fake products makers
-
యూజర్లకు అలెర్ట్.. టెక్ దిగ్గజం యాపిల్‌కు కొత్త తలనొప్పి!
అవును. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. దీంతో ఆ కంపెనీ సీఈఓ టిమ్‌కుక్ ఆలోచనలో పడ్డారు. వెంటనే యూజర్లకు అలెర్ట్ జారీ చేశారు. ‘చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటే ఇదే’ ఈ సామెత వినే ఉంటారు. ఇప్పుడు ఇదే అంశం టిమ్ కుక్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీ మార్కెట్లో యాపిల్ కంపెనీ పేరు చెప్పి.. నకిలీ ఉత్పత్తుల్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు నకిలీ రాయుళ్లు. దీంతో నకిలీ ఉత్పత్తుల నుంచి యూజర్లను అప్రమత్తం చేశారు టిమ్‌కుక్. తమ సంస్థ తయారు చేస్తున్న స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్స్లకు ఉపయోగించే ఛార్జర్ల వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవల స్మార్ట్ మార్కెట్లో ఫేక్ ఛార్జర్ల బెడద ఎక్కువైంది. ఫలితంగా యాపిల్ ఉత్పత్తులకు ఛార్జింగ్ వెంటనే అయిపోవడంతో పాటు బ్యాటరీ లైఫ్ స్పాన్ తగ్గిపోతున్నట్లు యాపిల్ గుర్తించింది. యూజర్లకు సూచనలు ఈ నేపథ్యంలో కస్టమర్లకు యాపిల్ సంస్థ కొన్ని సూచనలు ఇచ్చింది. యూజర్ల భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఛార్జర్లను తయారు చేస్తామని, తద్వారా ఉత్పత్తుల పనితీరు, లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అంతేకాదు, యాపిల్ ఛార్జర్లు యాపిల్ ఎఫ్ఐ సర్టిఫైడ్ గుర్తింపుతో పాటు యాపిల్ వాచ్ బ్యాడ్జ్‌లు ఉంటాయని చెప్పింది. యాపిల్ ఛార్జర్లు ఈ రంగులోనే ఉంటాయ్ దీంతో పాటు యాపిల్ ప్రొడక్ట్‌ల కోసం కంపెనీ తయారు చేసిన ఛార్జర్లు ఏ రంగులో ఉంటాయి. మార్కింగ్, రెగ్యులేటరీ సమాచారం ఎలా ఉంటుందో వివరించింది. కుపెర్టినో (యాపిల్) కేవలం తెలుపు రంగు ఛార్జర్లనే కస్టమర్లకు అందిస్తుంది. తెలుపు రంగులో కాకుండా ఇతర రంగుల్లో ఉంటే ఖచ్చింతంగా అవి ఫేక్ ఛార్జర్లేనని గుర్తించాలి. ఛార్జర్లపై యాపిల్ బ్యాడ్జి సైతం ఉంటుంది. ఒకవేళ నిజమైన ఛార్జర్లకు, నకిలీ ఛార్జర్లను గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించిన యాపిల్.. సంస్థ తయారు చేసే ఒరిజినట్ ఛార్జర్ల సిరీస్ వివరాల్ని వినియోగదారులకు అందించింది. ఇవి మాత్రమే ఒరిజినల్ ఏ1570, ఏ1598, ఏ1647, ఏ1714, ఏ1768,ఏ1923, ఏ2055, ఏ2056,ఏ2086, ఏ2255, ఏ2256, ఏ2257, ఏ2458, ఏ2515, ఏ2652, ఏ2879లను మాత్రమేనని చెప్పింది. ‘మేడ్ ఫర్ యాపిల్ వాచ్’ నకిలీ ఎంఎఫ్ఐ సర్టిఫైడ్ ఛార్జర్లకు యాపిల్ ఎంఎఫ్ఐ ఛార్జర్లకు పోలికలు చూడాలి. ఛార్జర్లపై ‘మేడ్ ఫర్ యాపిల్ వాచ్’ అని ఉంటుంది. ఐఫోన్, ఐపాడ్, ఐపోడ్, యాపిల్ వాచ్‌లపై ఎంఎఫ్ఐ లోగో, మ్యాగ్నెటిక్ టెక్నాలిజీతో మ్యాగ్‌సేఫ్ ఉంటుందని, వీటిని మాత్రమే వినియోగించాలని యాపిల్ సంస్థ యూజర్లకు విజ్ఞప్తి చేసింది. -
FRAI: చిన్న వర్తకుల పొట్ట గొడుతున్న నకిలీలు
గువహటి: చిన్న వర్తుకుల పొట్టగొడుతూ, ప్రభుత్వాల పన్ను ఆదాయానికి గండి కొడుతున్న నకిలీ ఉత్పత్తులను అరికట్టేందుకు ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఆర్ఏఐ) కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. రోజువా రీ వినియోగించే ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని కోరింది. 2023–24 బడ్జెట్‌కు ముందు ఈ మేరకు తన డిమాండ్లను తెలియజేసింది. ఈ సమాఖ్య పరిధిలో 42 రిటైలర్స్ అసోసియేషన్లు భాగంగా ఉన్నాయి. వీటి పరిధిలో 80 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి రిటైల్ వర్తకులు సభ్యులుగా ఉన్నారు. నిత్యావసర వస్తువులపై అధిక పన్నులు అక్రమ వాణిజ్యానికి వీలు కల్పిస్తున్నట్టు ఈ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో రిటైల్ వర్తకులు ఈ చట్టవిరుద్ధమైన వ్యాపారం చేసే నేరస్థులతో పోరాడాల్సి వస్తోందని ఎఫ్ఆర్ఏఐ పేర్కొంది. ‘‘80 లక్షల మంది రిటైల్ వర్తకుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి వినతి పత్రం ఇచ్చాం. ఈ వర్తకులు అందరూ బిస్క ట్లు, సాఫ్ డ్రింక్‌లు, మినరల్ వాటర్, కన్ఫెక్షనరీలు, సిగరెట్లు తదితర వస్తువుల విక్రయంతో జీవనోపాధి పొందుతున్న వారే’’అని సమాఖ్య తెలిపింది. 25–30 శాతం నకిలీలే.. ‘‘చిన్న వర్తకులు కరోనా మహమ్మారికి ముందు నెలవారీగా రూ.6,000–12,000 సంపాదించే వారు. కొంచెం పెద్ద వర్తకులు, మధ్యస్థాయి రిటైలర్లు రోజువారీ ఆదాయం రూ.400–500 వరకు ఉండేది. సూక్ష్మ వర్తకుల ఆదాయం రోజుకు రూ.200గా ఉండేది. కానీ, కొంత కాలంగా మా వర్తకులు విక్రయించే ఉత్పత్తులు పోలిన నకిలీ ఉత్పత్తులు, అక్రమంగా రవాణా (పన్నులు కట్టని) అయినవి మార్కెట్లో పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని చోట్లా, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇవి సులభంగా లభిస్తున్నాయి. వీటి వాటా 25–30 శాతంగా ఉంటుంది’’అని ఎఫ్ఆర్ఏఐ ప్రెసిడెంట్ రామ్ అస్రే మిశ్రా తెలిపారు. ఎఫ్ఆర్ఐఏలో సభ్యులుగా ఉన్న వర్తకుల్లో ఎక్కువ మంది చదువుకోని వారేనని, ఆర్థికంగా దిగువ స్థాయిలోని వారిగా పేర్కొంది. ఉపాధి కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగా షాపులు నిర్వహించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నట్టు వివరించింది. వారి కుటుంబాలకు ఇదే జీవనాధారమని పేర్కొంటూ.. నేరగాళ్లు అక్రమ, నకిలీ ఉత్పత్తులతో తమ ఉపాధికి గండి కొట్టడమే కాకుండా, ప్రభుత్వానికి పన్ను రాకుండా చేస్తున్నట్టు సమాఖ్య తన వినతిపత్రంలో పేర్కొంది. చిన్న వర్తకులు నకిలీ, అక్రమార్కులను ఎదుర్కోలేని స్థితిలో ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. మనదేశంలో తయారైన నిత్యావసర వినియోగ వస్తువలపై అధిక పన్నులే అక్రమ రవాణా, నకిలీ ఉత్పత్తులకు అవకాశం ఇస్తున్నందున.. ప్రభుత్వం పన్నులు తగ్గించడం ద్వారా చిన్న వర్తకులను ఆదుకోవాలని కోరింది. ఖజానా ఆదాయానికి గండి.. ‘‘అక్రమార్గాల్లో తీసుకొచ్చిన, నకిలీ ఉత్పత్తులు పూర్తిగా పన్నులు ఎగ్గొట్టేవి. అవి చట్టబద్ధమైన ఉత్పత్తులతో పోలిస్తే సగం ధరకే లేదంటే మూడింట ఒక వంతు ధరకే లభిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల పన్ను ఆదాయం రాకుండా పోతోంది’’అని సమాఖ్య వివరించింది. ఉదాహరణకు సిగరెట్లను ప్రస్తావించింది. 84ఎంఎం పొడువు ఉండే 20 సిగరెట్ల ప్యాకెట్ చట్టబద్ధమైన ధర రూ.300 అయితే, అక్రమ మార్గంలో తీసుకొచ్చిన ఇదే మాదిరి ఉత్పత్తి రూ.80–150 ధరకే వినియోగదారులకు లభిస్తోందని తెలిపింది. -
ఆన్లైన్ షాపింగా.. జరభద్రం!
సాక్షి, న్యూఢిల్లీ : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, మింత్రా, షాప్క్యూస్ లాంటి ఈ కామర్స్ సంస్థలతో ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటున్న ఉత్పత్తుల్లో ఎక్కువగా నకిలీ ఉత్పత్తులే ఉంటున్నాయని ప్రతి ముగ్గురిలో ఇద్దరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మొబైల్, కంప్యూటర్లలో ఎక్కువగా నకిలీ ఉత్పత్తులు వస్తున్నాయని, ఆ తర్వాత ఫ్యోషన్ ఉత్పత్తులు, ఆ తర్వాత టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో ఈ మోసం ఎక్కువగా జరుగుతోందని వినియోగదారులు ఆరోపించారు. ముంబైకి చెందిన మార్కెట్ పరిశోధన, విశ్లేషణ సంస్థ ‘వెలాసిటీ మిస్టర్’ తమ సర్వేలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలియజేసింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పుణె నగరాలకు చెందిన దాదాపు మూడువేల మంది ఆన్లైన్ వినియోగదారుల అభిప్రాయలను ఏప్రిల్ మొదటి వారంలో సేకరించడ ద్వారా ఈ సర్వేను నిర్వహించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో జషల్ షా తెలియజేశారు. అవకతవకలు జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ కామర్స్ మార్కెటింగ్ సంస్థలు చెబుతున్నప్పటికీ ఇలా నకిలీ సరుకులు వెల్లువెత్తడం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. అమ్మకం దారే ఒరిజనల్ అంటూ నకిలీ సరకులను సరఫరా చేస్తే తామేమి చేయలేమని, మార్గమధ్యంలో సరకులు మారకుండా మాత్రమే తాము కట్టడి చేయగలమని ఈ కామర్స్ సంస్థలు తెలియజేస్తున్నాయి. తమ వ్యాపారం నమ్మకంపైకే ఎక్కువగా ఆధారపడి ఉన్నందున ఆ నమ్మకం వమ్ముకాకుండా ఉండేందుకే ఎక్కువ కృషి చేస్తామని ఆ కంపెనీలు చెబుతున్నాయి. 2026 నాటికి 20.000 కోట్ల రూపాయలకు ఈ కామర్స్ వ్యాపారం చేరుకుంటుందని అంచనా వేస్తున్న సమయంలో నకిలీ ఉత్పత్తులు పెరిగిపోవడం నిజంగా విచారకరమే. నకిలీ ఉత్పత్తులను గమనించి వాటిని తిప్పి పంపితే, డబ్బు వెనక్కి వస్తున్న సందర్భాలు చాలా తక్కువని, నకిలీ స్థానంలో మరో ఉత్పత్తిని తీసుకోవడమే ఎక్కువ సార్లు జరుగుతోందని వినియోగదారులు చెబుతున్నారు. ఒరిజనల్ కన్నా తక్కువ ధరకు వస్తే నకిలీ ఉత్పత్తులనైనా తీసుకునేందుకు తాము సిద్ధమేనని ప్రతి నలుగురిలో ఒకరు చెబుతుండగా, ఒరిజనల్‌తో సమానమైన నాణ్యత కలిగి ఉన్నట్లయితే వాటిని తీసుకునేందుకు తాము సిద్ధమని 20 శాతం మంది వినియోగదారులు చెప్పారు. -
ఆన్లైన్లో భారీగా ఫేక్ ప్రొడక్ట్స్
-
షాకింగ్ : ఆన్లైన్లో భారీ ఫేక్ ప్రొడక్ట్స్
న్యూఢిల్లీ : పండుగ సీజన్లో దేశీయ ఆన్లైన్ షాపర్స్ డిస్కౌంట్లతో హోర్రెతిస్తుంటాయి. కస్టమర్ల నుంచి కలెక్షన్లు కూడా అదేమాదిరి వెల్లువెత్తుతుంటాయి. ఈ దివాళి సీజన్లో దాదాపు రూ.19వేల కోట్ల ఆన్లైన్ షాపింగ్ జరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ డిస్కౌంట్లతో హోర్రెత్తిస్తున్న ప్రొడక్ట్స్‌లో ఎన్ని మంచివి? ఎన్ని నకిలీవి? ఎప్పుడైనా గుర్తించారా? ఓ ఆంగ్ల ఛానల్ జరిపిన విచారణలో భారీ మొత్తంలో నకిలీ తయారీదారులు, నకిలీ విక్రేతలు వెలుగులోకి వచ్చారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని లోపాలను వాడుకుంటూ... నకిలీ తయారీదారులు, నకిలీ విక్రేతలు ఆన్లైన్ అమ్మకాల్లో చెలరేగి పోతున్నారని తెలిసింది. ఆన్లైన్ రిటైలర్లు కూడా భారీ మొత్తంలో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తూ.. నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న దాదాపు 60 శాతం క్రీడా ఉత్పత్తులు నకిలీవేనని తేలింది. అంతేకాక అపీరల్స్ విషయానికి వస్తే.. 40 శాతం ఉత్పత్తులు నకిలీ తయారీదారులవే లిస్టు అయినట్టు విచారణలో వెల్లడైంది. స్థానిక పోలీసుల సాయంతో మీరుట్లోని బ్రహ్మంపురి ఏరియాలో జరిపిన తనిఖీలో పెద్ద మొత్తంలో నకిలీ ఉత్పత్తులను సీజ్ చేశారు. ఈ నకిలీ ఉత్పత్తులను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్లు ఫ్లిప్‌కార్ట్, షాప్‌క్లూస్, స్నాప్‌డీల్ వంటి వాటిలో విక్రయిస్తున్నట్టు వెల్లడైంది. అసలు రూ.170-200 మధ్యలో ఉన్న నకిలీ ఉత్పత్తులను రూ.450-500కు విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఆ ఉత్పత్తులపై ఎంఆర్పీ రూ.900-1000గా పేర్కొంది. భారీగా 50-60 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటిస్తారని విచారణ అధికారులు పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లో సెక్షన్ 79లోని లోపాన్ని వాడుకుంటూ కంపెనీలు ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సైబర్ లా స్పెషలిస్ట్ పవన్ దుగల్ చెప్పారు. మనీలాండరింగ్‌కు, చీటింగ్‌కు కంపెనీలు ఆన్‌లైన్‌ను వాడుకుంటున్నట్టు తెలిపారు. ఆన్లైన్లో భారీ మొత్తంలో ఫేక్ ప్రొడక్ట్స్ -
గ్యాస్ లైటర్లనీ వదలట్లేదు!
- ‘కేటు’ గ్యాంగ్ లీడర్ రజనీ భాయ్ అరెస్ట్ - గుజరాత్లో నకిలీ సరుకుల తయారీ.. దేశ వ్యాప్తంగా సరఫరా - అరెస్టు చేసి తీసుకువచ్చిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు హైదరాబాద్: డూబ్లి‘కేటుగాళ్ళు’ ఏ వస్తువునీ వదిపెట్టట్లేదు. వివిధ కంపెనీల పేర్లతో నకిలీ గ్యాస్ లైటర్లు తయారు చేసి దేశ వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఉత్పత్తులకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సీసీఎస్ అధికారులు శుక్రవారం సూత్రధారిని రజనీ భాయ్‌ని అరెస్టు చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన ఇతగాడు దేశ వ్యాప్తంగా దందా చేస్తున్నట్లు గుర్తించామని డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. రాజ్‌కోట్‌కు చెందిన రజనీ భాయ్ అక్కడి ఆర్ఆర్ నగర్ చౌక్ ప్రాంతంలో జైమా ఖొడియార్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు. మిల్టన్, పీజియన్, ఈగెల్ కంపెనీల పేర్లతో డైలు రూపొందించాడు. వీటిసాయంతో ఆయా కంపెనీల పేర్లు ముద్రితమయ్యేలా నకిలీ గ్యాస్ లైటర్లు తయారు చేస్తున్నాడు. వీటిని దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌కూ సరఫరా చేస్తున్నాడు. సిటీలోని రిద్దీ సిద్దీ మార్కెటింగ్, రిషబ్ మార్కెటింగ్, రామ్‌దేవ్ స్పేర్ పార్ట్స్, రాజేశ్వర్ స్పేర్‌పార్ట్స్ సంస్థలకు కంపెనీ వాటి కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ నాలుగు సంస్థల్లో బ్రాండెడ్ కంపెనీ పేరుతో నకిలీ గ్యాస్ లైటర్లు విక్రయిస్తున్న విషయం గుర్తించిన శ్రీ ముఖేష్ మార్కెటింగ్ అధికార ప్రతినిధి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిద్దీ సిద్దీ మార్కెటింగ్, రిషబ్ మార్కెటింగ్, రామ్‌దేవ్ స్పేర్ పార్ట్స్, రాజేశ్వర్ స్పేర్‌పార్ట్స్ దుకాణాలపై దాడులు చేశారు. వీటి నిర్వాహకులైన సతీష్ జైన్, రతిలాల్, జగదీష్‌కుమార్, మోతీరామ్లను అదుపులోకి తీసుకుని వందల సంఖ్యలో నకిలీ గ్యాస్ లైటర్లు స్వాధీనం చేసుకున్నారు. జగదీష్ కుమార్ విచారణలో ఈ నకిలీ లైటర్లను రాజ్‌కోట్‌కు చెందిన రజనీ భాయ్ సరఫరా చేస్తున్నట్లు బయటపడింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న సూత్రధారి కోసం గాలిస్తూ అక్కడకు వెళ్ళిన ప్రత్యేక బృందం రజనీ భాయ్‌ను అరెస్టు చేసి తీసుకువచ్చింది. ఇతడి నుంచి గ్యాస్ లైటర్లపై ఆయా కంపెనీల పేర్లు ముద్రించడానికి ఉపకరించే ఇనుప డైలను స్వాధీనం చేసుకున్నారు.