100 Days For Russia Ukraine War: Timeline Of Ukraine Russia Conflict 2022 - Sakshi
Sakshi News home page

Timeline Of Russia-Ukraine War: 100 రోజుల వార్‌.. మరుభూమిగా ఉక్రెయిన్‌.. దశలవారీగా ఏమేం జరిగిందంటే?

Published Fri, Jun 3 2022 4:43 AM | Last Updated on Fri, Jun 3 2022 9:13 AM

Russia-Ukraine war: war completes 100 days - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి నేటికి 100 రోజులు. ఏడాదికి పైగా సన్నాహాలు జరిపి ఫిబ్రవరి 24న హఠాత్తుగా దాడికి దిగాయి పుతిన్‌ సేనలు. ‘ఉక్రెయిన్‌ నిస్సైనికీకరణ’ కోసం ‘ప్రత్యేక సైనిక చర్య’ ప్రకటనతో ప్రపంచ దేశాలకు పుతిన్‌ షాకిచ్చారు. కానీ కీవ్‌ను పట్టుకుని అధ్యక్షుడు జెలెన్‌స్కీని తప్పించి కీలుబొమ్మ సర్కారును గద్దెనెక్కించాలన్న ఆశలు మాత్రం నెరవేరలేదు. అమెరికా, పశ్చిమ దేశాలు భారీగా అందిస్తున్న ఆయుధాల సాయంతో రష్యాను ఉక్రెయిన్‌ దీటుగా ప్రతిఘటిస్తోంది. దాంతో సైనికంగా కనీవినీ ఎరగని నష్టాలతో, వాటికి తోడు పశ్చిమ దేశాల కఠిన ఆంక్షలతో రష్యా సతమతమవుతోంది.

నాటో విస్తరణను అడ్డుకోవడం, ఉక్రెయిన్‌ అందులో చేరకుండా చూడటం కూడా పుతిన్‌ యుద్ధ లక్ష్యాల్లో ఒకటి. కానీ స్వీడన్, ఫిన్లండ్‌ వంటి తటస్థ యూరప్‌ దేశాలు కూడా రక్షణ కోసం నాటో గూటికి చేరాలని నిర్ణయించుకోవడానికి యుద్ధమే కారణమవడం ఆయనకు మింగుడుపడని పరిణామమే. 70 లక్షలకు పైగా ఉక్రేనియన్లు శరణార్థులుగా దేశం వీడటంతో పాటు మొత్తమ్మీద కోటిన్నరకు పైగా నిరాశ్రయులైన వైనం గుండెల్ని మెలిపెట్టింది. ఉక్రెయిన్‌ను మరుభూమిగా మార్చడమే గాక ప్రపంచమంతటినీ ధరాభారం, ఆహార కొరత వంటి పెను సమస్యల వలయంలోకి నెట్టిన యుద్ధంపై ఓ సింహావలోకనం...

మొదటి దశ
భీకర దాడి
ఫిబ్రవరి 24: ఉక్రెయిన్‌వ్యాప్తంగా భారీ క్షిపణి దాడులతో రష్యా విరుచుకుపడింది. అధ్యక్ష భవనంలోకి చొరబడి ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీని హతమార్చేందుకు రష్యా పారాట్రూపర్లు విఫలయత్నం చేశారు.
ఫిబ్రవరి 25: దేశం వీడాలని జెలెన్‌స్కీకి అమెరికాతో పాటు పలు దేశాధ్యక్షులు సూచించారు. అందుకు సాయం చేస్తామంటూ ముందుకొచ్చారు. కానీ ఆయన ససేమిరా అన్నారు. ‘‘కీవ్‌లోనే ఉన్నా. ఇక్కడే ఉంటా. నా సైనికులతో కలిసి ఆక్రమణదారులను తుది రక్తపు బొట్టు దాకా ఎదుర్కొంటా’’ అంటూ వీరోచిత వీడియో సందేశంతో సైన్యంలో స్థైర్యం నింపారు.
ఫిబ్రవరి 28: తొలి ఐదు రోజుల యుద్ధంలో ఉక్రెయిన్‌ విపరీతంగా నష్టపోయింది. కీవ్‌ విమానాశ్రయం కూడా రష్యా దళాల చేతికి వచ్చినట్టు కన్పించింది. ఇరు దేశాలు తొలి దఫా చర్చలు జరిపాయి.
మార్చి 2: కీలకమైన రేవు పట్టణం మారియుపోల్‌ను రష్యా సేనలు చుట్టుముట్టాయి. ఖెర్సన్‌పైనా పట్టు సాధించాయి. 2014లో ఆక్రమించిన క్రిమియాకు రష్యా నుంచి భూమార్గాన్ని దాదాపుగా ఏర్పాటు చేసుకున్నాయి.

రెండో దశ
ఎదురుదెబ్బలు
మార్చి 4: జపోరిజియా అణు విద్యుత్కేంద్రాన్ని రష్యా ఆక్రమించింది. ఈ క్రమంలో జరిగిన బాంబు దాడుల్లో ఓ రియాక్టర్‌ దెబ్బ తినడంతో యూరప్‌ మొత్తం వణికిపోయింది.
మార్చి 6: రష్యా సైన్యానికి గట్టి ఎదురుదెబ్బలు తాకడం మొదలైంది. కీవ్‌లోకి వాటి రాకను అడ్డుకునేందుకు ఇర్పిన్‌ నదిపై బ్రిడ్జిని పేల్చేయడంతో రష్యా సేనల కదలికలు నెమ్మదించాయి.

మార్చి 11: 40 మైళ్లకు పైగా పొడవున్న రష్యా సాయుధ శ్రేణి కీవ్‌కేసి సాగుతూ కన్పించింది. దాన్ని ఉక్రెయిన్‌ దళాలు అడుగడుగునా దాడులతో అడ్డుకుంటూ, నష్టపరుస్తూ చీకాకు పెట్టాయి. రష్యా సాయుధ వాహనాలపై తొలిసారిగా డ్రోన్‌ దాడులకు దిగాయి. ఆ ఫుటేజీని కూడా బయట పెట్టాయి. మారియుపోల్‌లో స్టీల్‌ ఫ్యాక్టరీని స్థావరంగా చేసుకుని భారీ ప్రతిఘటనకు ఉక్రెయిన్‌ దళాలు శ్రీకారం చుట్టాయి.

25వ రోజు
మార్చి 22: రష్యాకు నష్టాలు నానాటికీ పెరగడం మొదలైంది. యుద్ధంలో వెనకంజ వేస్తున్న తొలి సంకేతాలు వెలువడ్డాయి. రష్యా సైన్యం వద్ద ఆహార, ఆయుధ నిల్వలు నిండుకున్నాయి. వాటికి సరఫరాలు కూడా సజావుగా అందని వైనం వెలుగులోకి వచ్చింది. సైనికులతో పాటు భారీ సంఖ్యలో ఉన్నతాధికారులు కూడా చనిపోతూ వచ్చారు. ‘యుద్ధంతో ఇప్పటిదాకా మేం సాధించిందేమీ లేద’ంటూ పుతిన్‌ అధికార ప్రతినిధి పెస్కోవ్‌ పెదవి విరిచారు!

మూడో దశ
వెనకడుగు, వ్యూహం మార్పు
మార్చి 29: పోరులో ఉక్రెయిన్‌ పై చేయి సాధిస్తున్న వైనం స్పష్టమైంది. నాలుగు దఫాల చర్చల్లో ఏమీ తేలకపోయినా కీవ్, చెహిర్నివ్‌ నగరాల వద్ద సైనిక మోహరింపులను బాగా తగ్గిస్తామంటూ రష్యా అనూహ్య ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌ సైన్యాల భారీ ప్రతిఘటనతో కీవ్‌ను ఆక్రమించలేకపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు చెప్పుకొచ్చారు. తూర్పున ఇప్పటికే సగానికి పైగా తమ అనుకూల వేర్పాటువాదుల అధీనంలో ఉన్న డోన్బాస్‌ను పూర్తిగా ఆక్రమించి యుద్ధానికి గౌరవప్రదంగా ముగింపు పలికేలా పుతిన్‌ వ్యూహం మార్చారు.

50వ రోజు
ఏప్రిల్‌ 14: రష్యాకు యుద్ధ నౌక మాస్క్‌వాను ఉక్రెయిన్‌ నల్లసముద్రంలో ముంచేసి భారీ దెబ్బ కొట్టింది. డ్రోన్లతో దృష్టి మళ్లించి నెప్ట్యూన్‌ యాంటీ షిప్‌ మిసైల్‌తో చేసిన ఈ దాడిలో నౌకతో పాటు వందల మంది సిబ్బంది కూడా జలసమాధయ్యారు. రష్యా కోలుకునేదాకా ఒకట్రెండు వారాల పాటు యుద్ధ తీవ్రత కాస్త తగ్గింది. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల తీవ్రత మరింతగా పెరిగింది.
75వ రోజు
మే 9: విక్టరీ డే సందర్భంగా యుద్ధానికి సంబంధించి పుతిన్‌ కీలక ప్రకటనలు చేస్తారని అంతా భావించినా ఆయన మాత్రం సాదాసీదా ప్రసంగంతోనే సరిపెట్టారు.

నాలుగో దశ
మారియుపోల్‌ పతనం
మే13: డోన్బాస్‌లో కూడా రష్యా సేనలకు ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. డొనెట్స్‌ నది దాటే ప్రయత్నంలో ఉక్రెయిన్‌ దాడిలో భారీ సైనిక నష్టం చవిచూశాయి. ఖర్కీవ్‌ శివార్ల నుంచీ రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్‌ దళాలు వెనక్కు తరిమాయి.
మే 17: మూడు నెలల పోరాటం తర్వాత స్టీల్‌ ప్లాంటులోని సైనికులంతా లొంగిపోవడంతో మారియుపోల్‌ పూర్తిగా రష్యా వశమైంది.

98వ రోజు
జూన్‌ 1: రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేయాలని యూరోపియన్‌ యూనియన్‌ కీలక నిర్ణయం తీసుకుంది.
99వ రోజు
జూన్‌ 2: ఉక్రెయిన్‌కు అత్యాధునిక మధ్య శ్రేణి క్షిపణులు ఇవ్వాలని అమెరికా, ఇంగ్లండ్‌ నిర్ణయించాయి.
– నేషనల్‌ డెస్క్, సాక్షి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement