కార్పొరేట్ ట్యాక్స్ కోత లాభాలు వరుసగా రెండో రోజూ, సోమవారం కూడా కొనసాగాయి. పన్ను కోత కారణంగా బాగా ప్రయోజనం పొందే ఆర్థిక, బ్యాంక్, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు లాభపడటంతో సెన్సెక్స్, నిఫ్టీలు మరోసారి భారీ లాభాలను సాధించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 39,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్‌టీ 11,600 పాయింట్లపైకి ఎగబాకాయి. జీఎస్‌టీ మండలి సానుకూల నిర్ణయాలు కలసివచ్చాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్‌గా ఉన్నా, అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్న ఈ వారంలో స్టాక్ సూచీలు బలంగా ట్రేడవడం విశేషం.
ఇంట్రాడేలో 1,426 పాయింట్లు పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 1,075 పాయింట్లు లాభపడి 39,090 పాయింట్లు వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 326 పాయింట్లు పెరిగి 11,600 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 2.8 శాతం చొప్పున ఎగిశాయి. ఇక గత రెండు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 2,996 పాయింట్లు(8.3 శాతం), నిఫ్టీ 895 పాయింట్లు(8.36 శాతం) చొప్పున లాభపడ్డాయి. రెండు రోజుల్లో ఈ రెండు సూచీలు ఇంత భారీగా లాభపడటం ఇప్పటిదాకా ఇదే మొదటిసారి. సాంకేతిక అవరోధాలు కారణంగా ముగింపులో చివరి పదినిమిషాల పాటు ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్‌లో అంతరాయం ఏర్పడింది. ఐటీ, టెక్నాలజీ, టెలికం, యుటిలిటీస్, పవర్ సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ 569 పాయింట్ల మేర పెరిగాయి.
పన్ను కోత.. లాభాల మోత...
కార్పొరేట్ ట్యాక్స్‌ను (సెస్‌లు, సర్‌చార్జీలు కలుపుకొని) కేంద్రం 34.9 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. అలాగే కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గింది. అన్ని వర్గాల ఇన్వెస్టర్లకు వర్తించే మూలధన లాభాల పన్నుపై అదనపు సర్‌చార్జీని కూడా కేంద్రం తొలగించింది. అలాగే షేర్ల బైబ్యాక్‌పై పన్నును కూడా కేంద్రం రద్దు చేసింది. ఇక 37వ జీఎస్‌టీ మండలిలో వ్యాపార వర్గాలకు ఊరటనిచ్చే పలు నిర్ణయాలను కంపెనీ తీసుకుంది. ఈ సానుకూల నిర్ణయాల వరదలో స్టాక్ మార్కెట్ లాభాల సునామీలో తడిసి ముద్దవుతోంది.
కార్పొరేట్ ట్యాక్స్ కోత కారణంగా కంపెనీల లాభాలు బాగా పెరుగుతాయని సెంట్రమ్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఎనలిస్ట్ దేవాంగ్ మెహతా చెప్పారు. ఈ లాభాల నేపథ్యంలో కంపెనీలు ధరలను తగ్గించి డిమాండ్ పెంచేలా చేసి అమ్మకాలను పెంచుకుంటాయని పేర్కొన్నారు. లేదా వాటాదారులకు డివిడెండ్‌లు పంచడమో, మూలధన పెట్టుబడులను పెంచుకోవడమో చేస్తాయని, ఎలా చూసినా రేట్ల కోత కంపెనీలకు సానుకూలమేనని వివరించారు. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీల లాభాలు పెరిగే అవకాశాలుండటంతో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఇక ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
మరిన్ని విశేషాలు...
► నిఫ్టీ 50లోని 32 షేర్లు లాభాల్లోనే ముగిశాయి.
► హోటల్ రూమ్ టారిఫ్‌లపై జీఎస్‌టీని తగ్గించడంతో హోటల్ షేర్లు దుమ్ము రేపాయి. తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ 20 శాతం, రాయల్ ఆర్చిడ్ హోటల్స్ 16 శాతం, ఇండియన్ హోటల్స్ కంపెనీ 8 శాతం, ఐటీసీ 7 శాతం, హోటల్ లీలా వెంచర్ 3.5 శాతం చొప్పున పెరిగాయి. ఒక్క రాత్రి బసకు రూ.7,500 ధర ఉండే హోటల్ రూమ్స్‌పై జీఎస్‌టీని 18 శాతం నుంచి 12 శాతానికి జీఎస్‌టీ కౌన్సిల్ తగ్గించింది. రూ.7,500కు మించిన టారిఫ్‌లపై జీఎస్‌టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది.
► జీ ఎంటర్‌టైన్మెంట్ షేర్ వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టపోయింది. సోమవారం ఈ షేర్ 10 శాతం నష్టంతో రూ.272 వద్ద ముగిసింది. ప్రమోటర్ తనఖా పెట్టిన షేర్లను ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ విక్రయించిందన్న వార్తలతో ఈ షేర్ ఈ స్థాయిలో పడిపోయింది.
► ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం వచ్చే మార్చికల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలతో బీపీసీఎల్ షేర్ 13% లాభంతో రూ.454 వద్ద, కంటైనర్ కార్ప్ షేర్ 6.4% లాభంతో రూ.585 వద్ద ముగిసింది.
► క్యూఐపీ మార్గంలో రూ.12,500 కోట్లు సమీకరించిన నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 6.8 శాతం లాభంతో రూ.727 వద్ద ముగిసింది.
► మార్కెట్ లాభాల ధమాకాలోనూ, 200కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. కాఫీ డే, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, ప్రొవొగ్, యాడ్‌ల్యాబ్స్.. ఈ జాబితాలో ఉన్నాయి.
టార్గెట్లు పెరిగాయ్...
కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, ఇతర చర్యల కారణంగా కంపెనీల లాభాలు జోరందుకుంటాయని విశ్లేషకులంటున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం సెన్సెక్స్, నిఫ్టీ టార్గెట్లను వివిధ బ్రోకరేజ్ సంస్థలు పెంచాయి. వచ్చే ఏడాది జూన్‌కల్లా సెన్సెక్స్45,000 పాయింట్లకు చేరుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి నిప్టీ 12,300–13,300 రేంజ్‌కు చేరగలదని యూబీఎస్, 13,200 పాయింట్లకు ఎగుస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొన్నాయి.
ఆల్‌టైమ్ హైకి బాటా...
స్టాక్ మార్కెట్ జోరు కారణంగా పలు షేర్లు వాటి వాటి జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బాటా ఇండియా, డీ–మార్ట్(అవెన్యూ సూపర్ మార్ట్స్), హిందుస్తాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, ఓల్టాస్, కాల్గేట్ పామోలివ్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
బుల్‌చల్!
Published Tue, Sep 24 2019 1:57 AM | Last Updated on Tue, Sep 24 2019 9:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment