High profits
-
ఇది లాభాల పంట! ఈ గడ్డి సాగుతో రూ. లక్షల రాబడి..
ప్రస్తుతం పంటల సాగు లాభదాయకమైన వ్యాపార మార్గంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నవారు అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో వినూత్న పంటలు సాగు చేస్తూ లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. మీకూ ఇలాంటి వ్యాపార ఆలోచన (Business Idea) ఉంటే లెమన్ గ్రాస్ ఫార్మింగ్ (Lemon grass farming) చేయొచ్చు. లెమన్ గ్రాస్ (నిమ్మ గడ్డి) సాగును ఇప్పటికే చాలా చోట్ల చేపడుతూ మంచి లాభాలు గడిస్తున్నారు. కొన్ని చోట్ల దీన్ని మహిళా గ్రూప్‌లు, పొదుపు సంఘాల సభ్యులు ఉమ్మడిగా సాగుచేస్తున్నారు. ఈ ఆలోచనను ప్రధాని మోదీ కూడా గుర్తించడం మరింత ఆసక్తికర అంశం. 2020లో ప్రధాని మోదీ నెలవారీ 'మన్ కీ బాత్' రేడియో ప్రసంగం సందర్భంగా నిమ్మగడ్డి సాగును ప్రశంసించారు. నిమ్మగడ్డి కేవలం నాలుగు నెలల్లోనే పెరుగుతుంది. దీని నూనెకు మార్కెట్లో అత్యంత గిరాకీ ఉంటుంది. అందుకే మంచి ధర లభిస్తోంది. సౌందర్య సాధనాలు, సబ్బులు, నూనెలు, మందులతో సహా వివిధ పరిశ్రమలలో లెమన్ గ్రాస్ నూనెకు విపరీతమైన డిమాండ్ ఉంది. లెమన్‌గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్స్ వర్గానికి చెందినది. పలు రకాల చికిత్సల్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తారు. లెమన్ గ్రాస్‌కు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే ఇది శుష్క ప్రాంతాలలోనూ పెరుగుతుంది. ఇది కరువు ప్రాంతాల్లో కూడా సాగు చేయడానికి అనువుగా ఉంటుంది. సహజంగానే స్థితిస్థాపకంగా ఉండే ఈ పంటకు ఎరువులు కూడా అవసరం లేదు. రూ. 20,000 కంటే తక్కువ పెట్టుబడితోనే హెక్టారుకు ఏటా రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. పంట ప్రారంభించిన తర్వాత, వరుసగా ఐదారు సంవత్సరాల పాటు స్థిరమైన దిగుబడి లభిస్తుంది. అయితే లెమన్‌గ్రాస్ సాగుకు సమయం చాలా కీలకం. ఫిబ్రవరి నుంచి జులై నెలల మధ్య కాలం ఈ పంట సాగుకు అనువుగా ఉంటుంది. మొక్కల నర్సరీ బెడ్స్ సిద్ధం చేయడానికి సరైన సమయం మార్చి నుంచి ఏప్రిల్ నెలల మధ్య కాలం. ఈ పంటను ఒకసారి నాటితే సంవత్సరానికి ఆరు నుంచి ఏడు పంటలు ఆశించవచ్చు. అంటే దాని విలువైన నూనెను అధిక మొత్తంలో తీసి విక్రయించి లాభాలు పొందవచ్చు. మీడియాలో వచ్చిన పలు నివేదికల ప్రకారం. హెక్టారుకు సంవత్సరానికి 3 నుంచి 5 లీటర్ల లెమన్‌గ్రాస్ నూనెను ఉత్పత్తి చేయవచ్చు. మార్కెట్లో ఒక్కో లీటరు లెమన్ గ్రాస్ ఆయిల్ ధర రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు ఉంటుంది. మొదటి మూడు సంవత్సరాలలో దాని ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. (Disclaimer: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమేనని గమనించగలరు. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మార్కెట్ అవగాహన, ఇతర వివరాలను పరిశీలించడం అవసరం.) -
ఆ పంట సాగు చేస్తే లాభాలే లాభాలు.. ఎకరాకు రూ.లక్ష ఆదాయం..
పుట్టపర్తి అర్బన్(శ్రీసత్యసాయి జిల్లా): ఆలుగడ్డల సాగు ఈ ఏడాది రైతులను లక్షాధికారులను చేస్తోంది. సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ సాగు చేసే ఆలుగడ్డ మంచి దిగుబడితో పాటు అధిక ధరలు పలుకుతుంటాయి. అయితే పంట సాగుకు ఖర్చు ఎక్కువే అయినా.. దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో రైతుల ఇంట సిరుల వర్షం కురుస్తోంది. ఎకరా విస్తీర్ణంలో రూ.లక్షకు పైగా ఆదాయం వస్తుండడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. కలిసొచ్చిన వాతావరణం గత మూడేళ్లుగా విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. దీనికి తోడు ఖరీఫ్, రబీ సీజన్లలో వాతావరణ పరిస్థితులూ బాగా కలిసొచ్చాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా 23,104 ఎకరాల్లో వివిధ రకాల ఆకు కూరలు, కూరగాయలను రైతులు సాగు చేశారు. అత్యధికంగా 18,872 ఎకరాల్లో టమాట సాగు చేయగా.. 2,076 ఎకరాల్లో పచ్చి మిరప, 919 ఎకరాల్లో వంకాయ, 450 ఎకరాలో ఆలుగడ్డ, 368 ఎకరాల్లో బెండ, 241 ఎకరాల్లో చిక్కుడు, 94 ఎకరాల్లో క్యాబేజీ పంటలను సాగు చేశారు. దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో పంట ఉత్పత్తులను స్థానిక వారపు మార్కెట్లతో పాటు హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, కొత్తచెరువు తదితర పట్టణ ప్రాంతాల్లోనే దినసరి మార్కెట్లు, మదనపల్లి, చెన్నేతో పాటు కర్ణాటకలోని బాగేపల్లి, చింతామణి, బెంగళూరు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ధర అధికంగా ఉండడంతో తోటల వద్దకే వ్యాపారులు వచ్చి పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు 150 బస్తాలు సీజన్‌ను బట్టి ఆలు విత్తన గడ్డ 50 కిలోల బస్తా రూ.2,500 నుంచి రూ.3వేల వరకు ధర పలుకుతోంది. భూమిని దుక్కి చేయడం, గడ్డి తొలగించడం, విత్తనం పెట్టడం, డ్రిప్ ద్వారా ఎరువులు, సాల్లు తీయడం, ఎరువులు పంట చివరన దున్ని గడ్డలను తొలగించడం వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియకు ఎకరా విస్తీర్ణంలో దాదాపు రూ.లక్ష వరకు రైతులు వ్యయం చేశారు. పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. దీంతో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు తోటల వద్దకు చేరుకుని పంట కొనుగోళ్లు చేపట్టారు. 40 కిలోల ఆలుగడ్డల బస్తా రూ.1,400తో అమ్ముడు పోతోంది. ఎకరా విస్తీర్ణంలో 150 బస్తాల వరకూ దిగుబడి వచ్చింది. ప్రస్తుత ధరను పోల్చుకుంటే 150 బస్తాలకు రూ.2.10 లక్షలు చేతికి అందుతున్నాయని, పెట్టుబడులు పోను రూ.1.10 లక్షలు మిగులు ఆదాయం ఉంటోందని పెడపల్లి రైతులు జనార్దనరెడ్డి, రోషన్, శివప్ప, సుబ్బరాయనిపల్లి చండ్రాయుడు తెలిపారు. చదవండి: వీర్లకొండ ఎక్కేద్దాం రండి! -
సిరులు పండిస్తున్న కొర్రమీను.. ఇలా చేస్తే లాభాలే లాభాలు
తాడేపల్లిగూడెం రూరల్(పశ్చిమ గోదావరి): మత్స్య ఉత్పత్తులకు పెట్టింది పేరు పశ్చిమగోదావరి జిల్లా. దేశ, అంతర్జాతీయంగా ఇక్కడి ఉత్పత్తులకు మంచి పేరు ఉంది. మత్స్య ఉత్పత్తుల్లో పండుగప్పది ప్రత్యేక స్థానం. ఇది సముద్రంలో పెరిగే చేప అయినప్పటికీ ఇక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో చెరువుల్లో సైతం సాగు చేస్తున్నారు. తరువాత స్థానం కొర్రమీనుదే. ఔషధ గుణాలతో పాటు రుచిగా ఉండటంతో మాంసప్రియులు దీనిని తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు ఈ చేప సీడ్ విక్రయం లాభసాటిగా మారడంతో కొందరు రైతులు తమ ఇళ్లల్లోనే సాగు చేసి లాభాలను చవిచూస్తుండటం విశేషం. చదవండి: జియో ట్రూ 5జీ : అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో సేవలు కొర్రమీను సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెరువుల్లోనూ సైతం సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడంతో సీడ్ దశలోనే మంచి గిరాకీ ఉందని సీడ్ సాగుదారులు పేర్కొంటున్నారు. సీడ్‌ను సైతం ప్రకృతి సిద్ధంగా మురుగు కుంటల్లో పెరిగిన కొర్రమీను నుంచి సేకరిస్తున్నారు. ఈ సీడ్‌ను ఇంటి పెరట్లోనే పెంచి చెరువుల రైతులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఇలా ఒక్క తాడేపల్లిగూడెం మండలంలోనే జగన్నాథపురం, నవాబ్‌పాలెం, కృష్ణాయపాలెం, దండగర్ర గ్రామాల్లో దాదాపు 15 నుంచి 20 మంది రైతులు కొర్రమీను సాగు చేపట్టడం విశేషం. జగన్నాథపురం గ్రామానికి చెందిన మారెడ్డి శ్రీనివాస్ తన కుమార్తెను భీమవరం కళాశాలకు తీసుకెళ్లే క్రమంలో కొర్ర మీను సాగుపై తన బంధువుల ద్వారా తెలుసుకున్నాడు. తాను కూడా ఒక ప్రయత్నం చేయాలనే సంకల్పంతో దాదాపు ఐదు వేల కొర్రమీను పిల్లను రూ.3 వేలకు కొనుగోలు చేశారు. దాదాపు మూడు నెలల వ్యవధిలోనే అంగుళం సైజు పిల్ల రూ.17 చొప్పున మొత్తం రూ.85 వేలకు సీడ్‌ను కైకలూరుకు చెందిన చేపల సాగుదారుడు కొనుగోలు చేశారు. సీడ్‌కు రూ.3 వేలు, మూడు నెలలు చేప పెంపకానికి ఐదు నుంచి పది వేల రూపాయలు వరకు ఖర్చయిందని అంచనా. పెట్టుబడి రూ.13 వేలు పోను రూ.72 వేల వరకు లాభం కనబడుతుంది. దీంతో మరింత ఉత్సాహంగా రైతు మారెడ్డి శ్రీనివాస్ కొర్రమీను పెంపకాన్ని చేపట్టారు. తాను సాగు చేయడంతో పాటు పరిసర గ్రామాల రైతులను సైతం ప్రోత్సహిస్తున్నారు. ఇంట్లోనే 1.50 లక్షల సీడ్ పెంపకం జగన్నాథపురం గ్రామంలోని తన ఇంటిలోనే మారెడ్డి శ్రీనివాస్ దాదాపు 1.50 లక్షల సీడ్‌ను పెంచుతున్నారు. సీడ్ పెంపకానికి మొదట్లో అందుబాటులో ఉన్న ట్యాంకులను వినియోగించినప్పటికీ సీడ్ పెరగడంతో వైజాగ్ నుంచి తీసుకువచ్చిన ట్యాంకుల్లో పెంచుతున్నారు. ఒక్కో ట్యాంకు ఖరీదు రూ.4,500 కాగా, పైప్‌లైన్, ఇతరత్రా పనులకు మరో రూ.500 వెరసి రూ.5 వేల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం తన ఇంటి వద్ద ఆరు ట్యాంకుల్లో సైజుల వారీగా పెంచుతున్నారు. ఒక్కో ట్యాంకులో ఐదు వేల వరకు పిల్లను పెంచాల్సి ఉండగా, 25 వేల సామర్థ్యంతో పిల్లను పెంచుతుండటం గమనార్హం. పిల్ల పరిమాణం ఆధారంగా మేత మైక్రో సీడ్ నుంచి మూడు అంగుళాల వరకు ఒక్కో దశకు ఒక్కో రకమైన మేతను అందిస్తారు. మైక్రో సీడ్‌కు తొలి వారం రోజులు ఎటువంటి ఆహారాన్ని అందించరు. తదుపరి తవుడు మాదిరి పౌడర్‌ను అందిస్తారు. 0.3, 0.6 సైజులు కలిగిన మిల్లెట్స్‌ను ఆహారంగా అందిస్తారు. ఈ ఆహారం కూడా పోషక విలువలు కలిగిన సోయాబీన్, తవుడు, వేరుశెనగ చెక్కతో తయారు చేసిన వాటినే వినియోగిస్తారు. పది కిలోల బస్తా రూ.1400 నుంచి రూ.2వేల వరకు పిల్ల సైజును బట్టి దాణాను కొనుగోలు చేస్తారు. రెండు నెలలకు సీడ్‌ను విక్రయించే నాటికి పది వేల పిల్లకు రూ.12 వేలు ఖర్చవుతుంది. ఈ పది వేల పిల్లను విక్రయిస్తే రూ.60 వేలు వస్తుంది. ఖర్చులు తీసివేస్తే రూ.48 వేల వరకు మిగులుతుంది. అన్ని పరిస్థితుల్లోనూ ఆరోగ్యంగా.. సాధారణంగా ఆక్వా సాగులో రైతులను వాతావరణ పరిస్థితులు వెంటాడుతుంటాయి. అయితే కొర్రమీను సాగు చేసే రైతులకు ఇటువంటి సమస్యలు ఉండవు. ఇవి ఆక్సిజన్, ఏ నీటినైనా తట్టుకుని జీవించగలవని రైతు మారెడ్డి శ్రీనివాస్ చెబుతున్నారు. బోరు, చెరువు, మంచినీటిలోనూ ఇవి ఆరోగ్యకరంగా పెరుగుతున్నట్టు చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సీడ్ ఎగుమతి ఇక్కడ నుంచి అత్యధికంగా కర్ణాటక ఆక్వా సాగుదారులు రెండున్నర నుంచి మూడు అంగుళాల సైజు సీడ్‌ను కొనుగోలు చేస్తున్నారు. రెండున్నర అంగుళాల పిల్లను రూ.3కు, మూడున్నర అంగుళాల పిల్లను రూ.4 నుంచి రూ.6 వరకు విక్రయిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆక్వా సాగుదారులకు సబ్సిడీలను ఇస్తుండటంతో కొర్రమీను సాగు చేపట్టేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. వీరితో పాటు కైకలూరు, ఆకివీడు, ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడుకు సైతం ఎగుమతి చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మధురై, బెంగళూరులోనూ కొర్రమీను వినియోగం అధికం. దీంతో ఆయా ప్రాంతాలకు ఎక్కువగా సీడ్ ఎగుమతి జరుగుతుంది. ఇంట్లోనే సులభంగా పెంపకం కొర్రమీను పిల్లను ఇంట్లోనే ట్యాంకుల్లో పెంచుకునే వెసులుబాటు ఉంది. కూలీలు అవసరం లేదు. కుటుంబ సభ్యులే సమయానుగుణంగా ఆహారం, నీటిని మారిస్తే చాలు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకోగలదు. మంచి ఆదాయం కూడా వస్తుంది. వీటి పెంపకంపై శిక్షణ ఇచ్చి యువతను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. – మారెడ్డి శ్రీనివాస్, కొర్రమీను పెంపకందారుడు, జగన్నాథపురం, తాడేపల్లిగూడెం మండలం స్వయం ఉపాధికి అవకాశం నిరుద్యోగ యువతకు కొర్రమీను పెంపకం స్వయం ఉపాధి రంగంగా నిలుస్తుంది. దీనిపై అవగాహన కోసం సాగుదారుల వద్దకే నేరుగా తీసుకెళ్లి శిక్షణ ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. యువత కొర్రమీను సీడ్ పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవాలి. – డాక్టర్ దేవీవరప్రసాద్‌రెడ్డి, మత్స్య విభాగం శాస్త్రవేత్త, కేవీకే, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం, తాడేపల్లిగూడెం మండలం -
కంద సాగుతో డబ్బులే డబ్బులు.. ఎకరానికి లక్ష లాభం..
పెరవలి(పశ్చిమగోదావరి): గత ఐదేళ్లుగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన కంద రైతులు ఇప్పుడు లాభాల బాట పడుతున్నారు. మార్కెట్లో కందకు గిట్టుబాటు ధర లభిస్తోంది. దానికి తోడు ఈ ఏడాది దిగుబడి కూడా మెరుగ్గా ఉండడంతో కంద రైతుల ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం మార్కెట్లో పుట్టు కంద ధర రూ.4000 పలుకుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎకరానికి 70 నుంచి 80 పుట్టుల వరకూ కంద ఊరుతోంది. 232 కిలోలను పుట్టుగా వ్యవహరిస్తారు. ఎకరం కంద చేను తవ్వితే 70 నుంచి 80 పుట్టులు దిగుబడి వస్తోంది. దీంతో రైతులకు ఎకరానికి రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకూ మిగులుతోంది. జిల్లాలో కందసాగు విస్తీర్ణం జిల్లాలో కంద పంటను పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, పోలవరం, కడియం, మండలాల్లో సుమారు 1,250 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. కంద ధరలు ఊహించని విధంగా ఈ ఏడాది పట్టు రూ.3,400 నుంచి ప్రారంభమై ప్రస్తుతం రూ.4,000 వద్ద స్థిరంగా ఉంది. గతంలో ఇదే ధర ఉన్నప్పటికీ ఆశించనం తగా ఊరికలు లేక రైతులు నష్టాల చవి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రైతులు లాభాల బాట పడుతున్నారు. ఊరుతున్న లాభాలు కంద సాగు చేసినపుడు రైతులు పుట్టు విత్తనాన్ని రూ.3000 నుంచి రూ. 3400 రేటుకు కొనుగోలు చేశారు. ఇప్పుడు మార్కెట్లో పుట్టు ధర రూ.4000 ఉండడానికి తోడు ఊరికలు బాగా రావడం రైతులకు కలసి వస్తోంది. ప్రస్తుత మార్కెట్లో లభిస్తున్న ధర ప్రకారం 80 పుట్టులకు రూ.3.20 లక్షలు, 70 పుట్టుల ఊరిక ఉంటే రూ.2.80 లక్షల ఆదాయం వస్తోంది. ఎకరానికి ఖర్చు రూ.2.10 లక్షలు అయ్యిందని రైతులు చెబుతున్నారు పెట్టుబడి రూ. లక్షల్లో.. కంద సాగు చేసే రైతులు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఎకరం విస్తీర్ణంలో కంద వేయాలంటే విత్తనానికి రూ.1.02 లక్షలు, దుక్కి దున్నడానికి, కంద నాటడానికి, బోదెలు తవ్వడానికి, చచ్చు ఎక్క వేయడానికి కూలీలకు రూ.50 వేలు అవుతుంది. అలాగే పెంట వేయడానికి రూ.18 వేలు, ఎరువులు, పురుగు మందులకు రూ, 25 వేలు, నీటి తడులు, కలుపుతీతకు రూ.15 వేలు ఖర్చవుతుంది. మొత్తం ఖర్చు రూ.2.10 లక్షలు అవుతుండగా నేడు ఊరికల ఆధారంగా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రైతులకు ఎకరానికి రూ.70 వేల నుంచి రూ. లక్ష మిగులు కనిపిస్తోందని రైతులు చెబుతున్నారు. రేటు స్థిరంగా ఉంది ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం సంతోషదాయకం. ఎకరానికి పెట్టుబడి పోను రూ.70 వేల మిగులు వచ్చింది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడం, ప్రభుత్వం తీసుకున్న చర్యలు వలన రేటు స్థిరంగా ఉంది. –కోటిపల్లి పెద్దకాపు, కంద రైతు, అన్నవరప్పాడు అన్నీ అనుకూలించాయి ఐదేళ్ల తరువాత కంద రైతులు లాభాలు బాట పట్టారు. గతంలో ధర ఉంటే ఊరికలు లేవు, ఊరికలు ఉంటే ధర ఉండేది కాదు. కానీ నేడు ధరలు బాగున్నాయి. దిగుబడి బాగుంది. –బొలిశెట్టి వెంకటేశ్వరావు, కంద రైతు, అన్నవరప్పాడు నగరాల్లో డిమాండ్ ఉభయ గోదావరి జిలాల్లో పండించిన కందకు మద్రాస్, ముంబై వంటి మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది.అందుకే రేటు బాగుంది. అంతే కాకుండా అన్ని జిల్లాల్లో కంద ఊరికలు గతంలో కంటే బాగా ఎక్కువగా వస్తున్నాయి. – గడుగొయ్యిల సత్యనారాయణ, కంద వ్యాపారి -
పన్ను ఆదా.. దీర్ఘకాలంలో మంచి రాబడులు
పన్ను ఆదా కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల్లోనూ ఇన్వెస్ట్ చేసే వారున్నారు. సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ మేరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ విభాగంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పరిశీలించాల్సిన పథకాల్లో టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ కూడా ఒకటి. రాబడులు..: టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ పథకం స్వల్ప కాలంలో మోస్తరు పనితీరే చూపించగా, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో మాత్రం బెంచ్ మార్క్‌తో పోలిస్తే మెరుగైన రాబడులను ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టింది. గత ఏడాది కాలంలో ఈ పథకం 14.49 శాతం రాబడులు ఇచ్చింది. మూడేళ్ల కాలంలో 14 శాతం వార్షిక రిటర్నులు ఇచ్చింది. ఐదేళ్లలో 12.13 శాతం, పదేళ్లలో 13.28 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. కాకపోతే ఏడాది, మూడేళ్ల కాలంలో మాత్రం బెంచ్ మార్క్ ఎస్అండ్పీ బీఎస్ఈ సెన్సెక్స్ టీఆర్ఐతో పోలిస్తే ఒక శాతం నుంచి రెండు శాతం వరకు తక్కువ రాబడులు ఉన్నాయి. కానీ, ఈఎల్ఎస్ఎస్ విభాగం సగటు రాబడులతో పోల్చి చూసినప్పుడు 2–5 శాతం వరకు అధిక రాబడులు టాటా ఇండియా ట్యాక్స్సేవింగ్స్లోనే ఉన్నాయి. ఈ పథకానికి 20 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ, 2014 చివరి వరకు ఈ పథకంలో గ్రోత్ ఆప్షన్ లేదు. రాబడుల చరిత్రను పరిశీలించే వారు ఈ అంశాలను గుర్తు పెట్టుకోవాలి. పెట్టుబడుల వ్యూహాలు మార్కెట్ అస్థిరతల నేపథ్యంలో దీర్ఘకాలం కోసం ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఒకింత సురక్షితమనే చెప్పాలి. ఎందుకంటే మూడేళ్ల పాటు ఇందులో చేసే పెట్టుబడులపై లాకిన్ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ చేసిన మూడేళ్ల తర్వాతే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తారు. దీంతో ఈఎల్ఎస్ఎస్ పథకాలకు రిడెంప్షన్ (పెట్టుబడులను ఉపసంహరించుకోవడం) ఒత్తిళ్లు తక్కువగా ఉంటాయి. దీంతో ఫండ్ మేనేజర్లు ఇన్వెస్ట్మెంట్ విషయంలో దీర్ఘకాల దృష్టితో నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలిగి ఉంటారు. ఇది దీర్ఘకాలంలో రాబడులకూ తోడ్పడుతుంది. ఈ పథకం మల్టీక్యాప్ విధానాన్ని పెట్టుబడులకు అనుసరిస్తుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను వివిధ మార్కెట్ విలువ కలిగిన (లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్) స్టాక్స్ మధ్య మార్పులు, చేర్పులు కూడా చేస్తుంది. ఉదాహరణకు 2017లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగంలో ఈ పథకం తన మొత్తం పెట్టుబడుల్లో 40 శాతాన్ని కేటాయించింది. కానీ, చిన్న, మధ్య స్థాయి షేర్లలో అస్థిరతల నేపథ్యంలో 2018 చివరికి మిడ్, స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులను 25 శాతానికి తగ్గించుకుంది. ఈ విధమైన వ్యూహాలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు తోడ్పడుతున్నాయి. పథకం పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతానికి 35 స్టాక్స్ ఉండగా, టాప్ 10 స్టాక్స్‌లోనే 58.41 శాతం మేర పెట్టుబడులను కలిగి ఉంది. బ్యాంకింగ్ ఫైనాన్షియల్, ఇంధనం, టెక్నాలజీ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లోనే 44.5 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. -
కానరీ మిలన్
తక్కువ రోజుల్లో ఎక్కువ లాభాలనిచ్చే కొత్త పంట కానరీ మిలన్ పండ్లను సాగు చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మిర్దాపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు కల్లెం నర్సింహారెడ్డి. పసుపురంగులో దోసకాయ మాదిరిగా ఉంటుంది. కానీ ఇది కూరగాయ కాదు. తర్బూజ మాదిరిగా తియ్యగా ఉండే పండు ఇది. నాలుగైదు నెలల్లో కోతకు వచ్చే వరి, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేసి సరైన ధర లేక కష్టనష్టాలను ఎదుర్కోవడం కంటే కానరీ మిలన్‌ను సాగు చేయడం మేలని నర్సింహారెడ్డి భావిస్తున్నారు. పంటను ప్యాకింగ్ చేస్తున్న కూలీలు మంచి పోషక విలువలు కలిగి ఉండటంతో కానరీ మిలన్‌ను ఢిల్లీతో పాటు, అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో దీనికి డిమాండ్ ఉంది. శీతలగిడ్డంగిలో పెడితే నెల రోజులైనా నిల్వ ఉంటుంది. అరబ్ దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నట్లు చెబుతున్నారు. అనంతపురం ప్రాంత రైతులు కొంత కాలం క్రితం నుంచే కానరీ మిలన్‌ను సాగు చేసి ఢిల్లీ మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. నిజామాబాద్ ప్రాంతంలో తొలుత నర్సింహారెడ్డి ఆరెకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఆయన సమీప బందువులు కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు. విత్తనం ధర అధికం తైవాన్ నుంచి తెప్పించే హైబ్రిడ్ విత్తనాన్ని వాడాల్సి రావడం వల్ల ధర ఎక్కువగా ఉంటున్నది. ప్రతి పంటకూ విత్తనం కొని వేయాల్సిందే. కానరీ మిలన్లో రెండు రకాలున్నాయి. వేసవి సీజన్లో అధిక దిగుబడినిచ్చే రకం కొయినూర్ రకం. ఇది చలిని తట్టుకోలేదు. చలికాలంలో వేరే రకం వెయ్యాలి. మరో పది రోజుల్లో ఆ రకం విత్తబోతున్నాను అన్నారు నర్సింహారెడ్డి. రవాణా ఖర్చు కిలోకు రూ. 20 ఎకరానికి 10–15 టన్నుల కానరీ మిలన్ పండ్ల దిగుబడి వస్తుంది. ఢిల్లీ తీసుకెళ్లి టోకున అమ్మితే కిలోకు రూ. 50 నుంచి 60 రూపాయల ధర పలుకుతుంది. పాదికి రెండు లేక మూడు పిందెలను మాత్రమే ఉంచుతారు. పండు కిలోన్నర రెండు కిలోల బరువు వరకు పెరుగుతుంది. కిలోకన్నా ఎక్కువ బరువున్న పండే రుచిగా ఉంటుంది. ధర కూడా పలుకుతుంది. అట్ట పెట్టెకు ఆరు నుంచి ఏడు కాయలను ప్యాక్ చేసి లారీల్లో ఢిల్లీ మార్కెట్‌కు రవాణా చేస్తున్నారు. రవాణాకు సిద్ధ్దమైన కానరీ మిలన్, రైతు నర్సింహారెడ్డి అయితే, లారీల్లో సరుకు ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి కిలోకు రూ. 20 వరకు ఖర్చవుతుంది. హైదరాబాద్‌లో దీనికి కిలోకు రూ. 30 ధర వచ్చినా మంచిదే. అయితే, మన వాళ్లకు ఈ పండు తెలియదు. గత ఏడాది శివరాత్రికి పది టన్నులు పంపి హైదరాబాద్‌లో అమ్మాం. స్థానికంగా మార్కెట్ పెరిగితే బాగుంటుందని నర్సింహారెడ్డి అన్నారు. దుక్కికి రూ.10 వేలు, పశువుల ఎరువుకు రూ.పది వేలు, మల్చింగ్, ఎరువులకు మరో రూ.20 వేలు, ఇతర ఖర్చులు మరో 15 వేల వరకు ఉంటాయి. రవాణా ఖర్చులు, మధ్యవర్తుల కమిషన్లు పోగా ఎకరానికి రూ. లక్ష వరకు నికరాదాయం ఆర్జిస్తున్నారు నర్సింహారెడ్డి. రోజూ పొలం అంతా కలియదిరగాలి సున్నితమైన హైబ్రిడ్ పంట కావడంతో పంటను ప్రతిపూటా రైతు స్వయంగా తడిమి చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. కూలీలపై వదిలేస్తే ఏమాత్రం కుదరదు. రోజూ ఏదో ఒక పూట పొలం అంతా కలియదిరగాల్సిందే. చీడపీడలేమైనా సోకాయేమో స్వయంగా చూసుకోవాలి. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోకపోతే నష్టాలు పాలు కావాల్సి వస్తుందని నర్సింహారెడ్డి(97052 02562) చెబుతున్నారు. – పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ 65 రోజుల్లో పంట చేతికి.. ఇది మెట్ట ప్రాంతపు పంట. నీరు ఎక్కువగా ఉండకూడదు. వర్షాకాలం దీని సాగుకు అనువైన కాలం కాదు. ఈ ఏడాది వర్షాలు నెల రోజులు ఎక్కువగా పడటం వల్ల తమ పంట దెబ్బతిన్నదని నర్సింహారెడ్డి తెలిపారు. వర్షం వల్ల కాయ తీపి కూడా తగ్గిందన్నారు. ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో కనీసం నాలుగు ఎకరాల్లో ఈ పంటను పండించవచ్చని ఆయన చెబుతున్నారు. విత్తనం వేసిన తర్వాత 60 నుంచి 65 రోజుల్లో పంట చేతికందుతుంది. స్వల్పకాలిక పంట కావడంతో ఏడాదిలో రెండు నుంచి మూడు పంటలు పండించవచ్చని నర్సింహాæరెడ్డి తెలిపారు. ఎకరంలో ఎత్తు మడుల(బెడ్స్‌పై)పై మల్చింగ్ షీట్ పరచి సాగు చేయడానికి మొదట సుమారు రూ. 75 వేల వరకు ఖర్చవుతుందని, రెండు, మూడో పంటలకు ఖర్చు తగ్గుతుందన్నారు. -
బుల్‌చల్!
కార్పొరేట్ ట్యాక్స్ కోత లాభాలు వరుసగా రెండో రోజూ, సోమవారం కూడా కొనసాగాయి. పన్ను కోత కారణంగా బాగా ప్రయోజనం పొందే ఆర్థిక, బ్యాంక్, ఎఫ్ఎమ్సీజీ షేర్లు లాభపడటంతో సెన్సెక్స్, నిఫ్టీలు మరోసారి భారీ లాభాలను సాధించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 39,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,600 పాయింట్లపైకి ఎగబాకాయి. జీఎస్టీ మండలి సానుకూల నిర్ణయాలు కలసివచ్చాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్‌గా ఉన్నా, అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్న ఈ వారంలో స్టాక్ సూచీలు బలంగా ట్రేడవడం విశేషం. ఇంట్రాడేలో 1,426 పాయింట్లు పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 1,075 పాయింట్లు లాభపడి 39,090 పాయింట్లు వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 326 పాయింట్లు పెరిగి 11,600 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 2.8 శాతం చొప్పున ఎగిశాయి. ఇక గత రెండు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 2,996 పాయింట్లు(8.3 శాతం), నిఫ్టీ 895 పాయింట్లు(8.36 శాతం) చొప్పున లాభపడ్డాయి. రెండు రోజుల్లో ఈ రెండు సూచీలు ఇంత భారీగా లాభపడటం ఇప్పటిదాకా ఇదే మొదటిసారి. సాంకేతిక అవరోధాలు కారణంగా ముగింపులో చివరి పదినిమిషాల పాటు ఎన్ఎస్ఈ ట్రేడింగ్‌లో అంతరాయం ఏర్పడింది. ఐటీ, టెక్నాలజీ, టెలికం, యుటిలిటీస్, పవర్ సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ 569 పాయింట్ల మేర పెరిగాయి. పన్ను కోత.. లాభాల మోత... కార్పొరేట్ ట్యాక్స్‌ను (సెస్‌లు, సర్‌చార్జీలు కలుపుకొని) కేంద్రం 34.9 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. అలాగే కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గింది. అన్ని వర్గాల ఇన్వెస్టర్లకు వర్తించే మూలధన లాభాల పన్నుపై అదనపు సర్‌చార్జీని కూడా కేంద్రం తొలగించింది. అలాగే షేర్ల బైబ్యాక్‌పై పన్నును కూడా కేంద్రం రద్దు చేసింది. ఇక 37వ జీఎస్టీ మండలిలో వ్యాపార వర్గాలకు ఊరటనిచ్చే పలు నిర్ణయాలను కంపెనీ తీసుకుంది. ఈ సానుకూల నిర్ణయాల వరదలో స్టాక్ మార్కెట్ లాభాల సునామీలో తడిసి ముద్దవుతోంది. కార్పొరేట్ ట్యాక్స్ కోత కారణంగా కంపెనీల లాభాలు బాగా పెరుగుతాయని సెంట్రమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ దేవాంగ్ మెహతా చెప్పారు. ఈ లాభాల నేపథ్యంలో కంపెనీలు ధరలను తగ్గించి డిమాండ్ పెంచేలా చేసి అమ్మకాలను పెంచుకుంటాయని పేర్కొన్నారు. లేదా వాటాదారులకు డివిడెండ్లు పంచడమో, మూలధన పెట్టుబడులను పెంచుకోవడమో చేస్తాయని, ఎలా చూసినా రేట్ల కోత కంపెనీలకు సానుకూలమేనని వివరించారు. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీల లాభాలు పెరిగే అవకాశాలుండటంతో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఇక ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మరిన్ని విశేషాలు... ► నిఫ్టీ 50లోని 32 షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ► హోటల్ రూమ్ టారిఫ్‌లపై జీఎస్టీని తగ్గించడంతో హోటల్ షేర్లు దుమ్ము రేపాయి. తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ 20 శాతం, రాయల్ ఆర్చిడ్ హోటల్స్ 16 శాతం, ఇండియన్ హోటల్స్ కంపెనీ 8 శాతం, ఐటీసీ 7 శాతం, హోటల్ లీలా వెంచర్ 3.5 శాతం చొప్పున పెరిగాయి. ఒక్క రాత్రి బసకు రూ.7,500 ధర ఉండే హోటల్ రూమ్స్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి జీఎస్టీ కౌన్సిల్ తగ్గించింది. రూ.7,500కు మించిన టారిఫ్‌లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ► జీ ఎంటర్టైన్మెంట్ షేర్ వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ నష్టపోయింది. సోమవారం ఈ షేర్ 10 శాతం నష్టంతో రూ.272 వద్ద ముగిసింది. ప్రమోటర్ తనఖా పెట్టిన షేర్లను ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ విక్రయించిందన్న వార్తలతో ఈ షేర్ ఈ స్థాయిలో పడిపోయింది. ► ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం వచ్చే మార్చికల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలతో బీపీసీఎల్ షేర్ 13% లాభంతో రూ.454 వద్ద, కంటైనర్ కార్ప్ షేర్ 6.4% లాభంతో రూ.585 వద్ద ముగిసింది. ► క్యూఐపీ మార్గంలో రూ.12,500 కోట్లు సమీకరించిన నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 6.8 శాతం లాభంతో రూ.727 వద్ద ముగిసింది. ► మార్కెట్ లాభాల ధమాకాలోనూ, 200కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. కాఫీ డే, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, ప్రొవొగ్, యాడ్‌ల్యాబ్స్.. ఈ జాబితాలో ఉన్నాయి. టార్గెట్లు పెరిగాయ్... కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, ఇతర చర్యల కారణంగా కంపెనీల లాభాలు జోరందుకుంటాయని విశ్లేషకులంటున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం సెన్సెక్స్, నిఫ్టీ టార్గెట్లను వివిధ బ్రోకరేజ్ సంస్థలు పెంచాయి. వచ్చే ఏడాది జూన్‌కల్లా సెన్సెక్స్45,000 పాయింట్లకు చేరుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి నిప్టీ 12,300–13,300 రేంజ్‌కు చేరగలదని యూబీఎస్, 13,200 పాయింట్లకు ఎగుస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొన్నాయి. ఆల్‌టైమ్ హైకి బాటా... స్టాక్ మార్కెట్ జోరు కారణంగా పలు షేర్లు వాటి వాటి జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బాటా ఇండియా, డీ–మార్ట్(అవెన్యూ సూపర్ మార్ట్స్), హిందుస్తాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, ఓల్టాస్, కాల్గేట్ పామోలివ్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
కశ్మీరీలకు భారీ ప్రయోజనాలు
న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయడం, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడం వల్ల ఆ రాష్ట్ర ప్రజలు అత్యంత భారీ ప్రయోజనాలను పొందుతారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం 73వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు. మిగతా దేశ పౌరులంతా ఏయే హక్కులు, ప్రయోజనాలు, సౌకర్యాలను పొందుతున్నారో.. ఆ లాభాలను ఇకపై జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రజలు కూడా పొందగలరని కోవింద్ అన్నారు. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ ఇటీవలే పార్లమెంటు ఆమోదం పొందిన చట్టం తదితరాలు జమ్మూ కశ్మీర్‌లోని ఆడబిడ్డలకు కూడా న్యాయం అందిస్తాయని కోవింద్ తెలిపారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో ఉన్న 370వ అధికరణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పది రోజుల క్రితమే తొలగించి, జమ్మూ కశ్మీర్‌ను అసెంబ్లీ సహిత కేంద్రపాలిత ప్రాంతంగాను, లదాఖ్‌ను ఆ రాష్ట్రం నుంచి విడదీసి అసెంబ్లీ రహిత కేంద్రపాలిత ప్రాంతంగాను మార్చాలని ప్రతిపాదించడం తెలిసిందే. దేశ తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31 నుంచి ఈ కొత్త కేంద్రపాలిత ప్రాంతాలు ఉనికిలోకి వస్తాయి. స్వాతంత్య్రమంటే అధికార మార్పిడి కాదు.. స్వాతంత్య్రం కోసం పోరాడిన పాత తరాన్ని కోవింద్ గుర్తు చేసుకుంటూ ‘స్వాతంత్య్రమంటే కేవలం అధికార మార్పిడేనని పెద్దలు అనుకోలేదు. జాతి నిర్మాణమనే సుదీర్ఘ, విస్తృత ప్రక్రియలో అదో మెట్టు మాత్రమేనని ఆ మహోన్నత వ్యక్తులు భావించారు. ప్రతీ వ్యక్తి, ప్రతీ కుటుంబం.. అలా మొత్తంగా సమాజ జీవితం బాగుండాలనేది వారి ఆశయం’ అని అన్నారు. ఒకరి జీవన విధానాన్ని లేదా పద్ధతులను చాలా తక్కువ సందర్భాల్లోనే భారత్ వేలెత్తి చూపిందనీ, ఇక్కడ అంతా అన్నింటినీ తేలిగ్గా తీసుకుంటూ, ‘మనం బతుకుదాం, ఇతరులను బతకనిద్దాం’ అనే సూత్రాన్ని అనుసరిస్తారన్నారు. అత్యంత దుర్బలమైన వ్యక్తుల గొంతుకను వినగలిగే సామర్థ్యాన్ని భారత్ ఎన్నటికీ కోల్పోదని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న ప్రజలను కోవింద్ అభినందిస్తూ, ప్రతీ ఎన్నిక ఓ కొత్త ప్రారంభాన్ని తెస్తుందని, భారత ప్రజల ఉమ్మడి ఆశలకు ఊపిరి పోస్తుందని అన్నారు. -
సేంద్రియ మారాణి!
వాంకుడోతు మారోణి.. తెలంగాణ రాష్ట్రంలో ఓ మారుమూల గిరిజన తండా ఆమె ఊరు. చదువు లేదు. అయినా, గుండెల నిండా చైతన్యం నింపుకున్న రైతు. సేంద్రియ వ్యవసాయం చేస్తుంది. మెరుగైన వ్యవసాయ పద్ధతులు నేర్చుకుంటూ పాటిస్తుంది. తాను, తన కుటుంబం పచ్చగా ఉండటంతోపాటు.. తోటి రైతులు కూడా చల్లగుండాలనుకుంటుంది. అందుకోసం తమ తండాలో రైతు సంఘాన్ని ఏర్పాటు చేసింది. శక్తి మేరకు కష్టపడటంతో పాటు దేవుడి దయ కూడా కావాలనుకొంటుంది. అందుకే వాళ్ల రైతు సంఘానికి బాలాజీ పేరు పెట్టుకుంది. రోజుకు ముప్పూటా ఇంటిల్లిపాదీ తినే పచ్చజొన్న, కొర్ర, శ్రీవరితోపాటు ఒకటికి నాలుగు తిండి పంటలతో పాటు కొంత మేరకు పత్తి వేస్తుంటుంది. పోయిన సీజన్లో ఎకరం పత్తి పెట్టి.. నానా బాధలు పడి ఖర్చులు రాబట్టుకుంది. కానీ, తన కష్టం వృథా పోయిందని, రూ. 20 వేల వరకు నష్టం వచ్చిందని అంటుంది. అందుకే, ఈసారి మాత్రం పత్తి పెట్టనని తెగేసి చెబుతోంది.. చిన్నపాటి మహిళా రైతు మరోణి! వాంకుడోతు మారోణిది దయ్యబండ అనే తండా. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ఉంది ఆ తండా. చిన్న రైతు కుటుంబం ఆమెది. భర్త పేరు చిన్న రాములు. ఇద్దరు కుమారులు. ఓ కూతురు. ముగ్గురికీ పెళ్లిళ్లు అయిపోయాయి. పెద్ద కొడుకు, కోడులు వేరు కాపురం ఉంటున్నారు. చిన్న కొడుకు, కోడలితో పాటు కలిసి ఉంటూ మారోణి ఒడుపుగా వ్యవసాయం చేస్తున్నది. మొదట్లో ఎడ్లబండిపై భర్తతో కలిసి ఊరూరూ తిరిగి చెరకు నరకడం, కొన్నాళ్లు ఊళ్లకు వెళ్లి సీతాఫలాలు, ఉప్పు అమ్మటం అలవాటుగా ఉండేది. భర్తకు కంటి చూపు మందగించటంతో గత కొద్ది ఏళ్లుగా తండాలోనే స్థిరంగా ఉంటూ.. వ్యవసాయం చేస్తున్నారు. దయ్యబండ తండా మహిళా గిరిజన రైతులు పిలుపు స్వచ్ఛంద సంస్థ సహకారంతో సేంద్రియ, శ్రీవరి సాగు పద్ధతులను అలవరచుకొని ముందడుగు వేస్తున్నారు. పచ్చజొన్న రొట్టె.. గటక.. మారోణి కుటుంబానికి సొంతం రెండెకరాల కుష్కి(మెట్ట), ఒక ఎకరం తరి(మాగాణి) పొలం ఉంది. మరో 3 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. మారోణి ఈ సంవత్సరం పది క్వింటాళ్ల మొక్కజొన్నలు, క్వింటన్నర కందులు, 4 క్వింటాళ్ల పచ్చజొన్నలు పండించింది. ఎన్ని పండినా పచ్చజొన్నలు మాత్రం అమ్మరు. ఇంట్లో పిల్లా పెద్దా అందరూ మూడు పూటలా జొన్న రొట్టె తింటారు. గటక తాగుతారు. ఆరోగ్యంగా ఉంటారు. పొలం పనులు చాలా వరకు సొంతంగానే చేసుకుంటారు. 3 ఎకరాలను కౌలుకు తీసుకున్నారు. ఎకరానికి ఏటా రూ. 10 వేలు కౌలు. బోరులో నీరు తక్కువ ఉండటంతో ఎకరంన్నరలో శ్రీవరి సాగు చేసింది. పంట చేతికి రాబోతుండగా రాళ్లవాన, గాలిదుమారం వచ్చి.. 40 బస్తాల ధాన్యం రాలటంతో.. 30 బస్తాల ధాన్యమే చేతికొచ్చింది. ‘ఎకరంలో పత్తి పెడితే.. పెట్టుబడి తిరిగి రావడమే కష్టమైంది. తమ కష్టం వృథా అయ్యింది. ఆ మేరకు రూ. 20 వేలు నష్టం వచ్చింది. ఈసారి మొక్కజొన్న, కందులు, కొర్రలు, సజ్జలు, శ్రీవరి పెడతా. పత్తి పెట్టేది లేద’ని మారోణి తేల్చి చెప్పారు. రైతు సంఘాలు.. విత్తన బ్యాంకు.. తండాలో రైతులు 20 మంది చొప్పున రెండు సంఘాలు పెట్టుకున్నారు. బాలాజీ రైతు సంఘం పెట్టుకొని నాలుగేళ్లు అయింది. వీటిల్లో సభ్యులు చాలా వరకు గిరిజన మహిళా రైతులే. మొదట్లో నెలకు తలకు రూ.50 మదుపు చేసేవారు. ఇప్పుడు రూ. 100 జమ చేస్తున్నారు. తొలకరికి రైతుకు రూ. 10 – 20 వేల వరకు అప్పు ఇస్తున్నారు. వందకు నెలకు రూ.1 వడ్డీ. నెలకు రూ.వెయ్యి/రెండు వేలు తిరిగి కట్టేస్తున్నారు. తోటి మహిళా రైతులతో సంఘం సమావేశం నిర్వహిస్తున్న మారోణి కాలం సరిగ్గా లేకపోవటమో, పంటలు సరిగ్గా పండకపోయినప్పుడు అప్పు ఎలా కడతారు? అనడిగితే.. ‘అట్లేం లేదు సారూ. ఏదో కష్టం చేస్తం. ఇంటికాడ ఉంటమా. సంఘం పెట్టుకున్న తర్వాత తెలివి వచ్చింది. అటూ ఇటూ మీటింగులకు వెళ్లి రావటం వల్ల విత్తనాలు వచ్చినై. విత్తన బ్యాంకు పెట్టినం. ఇప్పుడు మా దగ్గర తైదలు, కొర్రలు, సజ్జలు, పచ్చజొన్నలు, ఎర్రకందులు, తెల్లకందులు, అన్ని రకాల కూరగాయల విత్తనాలు ఉన్నయి. సంఘం సభ్యులకు కిలో విత్తనాలు ఇస్తే వచ్చే సంవత్సరం రెండు కిలోలు తిరిగి ఇస్తరు. వేరే ఊరోళ్లకైతే జొన్న విత్తనాలు కిలో రూ. 60కి, కందులు రూ.150కి.. అమ్ముతున్నం.. సంఘం వచ్చినంక జర మంచిగనే ఉంది..’ అంటున్నారు మారోణి. మేలైన, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అలవాటు చేసుకుంటూ అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహిస్తున్న మారోణిని మా మంచి రాణిగా తోటి రైతులు ప్రశంసిస్తున్నారు. స్వయంగా కౌలు రైతు కూడా అయిన మారోణి కౌలు రైతుల హక్కుల సాధన కోసం పోరాడుతున్నారు. ఇందిరాగాంధీ శ్రమ శక్తి అవార్డును గత ఏడాది మారోణి స్వంతం చే సుకోవడం ఎంతైనా సముచితం. కౌలు రైతులకు న్యాయం ఎక్కడ? వరి సాగులో శ్రీ పద్ధతిని అనుసరించడం, అదేవిధంగా అధిక లాభాలు అందించే చిరుధాన్యాలు, కంది వేస్తున్నాను. పంట మార్పిడితో మంచి దిగుబడులు సాధించాను. రసాయన ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించి సేంద్రియ వ్యవసాయానికి మొగ్గు చూపడం వల్ల చీడపీడల నుంచి రక్షణతో పాటుగా పంట దిగుబడి నూటికి నూరు శాతం పెరిగింది. వ్యవసాయం, పాడి గేదెల పెంపకం రెండూ లాభసాటిగా ఉన్నాయి. మహిళా రైతులు కూడా మంచి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఒకటికి నాలుగు రకాల పంటలు పండిస్తే వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించవచ్చు. అయితే, పంట నష్టపోయినా పరిహారం రావటం లేదు. మా వరి ధాన్యం సగానికి పైగా రాలిపోయింది. అధికారులు వచ్చి రాసుకున్నారు. అయినా రూపాయి రాలేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వటం లేదు. ఎకరానికి రూ. 4 వేల పెట్టుబడి సహాయం కూడా ప్రభుత్వం భూమి యజమానికే ఇస్తున్నది. కౌలు రైతులకు న్యాయం జరగటం లేదు. వాంకుడోతు మారోణి (95530 35321), దయ్యబండ తండా,తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా – టీవీ రమణాకర్, సాక్షి,తుర్కపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా -
నాటు కోళ్ల హేచరీ!
మాంసాహారుల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ నాటు కోళ్లకు మార్కెట్లో గిరాకీ పెరుగుతూ వస్తున్నది. అయితే, షెడ్లలో కోళ్లను ఉంచి పెంచే పద్ధతిలో ఖర్చులు అధికమైన నేపథ్యంలో లాభాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అయితే, ఉన్నత విద్యావంతులైన అరుణ్ క్రాంతి, నవత దంపతులు ఉద్యోగాలకు వెళ్లకుండా వినూత్నంగా ఆలోచించి నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. వినూత్నంగా మొలక గడ్డినే మేతగా వేస్తున్నారు. అంతేకాదు, స్వల్ప ఖర్చుతోనే నాటుకోడి పిల్లల హేచరీని నిర్వహిస్తున్నారు. నెలకు సుమారు 10 వేల నాటు కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. ఖర్చులు బాగా తగ్గించుకుంటూ అధిక లాభాలు పొందుతున్నారు. తమ ప్రాంతంలో యువతకు మార్గదర్శకులుగా నిలిచారు. వినూత్నమైన ఆలోచనలు, మనోబలంతో ముందుకెళ్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చనడానికి నిదర్శనం ఈ యువ జంట. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన కాపరబోయిన అరుణ్ క్రాంతి బీటెక్, ఆయన భార్య నవత ఎంబీఏ చదివారు. ఇద్దరికీ కార్పొరేట్ ఉద్యోగాలు వచ్చినప్పటికీ, వ్యవసాయం, అనుబంధ రంగాలపై అభిరుచితో కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. జగిత్యాల సమీపంలోని తమ రెండెకరాల భూమిలో చుట్టూ ఇనుప మెష్ వేసి, ఒక షెడ్డు వేసుకొని, ఆరుబయటే తిరుగాడే పద్ధతిలో నాటు కోళ్లను పెంచుతున్నారు. తొలుత, 2005 నుండి 2012 వరకు ఈము పక్షుల పెంపకాన్ని చేపట్టి, మార్కెటింగ్ సమస్యల వల్ల భారీ నష్టాలను చవిచూశారు. తదనంతరం కూడా ఉద్యోగాల వైపు చూడకుండా మనోధైర్యంతో వినూత్నంగా నాటు కోళ్ల పెంపకంతోపాటు హేచరీపై దృష్టి పెట్టి నిలదొక్కుకున్నారు. నెలకు రూ. లక్ష ఆదాయం పొందేలా ఎదిగారు. 800 నాటు కోళ్లు.. 10 వేల కోడి పిల్లలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో కోళ్ల ఫారాలను స్వయంగా పరిశీలించారు. నాటుకోళ్లను షెడ్లలో పెంచడం వల్ల వ్యాధులు వస్తున్నాయని, నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువై నష్టపోతున్నట్లు గ్రహించారు. షెడ్లలో పెంచడం వల్ల దాణా ఖర్చు ఎక్కువ అవుతుండటంతో పెద్దగా గిట్టుబాటు కావడం లేదని గుర్తించి, నాటు కోళ్లను వినూత్నంగా పెంచాలని నిర్ణయించుకున్నారు. తొలుత 100 గుడ్లతో కోళ్ల పెంపకం చేపట్టగా, నేడు 800 కోళ్లతో పాటు, నెలకు 5–10 వేల కోడి పిల్లలను అమ్మే స్థాయికి ఎదిగారు. కృత్రిమంగా గుడ్లను పొదిగే ఇంక్యుబేటర్‌ను కొనుగోలు చేయకుండా.. అందుబాటులో ఉన్న వస్తువులతో తయారు చేసుకున్నారు. 21 రోజుల్లో పిల్లలు బయటకు వస్తాయి. మరికొద్ది రోజుల పాటు లైట్ల కింద అతి జాగ్రత్తగా పెంచిన తర్వాత, కోడి పిల్లలను బయటకు వదులుతారు. ట్రేలలో పెంచే మొలక గడ్డి, ఆకుకూరలు, అజొల్లా.. ఆరు బయటకు వచ్చిన పిల్లలకు సమతుల పౌష్టికాహారంగా హైడ్రోపోనిక్ పద్ధతిలో ట్రేలలో పెంచే మొక్కజొన్నగడ్డి, జొన్న గడ్డి, గోధుమ గడ్డితోపాటు.. ఆరుబయట పొలంలో పాలకూర, ఆకుకూర, షేడ్‌నెట్ హౌస్‌లో అజొల్లాలను సొంతంగా పెంచి అందిస్తున్నారు. డక్వీడ్తోపాటు మినరల్స్ కూడా ఇస్తుంటారు. సాగు చేసిన తోటల్లో తిరుగుతూ కోళ్లు తమకు ఇష్టమైనవి తింటుంటాయి. కేవలం సాయంత్రం సమయాల్లో షెడ్లలోకి పిలిచేందుకే.. మొక్కజొన్న, సోయాబీన్, నూకలు, వరి తవుడును కలిపిన దాణా వేస్తుంటారు. సాధారణంగా పెరటి కోళ్లు పెంచే వారు పెట్టే ఖర్చులో 20% ఖర్చుతోనే వీరు మంచి ఉత్పాదకత సాధిస్తుండటం విశేషం. గ్రామాల నుంచి నాటు గుడ్ల సేకరణ నాటు కోడి పిల్లలకు డిమాండ్ రావడంతో, ప్రతి వారానికి జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల నుండి 3–4 వేల గుడ్లను సేకరిస్తారు. వీటితో పాటు, తన ఫామ్‌లో కోళ్ల నుండి వచ్చిన గుడ్లను ముందుగా ఫార్మాల్డిహైడ్ ద్రావణంతో శుభ్రం చేస్తారు. తర్వాత, 6 గంటల పాటు బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు, వైరస్ లేకుండా ఉండేందుకు ప్యూమిగేషన్ చేస్తారు. ఎందుకంటే, 21 రోజుల పాటు ఎలాంటి వైరస్ గుడ్లకు సోకకుండా కాపాడుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే స్వయంగా తయారు చేసిన గుడ్లను ఉంచే పరికరంలో లైట్ల వెలుతురులో గుడ్లను పెడుతుంటారు. ఇలా.. దాదాపు ఆరు గుడ్ల నుండి పిల్లలు వచ్చే పరికరాలు ఉన్నాయి. దాదాపు నెలకు 5–10 వేల నాటు కోడి పిల్లలు అందిస్తున్నాడు. 80 రోజుల్లో కిలో–కిలోన్నర బరువు నాటు కోడి పిల్లలు కొనుగోలు చేసిన వ్యక్తులకు వీటిని ఏ రీతిన పెంచితే లాభాలు వస్తాయో కూడా వీరు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో కోడి పిల్లను రూ. 35 పెట్టి కొనుగోలు చేసి తీసుకెళ్లిన వారు.. 80 రోజుల్లో మార్కెట్లో అమ్మే వరకు ఏ రోజు ఏమి చేయాలో షెడ్యూల్ ఇస్తుంటారు. కోడి కిలో నుండి కిలోన్నర బరువు పెరగ్గానే అమ్మితే, కిలో రూ. 200 పలుకుతోంది. నాటు కోళ్లకు డిమాండ్ బాగా ఉండటంతో, వీరి నాటు కోళ్ల ఫారాన్ని ప్రతి రోజూ చాలా మంది చూసి వెళ్తుంటారు. ఓటమే రేపటి విజయానికి నాంది! ఏదో సాధించాలన్న తపనతోనే కోళ్ల పెంపకం చేపట్టాము. ఈము కోళ్ల పెంపకంతో చేతులు కాల్చుకున్నాం. విదేశీ కోళ్ల సాగులో గుణపాఠం నేర్చుకొని అత్యంత శ్రద్ధతో నాటు కోళ్లు, పిల్లల పెంపకం చేపట్టాం. ఓటమే రేపటి విజయానికి నాంది అనడానికి మేమే నిదర్శనం. ప్రతి రోజూ కోళ్ల ఫారానికి వచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. నిశితంగా గమనిస్తూ ఉంటే ఏ కోడి గుడ్డు పెడుతుందో, ఏ కోడి పెట్టడం లేదో మాకు తెలిసిపోతుంది. కోళ్లకు వివిధ రకాల గడ్డిని ట్రేలలో పెంచుతుంటాం. ఆరోగ్యంగా ఆరుబయట తిరుగాడుతూ పెరుగుతున్న నాటు కోళ్లను చూస్తే తృప్తిగా ఉంటుంది. – నవత, అరుణ్ క్రాంతి (90005 67121), జగిత్యాల కృత్రిమంగా గుడ్లను పొదిగే ఏర్పాటు విద్యుత్ దీపాల వెలుగులో నాటు కోడి పిల్లలు ట్రేలలో పెరుగుతున్న మొలక గడ్డి మొక్కజొన్న మొలక గడ్డిని తింటున్న కోళ్లు – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
‘లూసన్’.. లాభాలు చూపెన్
ఘట్కేసర్: పశువులకు మేతగా ఉపయోగపడే లూసన్ గడ్డి సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు ఓ రైతు.. ఈ గడ్డిని పెంచడానికి అంతగా శ్రమించాల్సిన పని లేదని, నీరు ఎక్కువగా అవసరం లేదని, పెట్టుబడి కూడా తక్కువే అంటున్నాడాయన. ఈ పంటపై చీడపీడలు ఆశించే అవకాశం తక్కువ అని చెబుతున్నాడు రైతు కృష్ణ. ఆయన ఇంకా ఏమంటున్నాడంటే... గతంలో పాడి పశువులకు లూసన్ గడ్డి వేయడంతో పాల దిగుబడి పెరుగుతుందని గ్రహించాను. దీంతో లూసన్ గడ్డికి కోసం ప్రతి రోజు మార్కెట్ వెళ్లేవాడిని. అక్కడ ఈ గడ్డికి గిరాకీ బాగా ఉండటం చూశా. దానిని సాగు చేస్తే ఎక్కువ ఆదాయం పొందవచ్చని గ్రహించా. దీంతో యంనంపేట్‌లో రెండు ఎకరాల భూమిని లీజుకు తీసుకొని సాగు చేస్తున్నా. లూసన్ గడ్డి విత్తనాలు తెచ్చి వాటిని పొలంలో సాగు చేస్తూ నాలుగు రోజులకోసారి నీళ్లు పెడుతున్నా. కలుపు మొక్కలను ఎప్పటికప్పడు తొలగించాలి. దీనికోసం నలుగురు మహిళా కూలీలు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి ప్రతి రోజు రూ.150 కూలి ఇస్తున్నా. కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మంది కూలీలు అవసరపడుతుంది. ఎకరానికి రూ.25 వేల ఖర్చు.. లూసన్ గడ్డి సాగు చేయడానికి భూమిని సిద్ధం చేయడానికి, ఇతర ఖర్చులు కలిపి ఎకరాకు రూ.25 వేలు ఖర్చవుతుంది. గడ్డి ఏపుగా పెరగడానికి ఎరువులు, క్రిమిసంహారక మందులు వేస్తున్నా. విత్తనాలు వేసిన రెండు నెలల తర్వాత చిన్న కొమ్మలుగా కోసి వాటిని రూ.5 కట్టలు కడుతున్నా. వాటిని మోపులుగా తయారు చేస్తున్నా. ఒక్కో మోపులో 100 వరకు కట్టలు ఉంటా యి. ప్రతి నిత్యం 4 మోపులను నగరానికి తరలిస్తున్నా. నగరంలోని గోశాలలు, పరిశోధన నిమిత్తం వాడే ఎలుకలు, కుందేళ్లకు మేతగా విక్రయిస్తున్నా. ప్రతిరోజు రూ.2 వేలు వస్తున్నాయి. అన్ని ఖర్చులు పోనూ రోజుకు రూ.800 నుంచి రూ. వెయ్యి సంపాదిస్తున్నా. లూసన్ గడ్డిని గుర్రాలు, ఆవులు, కుందేళ్లు, ప్రయోగాలకు ఉపయోగించే ఎలుకలకు మేతగా వేస్తారు. దీంతో అవి ఎక్కువ శక్తిమంతమవుతాయి. పాడి పశువులకు వేస్తే ఎక్కువ పాల దిగుబడి పెరుగుతుంది. -
అంతా మా ఇష్టం..
రామచంద్రపురం, న్యూస్‌లైన్ : అధిక లాభాలు పండించుకోవాలనే కొంత మంది బడాబాబుల దురాశ.. పసిడి సిరులను పండించే నేలతల్లికి తూట్లు పొడుస్తోంది. రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇటీవల కొందరు.. నిబంధనలను తుంగలో తొక్కి.. రైతులకు అధిక శిస్తు ఆశ చూపి.. పచ్చని పంటలు పండే పంట పొలాలను విచ్చలవిడిగా.. రాత్రికి రాత్రే రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. దీనివల్ల తమ పొలాలు దెబ్బ తింటాయని చుట్టుపక్కల రైతులు ఆందోళన చెందుతున్నారు. రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇటీవల అనధికార రొయ్యల చెరువుల తవ్వకాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్క రామచంద్రపురం నియోజకవర్గంలోనే వందలాది ఎకరాల పంట పొలాలు రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయి. డివిజన్ పరిధిలోని కె.గంగవరం, రామచంద్రపురం, కాజులూరు, మండపేట, రాయవరం మండలాల్లోని రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకూ లీజు మొత్తం చెల్లించి, ఆ భూములను రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. ఈవిధంగా కొంతమంది బడాబాబులు నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కి.. వందలాది ఎకరాల పంట పొలాలను పదేళ్ల నుంచి 20 ఏళ్లకు లీజుకు తీసుకుని చెరువులుగా మార్చేస్తున్నారు. వ్యవసాయం ద్వారా పంటలు బాగా పండితే రైతుకు ఎకరానికి రూ.30 వేలు మాత్రమే శిస్తు వస్తుంది. అదే రొయ్యల చెరువులకు లీజుకు ఇస్తే ఏడాదికి సుమారు రూ.50 వేలు పైగానే దక్కుతోంది. దీంతో రైతులు కూడా తమ పొలాలను చెరువులకు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. పొంచి ఉన్న ప్రమాదం పంట పొలాల మధ్య చెరువులు తవ్వడం వల్ల చుట్టుపక్కల పొలాలపై ఆ ప్రభావం పడే అవకాశముంది. ఇష్టానుసారం చెరువులు తవ్వి భారీగా గట్లు వెయ్యడం వల్ల.. వర్షాలు అధికంగా కురిసే సమయంలో పంట పొలాల్లోని నీరు త్వరగా దిగేందుకు ఆస్కారం ఉండదు. దీనివల్ల రోజుల తరబడి పొలాలు ముంపులో చిక్కుకునే ప్రమాదం ఉంటుందని పరిసర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే చెరువులు తవ్వుతున్న పొలాలు భవిష్యత్తులో చౌడుబారి పంటలు పండించేందుకు పనికి రావని వారంటున్నారు. మరోపక్క రొయ్యల చెరువుల్లో రసాయనాలు వాడడం వల్ల వాటి పక్కన ఉన్న డ్రెయిన్లు, నీటిపారుదల కాలువలు కాలుష్యం బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న చెరువుల తవ్వకాన్ని తక్షణం నిలుపు చేయాలని అధికారులను పరిసర పొలాల రైతులు కోరుతున్నారు. అధిక లాభాల కోసమే.. ఎకరం పంట పొలాన్ని రొయ్యల చెరువుగా మారిస్తే మొదటిసారి సుమారు రూ 6లక్షల పెట్టుబడి అవుతుంది. రొయ్యల రేటు బాగుంటే మొదటి పంటలోనే సుమారు రూ.10 లక్షల వరకూ ఆదాయం వస్తుంది. అంటే ఒక్క పంటలోనే సుమారు రూ.4 లక్షల వరకూ లాభం వస్తుందన్నమాట. ఇలా ఏడాదికి రెండు లేదా మూడు పంటలు కూడా వేస్తారు. మొదటిసారి పెట్టుబడి ఎక్కువగా ఉన్నా అ తరువాత నుంచి పెట్టేది తక్కువగానే ఉంటుంది. ఇంతగా లాభాలు వస్తున్నందువల్లనే పంట పొలాలను రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారని తెలుస్తోంది. కఠిన చర్యలు తీసుకుంటాం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అనధికారంగా తవ్వుతున్న చెరువులపై ఫిర్యాదులందాయి. అనుమతులు లేకుండా పంట భూములను చెరువులుగా తవ్వుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రామచంద్రపురం మండలంలో కొన్నిచోట్ల అనధికార తవ్వకాలను నిలుపు చేశాం. జిల్లా కమిటీ అనుమతులు తప్పని సరిగా ఉండాలి. లేకుంటే చర్యలు తప్పవు. - కె.సుబ్బారావు, ఆర్డీఓ, రామచంద్రపురం ఇవీ నిబంధనలు నిబంధనల ప్రకారం అవసరమైన అనుమతులు లేకుండా పంట పొలాలను చెరువులుగా మార్చరాదు. అలా మార్చే పక్షంలో చెరువు చుట్టూ మూడు మీటర్ల స్థలం విడిచిపెట్టాలి. ఆ చెరువుల్లోని నీరు బయటకు పోయేవిధంగా వారి స్థలాల్లోనే కాలువలు తవ్వాలి. పంట కాలువలు, ప్రభుత్వ డ్రైనేజీల్లోనికి ఆ చెరువుల్లోని నీటిని వదలరాదు. ప్రభుత్వ భూములు ఆక్రమించరాదు. చుట్టుపక్కల పంట భూములకు ఎటువంటి ప్రమాదమూ వాటిల్లకూడదు. చేపలు, రొయ్యల చెరువుల తవ్వకానికి కలెక్టర్ నేతృత్వంలో వివిధ శాఖలతో ఏర్పాటు చేసిన కమిటీ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. మండల, డివిజన్ స్థాయిలో అనుమతులు పొందిన అనంతరం చివరిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తారు. చెరువులు తవ్వే ప్రాంతాలను సంబంధిత ఆర్డీఓ, వ్యవసాయ, మత్స్య, నీటిపారుదల, భూగర్భ నీటివనరుల అధికారుల బృందం చెరువులు తవ్వే ప్రదేశాలను పరిశీలించాలి. వారి నివేదిక ఆధారంగా కలెక్టర్ అనుమతి మంజూరు చేస్తారు. ఆ తరువాత మాత్రమే పంట పొలాలను చెరువులుగా మార్చాలి. కానీ రామచంద్రపురం డివిజన్లో ఎటువంటి అనుమతులూ లేకుండానే విచ్చలవిడిగా చెరువులను తవ్వుతున్నారు.