న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయడం, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడం వల్ల ఆ రాష్ట్ర ప్రజలు అత్యంత భారీ ప్రయోజనాలను పొందుతారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం 73వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు. మిగతా దేశ పౌరులంతా ఏయే హక్కులు, ప్రయోజనాలు, సౌకర్యాలను పొందుతున్నారో.. ఆ లాభాలను ఇకపై జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రజలు కూడా పొందగలరని కోవింద్ అన్నారు.
తక్షణ ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ ఇటీవలే పార్లమెంటు ఆమోదం పొందిన చట్టం తదితరాలు జమ్మూ కశ్మీర్‌లోని ఆడబిడ్డలకు కూడా న్యాయం అందిస్తాయని కోవింద్ తెలిపారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో ఉన్న 370వ అధికరణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పది రోజుల క్రితమే తొలగించి, జమ్మూ కశ్మీర్‌ను అసెంబ్లీ సహిత కేంద్రపాలిత ప్రాంతంగాను, లదాఖ్‌ను ఆ రాష్ట్రం నుంచి విడదీసి అసెంబ్లీ రహిత కేంద్రపాలిత ప్రాంతంగాను మార్చాలని ప్రతిపాదించడం తెలిసిందే. దేశ తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31 నుంచి ఈ కొత్త కేంద్రపాలిత ప్రాంతాలు ఉనికిలోకి వస్తాయి.
స్వాతంత్య్రమంటే అధికార మార్పిడి కాదు..
స్వాతంత్య్రం కోసం పోరాడిన పాత తరాన్ని కోవింద్ గుర్తు చేసుకుంటూ ‘స్వాతంత్య్రమంటే కేవలం అధికార మార్పిడేనని పెద్దలు అనుకోలేదు. జాతి నిర్మాణమనే సుదీర్ఘ, విస్తృత ప్రక్రియలో అదో మెట్టు మాత్రమేనని ఆ మహోన్నత వ్యక్తులు భావించారు. ప్రతీ వ్యక్తి, ప్రతీ కుటుంబం.. అలా మొత్తంగా సమాజ జీవితం బాగుండాలనేది వారి ఆశయం’ అని అన్నారు. ఒకరి జీవన విధానాన్ని లేదా పద్ధతులను చాలా తక్కువ సందర్భాల్లోనే భారత్ వేలెత్తి చూపిందనీ, ఇక్కడ అంతా అన్నింటినీ తేలిగ్గా తీసుకుంటూ, ‘మనం బతుకుదాం, ఇతరులను బతకనిద్దాం’ అనే సూత్రాన్ని అనుసరిస్తారన్నారు. అత్యంత దుర్బలమైన వ్యక్తుల గొంతుకను వినగలిగే సామర్థ్యాన్ని భారత్ ఎన్నటికీ కోల్పోదని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న ప్రజలను కోవింద్ అభినందిస్తూ, ప్రతీ ఎన్నిక ఓ కొత్త ప్రారంభాన్ని తెస్తుందని, భారత ప్రజల ఉమ్మడి ఆశలకు ఊపిరి పోస్తుందని అన్నారు.
కశ్మీరీలకు భారీ ప్రయోజనాలు
Published Thu, Aug 15 2019 3:30 AM | Last Updated on Thu, Aug 15 2019 9:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment