
Ukraine Crisis Effect: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య వివాదం ఇప్పుడు ప్రపంచ దేశాల్ని కలవరపెడుతోంది. ఈ దేశాల మధ్య నెలకొన్న సంక్షోభం ప్రపంచ మార్కెట్లను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడు ఈ దేశాల మధ్య నెలకొన్న సంక్షోభం భారతీయుల వంటిళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారీగా పెరగనున్న ధరలు..!
ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదంతో వంట నూనె ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఉక్రెయిన్ తో గల సంబంధమే. మనదేశంలో ఎంతో డిమాండ్ ఉన్నటువంటి సన్ ఫ్లవర్ నూనెను ఉక్రెయిన్ నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో ఉక్రెయిన్ సంక్షోభం వల్ల ఆయిల్ కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కొరత ప్రభావంతో భారత మార్కెట్లలో సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు భారీగా పెరగనున్నాయి. రష్యా, అర్జెంటీనావంటి దేశాల ద్వారా భారత మార్కెట్లోకి సన్ ఫ్లవర్ వంట నూనె దిగుమతి అవుతోంది. అయితే ఉక్రెయిన్, రష్యా వివాదం వల్ల ఇప్పుడు ఈ దిగుమతి దాదాపుగా ఆగిపోనుంది. ఇండియాలో సన్‌ఫ్లవర్ కుకింగ్ ఆయిల్ దిగుమతికి ఉక్రెయిన్ ప్రధాన ఆధారంగా ఉంది.
సన్ ఫ్లవర్ వాడకం ఎక్కువ..!
మనదేశంలో ఉపయోగించే వంట నూనెల్లో సన్ ఫ్లవర్ నూనే ఎక్కువగా ఉంటుంది. పామ్ ఆయిల్ తర్వాత సన్ ఫ్లవర్ ఆయిల్‌ను ఇండియాలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. గతేడాది ఇండియా సుమారు 1.89 మిలియన్ టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. ఇందులో 74 శాతం దాకా ఆయిల్ ఉక్రెయిన్ నుంచి ఇండియాకు వచ్చింది. కాగా క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడం వల్ల ఉక్రెయిన్‌లో సంక్షోభం ఏర్పడడం.. తద్వారా సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై కూడా ప్రభావం పడింది. ఉక్రెయిన్, రష్యాల మధ్య కొనసాగుతోన్న రాజకీయ ఉద్రిక్తతల వల్ల సన్ ఫ్లవర్ ఆయిల్ రిటైల్ ధరలు పెరగడమే కాకుండా, సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.