప్ప రష్యా తక్షణ కాల్పుల విరమణ ప్రకటించే అవకాశం లేదన్నది యుద్ధ నిపుణుల విశ్లేషణ. ఇప్పటికే దాడి కారణంగా రష్యాకు అటు మిలటరీ నష్టాలు ఇటు ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి.
పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో రష్యా ఎకానమీ దెబ్బతిన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తమకు నష్ట పరిహారం అందితే తప్ప కాల్పుల విరమణ ప్రకటించమని రష్యా చెప్పే అవకాశాలు అధికమని నిపుణుల భావన. ఉక్రెయిన్ కేవలం నాటో సభ్యత్వం వద్దనుకోవడంతో సరిపోదని, ఈయూలో చేరిక ఆశలను వదులుకోవడం, జెలెన్‌స్కీ ప్రభుత్వ స్థానంలో రష్యా అనుకూల ప్రభుత్వం ఏర్పడడం, నిస్సైనికీకరణకు అంగీకరించడం వంటి డిమాండ్లకు కూడా ఆమోదం లభిస్తేనే రష్యా యుద్ధం నుంచి వెనుదిరుగుతుందని అంచనా. అయితే ఈ డిమాండ్లకు అంగీకరించమని జెలెన్‌స్కీ ఇప్పటికే స్పష్టం చేసినందున నాటో సభ్యత్వ తిరస్కరణ అనే ఒక్క అంశంపై రష్యా వెనక్కు తగ్గకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment