ముంబై : మారిషస్ పెట్టుబడులపై పన్ను ఎఫెక్ట్ దేశీయ సూచీలపై పడింది. ఆ దేశం నుంచి వచ్చే పెట్టుబడులపై మూలధన పన్ను విధించాలని కేంద్రప్రభుత్వం రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయంతో, స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 105.37 పాయింట్ల నష్టంలో 25667.75 వద్ద నమోదవుతుండగా.. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 23.23 పాయింట్ల నష్టంతో 7,864.45 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ50 స్టాక్స్ ఇండెక్స్ లో 35 స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్, బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా 2శాతం కిందకి జారాయి. అదేవిధంగా మెటల్, రియాల్టీ, ఆటో స్టాక్స్ కూడా పతనమవుతున్నాయి.
మరోవైపు జీ ఎంటర్ టైనర్ నిఫ్టీలో లాభాలను పండిస్తోంది. 5శాతం పెరిగి, రూ.437.55 వద్ద నమోదవుతోంది. అదేవిధంగా హిందాల్కో, ఎన్టీపీసీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంకు, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, యస్ బ్యాంకు, ఆసియన్ పేయింట్లు లాభాల్లో నడుస్తున్నాయి. మరోవైపు వరుసగా రెండు రోజులు దిగొచ్చిన పసిడి, వెండి ధరలు పుంజుకున్నాయి. పసిడి రూ.160 లాభంతో రూ. 29,943గా నమోదవుతుండగా.. వెండి రూ.289 లాభంతో రూ.41,128 గా ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.74గా ఉంది.