గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ | Sensex Snaps Three Day Winning Run; IT Pharma Stocks Weigh | Sakshi
Sakshi News home page

గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ

Published Wed, Sep 8 2021 4:57 AM | Last Updated on Wed, Sep 8 2021 5:03 AM

Sensex Snaps Three Day Winning Run; IT Pharma Stocks Weigh - Sakshi

ముంబై: ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో సూచీల మూడురోజుల రికార్డు ర్యాలీకి మంగళవారం ముగింపు పడింది. ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూలతలు, డాలర్‌ మారకంలో రూపాయి పతనం అంశాలూ మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్‌ తొలి సెషన్‌లో ఆర్జించిన 256 పాయింట్లను కోల్పోయి 17 పాయింట్లు నష్టంతో 58,279 వద్ద ముగిసింది. నిఫ్టీ 59 పాయింట్లు ఆవిరై చివరికి 16 పాయింట్ల నష్టంతో 17,362 వద్ద నిలిచింది.

ఎఫ్‌ఎమ్‌సీజీ, ఆర్థిక రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. దేశీ, విదేశీ ఇన్వెస్టర్లు ఇరువురూ అమ్మకాలకు పాల్పడ్డారు. ఎఫ్‌ఐఐలు రూ.145 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.137 కోట్ల షేర్లను విక్రయించారు. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ బలపడటంతో ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ 32 పైసలు క్షీణించి 73.42 వద్ద స్థిరపడింది.

ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు... 
ఆసియాలో తైవాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా స్టాక్‌ సూచీలు నష్టాలతో ముగిశాయి. చైనా ఆగస్టు ఎగుమతి గణాంకాలు మెరుగ్గా నమోదుకావడంతో ఆ దేశ స్టాక్‌ మార్కెట్‌తో పాటు జపాన్, సింగపూర్, హాంకాంగ్‌ మార్కెట్లు లాభపడ్డాయి. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ పాలసీ సమావేశం గురువారం జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతతో యూరప్‌ మార్కెట్లు పతనమయ్యాయి. ఉద్యోగ గణాంకాలు నిరాశపరడచంతో అమెరికా స్టాక్‌ ఫ్యూచర్లు స్వల్ప నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి.   

ఇంట్రాడేలో కొత్త గరిష్టాలు..: ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఉదయం దేశీయ మార్కెట్‌ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 122 పాయింట్ల పెరిగి  58,419 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు లాభంతో 17,402 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలుత  ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపడంతో సెన్సెక్స్‌ 256 పాయింట్లు ర్యాలీ చేసి 58,553 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు పెరిగి 17,437 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదుచేశాయి. మిడ్‌సెషన్‌లో యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రారంభంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.

ఫలితంగా సూచీలు తొలి సెషన్‌లో ఆర్జించిన లాభాలన్నీ హరించుకుపోయి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ‘ప్రస్తుతం మార్కెట్‌లో పరిస్థితులు లాభాల స్వీకరణ లేదా స్థిరీకరణ(కన్సాలిడేషన్‌)కు అనుకూలంగా ఉన్నాయి. షేర్ల ఎంపికలో జాగ్రత్త వహించాలి. నిఫ్టీకి తక్షణ మద్దతు 17,200–17,250 శ్రేణిలో ఉంది. దేశీయంగా మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో రానున్న రోజుల్లో ప్రపంచ పరిణామాలే సూచీలకు దిశానిర్ధేశం చేయనున్నాయి’ అని రిలిగేర్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిండెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు.

హెచ్‌డీఎఫ్‌సీ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో మూడుశాతం పెరిగి రూ.2,852 వద్ద ఏడునెలల గరిష్టాన్ని అందుకుంది. చివరికి రెండున్నర శాతం లాభంతో రూ.2836 వద్ద ముగిసింది. ఐఆర్‌సీటీసీ రెండోరోజూ ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో పదిశాతం పెరిగి రూ.3,305 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్‌ ముగిసే సరికి తొమ్మిది శాతం లాభంతో రూ.3289 వద్ద ముగిసింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్‌ విలువ తొలిసారి రూ.50 వేల కోట్లను అధిగమించి రూ.52,618 వద్ద స్థిరపడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement