Nifty falls
-
గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ
ముంబై: ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో సూచీల మూడురోజుల రికార్డు ర్యాలీకి మంగళవారం ముగింపు పడింది. ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూలతలు, డాలర్ మారకంలో రూపాయి పతనం అంశాలూ మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ తొలి సెషన్లో ఆర్జించిన 256 పాయింట్లను కోల్పోయి 17 పాయింట్లు నష్టంతో 58,279 వద్ద ముగిసింది. నిఫ్టీ 59 పాయింట్లు ఆవిరై చివరికి 16 పాయింట్ల నష్టంతో 17,362 వద్ద నిలిచింది. ఎఫ్ఎమ్సీజీ, ఆర్థిక రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. దేశీ, విదేశీ ఇన్వెస్టర్లు ఇరువురూ అమ్మకాలకు పాల్పడ్డారు. ఎఫ్ఐఐలు రూ.145 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.137 కోట్ల షేర్లను విక్రయించారు. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ బలపడటంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 32 పైసలు క్షీణించి 73.42 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు... ఆసియాలో తైవాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా స్టాక్ సూచీలు నష్టాలతో ముగిశాయి. చైనా ఆగస్టు ఎగుమతి గణాంకాలు మెరుగ్గా నమోదుకావడంతో ఆ దేశ స్టాక్ మార్కెట్‌తో పాటు జపాన్, సింగపూర్, హాంకాంగ్ మార్కెట్లు లాభపడ్డాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ పాలసీ సమావేశం గురువారం జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతతో యూరప్ మార్కెట్లు పతనమయ్యాయి. ఉద్యోగ గణాంకాలు నిరాశపరడచంతో అమెరికా స్టాక్ ఫ్యూచర్లు స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడేలో కొత్త గరిష్టాలు..: ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ.., ఉదయం దేశీయ మార్కెట్ లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 122 పాయింట్ల పెరిగి 58,419 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు లాభంతో 17,402 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపడంతో సెన్సెక్స్ 256 పాయింట్లు ర్యాలీ చేసి 58,553 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు పెరిగి 17,437 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదుచేశాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఫలితంగా సూచీలు తొలి సెషన్లో ఆర్జించిన లాభాలన్నీ హరించుకుపోయి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ‘ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులు లాభాల స్వీకరణ లేదా స్థిరీకరణ(కన్సాలిడేషన్)కు అనుకూలంగా ఉన్నాయి. షేర్ల ఎంపికలో జాగ్రత్త వహించాలి. నిఫ్టీకి తక్షణ మద్దతు 17,200–17,250 శ్రేణిలో ఉంది. దేశీయంగా మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో రానున్న రోజుల్లో ప్రపంచ పరిణామాలే సూచీలకు దిశానిర్ధేశం చేయనున్నాయి’ అని రిలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిండెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. హెచ్డీఎఫ్సీ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో మూడుశాతం పెరిగి రూ.2,852 వద్ద ఏడునెలల గరిష్టాన్ని అందుకుంది. చివరికి రెండున్నర శాతం లాభంతో రూ.2836 వద్ద ముగిసింది. ఐఆర్సీటీసీ రెండోరోజూ ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో పదిశాతం పెరిగి రూ.3,305 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ ముగిసే సరికి తొమ్మిది శాతం లాభంతో రూ.3289 వద్ద ముగిసింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ తొలిసారి రూ.50 వేల కోట్లను అధిగమించి రూ.52,618 వద్ద స్థిరపడింది. -
వెంటాడిన కరోనా భయాలు.. ప్రపంచ ప్రతికూలతలు పడేశాయ్!
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న ప్రతికూలతలతో దేశీయ మార్కెట్ రెండో రోజూ వెనకడుగు వేసింది. మెటల్, ఆర్థిక, ఐటీ షేర్లతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో బుధవారమూ సూచీలు నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 471 పాయింట్లు పతనమై 49 వేల దిగువున 48,691 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 154 పాయింట్లను కోల్పోయి 14,696 వద్ద నిలిచింది. ఇప్పటికీ అదుపులోకి రాని కరోనా కేసులు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ట్రేడింగ్ ఆద్యంతం సూచీలు నష్టాల్లోనే కదలాడాయి. ఏ దశలో సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ఒక దశలో సెన్సెక్స్ 610 పాయింట్లు క్షీణించి 48,551 వద్ద, నిఫ్టీ 250 పాయింట్లను కోల్పోయి 14,650 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. నష్టాల ట్రేడింగ్‌లోనూ ప్రభుత్వ రంగ బ్యాంక్స్ షేర్లకు రాణించాయి. అలాగే ఎంపిక చేసుకున్న కొన్ని ఆటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,261 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మారు. సంస్ధాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) కూడా రూ.704 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 8 పైసలు బలహీనపడి 73.42 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతలు... అంతర్జాతీయంగా స్టీల్, అల్యూమినియం, రాగి వంటి కమోడిటీ ధరలు రికార్డు గరిష్ట స్థాయిల వద్ద ట్రేడ్ అవుతుండటంతో ద్రవ్యోల్బణ ఆందోళనలు తలెత్తాయి. పెరిగే ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచవచ్చనే ఆందోళనలు తెరపైకి వచ్చాయి. అలాగే బాండ్ ఈల్డ్ (రాబడులు) పెరగవచ్చనే భయాలు వెంటాడాయి. దీంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు తలెత్తాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం ఒకటిన్నర శాతం నష్టంతో ముగిశాయి. ఆసియాలో బుధవారం చైనా, హాంకాంగ్ మినహా మిగిలిన అన్ని దేశాలకు మార్కెట్లు పతనమయ్యాయి. ఎదురీదీన పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు మార్కెట్ ట్రెండ్‌కు భిన్నంగా ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు రాణించాయి. నేడు(గురువారం) వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంక్స్ షేర్లలో షార్ట్ కవరింగ్ జరిగి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. పీఎన్బీ, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు 10–5 % ర్యాలీ చేశాయి. జమ్మూకాశ్మీర్ బ్యాంక్, ఐఓబీ, మహారాష్ట్ర బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ షేర్లు మూడు నుంచి ఒక శాతం ర్యాలీ చేశాయి. ఫలితంగా నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్ 3.30 శాతం లాభంతో ముగిసింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ►స్టీల్ కంపెనీ షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగింది. టాటా స్టీల్ షేరు నాలుగు శాతం నష్టపోయి రూ.1179 వద్ద స్థిరపడింది. ►పదిహేను నెలల తర్వాత తొలిసారి ఏప్రిల్‌లో యూజర్లు పెరగడంతో వోడాఫోన్ ఐడియా షేరు 9% లాభపడి రూ.9 వద్ద ముగిసింది. ►మార్చి క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో పాటు కొత్త సీఈవో నియామకాన్ని చేపట్టడంతో గోద్రేజ్ కన్జూమర్ షేరు 22 శాతం లాభపడి రూ.873 వద్ద నిలిచింది. ►మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే వీఐఎ క్స్ ఇండెక్స్ ఒకశాతానికి పైగా పెరిగి 20.98 వద్ద స్థిరపడింది. -
మారిషస్ పన్నుఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లు డౌన్
ముంబై : మారిషస్ పెట్టుబడులపై పన్ను ఎఫెక్ట్ దేశీయ సూచీలపై పడింది. ఆ దేశం నుంచి వచ్చే పెట్టుబడులపై మూలధన పన్ను విధించాలని కేంద్రప్రభుత్వం రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయంతో, స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 105.37 పాయింట్ల నష్టంలో 25667.75 వద్ద నమోదవుతుండగా.. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 23.23 పాయింట్ల నష్టంతో 7,864.45 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ50 స్టాక్స్ ఇండెక్స్ లో 35 స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్, బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా 2శాతం కిందకి జారాయి. అదేవిధంగా మెటల్, రియాల్టీ, ఆటో స్టాక్స్ కూడా పతనమవుతున్నాయి. మరోవైపు జీ ఎంటర్ టైనర్ నిఫ్టీలో లాభాలను పండిస్తోంది. 5శాతం పెరిగి, రూ.437.55 వద్ద నమోదవుతోంది. అదేవిధంగా హిందాల్కో, ఎన్టీపీసీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంకు, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, యస్ బ్యాంకు, ఆసియన్ పేయింట్లు లాభాల్లో నడుస్తున్నాయి. మరోవైపు వరుసగా రెండు రోజులు దిగొచ్చిన పసిడి, వెండి ధరలు పుంజుకున్నాయి. పసిడి రూ.160 లాభంతో రూ. 29,943గా నమోదవుతుండగా.. వెండి రూ.289 లాభంతో రూ.41,128 గా ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.74గా ఉంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి : స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి బలహీనపడటం , అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పడిపోవడంతోపాటు మంగళవారం ఆర్బిఐ పరపతి విధానంపై ఉండే అనుమానాలు వెరసి మార్కెట్లు నష్టాల్లో ముగిసేలా చేశాయి. సెన్సెక్స్ 60 పాయింట్ల నష్టంతో 29,122పాయింట్ల వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 8797 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ వైజ్ సూచీల్లో ఎఫ్‌ఎమ్‌సిజి 1.77 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 0.54 శాతం నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్ 1.25 శాతం , ఐటి సూచీలు 1శాతం , ఆటో సూచీలు 0.46 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గేయినర్స్ లిస్ట్‌లో హెచ్‌సిఎల్ టెక్ 5.71 శాతం, యాక్సెస్ బ్యాంక్ 5.18 శాతం, హిందాల్కో 3.87 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్‌లో ఏషియన్ పెయింట్స్ 5.75 శాతం, భారతీ ఎయిర్టెల్ 3.71 శాతం, డాక్టర్ రెడ్డీస్ 2.88 శాతం నష్టపోయాయి.