Intraday
-
7 రోజుల ర్యాలీకి బ్రేక్
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ల ఏడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఇండెక్సులు వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 50 పాయింట్లు నీరసించి 61,716 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 58 పాయింట్లు క్షీణించి 18,419 వద్ద ముగిసింది. అయితే బుల్ జోష్‌ను కొనసాగిస్తూ ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 480 పాయింట్లు జంప్‌చేసి 62,245కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ 18,604ను తాకింది. వెరసి మరోసారి చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఆదుకున్న ఐటీ..: ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాలు 5–2.5 శాతం మధ్య నష్టపోయాయి. ఐటీ ఇండెక్స్ 2.2 శాతం బలపడటం ద్వారా మార్కెట్లను ఆదుకుంది. దీంతో నష్టాలు పరిమితమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐటీసీ, టాటా మోటార్స్, ఐషర్, హెచ్‌యూఎల్, టైటన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, అల్ట్రాటెక్, దివీస్, యూపీఎల్, ఇండస్ఇండ్, ఓఎన్జీసీ, ఎస్బీఐ 6.3–2 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే మరోపక్క టెక్ మహీంద్రా, ఎల్అండ్టీ, ఇన్ఫోసిస్, కొటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, ఆర్ఐఎల్, ఎంఅండ్ఎం, విప్రో 4.3–0.6 శాతం మధ్య బలపడ్డాయి. కొద్ది రోజులుగా దేశీ మార్కెట్ల దూకుడు నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. చిన్న షేర్లు వీక్ బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 2 శాతం స్థాయిలో క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 2,427 డీలాపడగా.. కేవలం 935 లాభాలతో ముగిశాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.7 శాతం పుంజుకుని దాదాపు 85 డాలర్లకు చేరింది. ఇది సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 506 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,578 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఎల్అండ్టీ షేర్ల స్పీడ్ ♦వివిధ ప్రోత్సాహకర అంశాల నేపథ్యంలో ఎల్అండ్టీ గ్రూప్ షేర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో 3 లిస్టెడ్ కంపెనీలు కొత్త గరిష్టాలను తాకాయి. ♦క్యూ2లో ప్రోత్సాహకర ఫలితాల సాధనతో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఎన్ఎస్ఈలో 17 శాతం పురోగమించింది. రూ. 6,900 వద్ద ముగిసింది. ♦క్యూ2 ఫలితాలపై అంచనాలతో ఎల్అండ్టీ టెక్నాలజీస్ 7.5 శాతం జంప్‌చేసి రూ. 5,215 వద్ద ముగిసింది. తొలుత రూ. 5,549కు చేరింది. ♦ఇటీవలి భారీ ఆర్డర్లతో ఎల్అండ్టీ షేరు 3.3 శాతం లాభపడి రూ. 1,848 వద్ద ముగిసింది. ఐఆర్సీటీసీకి షాక్ లాభాల స్వీకరణ ఐఆర్సీటీసీ కౌంటర్‌ను దెబ్బతీసింది. దీంతో ఎన్ఎస్ఈలో ఇంట్రా డేలో ఈ షేరు 15 శాతం పడిపోయి రూ. 4,996కు చేరింది. చివరికి 7% నష్టంతో రూ. 5,455 వద్ద ముగిసింది. అయితే తొలుత 9% జంప్‌చేసి, జీవితకాల గరిష్టం రూ. 6,396ను తాకింది. వెరసి కంపెనీ మార్కెట్ విలువ తొలిసారి రూ. లక్ష కోట్లను అధిగమించింది. అయితే ఆపై ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో కుప్పకూలింది. గత ఐదు రోజుల్లో ఈ షేరు 31 శాతం ర్యాలీ చేయడం ఇందుకు కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. గతేడాది(2020) నవంబర్ 4న ఐఆర్సీటీసీ షేరు రూ.1,290 వద్ద 52 వారాల కనిషాన్ని తాకింది. -
మూడు రోజుల లాభాలకు బ్రేక్
ముంబై: స్టాక్ సూచీల మూడు రోజుల లాభాలకు మంగళవారం అడ్డుకట్ట పడింది. ఐటీ, ఆర్థిక, టెలికాం షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఆర్థిక అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల్లో తలెత్తిన ఇబ్బందులు భారత్‌తో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపు(గురువారం) దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహించారు. డాలర్ మారకంలో రూపాయి 23 పైసలు పతనమైంది. ఫలితంగా సెన్సెక్స్ 410 పాయింట్లు పతనమై 60 వేల దిగువున 59,668 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 106 పాయింట్లు నష్టపోయి 17,749 వద్ద ముగిసింది. మెటల్, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ ఆద్యంతం స్టాక్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1243 పాయింట్ల పరిధిలో, నిఫ్టీ 337 పాయింట్ల రేంజ్ కదలాడాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1958 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.161 కోట్ల షేర్లను కొన్నారు. లాభాలతో మొదలై నష్టాల్లోకి.., దేశీయ మార్కెట్ ఉదయం లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 208 పాయింట్లు లాభంతో 60,286 వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 17,906 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లో ప్రతికూలతలతో పాటు గరిష్ట స్థాయి లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు ఆరంభ లాభాలన్ని కోల్పోయాయి. రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడికి ముందు ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూరప్ మార్కెట్లు నష్టాలతో మొదలవడంతో అమ్మకాల తీవ్రత మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(60,288) నుంచి 1243 పాయింట్లు నష్టపోయి 59,046 వద్ద, నిఫ్టీ డే హై(17,913) నుంచి 337 పాయింట్లు కోల్పోయి 17,912 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. నష్టాలు పరిమితం మిడ్ సెషన్ చివర్లో సూచీలకు దిగువ స్థాయిల వద్ద మద్దతు లభించడంతో అమ్మకాలు తగ్గాయి. మరో గంటలో ట్రేడింగ్ ముగుస్తుందనగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆస్తకి చూపారు. ముఖ్యంగా ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లు రాణించాయి. దీంతో సూచీలు భారీ నష్టాల నుంచి తేరుకొని పరిమిత నష్టాలతో ముగిశాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ►సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్టును దక్కించుకోవడంతో ఎన్టీపీసీ షేరు నాలుగు శాతం లాభపడి రూ.132 వద్ద ముగిసింది. ►ఆర్బీఐ రెండు కోట్ల జరిమానా విధించడంతో ఆర్బీఎల్ షేరు రెండుశాతం నష్టపోయి రూ.187 వద్ద ముగిసింది. ►గోవా షిప్‌యార్డ్ నుంచి కాంట్రాక్టు దక్కించుకోవడంతో భెల్ షేరు ఆరుశాతం ర్యాలీ చేసి రూ.60 వద్ద స్థిరపడింది. -
మార్కెట్‌కు ఫెడ్ బూస్ట్
ముంబై: దలాల్ స్ట్రీట్ గురువారం బుల్ రంకెలతో దద్దరిల్లిపోయింది. కొనుగోళ్ల అండతో ట్రేడింగ్ ఆద్యంతం ఉత్సాహాంగా ఉరకలేసింది. ట్రేడింగ్ ఆద్యంతం కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో స్టాక్ సూచీలు నాలుగు నెలల్లో అత్యధిక లాభాల్ని ఆర్జించాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రికవరీ 23 పైసలు బలపడటం కలిసొచ్చింది. ఒక్క మీడియా మినహా అన్ని రంగాల కౌంటర్లకు డిమాండ్ నెలకొనడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. ఇంట్రాడేలో 1030 పాయింట్లు పెరిగి 59,957 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 958 పాయింట్ల లాభంతో 59,885 వద్ద ముగిసింది. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్ 297 పాయింట్లు ఎగసి 17,844 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 276 పాయింట్ల లాభంతో 17,823 వద్ద స్థిరపడింది. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐసీఐసీఐ షేర్లు వంటి లార్జ్‌క్యాప్ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.358 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,173 కోట్ల షేర్లను కొన్నారు. డాలరు మారకంలో రూపాయి విలువ 73.64 వద్ద నిలిచింది. రాకెట్లా దూసుకెళ్లిన సూచీలు... ఆసియా మార్కెట్ల నుంచి సానకూల సంకేతాలు అందుకున్న దేశీయ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 431 పాయింట్ల లాభంతో 59,358 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 17,671 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం నుంచీ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బుల్ ఏ దశలోనూ తన పట్టు కోల్పోలేదు. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్, ఐటీ వంటి కీలక రంగాల షేర్లకు డిమాండ్ లభించడంతో సూచీలు రాకెట్లా దూసుకెళ్లాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1030 పాయింట్లు, నిఫ్టీ 297 పాయింట్లను ఆర్జించగలిగాయి. అయితే ట్రేడింగ్ చివర్లో సూచీలు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సూచీల లాభాలకు కారణాలివే... చైనా ఎవర్ గ్రాండే సంక్షోభంపై గ్రూప్ చైర్మన్ హుయి కా యువాన్ వివరణ ఇచ్చారు. ఆ దేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి చైనా పీపుల్స్ బ్యాంక్ 17 బిలియన్ డాలర్లను చొప్పించింది. మార్కెట్ వర్గాల అంచనాలకు తగ్గట్లే యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. బాండ్ల కొనుగోళ్లను నవంబర్ నుంచి తగ్గిస్తామనే ఫెడ్ నిర్ణయాన్ని ఈక్విటీ మార్కెట్లు అప్పటికే డిస్కౌంట్ చేసుకున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితిని తొలగించి సానుకూలతలను నెలకొల్పాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఇటీవల కేంద్రం పలు రంగాల్లో సంస్కరణల పర్వానికి తెరతీయడం మార్కెట్‌కు జోష్ నిచ్చింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లతో పాటు రిటైల్ ఇన్వెస్టర్లు అధికాసక్తి చూపుతుండటం మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతుంది. మార్కెట్లో మరిన్ని విశేషాలు... ► జీ ఎంటర్టైన్మెంట్ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. బీఎస్ఈలో ఐదున్నర శాతం నష్టపోయి రూ.318 వద్ద ముగిసింది. ► యూఎస్ సంస్థ బ్లింక్ను కొనుగోలు చేయడంతో ఎంఫసిస్ షేరు మూడు శాతం ర్యాలీ చేసి రూ.3,339 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.3392 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ► వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి 500 సీఎన్జీ, ఎలక్ట్రిక్ బస్సుల తయారీకి ఆర్డర్లను దక్కించుకోవడంతో జేఎంబీ ఆటో షేరు 12 శాతం లాభపడి రూ.516 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 17 శాతం ర్యాలీ చేసి రూ.537 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ఒక్క రోజులో రూ.3.16 లక్షల కోట్లు ప్లస్ సూచీలు నాలుగునెలల్లో అతిపెద్ద ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్ల లాభాల జడివానలో తడిసిముద్దయ్యారు. స్టాక్ మార్కెట్లో ఒక్కరోజులోనే రూ.3.16 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల రికార్డు స్థాయి రూ.261.73 లక్షల కోట్లకు చేరింది. -
గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ
ముంబై: ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో సూచీల మూడురోజుల రికార్డు ర్యాలీకి మంగళవారం ముగింపు పడింది. ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూలతలు, డాలర్ మారకంలో రూపాయి పతనం అంశాలూ మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ తొలి సెషన్లో ఆర్జించిన 256 పాయింట్లను కోల్పోయి 17 పాయింట్లు నష్టంతో 58,279 వద్ద ముగిసింది. నిఫ్టీ 59 పాయింట్లు ఆవిరై చివరికి 16 పాయింట్ల నష్టంతో 17,362 వద్ద నిలిచింది. ఎఫ్ఎమ్సీజీ, ఆర్థిక రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. దేశీ, విదేశీ ఇన్వెస్టర్లు ఇరువురూ అమ్మకాలకు పాల్పడ్డారు. ఎఫ్ఐఐలు రూ.145 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.137 కోట్ల షేర్లను విక్రయించారు. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ బలపడటంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 32 పైసలు క్షీణించి 73.42 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు... ఆసియాలో తైవాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా స్టాక్ సూచీలు నష్టాలతో ముగిశాయి. చైనా ఆగస్టు ఎగుమతి గణాంకాలు మెరుగ్గా నమోదుకావడంతో ఆ దేశ స్టాక్ మార్కెట్‌తో పాటు జపాన్, సింగపూర్, హాంకాంగ్ మార్కెట్లు లాభపడ్డాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ పాలసీ సమావేశం గురువారం జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతతో యూరప్ మార్కెట్లు పతనమయ్యాయి. ఉద్యోగ గణాంకాలు నిరాశపరడచంతో అమెరికా స్టాక్ ఫ్యూచర్లు స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడేలో కొత్త గరిష్టాలు..: ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ.., ఉదయం దేశీయ మార్కెట్ లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 122 పాయింట్ల పెరిగి 58,419 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు లాభంతో 17,402 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపడంతో సెన్సెక్స్ 256 పాయింట్లు ర్యాలీ చేసి 58,553 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు పెరిగి 17,437 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదుచేశాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఫలితంగా సూచీలు తొలి సెషన్లో ఆర్జించిన లాభాలన్నీ హరించుకుపోయి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ‘ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులు లాభాల స్వీకరణ లేదా స్థిరీకరణ(కన్సాలిడేషన్)కు అనుకూలంగా ఉన్నాయి. షేర్ల ఎంపికలో జాగ్రత్త వహించాలి. నిఫ్టీకి తక్షణ మద్దతు 17,200–17,250 శ్రేణిలో ఉంది. దేశీయంగా మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో రానున్న రోజుల్లో ప్రపంచ పరిణామాలే సూచీలకు దిశానిర్ధేశం చేయనున్నాయి’ అని రిలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిండెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. హెచ్డీఎఫ్సీ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో మూడుశాతం పెరిగి రూ.2,852 వద్ద ఏడునెలల గరిష్టాన్ని అందుకుంది. చివరికి రెండున్నర శాతం లాభంతో రూ.2836 వద్ద ముగిసింది. ఐఆర్సీటీసీ రెండోరోజూ ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో పదిశాతం పెరిగి రూ.3,305 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ ముగిసే సరికి తొమ్మిది శాతం లాభంతో రూ.3289 వద్ద ముగిసింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ తొలిసారి రూ.50 వేల కోట్లను అధిగమించి రూ.52,618 వద్ద స్థిరపడింది. -
Intraday Trading : మదుపర్లకు గుడ్ న్యూస్?!
న్యూఢిల్లీ: ఇంట్రాడే ట్రేడింగ్‌కు సంబంధించిన గరిష్ట స్థాయి మార్జిన్‌ను ప్రస్తుతం అమలవుతున్న 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గించాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ ఏఎన్ఎంఐ విజ్ఞప్తి చేసింది. పీక్ మార్జిన్‌ను తగ్గించడం వల్ల వ్యక్తిగత ఇన్వెస్టర్లు, ట్రేడింగ్ చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుందని, అలాగే క్యాపిటల్ మార్కెట్ మరింతగా విస్తరించడానికి కూడా దోహదపడగలదని ఒక ప్రకటనలో పేర్కొంది. స్టాక్ బ్రోకింగ్ సంస్థలు తమ క్లయింట్ల నుంచి తీసుకోవాల్సిన మార్జిన్లకు సంబంధించి క్రమంగా పెరిగే గరిష్ట మార్జిన్ కాన్సెప్టును 2020 డిసెంబర్ నుంచి సెబీ అమల్లోకి తెచ్చింది. తొలుత 25 శాతంగా ఉన్న ఈ మార్జిన్ స్థాయి ప్రస్తుతం 75 శాతానికి పెరిగింది. -
మూడో రోజూ రూపాయి వీక్
ముంబై: వరుసగా మూడో రోజు దేశీ కరెన్సీ బలహీనపడింది. డాలరుతో మారకంలో 23 పైసలు క్షీణించి 73.25 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తొలుత 11 పైసలు తక్కువగా 73.13 వద్ద నీరసంగా ప్రారంభమైంది. అయితే తదుపరి కోలుకుని ఇంట్రాడేలో 72.93 వద్ద గరిష్టానికి చేరింది. ఆపై బలహీనపడుతూ ఒక దశలో 73.29కు చేరింది. చివరికి 73.25 వద్ద నిలిచింది. వెరసి మూడు రోజుల్లో 53 పైసలు కోల్పోయింది. యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పుంజుకుంటున్న నేపథ్యంలో ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు దేశీ క్యాపిటల్ మార్కెట్లలో అమ్మకాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనికితోడు డాలరు ఇండెక్స్ బలపడుతూ వస్తోంది. తాజాగా 0.3 శాతం ఎగసి 92.22కు చేరింది. దీంతో రూపాయి నీరసిస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. యూఎస్ సెనేట్ 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, ఉపాధి గణాంకాలు పుంజుకోవడం, బాండ్ల ఈల్డ్స్ బలపడటం, అధిక క్రూడ్ ధరలు వంటి అంశాలతో డాలరు దాదాపు 4 నెలల గరిష్టానికి చేరింది. -
ఖతార్ ఫండ్‌కు అదానీ ఎలక్ట్రిసిటీలో వాటా
న్యూఢిల్లీ: అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌లో 25.1 శాతం వాటాను ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(క్యూఐఏ) కొనుగోలు చేయనున్నది. ఈ డీల్ విలువ రూ.3,200 కోట్లు. ఈ మేరకు ఖతార్‌కు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీతో నిశ్చయాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామని అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ ట్రాన్సిమిషన్ తెలిపింది. అదానీ ట్రాన్సిమిషన్ కంపెనీకి చెందిన అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై సంస్థ(ఏఈఎమ్ఎల్), ముంబైలో 400 చదరపు కిలోమీటర్ల పరిధిలో 30 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్తును పంపిణి చేస్తోంది. ఈ డీల్ నేపథ్యంలో అదానీ ట్రాన్సిమిషన్ షేర్ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.350ను తాకింది. చివరకు 1.7 శాతం లాభంతో రూ.342 వద్ద ముగిసింది. -
రికార్డు నుంచి రివర్స్...
మార్కెట్ అప్డేట్ ⇒ 8 రోజుల ర్యాలీకి సెన్సెక్స్ బ్రేక్ ⇒ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై.. ⇒ చివరకు స్వల్ప నష్టంలో ముగింపు ⇒ కొనసాగిన నిఫ్టీ రికార్డుల పర్వం ముంబై: ఎనిమిది రోజుల వరుస సెన్సెక్స్ ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది.బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్ప నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోల్చితే 12 పాయింట్లు నష్టంతో 29,559 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే నిఫ్టీ మాత్రం 4 పాయింట్ల లాభంతో 8,914 పాయింట్ల వద్దకు చేరింది. ఇంట్రాడేలో...: ఒక దశలో సెన్సెక్స్ 29,786.32 పాయింట్ల ఆల్‌టైమ్ హైని తాకింది. అయితే చివరకు నష్టాలోకి జారింది. నిఫ్టీ ఇంట్రాడేలో 8,985 పాయింట్లను తాకినప్పటికీ, చివరకు స్వల్పంగా 4 పాయింట్ల లాభంతోనే ముగిసింది. అంటే వరుసగా తొమ్మిదవ రోజు కూడా నిఫ్టీ లాభాల్లోనే నిలిచింది. ప్రభావిత అంశాలు...: అమెరికాఫెడ్ సమీక్ష జనవరికి సంబంధించి నెలవారీ ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనుండడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావితం చూపాయి. తొమ్మిది రోజుల్లో సెన్సెక్స్ 2,200 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 637 పాయింట్లు (7.69 శాతం) పెరిగింది. టాటా మోటార్స్ రూ. 7500 కోట్ల రైట్స్ ఇష్యూ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 7,500 కోట్లు సమీకరించనుంది. ఈ నిధులను వ్యాపార కార్యకలాపాల విస్తరణకు, రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించనుంది. ఇష్యూ పరిమాణం, ధర, ఇష్యూ ఎప్పుడు వచ్చేది తదితర అంశాలు మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయించనున్నట్లు సంస్థ తెలిపింది.