Russia Ukraine War Day 12 Live Updates In Telugu: ఉక్రెయిన్‌కు సాయంగా నాటో ఎంట్రీ.. రష్యా సాలిడ్‌ వార్నింగ్‌ - Sakshi
Sakshi News home page

Russia-Ukraine Crisis Updates: ఉక్రెయిన్‌లో 406 మంది పౌరులు మృతి: ఐరాస

Published Mon, Mar 7 2022 8:02 AM | Last Updated on Mon, Mar 7 2022 9:26 PM

Ukraine Russia War Day 12 Telugu Live Updates - Sakshi

Russia-Ukraine war Live Updates: యుద్ధ వాతావరణం నడుమే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది రష్యా. మరోవైపు తామేమీ తగ్గబోమంటూ ప్రకటించిన ఉక్రెయిన్‌ సైతం చర్చలకు సుముఖత వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో యుద్ధం 12వ రోజు కొనసాగుతుండగా..  చర్చలూ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలో..

ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ దేశం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. మానవతా దృక్పథంతో 175 మిలియన్ల పౌండ్లను అందజేస్తున్నట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు. దీంతో ఇప్పటి వరకూ బ్రిటన్‌ 400 మిలియన్‌ పౌండ్లను ఉక్రెయిన్‌కు సాయంగా అందించింది.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను పొరుగు దేశాల ద్వారా సోమవారం 7 విమానాల ద్వారా మొత్తం 1,31 మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు పౌరవిమనయానశాఖ తెలిపింది.

రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో 406 మంది పౌరుల మరణించినట్లు ధృవీకరించినట్లు ఐరాస మానవ హక్కుల కార్యాలయం తెలిపింది. ఆదివారం నాటికి మరో 801 మంది గాయపడినట్లు వెల్లడించింది.  

ఉక్రెయిన్ తమ షరతులను అంగీకరించినట్లయితే సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా పేర్కొంది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్మాట్లాడుతూ..కైవ్ తన షరతులను నెరవేర్చినట్లయితే  తక్షణం సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉక్రెయిన్‌ ఏ కూటమిలో చేరకుండా ఉండేందుకు వారు రాజ్యాంగ సవరణలు చేయాలని కోరారు.

ఉక్రెయిన్ దళాలు రష్యా బలగాల నుంచి మైకోలాయివ్ ప్రాంతీయ విమానాశ్రయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయని స్థానిక గవర్నర్ విటాలి కిమ్ సోమవారం తెలిపారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 400 మంది భారతీయులను తీసుకొచ్చేందుకు రొమేనియా నుంచి మంగళవారం రెండు విమానాలను నడపనున్నట్లు పౌర విమానయానశాఖ పేర్కొంది. 

రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కు సమీపంలోని గోస్టోమెల్ మేయర్‌ను కాల్చి చంపినట్లు సోమవారం స్థానిక అధికారులు తెలిపారు. గోస్టోమెల్‌ మేయర్‌ యూరి ఇల్లిచ్ ప్రైలిప్కో స్థానికంగా  ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని,యు రోగులకు మందులు పంపిణీ చేస్తున్నప్పుడు ఆయనతోపాటు మరో ఇద్దరిని కాల్చిచంపారని పేర్కొన్నారు.అని అది పేర్కొంది. ఆయన తన ప్రజల కోసం, గోస్టోమెల్ కోసం హీరోగా ప్రాణాలు విడిచాడని తెలిపారు.

రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా పరోక్షంగా నష్టపోతున్న ప్రపంచ దేశాల స్థితిగతులపై మహీంద్రా అండ్‌ మహీంద్రా గ‍్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. 21వ శతాబ్దంలో జరుగుతున్న ప్రపంచ యుద్ధానికి స్వాగతం చెబుతూ.. రష్యా - ఉక్రెయిన్‌ తోపాటు  మిగిలిన ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయని ట్వీట్‌ చేశారు.

ఉక్రెయిన్‌-రష్యా ప్రతినిధుల మధ్య సోమవారం మూడో విడత శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో రష్యా ప్రతినిధు బృంధం నేడు బెలారస్‌కు చేరుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. 

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. ఉక్రెయిన్‌ పరిస్థితులపై 50 నిమిషాలపాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఉక్రెయిన్‌తో చర్చల వివరాలను పుతిన్‌ మోదీకి వివరించారు. అయితే ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో నేరుగా మాట్లాడాలని పుతిన్‌ను మోదీ కోరారు. ఉక్రెయిన్‌లో నగరాలు, సుమీ ప్రాంతాల్లో కాల్పుల విరమణ చేసి మానవతా కారిడార్‌ను ఏర్పాటు చేయడంపై పుతిన్‌కు మోదీ అభినందనలు తెలిపారు.

తమ దేశంపై రష్యా తన సైనిక చర్యను వెంటనే నిలిపి వేయాలని ఆదేశించాలని కోరుతూ ఉక్రెయిన్‌ చేసిన అభ్యర్థనపై అంతర్జాతీయ న్యాయస్థానం రెండు రోజుల విచారణను సోమవారం ప్రారంభించింది.  ఈ మేరకు ఐసీజే ప్రధాన కార్యాలయం పీస్‌ ప్యాలెస్‌లో ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్‌ తన వాదలను నేడు కోర్టు ముందు ఉంచనుంది. రష్య మంగళవారం స్పందించే అవకాశం ఉంది.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా బలగాలకు ఉక్రెయిన్ సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న విధానాన్ని మోదీ ప్రశంసించారని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. యుద్ధ సమయంలో అత్యున్నత స్థాయిలో శాంతియుత సంభాషణలు చేసినందుకు, ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం నరేంద్రమోదీతో 35 నిమిషాల పాటు ఫోన్‌లో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయనఅధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

రష్యా-చైనా మధ్య స్నేహం ఇప్పటికీ చాలా ధృడంగా ఉన్నట్లు చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యూ సోమవారం స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు ఇరు దేశాల శాంతి పునరుద్ధర కోసం మధ్యవర్తిత్వంపై పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నన నేపథ్యంలో చైనా మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే విధంగా మానవతా సహాయాన్ని ఉక్రెయిన్‌కు అందిస్తున్నామని వాంగ్‌ తెలిపారు. 

ఉక్రెయిన్‌లో బాంబుల మోత మోగుతుంటే తన ప్రాణాలకు ఏమైనా ఫర్వాలేదు కానీ కొడుకు క్షేమంగా ఉండాలని రైలులో ఒంటరిగా పంపించింది ఓ తల్లి.  తన 11 ఏళ్ల కొడుకుకి ధైర్యం చెప్పి..తినటానికి తిండి తాగటానికి నీళ్లు అన్నీ బ్యాగులో సర్ది.. చేతిపై ఫోన్‌ నెంబర్‌ రాసి ‘క్షేమంగా..జాగ్రత్తగా వెళ్లు నాన్నా’అంటూ కొడుకును పంపించింది. అమ్మ చెప్పిన మాటలు అన్ని శ్రద్ధగా విన్న ఆ పిల్లాడు బాంబులు, క్షిపణులు, తుపాకులు గర్జిస్తూ, ఆర్తనాదాలు వినిపించే యుద్ధ భూమిలో ఒంటరిగా 1,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి యుక్రెయిన్‌లోని జపోరిజియా ప్రాంతం నుంచి స్లొవేకియా దేశానికి చేరుకున్నాడు. పిల్లాడు సురక్షితంగా అనుకున్న గమ్యానికి చేరుకున్నాడని తెలిసిన ఆ తల్లి హాయిగా ఊపిరి పీల్చుకుంది.

►  రష్యా మా బంధం బలంగానే ఉంది: చైనా
రష్యా తమకు మిత్రదేశమని, బంధం ఇంకా బలంగానే ఉందని చైనా ప్రకటించుకంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ మరోసారి ‘అవసరమైతే ఉక్రెయిన్‌-రష్యా సంధిలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమ’ని స్పష్టమైన ప్రకటన చేశారు. 

► ఆపరేషన్‌ గంగలో భాగంగా..  ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు స్పెషల్‌ విమానాల్లో భారత్‌కు చేరుకుంటున్నారు. వీలైనంత త్వరగా ఈ ఆపరేషన్‌ ముగించాలని భారత్‌ భావిస్తోంది. 

► రష్యాపై ఆంక్షలు మాత్రమే సరిపోవని, యుద్ధం ఆపేలా చేయడానికి తీవ్ర చర్యలకు దిగాల్సిందేనని పశ్చిమ దేశాలతో జెలెన్‌స్కీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

► రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌తో లావాదేవీలను నిలిపివేసిన సౌత్‌ కొరియా.

జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన మోదీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు. వీరిద్ద‌రి మ‌ధ్య దాదాపు 35 నిమిషాల పాటు సంభాష‌ణ కొన‌సాగింది. ఉక్రెయిన్ నుంచి భార‌త పౌరుల త‌ర‌లింపులో సాయం ప‌ట్ల జెలెన్ స్కీకి మోదీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇప్ప‌టికీ కొంద‌రు భార‌త పౌరులు ఉక్రెయిన్‌లోనే ఉండ‌డంతో భార‌త పౌరుల త‌ర‌లింపులో నిరంత‌రం స‌హ‌కారం ఉండాల‌ని మోదీ కోరారు. ఉక్రెయిన్‌లో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై మోదీకి జెలెన్ స్కీ వివ‌రించారు. ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య ప్ర‌త్యక్ష చ‌ర్చ‌లు జ‌రుగుతోన్న తీరును మోదీ అభినందించారు. దౌత్య మార్గాల్లో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న చెప్పారని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. 

► మరోసారి కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా మరోసారి కాల్పుల విరమణ ప్రకటించింది. కీవ్‌, ఖార్కీవ్‌, మరియూపోల్‌, సుమీ నగరాల్లో మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాల నుంచి కాల్పుల విరమణ మొదలవుతుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ విషయాన్ని పలు న్యూస్‌ ఏజెన్సీలు సైతం ధృవీకరించాయి.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రోన్‌ వ్యక్తిగత రిక్వెస్ట్‌ మేరకు రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విరమణ ఎంత సేపు ఉంటుందనేది మాత్రం పేర్కొనలేదు. ఈ లోపు కారిడార్ల ద్వారా పౌరులను తరలించనున్నారు.

ఉక్రెయిన్‌లోని క్రమాటోర్స్క్‌ నగరంలోని నివాస భవనాలపై రష్యా వాయుసేన సోమవారం క్షిపణి దాడి చేసింది.వాయుసేన జరిపిన దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. క్రమాటోర్స్క్ నగరంలోని నివాస భవనాలపై రష్యా క్రూయిజ్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మరణించారని ఉక్రెయిన్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ తెలిపింది.

ఇంకోపక్క సుమీలో భారతీయ విద్యార్థుల తరలింపు కష్టతరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు  జెలెన్‌స్కీతో మధ్యాహ్నాం ఫోన్‌లో సంప్రదించనున్నట్లు పీఎంవో వెల్లడించింది.

► ఖార్కివ్ మీదుగా ఎగురుతున్న రష్యన్ యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఈ ఘటనలో పైలట్ చనిపోయినట్టు ఖార్కివ్ రీజియన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ వెల్లడించింది. కులినిచివ్ ప్రాంతంలో విమానం కూలిపోయినట్టు వివరించింది. పైలట్‌కు తప్పించుకునే సమయం కూడా లేకపోయిందని, ఘటనా స్థలంలోనే ఆయన చనిపోయారని పేర్కొంది.

► బాంబులతో దద్దరిల్లుతున్న మికోలాయివ్‌

పోర్టు నగరం మికోలాయివ్‌ బాంబులతో దద్దరిల్లుతోంది. ప్రధాన నగరాలకు వశపర్చుకునే క్రమంలో రష్యా బలగాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో దాడులు ఉదృతం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సైన్యానికి పిలుపు ఇచ్చాడు.

   

రష్యాపై ఆంక్షల పర్వం

రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా, మిత్రపక్షాలు రష్యా ఆయిల్‌పైనా బ్యాన్‌ విధించే యోచనలో ఉన్నాయి.

► అంతర్జాతీయ న్యాయస్థానంలో.. 

మారణహోమం దావాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ మరియు రష్యాలు తలపడనున్నాయి. ఉక్రెయిన్‌  తూర్పు ప్రాంతంలో జరుగుతున్న దారుణాల నేపథ్యంలోనే ప్రత్యేక మిలిటరీ చర్యలకు దిగినట్లు రష్యా.. ఆధారాల్లేకుండా ఆరోపణలపై ఉక్రెయిన్‌ పరస్పరం వాదించనున్నాయి.

జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ ఫోన్‌!

