![India palm oil imports plummeted to a near 14 year low primarily driven by a surge in soyoil imports](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/oil01.jpg.webp?itok=CGl--RJv)
భారత్ పామాయిల్ దిగుమతులు 2025 జనవరిలో 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. అదే సమయంలో సోయా దిగుమతులు భారీగా పెరిగాయి. సోయా దిగుమతులు మునుపటి సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ నమోదయ్యాయి. పామాయిల్ శుద్ధి చేసేందుకు అయ్యే ఖర్చు.. దానివల్ల సమకూరే మార్జిన్లు సోయా దిగుమతులకు కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. పామాయిల్ దిగుమతులు పడిపోవడానికిగల కొన్ని కారణాలను విశ్లేషిస్తున్నారు.
దిగుమతి చేసుకున్న పామాయిల్ రిఫైనింగ్ మార్జిన్లు తక్కువగా ఉంటున్నాయి. చాలా కంపెనీల రెవెన్యూపై దీని ప్రభావం పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కొన్ని ప్రాంతాలు పామాయిల్ ధరలను టన్నుకు 80-100 డాలర్లు తగ్గించాయి. అయినప్పటికీ దిగుమతులు మందగించాయి. ఇండోనేషియా, మలేషియా వంటి ప్రధాన పామాయిల్ ఉత్పత్తి దేశాలు ఎగుమతి సరఫరాలను కఠినతరం చేశాయి. ఇది సోయా నూనె వైపు మళ్లడానికి మరింత ప్రోత్సహించింది. ప్రపంచంలోనే అత్యధికంగా కూరగాయల నూనె(ఎడిబుల్ ఆయిల్)లను కొనుగోలు చేస్తున్న భారత్ పామాయిల్ దిగుమతులు తగ్గడం ప్రపంచ మార్కెట్లపై గణనీయమైన ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. భారత్ నుంచి డిమాండ్ తగ్గడంతో మలేషియా పామాయిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రపంచ బ్యాంక్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2025.. అర్హతలివే..
ఫిబ్రవరిలో పామాయిల్ దిగుమతులు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అవి సాధారణం కంటే తక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు. సోయా దిగుమతులు కొద్దిగా తగ్గవచ్చని, సన్‌ఫ్లవర్ నూనె దిగుమతులు స్వల్పంగా పెరగవచ్చని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment