Tax Cuts
-
ఏంజెల్ ట్యాక్స్ రద్దుతో స్టార్టప్‌లకు బూస్ట్
వాషింగ్టన్: ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేస్తూ భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను సిలికాన్ వ్యాలీకి చెందిన పారిశ్రామికవేత్తలు స్వాగతించారు. దీన్నొక చరిత్రాత్మక నిర్ణయంగా అభివరి్ణంచారు. స్టార్టప్‌ల ఎకోసిస్టమ్‌కు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని టీఐఈ సిలికాన్ వ్యాలీ ప్రెసిడెంట్ అనిత మన్వానీ అన్నారు. దేశ వృద్ధికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా వ్యాపార నిర్వహణ పట్ల ఆసక్తి పెరుగుతుండడాన్ని చూడొచ్చు. కేవలం టెక్నాలజీలోనే కాకుండా, సేవలరంగం, తయారీలో మరింత మంది యువ పారిశ్రామికవేత్తలు అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో పెరుగుతున్న యువ జనాభా నేపథ్యంలో ఏంజెల్ ఇన్వెస్టర్లను పన్ను నుంచి మినహాయించే ఇలాంటి చట్టాలే అవసరం. ఇది భారాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల పారిశ్రామికవేత్తలు నిబంధనల అమలుకు బదులు తమ వ్యాపారంపై దృష్టి పెట్టేందుకు వీలు కలుగుతుంది. అంతిమంగా ఈ నిర్ణ యం భారత్–యూఎస్ కారిడార్‌లో ఏంజెల్ పెట్టు బడులను పెంచుతుంది’’అని మన్వానీ వివరించారు. పలువురు ఇతర పారిశ్రామికవేత్తలు సైతం ఈ నిర్ణయాన్ని అభినందించారు. సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే పారిశ్రామికవేత్తలు ఎప్పటి నుంచో ఏంజెల్ ట్యాక్స్ రద్దు కోసం డిమాండ్ చేస్తుండడం గమనార్హం. స్టార్టప్‌కు నిధులు పెరుగుతాయి.. భారత ప్రభుత్వ నిర్ణయంతో స్టార్టప్‌లకు స్థానికంగానే కాకుండా, విదేశాల నుంచి పెట్టుబడుల సా యం పెరుగుతుందని యూఎస్ ఇండియా వ్యూహా త్మక భాగస్వామ్య సంస్థ పేర్కొంది. ఏంజెల్ ట్యాక్స్ రద్దు ద్వైపాక్షిక సాంకేతిక సహకారం, ఆవిష్కరణల విషయంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుందని యూ ఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ తెలిపింది. ‘‘భారత్‌లో స్టార్టప్‌ల వ్యవస్థకు ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. స్టార్టప్ ఎకోసిస్టమ్ రాణించేందుకు, ఆవిష్కరణలు, ఉపాధి కల్పన, పోటీతత్వాన్ని పెంచేందుకు సాయపడుతుంది’’ అని యూఎస్ఏ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కరుణ్ రిషి పేర్కొన్నారు. రిపాట్రియేషన్లోనూ సంస్కరణలు అవసరం స్వదేశానికి నిధుల తరలింపులో(రిపాట్రియేషన్ )నూ సంస్కరణలు అవసరమని మన్వానీ అభిప్రాయపడ్డారు. ‘‘రిపాట్రియేషన్ అన్నది అధిక శాతం ఎన్ఆర్ఐలు, ఇన్వెస్టర్లకు ప్రాముఖ్యంగా ఉంటుంది. ఈ విషయంలోనూ నిబంధనలను సడలించాలి. నేడు ఎవరైనా యూఎస్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రిపా్రటియేషన్కు సంబంధించి ఇదే విధమైన నిబంధనలు, నియంత్రణలను భారత్ కూడా పాటించొచ్చు’’అని మన్వానీ తెలిపారు. -
FRAI: చిన్న వర్తకుల పొట్ట గొడుతున్న నకిలీలు
గువహటి: చిన్న వర్తుకుల పొట్టగొడుతూ, ప్రభుత్వాల పన్ను ఆదాయానికి గండి కొడుతున్న నకిలీ ఉత్పత్తులను అరికట్టేందుకు ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఆర్ఏఐ) కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. రోజువా రీ వినియోగించే ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని కోరింది. 2023–24 బడ్జెట్‌కు ముందు ఈ మేరకు తన డిమాండ్లను తెలియజేసింది. ఈ సమాఖ్య పరిధిలో 42 రిటైలర్స్ అసోసియేషన్లు భాగంగా ఉన్నాయి. వీటి పరిధిలో 80 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి రిటైల్ వర్తకులు సభ్యులుగా ఉన్నారు. నిత్యావసర వస్తువులపై అధిక పన్నులు అక్రమ వాణిజ్యానికి వీలు కల్పిస్తున్నట్టు ఈ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో రిటైల్ వర్తకులు ఈ చట్టవిరుద్ధమైన వ్యాపారం చేసే నేరస్థులతో పోరాడాల్సి వస్తోందని ఎఫ్ఆర్ఏఐ పేర్కొంది. ‘‘80 లక్షల మంది రిటైల్ వర్తకుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి వినతి పత్రం ఇచ్చాం. ఈ వర్తకులు అందరూ బిస్క ట్లు, సాఫ్ డ్రింక్‌లు, మినరల్ వాటర్, కన్ఫెక్షనరీలు, సిగరెట్లు తదితర వస్తువుల విక్రయంతో జీవనోపాధి పొందుతున్న వారే’’అని సమాఖ్య తెలిపింది. 25–30 శాతం నకిలీలే.. ‘‘చిన్న వర్తకులు కరోనా మహమ్మారికి ముందు నెలవారీగా రూ.6,000–12,000 సంపాదించే వారు. కొంచెం పెద్ద వర్తకులు, మధ్యస్థాయి రిటైలర్లు రోజువారీ ఆదాయం రూ.400–500 వరకు ఉండేది. సూక్ష్మ వర్తకుల ఆదాయం రోజుకు రూ.200గా ఉండేది. కానీ, కొంత కాలంగా మా వర్తకులు విక్రయించే ఉత్పత్తులు పోలిన నకిలీ ఉత్పత్తులు, అక్రమంగా రవాణా (పన్నులు కట్టని) అయినవి మార్కెట్లో పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని చోట్లా, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇవి సులభంగా లభిస్తున్నాయి. వీటి వాటా 25–30 శాతంగా ఉంటుంది’’అని ఎఫ్ఆర్ఏఐ ప్రెసిడెంట్ రామ్ అస్రే మిశ్రా తెలిపారు. ఎఫ్ఆర్ఐఏలో సభ్యులుగా ఉన్న వర్తకుల్లో ఎక్కువ మంది చదువుకోని వారేనని, ఆర్థికంగా దిగువ స్థాయిలోని వారిగా పేర్కొంది. ఉపాధి కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగా షాపులు నిర్వహించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నట్టు వివరించింది. వారి కుటుంబాలకు ఇదే జీవనాధారమని పేర్కొంటూ.. నేరగాళ్లు అక్రమ, నకిలీ ఉత్పత్తులతో తమ ఉపాధికి గండి కొట్టడమే కాకుండా, ప్రభుత్వానికి పన్ను రాకుండా చేస్తున్నట్టు సమాఖ్య తన వినతిపత్రంలో పేర్కొంది. చిన్న వర్తకులు నకిలీ, అక్రమార్కులను ఎదుర్కోలేని స్థితిలో ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. మనదేశంలో తయారైన నిత్యావసర వినియోగ వస్తువలపై అధిక పన్నులే అక్రమ రవాణా, నకిలీ ఉత్పత్తులకు అవకాశం ఇస్తున్నందున.. ప్రభుత్వం పన్నులు తగ్గించడం ద్వారా చిన్న వర్తకులను ఆదుకోవాలని కోరింది. ఖజానా ఆదాయానికి గండి.. ‘‘అక్రమార్గాల్లో తీసుకొచ్చిన, నకిలీ ఉత్పత్తులు పూర్తిగా పన్నులు ఎగ్గొట్టేవి. అవి చట్టబద్ధమైన ఉత్పత్తులతో పోలిస్తే సగం ధరకే లేదంటే మూడింట ఒక వంతు ధరకే లభిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల పన్ను ఆదాయం రాకుండా పోతోంది’’అని సమాఖ్య వివరించింది. ఉదాహరణకు సిగరెట్లను ప్రస్తావించింది. 84ఎంఎం పొడువు ఉండే 20 సిగరెట్ల ప్యాకెట్ చట్టబద్ధమైన ధర రూ.300 అయితే, అక్రమ మార్గంలో తీసుకొచ్చిన ఇదే మాదిరి ఉత్పత్తి రూ.80–150 ధరకే వినియోగదారులకు లభిస్తోందని తెలిపింది. -
పిల్లల్ని కంటే రుణాలిస్తాం
బీజింగ్: ఒకప్పుడు చైనా అంటే జనాభా విస్ఫోటనం. దీన్ని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం పలు కఠిన నియమాలు తెచ్చింది. అవన్నీ ఫలితాలివ్వడంతో చాలావరకు జనన రేటు అదుపులోకి వచ్చింది. ఈ ప్రయత్నాలు క్రమంగా ఆదేశ జనాభా తరుగుదలకు, ముఖ్యంగా యువత సంఖ్య తగ్గేందుకు కారణమయ్యాయి. ప్రమాదాన్ని ఊహించిన ప్రభుత్వం ప్రస్తుతం మరింతమందిని కనేందుకు ప్రోత్సాహాలిస్తోంది. ఈ కోవలోనే జిలిన్ ప్రావిన్సు కొత్త పథకం ప్రకటించింది. పెళ్లైన వారు పిల్లలు కనాలనుకుంటే వారికి 2 లక్షల యువాన్ల(సుమారు రూ. 25 లక్షలు) బ్యాంకు రుణాలిప్పిస్తామని ప్రకటించింది. చిన్నాచితకా వ్యాపారాలు నడిపే జంటలకు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది పిల్లలుంటే వారి వ్యాపారాలపై పన్నుల్లో తగ్గింపులు, మినహాయింపులు ఇస్తామని ప్రకటించింది. -
పన్నుల తగ్గింపు.. రూ.80 వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి కోత?
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో వేసిన అంచనాలకు మించి పన్ను వసూళ్లు రానున్నాయని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. అక్టోబర్ నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6 లక్షల కోట్ల మేర ఉండగా.. ప్రతీ నెలా జీఎస్టీ వసూళ్లు సగటున రూ.1.15లక్షలుగా ఉంటున్నట్టు చెప్పారు. బడ్జెట్ అంచనాలకు మించి పన్ను వసూళ్లు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు, వంట నూనెల దిగుమతులపై కస్టమ్స్ సుంకాల తగ్గింపు వల్ల ఖజానాకు రూ.75,000–80,000 కోట్ల ఆదాయం తగ్గిపోనున్నట్టు చెప్పారు. అయినా పన్ను వసూళ్లు పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువే వస్తాయన్నారు. రిఫండ్లు (పన్ను తిరిగి చెల్లింపులు) తీసేసి చూసినా.. అక్టోబర్ నాటికి ప్రత్యక్ష పన్నులు రూ.6 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. జీఎస్టీ ఆదాయం నవంబర్‌లో రూ.1.30 లక్షల కోట్లు దాటిపోవచ్చన్నారు. 2021–22 బడ్జెట్లో పన్నుల ఆదాయం రూ.22.2 లక్షల కోట్లుగా కేంద్రం అంచనాలు వేసింది. ఇందులో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.11 లక్షల కోట్లు, కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో రూ.5.47 లక్షల కోట్లుగా రావచ్చని పేర్కొనడం గమనార్హం. 2020–21లో పన్నుల ఆదాయం రూ.20.2 లక్షల కోట్లుగా ఉంది. రెట్రో కేసుల పరిష్కారానికి సిద్ధం ముందుకొచ్చిన 14 సంస్థలు రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ కేసుల పరిష్కార ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ట్యాక్స్ డిమాండ్లు అందుకున్న 14 కంపెనీలు వీటి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. 17 కంపెనీలకు ట్యాక్స్ డిమాండ్లు పంపగా.. మూడు.. నాలుగు మినహా మిగతావన్నీ కూడా సెటిల్మెంట్కు తమ సమ్మతి తెలియజేశాయని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ సెటిల్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు నెలాఖరు దాకా సమయం ఉందని బజాజ్ చెప్పారు. కెయిర్న్ ఎనర్జీ విషయానికొస్తే.. ప్రభుత్వంపై వేసిన కేసులను వెనక్కి తీసుకునే దాన్ని బట్టి సత్వరం చెల్లింపులు ఉంటాయని ఆయన వివరించారు. గతంలో ఎప్పుడో జరిగిన వ్యాపార ఒప్పందాలపై కూడా పన్నులు విధించేలా (రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్) 2012లో చేసిన చట్టం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీన్ని ఉపయోగించుకుని వొడాఫోన్ తదితర 17 సంస్థలకు రూ. 1.10 లక్ష కోట్ల పన్నులు కట్టాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. కెయిర్న్ విషయంలో ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది. అయితే, అంతర్జాతీయ స్థాయిలో ఇది వివాదాస్పదం కావడం, న్యాయస్థానాల్లో కెయిర్న్‌కు అనుకూలంగా తీర్పులు రావడం తదితర పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఇటీవల ఈ చట్టాన్ని పక్కన పెట్టింది. ప్రభుత్వంపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటే వసూలు చేసిన పన్నులు తిరిగి ఇచ్చేస్తామని పేర్కొంది. చదవండి: చమురు ధరలకు భారత్ చెక్! -
భారత్... అవకాశాల గని!
న్యూయార్క్: అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్ స్వర్గధామంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు దీర్ఘకాల ప్రయాణంలో కేవలం ఆరంభమేనన్నారు. కార్పొరేట్ పన్నును చరిత్రాత్మక స్థాయిలో ప్రభుత్వం తగ్గించిందని, పెట్టుబడులకు ఇదొక బంగారం లాంటి అవకాశమని అభివర్ణించారు. భారత్‌లో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని న్యూయార్క్‌లో బుధవారం జరిగిన బ్లూంబర్గ్ వ్యాపార సదస్సులో భాగంగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కార్పొరేట్లను, సంపద సృష్టికర్తలను గౌరవించే ప్రభుత్వం భారత్‌లో ఉందన్నారు. ‘‘విస్తరణకు అవకాశం ఉన్న మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు భారత్‌కు విచ్చేయండి. ఆధునిక ధోరణులు, ఫీచర్లను అభినందించే మార్కెట్లో చేయదలిస్తే భారత్‌కు రండి. భారీ మార్కెట్ ఉన్న చోట స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భారత్‌కు రండి. ప్రపంచంలో ఒకానొక అతిపెద్ద మౌలిక సదుపాయాల వ్యవస్థలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే భారత్‌కు తరలిరండి’’ అని ప్రధాని అంతర్జాతీయ కంపెనీలకు పిలుపునిచ్చారు. కార్పొరేట్ పన్నును అన్ని రకాల సెస్సులు, చార్జీలతో కలుపుకుని 35 శాతంగా ఉన్నదాన్ని ఇటీవలే ప్రభుత్వం 25.17 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల పన్నులకు దీటుగా భారత కార్పొరేట్ పన్ను మారింది. ఆ నాలుగు అంశాలే భారత్‌కు బలం... ‘‘భారత వృద్ధి పథం నాలుగు కీలక అంశాలతో ముడిపడి ఉంది. ప్రపంచంలో వేరెక్కడా ఇవి లేవు. అవి ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, నిర్ణయాత్మక శక్తి. ప్రజాస్వామ్యానికి తోడు, రాజకీయ స్థితర్వం, ఊహించతగ్గ విధానాలు, స్వతంత్ర న్యాయవ్యవస్థ అన్నవి పెట్టుబడుల వృద్ధికి భరోసానిచ్చేవి., రక్షణనిచ్చేవి. భారత్ తన పట్టణాలను ఎంతో వేగంగా ఆధునీకరిస్తోంది. ఆధునిక టెక్నాలజీలతో, పౌరులకు సౌకర్యమైన సదుపాయాలతో వాటిని తీర్చిదిద్దుతోంది. కనుక పట్టణీకరణపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భారత్‌కు రావాలి’’అని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. రక్షణ రంగంలో ముందెన్నడూ లేని స్థాయిలో పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్టు ఆయన చెప్పారు.భారత్ కోసం, ప్రపంచం కోసం భారత్‌లో తయారు చేయాలనుకుంటే భారత్‌కు రావాలని ఆహ్వానం పలికారు. వ్యాపార వాతావరణం మెరుగుపరిచేందుకు గాను రెండోసారి అధికార పగ్గాలు స్వీకరించిన అనంతరం.. మోదీ సర్కారు 50 చట్టాలను రద్దు చేసిన విషయం గమనార్హం. ఆరంభమే... మున్ముందు ఇంకా చూస్తారు ‘‘భారత ప్రభుత్వం వ్యాపార ప్రపంచాన్ని, సంపద సృష్టిని గౌరవిస్తుంది. వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు కఠినమైన, భారీ నిర్ణయాలను తీసుకుంటోంది. నూతన ప్రభుత్వం కొలువుదీరి కేవలం మూడు నాలుగు నెలలే అయింది. ఇది కేవలం ఆరంభమేనని చెప్పదలుచుకున్నా. ఇంకా ఎంతో పదవీ కాలం ఉంది. ఈ ప్రయాణంలో అంతర్జాతీయ వ్యాపార సమూహంతో భాగస్వామ్యం పటిష్టం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది మీకు బంగారం లాంటి అవకాశం’’ అని మోదీ వివరించారు. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి (రూ.350 లక్షల కోట్లు) దేశ జీడీపీని తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని కేంద్ర సర్కారు విధించుకున్న విషయం గమనార్హం. ఇప్పటికే ఐదేళ్లలో ట్రిలియన్ డాలర్ల మేర జీడీపీ స్థాయిని పెంచామని, 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మోదీ చెప్పారు. 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యంలో ఇప్పటికే 120 గిగావాట్ల మేర సాధించినట్టు తెలిపారు. 450 గిగావాట్ల లక్ష్యాన్ని సమీప కాలంలో చేరుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. గడచిన ఐదేళ్లలో భారత్ 286 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని, అంతక్రితం 20 ఏళ్లలో వచ్చినవి ఇందులో సగమేనన్నారు. మౌలిక సదుపాయాలపై 100 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. సరుకు రవాణా, అంతర్జాతీయ పోటీతత్వం, అంతర్జాతీయ ఆవిష్కరణ, వ్యాపార సులభతర నిర్వహణ సూచీల్లో భారత్ తన స్థానాలను మెరుగుపరుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. -
బుల్‌చల్!
కార్పొరేట్ ట్యాక్స్ కోత లాభాలు వరుసగా రెండో రోజూ, సోమవారం కూడా కొనసాగాయి. పన్ను కోత కారణంగా బాగా ప్రయోజనం పొందే ఆర్థిక, బ్యాంక్, ఎఫ్ఎమ్సీజీ షేర్లు లాభపడటంతో సెన్సెక్స్, నిఫ్టీలు మరోసారి భారీ లాభాలను సాధించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 39,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,600 పాయింట్లపైకి ఎగబాకాయి. జీఎస్టీ మండలి సానుకూల నిర్ణయాలు కలసివచ్చాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్‌గా ఉన్నా, అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్న ఈ వారంలో స్టాక్ సూచీలు బలంగా ట్రేడవడం విశేషం. ఇంట్రాడేలో 1,426 పాయింట్లు పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 1,075 పాయింట్లు లాభపడి 39,090 పాయింట్లు వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 326 పాయింట్లు పెరిగి 11,600 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 2.8 శాతం చొప్పున ఎగిశాయి. ఇక గత రెండు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 2,996 పాయింట్లు(8.3 శాతం), నిఫ్టీ 895 పాయింట్లు(8.36 శాతం) చొప్పున లాభపడ్డాయి. రెండు రోజుల్లో ఈ రెండు సూచీలు ఇంత భారీగా లాభపడటం ఇప్పటిదాకా ఇదే మొదటిసారి. సాంకేతిక అవరోధాలు కారణంగా ముగింపులో చివరి పదినిమిషాల పాటు ఎన్ఎస్ఈ ట్రేడింగ్‌లో అంతరాయం ఏర్పడింది. ఐటీ, టెక్నాలజీ, టెలికం, యుటిలిటీస్, పవర్ సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ 569 పాయింట్ల మేర పెరిగాయి. పన్ను కోత.. లాభాల మోత... కార్పొరేట్ ట్యాక్స్‌ను (సెస్‌లు, సర్‌చార్జీలు కలుపుకొని) కేంద్రం 34.9 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. అలాగే కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గింది. అన్ని వర్గాల ఇన్వెస్టర్లకు వర్తించే మూలధన లాభాల పన్నుపై అదనపు సర్‌చార్జీని కూడా కేంద్రం తొలగించింది. అలాగే షేర్ల బైబ్యాక్‌పై పన్నును కూడా కేంద్రం రద్దు చేసింది. ఇక 37వ జీఎస్టీ మండలిలో వ్యాపార వర్గాలకు ఊరటనిచ్చే పలు నిర్ణయాలను కంపెనీ తీసుకుంది. ఈ సానుకూల నిర్ణయాల వరదలో స్టాక్ మార్కెట్ లాభాల సునామీలో తడిసి ముద్దవుతోంది. కార్పొరేట్ ట్యాక్స్ కోత కారణంగా కంపెనీల లాభాలు బాగా పెరుగుతాయని సెంట్రమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ దేవాంగ్ మెహతా చెప్పారు. ఈ లాభాల నేపథ్యంలో కంపెనీలు ధరలను తగ్గించి డిమాండ్ పెంచేలా చేసి అమ్మకాలను పెంచుకుంటాయని పేర్కొన్నారు. లేదా వాటాదారులకు డివిడెండ్లు పంచడమో, మూలధన పెట్టుబడులను పెంచుకోవడమో చేస్తాయని, ఎలా చూసినా రేట్ల కోత కంపెనీలకు సానుకూలమేనని వివరించారు. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీల లాభాలు పెరిగే అవకాశాలుండటంతో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఇక ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మరిన్ని విశేషాలు... ► నిఫ్టీ 50లోని 32 షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ► హోటల్ రూమ్ టారిఫ్‌లపై జీఎస్టీని తగ్గించడంతో హోటల్ షేర్లు దుమ్ము రేపాయి. తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ 20 శాతం, రాయల్ ఆర్చిడ్ హోటల్స్ 16 శాతం, ఇండియన్ హోటల్స్ కంపెనీ 8 శాతం, ఐటీసీ 7 శాతం, హోటల్ లీలా వెంచర్ 3.5 శాతం చొప్పున పెరిగాయి. ఒక్క రాత్రి బసకు రూ.7,500 ధర ఉండే హోటల్ రూమ్స్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి జీఎస్టీ కౌన్సిల్ తగ్గించింది. రూ.7,500కు మించిన టారిఫ్‌లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ► జీ ఎంటర్టైన్మెంట్ షేర్ వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ నష్టపోయింది. సోమవారం ఈ షేర్ 10 శాతం నష్టంతో రూ.272 వద్ద ముగిసింది. ప్రమోటర్ తనఖా పెట్టిన షేర్లను ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ విక్రయించిందన్న వార్తలతో ఈ షేర్ ఈ స్థాయిలో పడిపోయింది. ► ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం వచ్చే మార్చికల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలతో బీపీసీఎల్ షేర్ 13% లాభంతో రూ.454 వద్ద, కంటైనర్ కార్ప్ షేర్ 6.4% లాభంతో రూ.585 వద్ద ముగిసింది. ► క్యూఐపీ మార్గంలో రూ.12,500 కోట్లు సమీకరించిన నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 6.8 శాతం లాభంతో రూ.727 వద్ద ముగిసింది. ► మార్కెట్ లాభాల ధమాకాలోనూ, 200కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. కాఫీ డే, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, ప్రొవొగ్, యాడ్‌ల్యాబ్స్.. ఈ జాబితాలో ఉన్నాయి. టార్గెట్లు పెరిగాయ్... కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, ఇతర చర్యల కారణంగా కంపెనీల లాభాలు జోరందుకుంటాయని విశ్లేషకులంటున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం సెన్సెక్స్, నిఫ్టీ టార్గెట్లను వివిధ బ్రోకరేజ్ సంస్థలు పెంచాయి. వచ్చే ఏడాది జూన్‌కల్లా సెన్సెక్స్45,000 పాయింట్లకు చేరుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి నిప్టీ 12,300–13,300 రేంజ్‌కు చేరగలదని యూబీఎస్, 13,200 పాయింట్లకు ఎగుస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొన్నాయి. ఆల్‌టైమ్ హైకి బాటా... స్టాక్ మార్కెట్ జోరు కారణంగా పలు షేర్లు వాటి వాటి జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బాటా ఇండియా, డీ–మార్ట్(అవెన్యూ సూపర్ మార్ట్స్), హిందుస్తాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, ఓల్టాస్, కాల్గేట్ పామోలివ్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
ర్యాలీ కొనసాగేనా!
ముంబై: దేశీ కార్పొరేట్ రంగ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే స్థాయి నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారాంతాన ప్రకటించిన నేపథ్యంలో సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ 569 పాయింట్లు లాభపడ్డాయి. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,285 పాయింట్లు, నిఫ్టీ 677 పాయింట్లు పెరిగాయి. కార్పొరేట్ రంగాన్ని సంభ్రమాశ్చర్యంలో పడేస్తూ శుక్రవారం ఆర్థిక మంత్రి భారీ పన్ను కోతను ప్రకటించారు. దేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి ఒక్కసారిగా 22 శాతానికి తగ్గించారు. సెస్సులతో కలుపుకుని 35 శాతం వరకు ఉన్న పన్ను రేటు ఏకంగా 25.17 శాతానికి దిగొస్తుందన్న వార్తలు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే శుక్రవారం దేశీ ప్రధాన స్టాక్ సూచీలు తారా జువ్వలా దూసుకుపోయాయి. పన్ను భారం తగ్గినందున లాభాలు పెరుగుతాయని భావించిన ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో కొనుగోళ్లకు దిగారు. దీనికి షార్ట్ కవరింగ్ జత అయి లాభాలు మరింత పెరిగిపోయాయి. సూచీలు బలమైన ర్యాలీని నమోదుచేసినందున ఇదే ఉత్సాహం ఈ వారంలో కూడా కొనసాగేందుకు అవకాశం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉత్సాహభరిత అంశాలు నెమ్మదించిన దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మళ్లీ భారత్ వైపు చూసే అవకాశం ఉందని విశ్లేషించారు. 11,500 పాయింట్లకు నిఫ్టీ..! ఆటో, రియల్టీ, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకుని ఈ వారంలో నిఫ్టీ 11,500 పాయింట్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని కాపిటల్ఎయిమ్ రీసెర్చ్ హెడ్ రోమేష్ తివారీ అంచనావేశారు. సోమవారం నూతన లాంగ్స్ పెరిగి, షార్ట్ కవరింగ్ కొనసాగి నిఫ్టీ ఈ స్థాయికి చేరుకుంటుందని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. పన్ను రేటు తగ్గినందున కంపెనీల జూన్–సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉంటాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోదీ విశ్లేషించారు. లాభాల్లో కనీసం 10–15 శాతం పెరుగుదల ఉంటుందన్నారు. శుక్రవారం మార్కెట్ భారీ ర్యాలీని నమోదుచేసినందున ఈ స్థాయిల వద్ద నిలబడుతుందా లేదా అనే అంశానికి ఎఫ్‌పీఐ పెట్టుబడులు కీలకంగా మారాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోదీ విశ్లేషించారు. మరోవైపు శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ హోటల్ ట్యారిఫ్‌లపై పన్ను రేట్లను తగ్గించడంతో ఈ రంగ షేర్లలో కొనుగోలుకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సెప్టెంబర్ సిరీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ (ఎఫ్అండ్ఓ) డెరివేటివ్‌ల ముగింపు ఈ వారంలోనే ఉంది. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు, అమెరికా క్యూ2 జీడీపీ గణాంకాలు వెల్లడి మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌లో రూ.4,193 కోట్లు ఉపసంహరణ... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) సెప్టెంబర్ 3–20 కాలానికి ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.5,578 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. అయితే, డెట్ మార్కెట్లో వీరు రూ. 1,384 కోట్లను పెట్టుబడి పెట్టారు. దీంతో క్యాపిటల్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి ఉపసంహరణ ఈనెల్లో ఇప్పటివరకు రూ.4,193 కోట్లకు పరిమితమైంది. కార్పొరేట్ పన్ను రేట్లు భారీగా తగ్గడంతో వీరి పెట్టుబడులు మళ్లీ పెరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీ ఎండీ, సీఈఓ విజయ్ చందోక్ అన్నారు. తాజా పరిణామాలతో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరిగేందుకు అవకాశం ఉందని వి.కే విజయ్‌కుమార్ విశ్లేషించారు. -
ప్రభుత్వ పెద్దల హర్షాతిరేకాలు...
కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం పట్ల అటు ప్రభుత్వ వర్గాలు నుంచి ఇటు పారిశ్రామిక వర్గాల వరకూ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాపారాలను తిరిగి గాడిలో పడేందుకు, మరింత ఉపాధి అవకాశాల కల్పనకు, అంతర్జాతీయంగా మందగమనంలోనూ భారత్‌ను తయారీ కేంద్రంగా చేసేందుకు, ఆర్థిక వృద్ధికి ఈ నిర్ణయం సాయపడుతుందని అభిప్రాయడుతున్నాయి. పెట్టుబడులు పెరుగుతాయి అద్భుతమైన నిర్ణయాలను ప్రకటించింది. ఈ నిర్ణయాలు దీర్ఘకాలంగా నిదానించిన ఆర్థిక వృద్ధికి తగిన ప్రేరణనిస్తాయి. మినహాయింపులు కూడా కలిపి చూస్తే మన పన్ను రేటు అమెరికా, దక్షిణాసియా దేశాలకు దీటుగా, పోటీనిచ్చేదిగా ఉంటుంది. మినహాయింపులను కూడా వినియోగించుకుంటే పన్ను రేటు చాలా తక్కువగా 15 శాతమే ఉంటుంది. పెట్టుబడులకు ప్రభుత్వ నిర్ణయాలు ప్రోత్సాహాన్నిస్తాయి. రూ.1.45 లక్షల కోట్లు నేరుగా కంపెనీల ఖజానాకు వెళతాయి. వాటిని తిరిగి పెట్టుబడులకు వినియోగించడం వల్ల వృద్ధికి ఊతం లభిస్తుంది. – పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య మంత్రి కార్పొకు ప్రేరణ ప్రభుత్వ నిర్ణయాలు కార్పొరేట్ రంగానికి తాజా శక్తి, ప్రేరణనిస్తాయి. – ధర్మేంద్ర ప్రదాన్, పెట్రోలియం మంత్రి చరిత్రాత్మక సంస్కరణ ఈ చరిత్రాత్మక సంస్కరణలు భారత్‌లో తయారీకి బలమైన ఊతమిస్తాయి. – స్మృతి ఇరానీ. మహిళా, శిశుఅభివృద్ధి మంత్రి ఇన్వెస్టర్లకు ఉత్సాహం... ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక రంగం అధిక వృద్ధి పథంలోకి అడుగుపెడుతుంది. – రాజీవ్ కుమార్, నీతిఆయోగ్ వైస్ చైర్మన్ సాహసోపేత నిర్ణయం కార్పొరేట్ పన్ను తగ్గింపును సాహసోపేత నిర్ణయం. ఇది ఆర్థి క వ్యవస్థకు ఎంతో సా నుకూలం. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాల ను కచ్చితంగా స్వాగ తించాల్సిందే. మనదగ్గరున్న ప్రతికూలతల్లో అధిక కార్పొరేట్ పన్ను రేట్లు కూడా ఒకటి. ఈ రోజు గణనీయంగా తగ్గించడం వల్ల థాయిలాండ్, ఫిలి ప్పీన్స్ వంటి వర్ధమాన దేశాలకు దగ్గరగా మన దేశాన్ని తీసుకెళుతుంది. దీనికితోడు సరళతర వడ్డీరేట్ల విధానం దేశాభి వృద్ధికి దోహదపడే అంశం. వృద్ధి లక్ష్యంగా ప్రభుత్వంతో ఆర్బీఐ కలిసి పనిచేస్తుంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఆర్థిక రంగానికి ఊతం ఆర్థిక రంగానికి ఊపునిస్తుంది. తయారీకి, మౌలిక సదుపాయాలకు గొప్ప ప్రేరణనిస్తుంది. ఈ అడుగు రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ (జీడీపీ వృద్ధి) వృద్ధి తిరిగి 8–9 శాతానికి చేరుకునేందుకు సాయపడుతుందని బలంగా నమ్ముతున్నాం. భారత్‌లో వేలాది ఉ ద్యోగాల కల్పనకు, 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ మార్క్నుకుచే రుకునే ప్రయాణం ఎంతో ఆశాజనకంగా ఉంది. – అనిల్ అగర్వాల్, వేదాంత రీసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పోటీకి సై... కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అమెరికా వంటి తక్కువ పన్ను రేటున్న దేశాలతో పోటీ పడేందుకు భారత కంపెనీలకు వీలు కల్పిస్తుంది. ఆర్థిక వృద్ధికి, చట్టబద్ధమైన పన్నులను చెల్లించే కంపెనీలకు మద్దతుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సంకేతమిస్తోంది. – ఉదయ్ కోటక్, కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈవో వృద్ధికి దోహదం వృద్ధి తిరిగి కోలుకునేందుకు, పెట్టుబడుల పునరుద్ధరణకు ఇదో గొప్ప అడుగు. సాహసోపేతమైన, అవసరమైన ఈ చర్యను తీసుకున్నందుకు ఆర్థిక మంత్రికి నా హ్యాట్సాఫ్. – కిరణ్ మజుందార్ షా, బయోకాన్ చైర్పర్సన్ తిరుగులేని సంస్కరణ... కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గించడం అన్నది గడిచిన 28 ఏళ్లలోనే తిరుగులేని సంస్కరణ. కార్పొరేట్ కంపెనీల లాభాలకు తోడ్పడుతుంది. ఉత్పత్తుల ధరలు తగ్గేందుకు వీలు కల్పిస్తుంది. నూతన తయారీ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహాన్నిస్తుంది. భారత్‌లో తయారీని పెంచుతుంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ అపూర్వం, సాహసోపేతం ఎంతో కాలంగా ఉన్న డిమాండ్. దీన్ని నెరవేర్చడం అపూర్వమైనది, సాహసోపేతమైనది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ప్రేరణనిస్తుంది. తయారీని ప్రోత్సహిస్తుంది. ఆర్థిక రంగంలో ఉత్సాహాన్ని పెంచుతుంది. – విక్రమ్ కిర్లోస్కర్, సీఐఐ ప్రెసిడెంట్ -
29 వస్తువులపై పన్నుకోత
న్యూఢిల్లీ: సామాన్యులకు మరింత ఊరటనిచ్చేలా జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) మండలి మరోసారి పన్ను రేట్లను తగ్గించింది. తాజాగా 29 వస్తువులు, 54 సేవలపై పన్ను రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సవరించిన పన్ను రేట్లు ఈ నెల 25 నుంచే అమల్లోకి రానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ నేతృత్వంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ మండలి 25వ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. రిటర్నుల సరళీకరణపై చర్చ వ్యాపారులు నెలకు ఒకటే రిటర్నును దాఖలు చేసేలా జీఎస్టీ రిటర్నుల విధానాన్ని సరళీకృతం చేయడంపై జీఎస్టీ మండలి చర్చించింది. జీఎస్టీ రిటర్నులను సరళతరం చేయడంపై ఇన్ఫోసిస్ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నీలేకని జీఎస్టీ మండలికి ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం వాణిజ్య సంస్థలు జీఎస్టీఆర్–3బీ, జీఎస్టీఆర్–1 అంటూ రెండు రిటర్నులను దాఖలు చేస్తుండగా, ఇకపై 3బీతోపాటు ఇన్వాయిస్లు కూడా సమర్పిస్తే సరిపోతుందా అన్నదానిపై ఆలోచిస్తున్నామని జైట్లీ చెప్పారు. ముడి చమురు, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, విమాన ఇంధనం తదితరాలను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై తదుపరి జీఎస్టీ మండలిలో చర్చించే అవకాశం ఉందని చెప్పారు. అంతర్రాష్ట్ర సరుకు రవాణా కోసం ఎలక్ట్రానిక్ వే బిల్లు విధానం ఫిబ్రవరి 1 నుంచి అమలవుతుందనీ, 15 రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల్లో సరుకు రవాణాకు సైతం ఈ–వే బిల్లును ఆ రోజు నుంచే అమలు చేస్తామని చెప్పాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేవలం వాణిజ్య సంస్థలు ఇస్తున్న సమాచారం ఆధారంగానే జీఎస్టీ వసూలవుతోందనీ, పన్ను ఎగవేతదారులను నిరోధించేలా చర్యలు తీసుకుంటే ఆదాయం పెరుగుతుందని అన్నారు. కాగా, వజ్రాలు, విలువైన రాళ్లపై పన్నును 3 నుంచి 0.25 శాతానికి తగ్గించారు. అలాగే థీమ్ పార్క్ టికెట్లు, దర్జీ సేవలపై కూడా పన్ను రేట్లు తగ్గాయి. 28 నుంచి 18 శాతానికి తగ్గినవి ► సెకండ్ హ్యాండ్లో కొనే పెద్ద, మధ్యస్థాయి కార్లు, ఎస్‌యూవీలు (మిగతా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ మోటార్ వాహనాలపై పన్నును 28 నుంచి 12 శాతానికి తగ్గించారు) ళీ జీవ ఇంధనాలతో నడిచే, ప్రజా రవాణాకు ఉపయోగించే బస్సులు. 18 నుంచి 12 శాతానికి తగ్గినవి ► చక్కెర ఉండే స్వీట్లు, చాక్లెట్లు, 20 లీటర్ల తాగునీటి సీసాలు, ఎరువుగా ఉపయోగించే పాస్ఫరిక్ యాసిడ్, బయో డీజిల్, వేప ఆధారిత పురుగు మందులు, కొన్ని రకాల జీవ–పురుగుమందులు, డ్రిప్‌ల వంటి నీటిపారుదల పరికరాలు, స్ప్రింక్లర్లు, స్ప్రేయర్లు. 18 నుంచి 5 శాతానికి తగ్గినవి ► చింతగింజల పొడి, మెహందీ కోన్లు, ప్రైవేటు డిస్ట్రిబ్యూటర్లు సరఫరా చేసే ఎల్పీజీ సిలిండర్లు. 12 నుంచి 5 శాతానికి తగ్గినవి ► వెదురు/ఎండుగడ్డితో తయారైన బుట్టలు తదితర వస్తువులు, అల్లికతో తయారైన వస్తువులు, వెల్వెట్ వస్త్రాలు సున్నా శాతానికి తగ్గిన వస్తువులు ► విబూది, వినికిడి పరికరాల విడి భాగాలు, తవుడు -
కార్పొరేట్ల పన్ను రాయితీలు వెనక్కి..
దశలవారీగా తొలగింపు; త్వరలో జాబితా విడుదల చేస్తాం - నల్లధనంపై వెనక్కితగ్గం... - వచ్చే ఏప్రిల్ నుంచి జీఎస్టీ అమలు లక్ష్యం - ఇండియా సమిట్-2015లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: కార్పొరేట్ రంగానికి ఇస్తున్న పన్ను మినహాయింపులను దశలవారీగా తొలగించనున్నామని.. వీటికి సంబంధించి కొద్ది రోజుల్లోనే ఒక జాబితాను విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. కార్పొరేట్ పన్నును నాలుగేళ్లలో ఇప్పుడున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించనున్నట్లు ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన నేపథ్యంలో దీనికి అనుగుణంగానే పన్ను రాయితీలను వెనక్కితీసుకోనున్నామని ఆయన పేర్కొన్నారు. బుధవారమిక్కడ ‘ఇండియా సమిట్-2015’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. బ్రిటన్‌కు చెందిన ఎకనమిస్ట్ మ్యాగజీన్ ఈ సదస్సును నిర్వహించింది. ‘వచ్చే నాలుగేళ్లలో కార్పొరేట్ పన్నును 5 శాతం తగ్గిస్తున్నాం. దీంతో ఇప్పటివరకూ ఇస్తున్న పన్ను మినహాయింపులు క్రమంగా తొలగిపోనున్నాయి. ఇందులో తొలి దశ జాబితాను త్వరలోనే ప్రకటించనున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పన్నుల మదింపు, రిటర్నుల వ్యవస్థను సరళీకృతం చేయడమే ఈ చర్యల ముఖ్యోద్దేశం’ అని జైట్లీ వివరించారు. నల్లధనంపై పట్టు సడలించం... విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని భారత్‌కు రప్పించడంలో ప్రభుత్వం వెనకడుగువేసే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము పట్టు సడలించలేదని కూడా తేల్చిచెప్పారు. నల్లధనం సమస్య కొంతమంది వ్యక్తులకు సంబంధించిందని.. అందుకే దీన్ని వ్యవస్థలోకి తెచ్చేవరకూ సర్కారు చాలా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ‘నల్లధనానికి చెక్ చెప్పేందుకు ఇప్పటికే మేం చట్టాన్ని తీసుకొచ్చాం. దీని ప్రకారం ఎవరైనా సరే 90 రోజుల్లో విదేశాల్లోని తమ అక్రమ ఆస్తులను వెల్లడించడం ద్వారా... 60 శాతం వరకూ పన్ను, జరిమానాలను చెల్లించి, బయటపడేందుకు ప్రత్యేకమైన సదుపాయాన్ని(విండో) కూడా కల్పించాం. ఈ నెలాఖరుతో అవకాశానికి తెరపడుతుంది. ఆతర్వాత 120 శాతం జరిమానా, పన్నులతో పాటు 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష కూడా తప్పదు’ అని జైట్లీ పేర్కొన్నారు. ఇంకా పలు అంశాలపై ఆయనేమన్నారంటే... - పేమెంట్ బ్యాంకులు, జనధన యోజన వంటి పలు స్కీమ్‌ల లక్ష్యం... బ్యాంకింగ్ వ్యవస్థను మరింత విస్తృతం చేసి, అందరికీ ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే. - వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి వస్తు-సేవల పన్ను(జీఎస్టీ)ని అమలు చేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అయితే, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్లమెంట్‌ను స్తంభింపజేస్తుండటంతో దీనికి సమస్యలు తలెత్తుతున్నాయి. పార్లమెంటు సజావుగా సాగకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. అయితే, త్వరలోనే ఈ ప్రతిష్టంభనకు తెరపడి, బిల్లు పాస్ అవుతుందని భావిస్తున్నా. - ప్రభుత్వం జారీ చేసే ప్రతి పన్ను డిమాండ్‌నూ పన్ను ఉగ్రవాదం(ట్యాక్స్ టైజం)గా చిత్రీకరించడం తగదు. చాలావరకూ వాటికి చట్టబద్ధత ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. - విదేశాల నుంచి చౌక దిగుమతుల వెల్లువ నుంచి దేశీ ఉక్కు రంగాన్ని కాపాడేందుకు త్వరలో మరిన్ని చర్యలు ఉంటాయి. చైనా, కొరియా, జపాన్, రష్యాల నుంచి వచ్చిపడుతున్న స్టీల్ దిగుమతులపై డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సేఫ్‌గార్డ్స్(డీజీఎస్) ఇప్పటికే దృష్టిపెట్టింది. బలహీన బ్యాంకుల విలీనమే! ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై జైట్లీ పెదవి విప్పారు. ‘ప్రభుత్వం తగినవిధంగా చేయూతనందిస్తున్నప్పటికీ.. ఇంకా బలహీన స్థితిలోనే(తీవ్ర మొండిబకాయిలు-ఎన్పీఏ) ఉండే కొన్ని బ్యాంకులను పటిష్టమైన ఇతర పీఎస్‌యూ బ్యాంకుల్లో విలీనం చేసేవిధంగా తదుపరి చర్యలు ఉంటాయి’ అని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఏల సమస్య ఆందోళనకరమైన విషయమే అయినప్పటికీ.. మరీ అంత భయపడాల్సిన పనేమీలేదని జైట్లీ చెప్పారు. ‘పీఎస్‌యూల బ్యాంకుల బలోపేతానికి మూలధనం పెంపు సహా అనేక చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ వాటాను 52 శాతానికి తగ్గించుకోవడం ద్వారా మరిన్ని నిధులు బ్యాంకులకు లభిస్తాయి. అప్పటికీ ఇంకా బలహీనంగానే ఉండే బ్యాంకులను పటిష్టమైన బ్యాంకుల్లో విలీనం చేయక తప్పదు’ అని జైట్లీ వివరించారు. ఈ ఏడాది మార్చి నాటికి పీఎస్‌యూ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు మొత్తం రుణాల్లో 5.2 శాతంగా నమోదయ్యాయి.