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఫోన్‌లో మాట్లాడుకోనున్న ఇరు దేశాల నేతలు. మరోసారి భారత్‌ సాయం కోరనున్న జెలెన్‌స్కీ. భారత విద్యార్థుల తరలింపుపైనే ప్రధానంగా ప్రధాని మోదీ ఆరా తీసే అవకాశం.

అత్యాధునిక ప్రపంచ చరిత్రలో అతిపెద్ద మానవ సంక్షోభంగా ఉకక్రెయిన్‌ యుద్ధం నిలిచిపోనుందనే ఆందోళన ఐరాస వ్యక్తం చేస్తోంది. సుమారు 70 లక్షల మంది ఉకక్రెయిన్‌ను వీడొచ్చని అంచనా వేస్తోంది.

ఉక్రెయిన్‌ సంక్షోభ నేపథ్యంలో నేడు(సోమవారం).. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యవసర సమావేశం

నాటో ఎంట్రీ

 నాటో దళాల ఎంట్రీని ఖంచిస్తున్న రష్యా. ఇది తీవ్ర యుద్ధానికి దారితీస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రతిహెచ్చరిక.

 ఉక్రెయిన్‌కు మద్దతుగా రంగంలోకి దిగిన నాటో దేశాలు. జెలెన్‌స్కీ సాయం కోరిన తర్వాత అమెరికా చొవరతో నాటో దేశాల్లో కదలిక.  రొమేనియాకు 40 వేల మంది సైనికులు. ఫ్రాన్స్‌ రాఫెల్‌ విమానాలు, 4 పైటర్‌జెట్‌లు. పోలాండ్‌కు చేరుకున్న బ్రిటన్‌ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌.

 ఫలించిన జెలెన్‌స్కీ విజ్ఞప్తి.  నాటోకు అమెరికా గ్రీన్‌ సిగ్నల్‌. పోలాండ్‌కు సాయం తరలింపు. 

► యుద్ధంతో నన్ను చంపేస్తే.. ఉక్రెయిన్‌కు సాయం చేయాలని అమెరికాను కోరిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.

► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం12వ రోజూ కొనసాగుతోంది. మిస్సైల్స్‌తో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. మికోలాయివ్‌ దగ్గర హోరాహోరీ పోరు. 

► యుద్ధ భయంతో ఉక్రెయిన్‌ నుంచి 15 లక్షల మంది వలస వెళ్లిపోయారు: ఐరాస

► పౌరుల తరలింపునకు సహకరిస్తామని ప్రకటించిన రష్యా.. యుద్ధం ఆపట్లేదు. దీంతో ప్రధాన నగరాల నుంచి పౌరుల తరలింపు కష్టతరంగా మారింది ఉక్రెయిన్‌కు. ముఖ్యంగా మరియూపోల్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒకవైపు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న రష్యా.. పవర్‌, వాటర్‌ను కట్‌ చేసి పడేసింది నగరానికి. 

► రష్యా దాడులతో మధ్య ఉక్రెయిన్‌లోని విన్నిట్సియా ఎయిర్‌పోర్ట్‌ సర్వనాశనం అయ్యింది. 

► ఉక్రెయిన్‌లోని పౌరులపై రష్యా బలగాలు దాడులకు పాల్పడుతున్నాయని అమెరికా భద్రత ప్రతినిధి ఆంటోనీ బ్లింకెన్ ఆరోపిస్తున్నారు. 

► ఇర్పిన్‌ నగరాన్ని వీడాలని ప్రయత్నిస్తున్న పౌరులు.. రష్యా దాడుల భయంతో, సైనికుల తుపాకీ బెదిరింపులతో వెనక్కి మళ్లుతున్నారు.

► ఓటీటీ కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌తో పాటు కేపీఎంజీ, పీడబ్ల్యూసీ లాంటి అకౌంటింగ్‌ సంస్థలు, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ లాంటి ఫైనాన్షియల్‌ కంపెనీలు రష్యాతో పూర్తిగా సంబంధాలు తెంపేసుకున్నట్లు ప్రకటించాయి. 

► ఉక్రెయిన్‌కు మద్ధతుగా రష్యాలో కొనసాగుతున్న నిరసనలు. 4,500 మంది నిరసనకారులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

► అయితే సంధి లేకుంటే సమరం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని ఉక్రెయిన్‌తో తేల్చి చెప్పారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement