Palm oil Farmers
-
పామాయిల్ సాగుతో ఎకరానికి ఏటా రూ. లక్ష నికరాదాయం
సాక్షి, హైదరాబాద్: పామాయిల్ సాగు విస్తరణ ద్వారానే వంట నూనెల ఉత్పత్తిలో మన దేశం స్వావలంబన సాధించగలుగుతుందని, రైతులకు ఎకరానికి ఏటా కనీసం రూ. లక్ష నికరాదాయం వస్తుందని పామాయిల్ సాగు నిపుణులు, తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారు డాక్టర్ బి.ఎన్.రావు చెప్పారు. ‘ఆయిల్‌పామ్ సాగు, ప్రాసెసింగ్ - ఆహార, ఆహారేతర రంగాల్లో ఉపయోగాలు’ అనే అంశంపై తార్నాకలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో జరిగిన జాతీయ సమావేశంలో శనివారం సాయంత్రం జరిగిన చర్చాగోష్టిలో డా. రావు మాట్లాడారు. ఏయే ఇతర పంటల్లో లేని విధంగా ఆయిల్‌పామ్‌లో రైతులకు నిరంతర ఆదాయం వస్తుందని ఆయన అన్నారు.అయితే, ఏడాది పొడవునా కాలువ / బోరు నీటి సదుపాయం పుష్కలంగా ఉండి, 30 ఏళ్ల పాటు నీటి సమస్య ఉండదనుకున్న రైతులే పామాయిల్ సాగు చేపట్టాలని సూచించారు. పామాయిల్ ఉత్పత్తికి సంబంధించిన శాస్త్రవేత్తలు, ప్రాసెసింగ్ శాస్త్రవేత్తలు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీసీఎంబీ విశ్రాంత ప్రిన్సిపల్ సైంటిస్ట్, అగ్రి-హార్టీకల్చర్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఏవీ రావు మాట్లాడుతూ వాతావరణ మార్పులు, నిపుణుల కొరత, పరిశోధనల లేమి కారణంగా పామాయిల్ సాగులో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. మలేషియాలో మాదిరిగా ఇక్కడ దిగుబడులు రావాలని లేదన్నారు.శాస్త్రవేత్తలు, నూనె పరిశ్రమదారులు పామాయిల్ రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ ఉద్యానశాఖ ఏడీ డాక్టర్ లహరి మాట్లాడుతూ తెలంగాణలో పామాయిల్ సాగు 29 జిల్లాల్లో జరుగుతోందన్నారు. ప్రస్తుతం టన్ను గెలల ధర రూ. 20,506 ఉందని చెబుతూ, ప్రభుత్వం నిర్ణయించే ధరలకే కంపెనీలు కొనుగోలు చేస్తాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సీనియర్ శాస్త్రవేత్త డా. అహ్మద్ ఇబ్రాహిం మాట్లాడుతూ వంట నూనెలు ఎన్ని ఉన్నా దేనికి ఉండే ప్రత్యేకతలు దానికి ఉన్నాయన్నారు. ఏదో ఒక వంట నూనెనే వాడటం మంచిదికాదన్నారు. మళ్లీ మళ్లీ వంటనూనెలను మరిగించి వినియోగించటం ఆరోగ్యకరం కాదంటూ, ఎన్ఐఎన్ మార్గదర్శకాలను పాటించాలన్నారు. అధ్యక్షతవహించిన ఎస్.కె. పట్నాయక్ మాట్లాడుతూ వంట నూనెల రంగంలో ప్రతిబంధకాలను అధిగమిస్తే స్వావలంబనకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. -
ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు మంచి లాభాలు
-
ఆయిల్ పామ్ టన్ను రూ.22,770
సాక్షి, అమరావతి: ఆయిల్ పామ్ రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ధర పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ టన్ను రూ.17 వేలతో ప్రారంభం కాగా, ప్రస్తుతం తాజా గెలల (ఎఫ్‌ఎఫ్‌బీ)ను టన్ను రూ.22,770 చొప్పున కొనాలని ఉద్యాన శాఖ పామాయిల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. కేవలం ఏడు నెలల్లోనే టన్నుకు రూ.5,770 పెరగడం గతంలో ఎప్పుడూ లేదని రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలో 4.80 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది. ప్రభుత్వ చర్యల ఫలితంగా 2019–20లో 6,642 హెక్టార్లు, 2020–21లో 8,801 హెక్టార్లు, 2021–22లో 11,257 హెక్టార్లు కొత్తగా సాగులోకి వచ్చాయి. 2020–21లో 14.94 లక్షల టన్నులు, 2021–22లో 17.22 లక్షల టన్నులు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో దిగుబడులొస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో గంటకు 461 టన్నుల సామర్థ్యంతో 13 పామాయిల్ కంపెనీలు పని చేస్తున్నాయి. ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో (ఓఈర్)ను బట్టి ధర చెల్లించాలి. అయితే, నాణ్యత సాకుతో గతంలో తెలంగాణ ఓఈఆర్ కంటే ఇక్కడ తక్కువగా చెల్లించేవారు. దీంతో రైతులు టన్నుకు రూ.4 వేలకు పైగా నష్టపోయేవారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో రైతులు ఆయన్ని కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. వారి ఆవేదనను అర్ధం చేసుకున్న వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఆయిల్ పామ్‌కు గిట్టుబాటు ధర కల్పించారు. అప్పటివరకు 16.08 శాతం ఉన్న ఓఈఆర్ను 18.68 శాతానికి పెంచారు. 2018–19లో సగటున రూ.7 వేలు పలికిన టన్ను ఆయిల్‌పామ్ ధర ఇప్పుడు రూ.15వేలకు పైగా పెరిగింది. 2020–21లో టన్ను రూ.13,127 తో సీజన్ ప్రారంభం కాగా గరిష్టంగా మే–జూన్ నెలల్లో రూ.18,942 పలికింది. కాగా ఈ ఏడాది ఓఈఆర్ నిర్ధారణ కాకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్ ధరలు, డిమాండ్‌ను బట్టి అడ్హాక్ కమిటీ నెలవారీ ధరలను ప్రకటిస్తోంది. సీజన్ ప్రారంభమైన నవంబర్‌లో టన్ను రూ.17 వేలుగా అడ్హాక్ కమిటీ నిర్ణయించగా ఇదే ధరతో జనవరి వరకు కొన్నారు. ఫిబ్రవరిలో టన్ను రూ.19,300గా నిర్ణయించారు. మార్చిలో రూ.21,890, ఏప్రిల్‌లో రూ.21,940గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇదే ధరతో కొంటున్నారు. మే నెల నుంచి టన్ను రూ.22,770 చొప్పున ధర చెల్లించాలన్న అడహాక్ కమిటీ నిర్ణయం మేరకు ఆయిల్ కంపెనీలకు ఉద్యాన శాఖ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. పెరిగిన ధరల నేపథ్యంలో పెట్టుబడి పోను ఎకరాకు రూ.2 లక్షల వరకు నికర ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మంచి ధర వస్తోంది ఆయిల్‌పామ్‌కు ఇప్పుడు మంచి ధర వస్తోంది. ఓఈఆర్ ఎంత ఇవ్వాలనే అంశంపై ఇంకా నిర్ణయం జరగలేదు. అంతర్జాతీయ మార్కెట్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అడ్హాక్ కమిటీ నెలవారీ ధరలను నిర్ణయిస్తోంది. పూర్తిగా పక్వానికి వచ్చిన తాజా గెలలకు టన్ను రూ.22,770 చొప్పున చెల్లించాలని కంపెనీలకు ఆదేశాలిచ్చిందిది. – పి.హనుమంతరావు, జేడీ, ఉద్యాన శాఖ (ఆయిల్‌పామ్ విభాగం) -
ఒక్కసారి వేస్తే 30 ఏళ్ల పాటు పంట: ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం
తగరపువలస/విశాఖపట్నం: సేద్యంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు భీమిలి నియోజకవర్గ రైతులు. ఒక్క సారి పెట్టుబడి పెడితే.. 30 ఏళ్లు వరసగా ఆదాయం పొందే ఆయిల్‌పామ్ తోటల వైపు మళ్లుతున్నారు. భీమిలి డివిజన్లో నారాయణరాజుపేట, దాకమర్రి, సంగివలస, రావాడ, గెద్దపేట, కురపల్లి, రెడ్డిపల్లి, కుసులవాడ, మజ్జిపేట తదితర పంచాయితీల్లో 200 ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ సాగు చేస్తుండగా.. ప్రస్తుతం దిగుబడి ఇస్తున్నాయి. ఏడాదిలో 8 నెలల పాటు 15 రోజులకొకసారి ఎకరానికి 10–12 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను ఆయిల్‌పామ్ గెలల ధర రూ.21 వేలకు కంపెనీల యజమానులు కొనుగోలు చేస్తున్నారు. నర్సీపట్నం వద్ద బంగారుమెట్ట, విజయనగరం జిల్లా పార్వతీపురంలో కంపెనీలకు ఆయిల్‌పామ్ గెలలను తరలిస్తున్నారు. మొదటి నాలుగేళ్లే.. నిరీక్షణ సాధారణంగా ఎక్కువ ఎకరాలు భూమి కలిగిన రైతులు ఆయిల్‌పామ్ తోటలను సాగు చేస్తుంటారు. ఒకసారి పంటకు ఉపక్రమించిన తర్వాత నాలుగేళ్లు వరసగా పెట్టుబడి పెట్టాలి. గోదావరి జిల్లాల్లో అయితే చిన్న కమతాలు కలిగిన రైతులు కూడా ఆయిల్‌పామ్‌కే మొగ్గు చూపుతారు. గత ప్రభుత్వాల హయాంలో రూ.60 ఉండే ఆయిల్‌పామ్ మొక్కను రాయితీ పోను మూడు ఎకరాల్లోపు రైతులకు రూ.5, మూడు నుంచి ఐదు ఎకరాల్లోపు రైతులకు రూ.10, ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు రూ.30 వంతున ప్రభుత్వం సరఫరా చేసేది. ప్రస్తుతం రూ.300 ఉన్న మొక్కను.. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రైతులకు ఎన్ని కావాలంటే అన్ని అందిస్తోంది. గత ప్రభుత్వాలు దిగుబడి వచ్చే నాలుగేళ్ల వరకు హెక్టారుకు ఏడాదికి రూ.4 వేల విలువైన ఎరువులు ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం రూ.4 వేల నగదును నేరుగా రైతుల ఖాతాకు జమ చేస్తోంది. పెట్టుబడి గోరంత.. ఆదాయం కొండంత ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు మొక్కలు ఉచితంగా లభిస్తుండగా ఎకరాకు గాను పెట్టుబడి నిమిత్తం రూ.30 వేల నుంచి 40 వేలు అవుతుంది. మొక్కకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో రోజుకు 250 లీటర్ల నీరు, మూడు నెలలకు ఒకసారి మొక్కకు 3–4 కిలోల ఎరువులు, అవసరమైన చోట మట్టలు నరకడం చేస్తే సరిపోతుంది. నాలుగేళ్ల తర్వాత ఏడాదిలో ఎనిమిది మాసాలకు కలిపి 16సార్లు దిగుబడి వస్తుంది. దీంతో ఖర్చులు పోను ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం లభిస్తుంది. అంతర పంటగా వేస్తే అదనపు ఆదాయం 2013లో నాకున్న 9 ఎకరాల్లో మొదట ఆయిల్‌పామ్ వేశాను. తర్వాత 18 ఎకరాలకు విస్తరించాను. మొత్తంగా 27 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌తో పాటు అరటి, బొప్పాయి అంతర పంటలుగా వేశాను. మధ్యలో కోళ్ల ఫారాలు ఏర్పాటు చేశాను. సోలార్ ద్వారా బిందుసేద్యం మొదలుపెట్టాను. ఆయిల్‌పామ్ నాలుగేళ్లు తర్వాత దిగుబడి ప్రారంభయి జీవితకాలం 30 ఏళ్ల వరకు ఆదాయం ఇస్తుంది. అరటి, బొప్పాయి వలన ఏడాదికి రూ.లక్ష అదనపు ఆదాయం లభిస్తుంది. మార్కెటింగ్ సమస్య లేదు. – కాద సూర్యనారాయణ, సర్పంచ్, నారాయణరాజుపేట, భీమిలి మండలం పక్షుల బెడద ఉంటుంది ఆయిల్‌పామ్‌కు తెగుళ్ల బాధ తక్కువ. ఒకవేళ తెగుళ్లు సోకినా ఇబ్బంది లేదు. పంట దిగుబడి సమయంలో ఆయిల్‌పామ్ పండ్లను గోరపిట్టలు, కాకులు, ఉడతలు తినేస్తుంటాయి. సాధారణంగా ఆయిల్‌పామ్ గెల 30 కిలోలు ఉండగా.. గెలకు అరకిలో వరకు నష్టం ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా రక్షణ చర్యలు తీసుకోవాలి. వచ్చే ఆదాయం ముందు నష్టం ఏమంత కాదు. – మజ్జి చినపైడితల్లి, రైతు, మజ్జిపేట, భీమిలి మండలం -
భారీగా పామాయిల్ సాగు
న్యూఢిల్లీ: దేశీ రైతులు పండించిన నూనెగింజలను కొనుగోలు చేస్తూ వారికి మద్దతుగా నిలవాలని ప్రైవేటు కంపెనీలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అదే సమయంలో వంట నూనెల దిగుమతులు తగ్గించుకోవాలని సూచించారు. ఇది ఇరు వర్గాలకు ప్రయోజనకరమన్నారు. భారత్ వచ్చే 3–4 ఏళ్లలో వంట నూనెల ఉత్పత్తిని 50 శాతం పెంచుకునే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్’ కార్యక్రమం కింద పెద్ద ఎత్తున పామాయిల్ సాగుకు పుష్కలంగా అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. ‘వ్యవసాయ రంగంపై బడ్జెట్ 2022 సానుకూల ప్రభావం’ అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘‘వీటికి (కాయధాన్యాలు, నూనె గింజలకు) దేశంలో భారీ డిమాండ్ ఉంది కార్పొరేట్ ప్రపంచం ముందుకు రావాలి. మీకు భరోసానిచ్చే మార్కెట్ ఉంది. దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎంత పరిమాణంలో కాయధాన్యాలు, నూనె గింజలను కొనుగోలు చేస్తారో రైతులకు ముందే చెప్పండి’’అని మోదీ అన్నారు. పంట నష్టానికి రక్షణగా వ్యవసాయ బీమా యంత్రాంగం ఉన్నట్టు చెప్పారు. మనమంతా కలసి పనిచేయడం ద్వారా మన దేశ అవసరాలకు కావాల్సిన ఆహార ఉత్పత్తులను స్థానికంగానే పండించేలా చూడాల్సి ఉందన్నారు. దేశ వంట నూనెల అవసరాల్లో 60–65 శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రధాని గుర్తు చేశారు. వంట నూనెల దిగుమతి బిల్లు 2020–21 సీజన్లో రూ.1.17 లక్షల కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. చిరుధాన్యాల సంవత్సరం 2023 అధిక పోషక విలువలు కలిగిన భారతీయ మిల్లెట్స్ (చిరు ధాన్యాలు)కు బ్రాండింగ్, ప్రచారానికి సహకారం అందించాలని కార్పొరేట్ సంస్థలను ప్రధాని కోరారు. 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించారు. నానో ఫెర్టిలైజర్ విభాగంలో కంపెనీలకు అపార అవకాశాలున్నట్టు గుర్తు చేశారు. దీనితోపాటు ఆహారశుద్ధి, ఇథనాల్ తయారీ సాగు ముఖచిత్రాన్ని మార్చేవిగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా భూసార పరీక్షా కేంద్రాల నెట్వర్క్ ఏర్పాటుకు స్టార్టప్‌లు, ఇన్వెస్టర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భూముల సారాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 2022–23 బడ్జెట్ భారత్ వ్యవసాయ రంగాన్ని ఆధునికంగా, స్మార్ట్‌గా మార్చడంపై దృష్టి సారించినట్టు ప్రధాని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో సాగు, వాణిజ్య అంశాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మార్చేస్తుందన్నారు. అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించినప్పుడే సాగులో డ్రోట్ టెక్నాలజీ మరింత అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. గత మూడు నాలుగేళ్లలో 700 వ్యవసాయాధారిత స్టార్టప్‌లు ప్రారంభమైనట్టు చెప్పారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం ‘‘రైతుల ఆదాయం పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, రైతులకు ఆధునిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం. రైతులకు అద్దెపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను అందించే వ్యవస్థను కార్పొరేట్లు ఏర్పాటు చేయాలి. సహజ, సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేయడంపై అవగాహన పెంచేందుకు యూనివర్సిటీలు, శాస్త్రవేత్తలు కృషి చేయాలి’’ అని ప్రధాని కోరారు. గడిచిన ఆరేళ్లలో వ్యవసాయానికి బడ్జెట్ ఎన్నో రెట్లు పెంచామని, వ్యవసాయ రుణాలు ఏడేళ్లలో రెండున్నర రెట్లు పెరిగినట్టు ప్రదాని గుర్తు చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం చిన్న రైతులకు మద్దతుగా నిలుస్తోందంటూ.. 11 కోట్ల మంది రైతులకు రూ.1.75 లక్షల కోట్ల రుణాలను ఈ పథకం కింద అందించినట్టు ప్రకటించారు. చమురులో 20 శాతం ఇథనాల్‌ను కలిపే లక్ష్యం దిశగా పనిచేస్తున్నట్టు, ఇప్పటికే ఇది 8 శాతానికి చేరినట్టు గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ 2022: వ్యవసాయ రంగంపై సానుకూల ప్రభావం అన్న అంశంపై జరిగిన వెబినార్‌లో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ -
పామాయిల్ సాగు ప్రోత్సాహానికి రూ.11 వేల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పామాయిల్ సాగు ప్రోత్సాహం కోసం రూ.11 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశంలో వంట నూనెల అందుబాటును విస్తృతం చేసేందుకు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ పామ్ (ఎన్ఎంఈవో) పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. దేశంలో 27.99 లక్షల హెక్టార్లు పామాయిల్ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు ఐసీఏఆర్ ఆధ్వర్యంలోని కమిటీ అంచనా వేసిందని తెలిపారు. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి, సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచి వంటనూనెల దిగుమతి వల్ల పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్ఎంఈవో బృహత్తర కార్యాచరణను అమలు చేస్తోందన్నారు. అంతర్జాతీయ ధరల్లో హెచ్చు తగ్గుల నుంచి పామాయిల్ రైతులను కాపాడేందుకు వీలుగా గిట్టుబాటు ధర విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి చెప్పారు. ఏపీలో 40 ఎఫ్‌సీఐ వేర్‌హౌస్‌లు ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్సీఐకు చెందిన సొంత, అద్దె గోదాములు 40 ఉన్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్చౌబే తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఎఫ్‌సీఐ, రాష్ట్ర ఏజెన్సీలు నిర్వహిస్తున్న వేర్‌హౌస్‌లు సెంట్రల్‌పూల్ స్టాక్‌కు సరిపోతాయని చెప్పారు. ఏపీ ప్రతిపాదనలకు అనుమతి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై)లో ఏపీ పంపిన ప్రతిపాదనలను అనుమతించామని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రూ.657.11 కోట్ల పనులకు అనుమతించి ఇప్పటివరకు రూ.108.95 కోట్లు విడుదల చేశామని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, ఓడరేవుల్లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతోపాటు ఫిష్ రిటైల్ హబ్ తదితర పనులకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. పీపీపీ పద్ధతిలో ఎంవీయూలు పశువుల సంరక్షణ నిమిత్తం సేవలు నేరుగా రైతుల ఇంటివద్దే అందించేలా మొబైల్ వెటర్నరీ యూనిట్లను (ఎంవీయూలను) పబ్లిక్, ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో తీసుకొచ్చినట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మౌలికసదుపాయాలను, ఏజెన్సీలు (కోఆపరేటివ్, మిల్క్ యూనియన్లు) మానవ వనరులను ఏర్పాటు చేస్తాయని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లబ్ధిదారుల్ని పెంచాలని ఏపీ కోరింది జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ)లో లబ్ధిదారుల సంఖ్యను గ్రామీణ ప్రాంతంలో 75, పట్టణ ప్రాంతంలో 50 శాతానికి పెంచాలని ఏపీ ప్రభుత్వం కోరిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. బీజేపీ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. 2011 జనాభా లెక్కలననుసరించి ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 60.96 శాతం, పట్టణ ప్రాంతాల్లో 41.14 శాతం లబ్ధిదారుల్ని గుర్తించినట్లు చెప్పారు. -
సీఎం జగన్ రైతులకు పెద్దపీట వేస్తున్నారు
సాక్షి, పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పాదయాత్ర సమయంలో పామాయిల్ రైతులు పడుతున్న కష్టాలను చూసి సీఎం వైఎస్ జగన్ చలించిపోయారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక పామాయిల్‌కు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రవాణా ఖర్చులు కూడా చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం హర్షనీయం అన్నారు. నివర్ తుఫాన్ సమయంలో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పరిహారం అందించామని ఆయన చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ అంటూ ఒక జిల్లా తర్వాత మరో జిల్లా పర్యటిస్తున్నారని, హైదరాబాద్‌లో వరదలు వచ్చినపుడు పవన్ కల్యాణ్ ఎందుకు బయటకు రాలేదన్నారు. గతంలో చంద్రబాబును ప్రశ్నించలేదు కానీ ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గతంలో రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లొకేష్‌లు ఏమయ్యారని ఎమ్మెల్యే మండిపడ్డారు. -
పామాయిల్ రైతులకు తీపికబురు
-
కందకాలు తవ్వితే చెట్లు పచ్చబడ్డాయి
కోనేరు సురేశ్‌బాబు విజయనగరం జిల్లా ఆలూరు మండలం కందుల పదం గ్రామపరిధిలో 13 ఎకరాల్లో పామాయిల్ తోటను పదిహేనేళ్లుగా సాగు చేస్తున్నారు. పామాయిల్ చెట్టుకు రోజుకు 200 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. వెంగళ్రావు సాగర్ డ్యామ్ దగ్గర్లోనే సురేశ్‌బాబు వ్యవసాయ క్షేత్రం ఉంటుంది. గుడ్డవాగు ద్వారా వచ్చే బ్యాక్ వాటర్ అందుబాటులో ఉండటం వల్ల బోర్ పుష్కలంగా నీరు పోస్తూ ఉంటుంది. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు కరెంటు ఉన్న సమయంలో గతంలో డ్రిప్ ద్వారా అనుదినం నీరందించేవారు. అయితే, భూమి తేలిక నేల కాకపోయినప్పటికీ ఎత్తుపల్లాలుగా ఉండటం వల్ల కొన్ని చోట్ల చెట్లకు సరిగ్గా నీరందక ఇబ్బందులు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో కందకాలు తీయిస్తే ఎక్కడి వర్షపు నీరు అక్కడే ఇంకి, వేసవిలోనూ చెట్లకు, దిగుబడికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్న భావనతో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)లను సంప్రదించి గత మేలో కందకాలు తీయించారు. పామాయిల్ చెట్ల మధ్య 9 మీటర్ల దూరం ఉంటుంది. చెట్లకు సమాన దూరంలో మీటరు లోతు, మీటరు వెడల్పున వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. కందకాలు తవ్విన తర్వాత డ్రిప్ వాడటం మానేశారు. కందకాల ద్వారానే బోరు నీటిని పారిస్తున్నారు. పామాయిల్ చెట్ల మట్టలను కందకాల్లో వేశారు. అవి క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారుతున్నాయి. నీటికి కొరత లేకపోయినా ముందు చూపుతో సురేశ్‌బాబు వాన నీటి సంరక్షణ కోసం కందకాలు తవ్వించడం విశేషం. కందకాలు తవ్విన తర్వాత చెట్లు మరింత పచ్చగా, కళగా ఉంటున్నాయని ఆయన గుర్తించారు. ఇరుగు పొరుగు రైతులు కూడా ఈ మార్పును గుర్తించారని ఆయన తెలిపారు. భూమిలో తేమ ఉంటుంది కాబట్టి, ఎండాకాలంలో నీరు వెనకా ముందు అయినాæచెట్లకు ఇబ్బందేమీ ఉండబోదని సురేశ్‌బాబు (97017 50189) ఆశాభావంతో ఉన్నారు. -
పామాయిల్ పంటకు ‘ఫసల్ బీమా’ వర్తింపు
కల్లూరురూరల్ : పామాయిల్ సాగు చేసే రైతులకు ప్రధానమంత్రి ఫసల బీమా యోజన వర్తింపజేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణలో కేవలం ఉభయ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రైతులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు, పెనుబల్లి, ఎర్రుపాలెం, మధిర, వైరా, పాలేరు, కూసుమంచి, నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో సుమారు పది వేల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, జూలూరుపాడు, చండ్రుగుండ్ర మండలాల్లో సుమారు 25 వేల ఎకరాలలో పామాయిల్ సాగవుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో పామాయిల్ రైతులకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలు కానుంది. ఈ పథకంలో బ్యాంకు రుణం పొందిన రైతులకు ఫసల్ బీమా యోజన తప్పని సరిగా వర్తిస్తుంది. అదే విధంగా రుణం పొందని రైతులకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో బ్యాంకు అధికారులను సంప్రదించి ప్రీమియం ఫారం పొంది కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా బీమా నమోదు చేయించుకునే అవకాశం ఉంది. పామాయిల్ ఎకరానికి వర్తించే బీమా రూ. 35 వేలు కాగా, ఇందులో 5 శాతం ఎకరానికి రూ. 1750 రైతులు చెల్లించాల్సి ఉంటుంది. పామాయిల్ రైతులు ఈ నెల 14 వ తేదీ లోపు తమ ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు సమీపంలోని బ్యాంకులు, వ్యవసాయ, ఉద్యాన వనశాఖ అధికారులను రైతులు సంప్రదించాలి. -
సంక్షోభంలో కూరుకుపోయిన ఆయిల్ ఫామ్ సాగు
-
పామాయిల్ పాట్లు..!
-
పామాయిల్ రైతుల నిరసన
అశ్వారావుపేట (ఖమ్మం) : పామాయిల్ గెలలను ఫ్యాక్టరీ దిగుమతి చేసుకోకపోవడంతో రైతులు ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలోని క్రషింగ్ యూనిట్లో ఏర్పడిన సాంకేతికలోపంతో ఇప్పటికే దిగుమతి చేసుకున్న రూ. కొటి విలువైన గెలలు కుళ్లిపోయాయి. దీంతో ఈ రోజు రైతుల నుంచి గెలలు కొనడంలేదని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపింది. దీంతో రైతులు రహదారిపై ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు.