రికార్డు నుంచి రివర్స్...
మార్కెట్ అప్‌డేట్
⇒ 8 రోజుల ర్యాలీకి సెన్సెక్స్ బ్రేక్
⇒ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై..
⇒ చివరకు స్వల్ప నష్టంలో ముగింపు
⇒ కొనసాగిన నిఫ్టీ రికార్డుల పర్వం
ముంబై: ఎనిమిది రోజుల వరుస సెన్సెక్స్ ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది.బీఎస్‌ఈ సెన్సెక్స్ స్వల్ప నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోల్చితే 12 పాయింట్లు నష్టంతో 29,559 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే నిఫ్టీ మాత్రం 4 పాయింట్ల లాభంతో 8,914 పాయింట్ల వద్దకు చేరింది.
ఇంట్రాడేలో...: ఒక దశలో సెన్సెక్స్ 29,786.32 పాయింట్ల ఆల్‌టైమ్ హైని తాకింది. అయితే చివరకు నష్టాలోకి జారింది. నిఫ్టీ ఇంట్రాడేలో 8,985 పాయింట్లను తాకినప్పటికీ, చివరకు స్వల్పంగా 4 పాయింట్ల లాభంతోనే ముగిసింది. అంటే వరుసగా తొమ్మిదవ రోజు కూడా నిఫ్టీ లాభాల్లోనే నిలిచింది.
ప్రభావిత అంశాలు...: అమెరికాఫెడ్ సమీక్ష జనవరికి సంబంధించి నెలవారీ ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనుండడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావితం చూపాయి. తొమ్మిది రోజుల్లో సెన్సెక్స్ 2,200 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 637 పాయింట్లు (7.69 శాతం) పెరిగింది.
టాటా మోటార్స్ రూ. 7500 కోట్ల రైట్స్ ఇష్యూ
ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 7,500 కోట్లు సమీకరించనుంది. ఈ నిధులను వ్యాపార కార్యకలాపాల విస్తరణకు, రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించనుంది. ఇష్యూ పరిమాణం, ధర, ఇష్యూ ఎప్పుడు వచ్చేది తదితర అంశాలు మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయించనున్నట్లు సంస్థ తెలిపింది.