గువహటి: చిన్న వర్తుకుల పొట్టగొడుతూ, ప్రభుత్వాల పన్ను ఆదాయానికి గండి కొడుతున్న నకిలీ ఉత్పత్తులను అరికట్టేందుకు ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఆర్‌ఏఐ) కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. రోజువా రీ వినియోగించే ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని కోరింది. 2023–24 బడ్జెట్‌కు ముందు ఈ మేరకు తన డిమాండ్లను తెలియజేసింది. ఈ సమాఖ్య పరిధిలో 42 రిటైలర్స్ అసోసియేషన్లు భాగంగా ఉన్నాయి. వీటి పరిధిలో 80 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి రిటైల్ వర్తకులు సభ్యులుగా ఉన్నారు.
నిత్యావసర వస్తువులపై అధిక పన్నులు అక్రమ వాణిజ్యానికి వీలు కల్పిస్తున్నట్టు ఈ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో రిటైల్ వర్తకులు ఈ చట్టవిరుద్ధమైన వ్యాపారం చేసే నేరస్థులతో పోరాడాల్సి వస్తోందని ఎఫ్‌ఆర్‌ఏఐ పేర్కొంది. ‘‘80 లక్షల మంది రిటైల్ వర్తకుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి వినతి పత్రం ఇచ్చాం. ఈ వర్తకులు అందరూ బిస్క ట్లు, సాఫ్ డ్రింక్‌లు, మినరల్ వాటర్, కన్ఫెక్షనరీలు, సిగరెట్లు తదితర వస్తువుల విక్రయంతో జీవనోపాధి పొందుతున్న వారే’’అని సమాఖ్య తెలిపింది.
25–30 శాతం నకిలీలే..
‘‘చిన్న వర్తకులు కరోనా మహమ్మారికి ముందు నెలవారీగా రూ.6,000–12,000 సంపాదించే వారు. కొంచెం పెద్ద వర్తకులు, మధ్యస్థాయి రిటైలర్లు రోజువారీ ఆదాయం రూ.400–500 వరకు ఉండేది. సూక్ష్మ వర్తకుల ఆదాయం రోజుకు రూ.200గా ఉండేది. కానీ, కొంత కాలంగా మా వర్తకులు విక్రయించే ఉత్పత్తులు పోలిన నకిలీ ఉత్పత్తులు, అక్రమంగా రవాణా (పన్నులు కట్టని) అయినవి మార్కెట్లో పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని చోట్లా, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇవి సులభంగా లభిస్తున్నాయి. వీటి వాటా 25–30 శాతంగా ఉంటుంది’’అని ఎఫ్‌ఆర్‌ఏఐ ప్రెసిడెంట్ రామ్ అస్రే మిశ్రా తెలిపారు.
ఎఫ్‌ఆర్‌ఐఏలో సభ్యులుగా ఉన్న వర్తకుల్లో ఎక్కువ మంది చదువుకోని వారేనని, ఆర్థికంగా దిగువ స్థాయిలోని వారిగా పేర్కొంది. ఉపాధి కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగా షాపులు నిర్వహించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నట్టు వివరించింది. వారి కుటుంబాలకు ఇదే జీవనాధారమని పేర్కొంటూ.. నేరగాళ్లు అక్రమ, నకిలీ ఉత్పత్తులతో తమ ఉపాధికి గండి కొట్టడమే కాకుండా, ప్రభుత్వానికి పన్ను రాకుండా చేస్తున్నట్టు సమాఖ్య తన వినతిపత్రంలో పేర్కొంది. చిన్న వర్తకులు నకిలీ, అక్రమార్కులను ఎదుర్కోలేని స్థితిలో ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. మనదేశంలో తయారైన నిత్యావసర వినియోగ వస్తువలపై అధిక పన్నులే అక్రమ రవాణా, నకిలీ ఉత్పత్తులకు అవకాశం ఇస్తున్నందున.. ప్రభుత్వం పన్నులు తగ్గించడం ద్వారా చిన్న వర్తకులను ఆదుకోవాలని కోరింది.
ఖజానా ఆదాయానికి గండి..
‘‘అక్రమార్గాల్లో తీసుకొచ్చిన, నకిలీ ఉత్పత్తులు పూర్తిగా పన్నులు ఎగ్గొట్టేవి. అవి చట్టబద్ధమైన ఉత్పత్తులతో పోలిస్తే సగం ధరకే లేదంటే మూడింట ఒక వంతు ధరకే లభిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల పన్ను ఆదాయం రాకుండా పోతోంది’’అని సమాఖ్య వివరించింది. ఉదాహరణకు సిగరెట్లను ప్రస్తావించింది. 84ఎంఎం పొడువు ఉండే 20 సిగరెట్ల ప్యాకెట్ చట్టబద్ధమైన ధర రూ.300 అయితే, అక్రమ మార్గంలో తీసుకొచ్చిన ఇదే మాదిరి ఉత్పత్తి రూ.80–150 ధరకే వినియోగదారులకు లభిస్తోందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment