
ఒక ప్రైవేటు కేసు ఉపసంహరణకు డిమాండ్
ప్రాణ భయంతో పోలీసులకు ఫిర్యాదు
తణుకు అర్బన్: తనపై పెట్టిన ప్రైవేటు కేసును ఉపసంహరించుకోవాలని చిన్ని అనే జనసేన నాయకుడు మరో సహచర నాయకునితో కలిసి ఒక మహిళా ఉద్యోగినిపై అమానుషత్వం ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, తాజాగా తనకు ప్రాణభయం ఉందని వాపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి బాధితురాలు తెలిపిన వివరాలు పరిశీలిస్తే, పంచాయతీ బిల్లు కలెక్టర్‌గా కాంట్రాక్టు పద్ధతిలో నీలం వెంకటలక్ష్మి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
గతేడాది జూలైలో ఆమె బావ నరసింహస్వామి అలియాస్ అంతర్వేదికి– జనసేన దువ్వ అధ్యక్షుడు శ్రీరాములు దుర్గారావు అలియాస్ చిన్నికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో అంతర్వేదికి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. అప్పట్లో దీనిపై కేసు నమోదైంది. సదరు కేసును వెనక్కి తీసుకునేలా అంతర్వేదిని ఒప్పించాలని చిన్ని, జనసేన పార్టీ తణుకు మండల అధ్యక్షుడు చిక్కాల వేణుతో కలిసి ఆమెపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులు మరింత తీవ్రమయ్యాయి.
తలుపులు వేసి మరీ దుర్భాషలు..
ఈ నేపథ్యంలో మార్చి 28న ఫీల్డులో ఉన్న వెంకటలక్ష్మిని పంచాయతీ కార్యాలయానికి రావాల్సిందిగా జనసేన నాయకులు ఫోన్ చేశారు. పంచాయతీ కార్యాలయానికి వచ్చిన తరువాత ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు. అయితే ఆ ఫిర్యాదుతో తనకు సంబంధం లేదని, అంతర్వేదితోనే మాట్లాడుకోమని ఆమె చెప్పారు.
దీంతో రెచ్చిపోయిన నాయకులు ఇరువురు తలుపులు వేసి మరీ చెప్పుకోలేని విధంగా దుర్భాషలాడారు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు విచారిస్తున్నట్లు తణుకు రూరల్ ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో దువ్వ పంచాయతీ కార్యాలయాన్ని కూటమి పార్టీ కార్యాలయంగా మారుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.