సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వంట నూనెలు భగభగమండుతున్నాయి. లీటర్ పొద్దుతిరుగుడు నూనె ప్యాకెట్ ధర నెలరోజుల్లో దాదాపుగా రూ.100 పెరిగింది. గత నెలలో రూ.120 నుంచి రూ.130 ఉన్న నూనె ధరలు ఏకంగా రూ. 225 వరకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లోని హోల్‌సేల్ మార్కెట్లలో కూడా ఎప్పటికప్పుడు కొత్త ఎంఆర్‌పీ ధరల స్టిక్కర్లతో సన్‌ఫ్లవర్ నూనెలను విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఇక్కడ నూనె తయారీ సంస్థలే ఎంఆర్‌పీ ధరలను సవరిస్తూ విక్రయిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
యుద్ధం నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ నుంచి సన్‌ఫ్లవర్ ముడి చమురు కంటెయినర్లు ఇప్పట్లో తయారీ సంస్థల వద్దకు రావని అర్థం కావడంతో, మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను ఆధారం చేసుకొని 5 నుంచి 7రోజులకోసారి ఎంఆర్‌పీలను సవరించి మార్కెట్లకు పంపిస్తున్నారు. తద్వారా ఈరోజు ఉన్న ధర రేపు ఉండని పరిస్థితి. ఇతర కంపెనీలతో పాటే ప్రభుత్వ సంస్థ ‘విజయ’కూడా సన్‌ఫ్లవర్ నూనె ధరను రూ. 225గా ప్రింట్ చేసి విక్రయిస్తోంది. వారం క్రితం విజయ ఎంఆర్‌పీ రూ.196 మాత్రమే. వేరుశనగ, రైస్‌బ్రాన్, సోయాబీన్ ధర పెరిగినా రూ.170 నుంచి రూ. 180 ఎంఆర్‌పీగా ఉన్నాయి. పామాయిల్ నూనె లీటర్‌కు రూ. 150 నుంచి రూ. 160కి విక్రయిస్తున్నారు. పామాయిల్ ధరలు నెల క్రితంతో పోలిస్తే 20 రూపాయల వరకు పెరగగా, దీని వినియోగం రాష్ట్రంలో పెరిగింది.
సూపర్ మార్కెట్లు, హోల్‌సేల్ వ్యాపారులు కూడా నూనెలపై డిస్కౌంట్ సేల్ ఎత్తేసి ఎంఆర్‌పీకే విక్రయిస్తున్నారు. సన్‌ఫ్లవర్‌తో పోలిస్తే ఇతర నూనెల ధరలు అంతగా పెరగకపోవడంతో పల్లి నూనె, రైస్‌బ్రాన్, సోయాబీన్, పామాయిల్ నూనెల వైపు ప్రజలు మరలుతున్నారని మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. దీంతో ఈ నూనెల ధరలు పెంచడంపైనా కంపెనీలు దృష్టిపెట్టాయి. ఇప్పటికే బ్లాక్ మార్కెట్‌కు తరలించిన ఏజెన్సీలు త్వరలోనే కొత్త ధరలను ప్రింట్ చేసి మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు సమచారం.
స్టిక్కర్లు మార్చి...
ఈ ఫొటోలో ఉన్న ఓ కంపెనీకి చెందిన సన్‌ఫ్లవర్ నూనె ప్యాకెట్లు పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఓ సూపర్ మార్కెట్‌లోనివి. ఆ కంపెనీ నూనె ప్యాకెట్ ధర వారం రోజుల క్రితం ఎంఆర్‌పీ రూ.175 ఉండగా, ప్రస్తుతం 217కి చేరింది. అయితే ఆ సూపర్ మార్కెట్ యజమాని నిల్వ ఉన్న ప్యాకెట్లపై పాతరేట్లను తొలగించి రూ. 205 ధరతో కొత్త స్టిక్కర్లు వేసి విక్రయించాడు. ఇది పెద్దపల్లి జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇదే దందా.
Comments
Please login to add a commentAdd a comment