మార్కెట్‌కు ఫెడ్‌ బూస్ట్‌ | Sensex soars 958 points, logs biggest gain in four months | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు ఫెడ్‌ బూస్ట్‌

Published Fri, Sep 24 2021 3:41 AM | Last Updated on Fri, Sep 24 2021 3:41 AM

Sensex soars 958 points, logs biggest gain in four months - Sakshi

ముంబై: దలాల్‌ స్ట్రీట్‌ గురువారం బుల్‌ రంకెలతో దద్దరిల్లిపోయింది. కొనుగోళ్ల అండతో ట్రేడింగ్‌ ఆద్యంతం ఉత్సాహాంగా ఉరకలేసింది. ట్రేడింగ్‌ ఆద్యంతం కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో స్టాక్‌ సూచీలు నాలుగు నెలల్లో అత్యధిక లాభాల్ని ఆర్జించాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి రికవరీ 23 పైసలు బలపడటం కలిసొచ్చింది.

ఒక్క మీడియా మినహా అన్ని రంగాల కౌంటర్లకు డిమాండ్‌ నెలకొనడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. ఇంట్రాడేలో 1030 పాయింట్లు పెరిగి 59,957 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌ చివరికి 958 పాయింట్ల లాభంతో 59,885 వద్ద ముగిసింది. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు షేర్లు మాత్రమే నష్టపోయాయి.

నిఫ్టీ ఇండెక్స్‌ 297 పాయింట్లు ఎగసి 17,844 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్‌ ముగిసేసరికి 276 పాయింట్ల లాభంతో 17,823 వద్ద స్థిరపడింది. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఐసీఐసీఐ షేర్లు వంటి లార్జ్‌క్యాప్‌ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.358 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,173 కోట్ల షేర్లను కొన్నారు. డాలరు మారకంలో రూపాయి విలువ 73.64 వద్ద నిలిచింది.  

రాకెట్‌లా దూసుకెళ్లిన సూచీలు...  
ఆసియా మార్కెట్ల నుంచి సానకూల సంకేతాలు అందుకున్న దేశీయ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 431 పాయింట్ల లాభంతో 59,358 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 17,671 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం నుంచీ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బుల్‌ ఏ దశలోనూ తన పట్టు కోల్పోలేదు. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్, ఐటీ వంటి కీలక రంగాల షేర్లకు డిమాండ్‌ లభించడంతో సూచీలు రాకెట్‌లా దూసుకెళ్లాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1030 పాయింట్లు, నిఫ్టీ 297 పాయింట్లను ఆర్జించగలిగాయి. అయితే ట్రేడింగ్‌ చివర్లో సూచీలు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

సూచీల లాభాలకు కారణాలివే...  
చైనా ఎవర్‌ గ్రాండే సంక్షోభంపై గ్రూప్‌ చైర్మన్‌ హుయి కా యువాన్‌ వివరణ ఇచ్చారు. ఆ దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి చైనా పీపుల్స్‌ బ్యాంక్‌ 17 బిలియన్‌ డాలర్లను చొప్పించింది. మార్కెట్‌ వర్గాల అంచనాలకు తగ్గట్లే యూఎస్‌ ఫెడ్‌ రిజర్వు వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. బాండ్ల కొనుగోళ్లను నవంబర్‌ నుంచి తగ్గిస్తామనే ఫెడ్‌ నిర్ణయాన్ని ఈక్విటీ మార్కెట్లు అప్పటికే డిస్కౌంట్‌ చేసుకున్నాయి.

ఈ పరిణామాలు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితిని తొలగించి సానుకూలతలను నెలకొల్పాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఇటీవల కేంద్రం పలు రంగాల్లో సంస్కరణల పర్వానికి తెరతీయడం మార్కెట్‌కు జోష్‌ నిచ్చింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లతో పాటు రిటైల్‌ ఇన్వెస్టర్లు అధికాసక్తి చూపుతుండటం మార్కెట్లలో బుల్‌ జోరు కొనసాగుతుంది.  

మార్కెట్లో మరిన్ని విశేషాలు...
► జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. బీఎస్‌ఈలో ఐదున్నర శాతం నష్టపోయి రూ.318 వద్ద ముగిసింది.  
► యూఎస్‌ సంస్థ బ్లింక్‌ను కొనుగోలు చేయడంతో ఎంఫసిస్‌ షేరు మూడు శాతం ర్యాలీ చేసి రూ.3,339 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.3392 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది.  
► వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి 500 సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీకి ఆర్డర్లను దక్కించుకోవడంతో జేఎంబీ ఆటో షేరు 12 శాతం లాభపడి రూ.516 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 17 శాతం ర్యాలీ చేసి రూ.537 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది.


ఒక్క రోజులో రూ.3.16 లక్షల కోట్లు ప్లస్‌
సూచీలు నాలుగునెలల్లో అతిపెద్ద ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్ల లాభాల జడివానలో తడిసిముద్దయ్యారు. స్టాక్‌ మార్కెట్లో ఒక్కరోజులోనే రూ.3.16 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ జీవితకాల రికార్డు స్థాయి రూ.261.73 లక్షల కోట్లకు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement