పామాయిల్ నిపుణులు డాక్టర్ బి.ఎన్.రావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పామాయిల్ సాగు విస్తరణ ద్వారానే వంట నూనెల ఉత్పత్తిలో మన దేశం స్వావలంబన సాధించగలుగుతుందని, రైతులకు ఎకరానికి ఏటా కనీసం రూ. లక్ష నికరాదాయం వస్తుందని పామాయిల్ సాగు నిపుణులు, తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారు డాక్టర్ బి.ఎన్.రావు చెప్పారు. ‘ఆయిల్‌పామ్ సాగు, ప్రాసెసింగ్ - ఆహార, ఆహారేతర రంగాల్లో ఉపయోగాలు’ అనే అంశంపై తార్నాకలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో జరిగిన జాతీయ సమావేశంలో శనివారం సాయంత్రం జరిగిన చర్చాగోష్టిలో డా. రావు మాట్లాడారు. ఏయే ఇతర పంటల్లో లేని విధంగా ఆయిల్‌పామ్‌లో రైతులకు నిరంతర ఆదాయం వస్తుందని ఆయన అన్నారు.
అయితే, ఏడాది పొడవునా కాలువ / బోరు నీటి సదుపాయం పుష్కలంగా ఉండి, 30 ఏళ్ల పాటు నీటి సమస్య ఉండదనుకున్న రైతులే పామాయిల్ సాగు చేపట్టాలని సూచించారు. పామాయిల్ ఉత్పత్తికి సంబంధించిన శాస్త్రవేత్తలు, ప్రాసెసింగ్ శాస్త్రవేత్తలు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీసీఎంబీ విశ్రాంత ప్రిన్సిపల్ సైంటిస్ట్, అగ్రి-హార్టీకల్చర్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఏవీ రావు మాట్లాడుతూ వాతావరణ మార్పులు, నిపుణుల కొరత, పరిశోధనల లేమి కారణంగా పామాయిల్ సాగులో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. మలేషియాలో మాదిరిగా ఇక్కడ దిగుబడులు రావాలని లేదన్నారు.
శాస్త్రవేత్తలు, నూనె పరిశ్రమదారులు పామాయిల్ రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ ఉద్యానశాఖ ఏడీ డాక్టర్ లహరి మాట్లాడుతూ తెలంగాణలో పామాయిల్ సాగు 29 జిల్లాల్లో జరుగుతోందన్నారు. ప్రస్తుతం టన్ను గెలల ధర రూ. 20,506 ఉందని చెబుతూ, ప్రభుత్వం నిర్ణయించే ధరలకే కంపెనీలు కొనుగోలు చేస్తాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సీనియర్ శాస్త్రవేత్త డా. అహ్మద్ ఇబ్రాహిం మాట్లాడుతూ వంట నూనెలు ఎన్ని ఉన్నా దేనికి ఉండే ప్రత్యేకతలు దానికి ఉన్నాయన్నారు. ఏదో ఒక వంట నూనెనే వాడటం మంచిదికాదన్నారు. మళ్లీ మళ్లీ వంటనూనెలను మరిగించి వినియోగించటం ఆరోగ్యకరం కాదంటూ, ఎన్‌ఐఎన్ మార్గదర్శకాలను పాటించాలన్నారు.
అధ్యక్షతవహించిన ఎస్.కె. పట్నాయక్ మాట్లాడుతూ వంట నూనెల రంగంలో ప్రతిబంధకాలను అధిగమిస్తే స్వావలంబనకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment