
వాషింగ్టన్: రష్యా సైనిక చర్య తర్వాత ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభంపై భారత్‌తో అమెరికా సంప్రదింపులు జరుపుతోందని అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్ సమస్య కొలిక్కి రాకపోవడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో గురువారం సైనిక చర్యను ప్రారంభించారు. అంతేకాకుండా రష్యన్ మిలిటరీ ఆపరేషన్‌లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తే, తాము ఎన్నడూ చూడని పరిణామాలను చూస్తారని ఇతర దేశాలను కూడా ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. తాము భారత్‌తో ఉక్రేనియన్ సంక్షోభంపై సంప్రదింపులు జరపబోతున్నామని వైట్ హౌస్ వార్తా సమావేశంలో బిడెన్ విలేకరులతో అన్నారు. మరి రష్యా దురాక్రమణపై అమెరికాతో భారత్ పూర్తిగా సహకరిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఉక్రెయిన్ సంక్షోభంలో భారత్, అమెరికాలు ఒకే మాటపై లేవని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకుంటే రష్యాతో భారతదేశానికి దీర్ఘకాలిక స్నేహ సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో, భారత్ అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గత దశాబ్దన్నర కాలంలో కొనసాగిస్తోంది. ప్రస్తుతం వీటిని దృష్టిలో ఉంచుకుని భారత్ తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. అయితే తాజాగా బైడెన్ వ్యాఖ్యల అనంతరం అమెరికా కావాలనే భారత్‌ను ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తోందా అనే సందేహం రేకెత్తుతోంది.
Comments
Please login to add a commentAdd a comment