కాటేస్తున్న కల్తీ నూనె
- విచ్చలవిడిగా కల్తీ అమ్మకాలు
- {పజల ఆరోగ్యాలను
- హరిస్తున్న వ్యాపారులు
- అధికారుల దాడులు శూన్యం
కల్తీకి కాదేది అనర్హం అంటున్నారు స్వార్ధపరులు. నూనె కల్తీతో ప్రజల ఆరోగ్యాలను హరిస్తున్నారు. దాడులు చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్నారు.
చోడవరం,న్యూస్‌లైన్: ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో పేద, దిగువ తరగతి ప్రజల్లో ఎక్కువ శాతం మంది తక్కువ ధరకు లభించే పామాయిల్‌నే ఎక్కువగా వినియోగిస్తారు. దీనిని ఆసరాగా చేసుకుని ఈ రకం నూనెలోనే ఎక్కువ కల్తీ జరుగుతోంది. రిఫైన్డ్ ఆయిల్ పొద్దుతిరుగుడు పువ్వుల గింజల నుంచి తయారు చేస్తారు. వేరుశనగ, నువ్వులు రకాల నూనెలు ఉన్నప్పటికీ వాటి వాడుక నామమాత్రమే. తౌడు, మొక్కజొన్న కంకెలు, సన్‌ఫ్లవర్,పామాయిల్ పిప్పి నుంచి తీసే నూనె చాలా ప్రమాదకరం. వీటిని ఈ పామాయిల్‌లో కలిపేసి అమ్మేస్తున్నారు.
వాస్తవానికి పామాయిల్ గెలల నుంచి తొలుత తీసే నూనె వినియోగిస్తే ఎలాంటి ప్రమాదం లేదు. కానీ నూనె తీసేసిన పామాయిల్ పిప్పి, తౌడు, మొక్కజొన్న కంకెలను మళ్లీ గానుగలో వేసి తీసినది అత్యంత నాసిరకం. ఆరోగ్యానికి ప్రమాదకరమైన ఈ నూనెలను మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల పామాయిల్‌లో ఈ నాసిరకం నూనెలను కలిపి విక్రయిస్తున్నారు. మండల కేంద్రాల్లో జరిగే లూజు అమ్మకాల్లో దాదాపు 60 శాతం వరకూ కల్తీ జరుగుతోంది. అరడబ్బా అసలు నూనెలో మరో అరడబ్బా నాసిరకం కలిపేసి విక్రయిస్తున్నారు.
బ్రాండెడ్ నూనె లీటర్ రూ.80 వరకూ ఉంది. అయితే ఈ నాసిరకపు నూనె రూ.40కే లభిస్తుండడంతో దీనిని మేలు రకపు సరుకులో కలిపేసి సొమ్ము చేసుకుంటున్నారు. చోడవరం పాత బస్టాండ్ సమీపంలో ఉన్న హోల్‌సేల్, రిటైల్ నూనెదుకాణాల్లో ఈ వ్యవహారం మరీ ఎక్కువగా జరుగుతోంది. నేరుగా ట్యాంకర్‌తో వచ్చిన నూనెను హోల్‌సేల్ వ్యాపారులు పీపాల్లోకి తీసి వాటి నుంచి 15 కిలోల డబ్బాల్లోకి నింపేటప్పుడు కల్తీ చేస్తున్నారు. కంపెనీ నుంచి వచ్చే డబ్బాల కన్నా లూజు డబ్బాలు తక్కువ ధరకు లభిస్తాయని వినియోగదారులకు ఒప్పిస్తూ ఈ నాసిరకపు నూనెలు అంటగడుతున్నారు.
చోడవరం పరిసర ఏడు మండలాల ప్రజలు ఇక్కడే నూనె కొనుగోలు చేస్తారు. వీరంతా రైతులు, సామాన్య ప్రజలు కావడంతో వ్యాపారులు ఇష్టానుసారం ఈ నాసిరకపు సరుకు అంటగడుతున్నారు. ప్రజలు మాత్రం నాసిరకం నూనెలు తిని కాలేయం, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఏనాడూ అధికారులు ఇలాంటి వ్యవహారాలపై దాడులు చేసిన దాఖలాలు లేవు.